ప్రియురాలిని హత్య చేసి టీవీ స్టూడియోకి వెళ్లి నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తి

హత్య ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, ISTOCK

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసినట్లు ఓ టీవీ స్టూడియోకు వెళ్లి నేరాన్ని అంగీకరించిన వ్యక్తిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు.

చండీగఢ్‌లోని న్యూస్18 కార్యాలయానికి వెళ్లిన 27 ఏళ్ల మనిందర్ సింగ్, ప్రియురాలిని హత్య చేసినట్లు టీవీలో అంగీకరించాలని అనుకుంటున్నట్లు అక్కడున్న కెమెరామెన్‌కు తెలిపారు.

అప్పుడు టీవీ సిబ్బంది వెంటనే ఆయన్ను స్టూడియోకు తీసుకెళ్లి, ఆయన 'నేర అంగీకార' ప్రకటనను ప్రసారం చేశారు.

ఈ ఘటన మీడియా నైతికత పట్ల ప్రశ్నలను లేవనెత్తింది.

తమ 'వివాహానికి' యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్లే ఆమెను చంపేశానని మనిందర్ సింగ్ ప్రెజెంటర్‌తో చెప్పడం ఆ టీవీలో ప్రసారమైంది.

ఆ తర్వాత టీవీ సిబ్బంది పోలీసులను పిలిచారు. వాళ్లు వచ్చి నిందితుడిని అరెస్టు చేశారు.

కెమెరా

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబర్ 30న ఒక హోటల్‌లో బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి మనిందర్ సింగ్ పరారీలో ఉన్నారు.

అప్పటి నుంచి తన కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని, అందుకే 'నేరాన్ని అంగీకరించేందుకు' తాను రావాల్సి వచ్చిందని నిందితుడు టీవీలో చెప్పారు.

"ఆయన పబ్లిసిటీ, సానుభూతి పొందాలని అనుకున్నారు. లాయర్‌ను నియమించుకునేందుకు అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఇలా చేస్తే తన కేసును వాదించేందుకు ఎవరైనా లాయర్లు ముందుకొస్తారని అతడు ఆశించారు" అని చండీగఢ్ పోలీసు అధికారి నేహా యాదవ్ బీబీసీ పంజాబీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రాతో చెప్పారు.

తనది వేరే కులం కావడం వల్ల తమ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారని మనిందర్ సింగ్ అన్నారు.

అతడు గతంలోనూ తన మాజీ ప్రియురాలిని హరియాణాలో చంపేశాడని పంజాబ్ పోలీసులు బీబీసీతో చెప్పారు. ఆ కేసులో విచారణ కొనసాగుతున్నందున అతడు బెయిల్ మీద బయట ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)