విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ శనివారం ప్రకటించాడు.
టెస్టు కెప్టెన్సీకి కూడా ఆయన గుడ్‌బై చెబుతారని దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందే ఊహాగానాలు వచ్చాయి. కెప్టెన్సీని కాపాడుకునేందుకు ఎలాగైనా ఆ సిరీస్‌ను గెలవాలని ఆయనపై ఒత్తిడి ఉండేది.
మొదటి మ్యాచ్‌లో 133 పరుగుల భారీ తేడాతో భారత జట్టు విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో సిరీస్ చేజారింది.
ఈ ఓటమి అనంతర పరిణామాలపై సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు చంద్రశేఖర్ లూథరా బీబీసీతో మాట్లాడారు. ''టెస్టు సిరీస్‌కు ముందే కోహ్లీకి ఎలా గుడ్ బై చెప్పాలా? అనే అవకాశం కోసం బీసీసీఐ ఎదురుచూస్తుండేది. ఓటమి తర్వాత వారికి ఆ అవకాశం దక్కింది. దీంతో కోహ్లీ వారి కంటే ముందుగానే తనకు తానుగానే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీన్ని కోహ్లీ వర్సెస్ బీసీసీఐ ఫైట్‌గా చెప్పుకోవచ్చు. బీసీసీఐ ముందు ఏ ఒక్కరూ ఎక్కువ కాదనే విషయం మరోసారి రుజువైంది''అని ఆయన అన్నారు.
కోహ్లీ వర్సెస్ బీసీసీఐ
ఇంతకీ ఈ కోహ్లీ వర్సెస్ బీసీసీఐ ఫైట్ ఏమిటి?
దీని గురించి తెలుసుకోవాలంటే, టెస్టు టీమ్‌కు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పనితీరు గురించి మనం మాట్లాడుకోవాలి.
కోహ్లీ రాజీనామాను ప్రకటించిన వెంటనే, సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ స్పందించింది. టెస్టు క్రికెట్‌లో కోహ్లీని ''మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్''అంటూ ప్రశంసలు కురిపించింది.
నెల రోజుల క్రితం కోహ్లీని వన్ డే జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ తొలగించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు కేవలం రెండే లైన్ల ట్వీట్‌తో కోహ్లీని తప్పిస్తున్నట్లు చెప్పారు. కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటారని పేర్కొన్నారు. కోహ్లీ విజయాల గురించి అసలేమీ ప్రస్తావించలేదు. దీనికి ఒక నెల రోజుల ముందు మొత్తం మూడు ఫార్మాట్లకూ కెప్టెన్‌గా కోహ్లీనే ఉండేవాడు.
క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగే కోహ్లీని వరుస పరిణామాలు ఫేర్‌వెల్ వరకూ తీసుకొచ్చాయి. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కోహ్లీ వరుస విజయాలు అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్రేట్ కెప్టెన్
విరాట్ కోహ్లీకి తన కెరియర్‌లో ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నారో ఇప్పుడు చూద్దాం.
68 టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగాడు. వీటిలో 40 మ్యాచ్‌లు గెలిచాడు. 17 మ్యాచ్‌లు ఓటమి పాలయ్యాడు. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
వేరే ఇతర ఏ కెప్టెన్ కూడా భారత్‌కు టెస్టుల్లో ఇన్ని విజయాలు తెచ్చిపెట్టలేదు. అదే సమయంలో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 95 వన్డే మ్యాచ్‌లు ఆడింది. వీరిలో 65 మ్యాచ్‌లు గెలిచింది.
వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోనీ 110, మహమ్మద్ అజహరుద్దీన్ 90, సౌరవ్ గంగూలీ 76 మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. అయితే వీరి సక్సెస్ రేటు 70 శాతాన్ని మించలేదు.
విదేశీ గడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ సాధించిన విజయాలు కూడా ఇలానే ఉంటాయి. అందుకే ఆయన్ను ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా కొనియాడుతుంటారు. ఆయనకు కాస్త మెరుగ్గా గుడ్ బై చెప్పాల్సి ఉందని చర్చలు జరగడానికి కారణం కూడా ఇదే.
''టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత మీడియా వేదికగా బీసీసీఐకి వ్యతిరేకంగా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎప్పుడో ఒకప్పుడు తప్పుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆయన లెక్కలు వరుసగా తలకిందులవుతూ వచ్చాయి. మరోవైపు గత రెండేళ్లలో కోహ్లీ నుంచి మనకు అద్భుత ప్రదర్శన కూడా కనిపించలేదు''అని చంద్రశేఖర్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కెప్టెన్సీ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందంటే..
2014లో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు తొలిసారి టెస్టుకు సారథ్యం వహించే అవకాశం కోహ్లీకి వచ్చింది. అప్పటికి కెప్టెన్ ధోనీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో కోహ్లీని కెప్టెన్‌గా బీసీసీఐ ఎంచుకుంది.
కెప్టెన్‌గా తను ఏం చేయగలడో కోహ్లీ ఆ అవకాశంతో రుజువు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 115 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు సాధించాడు. 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా మ్యాచ్‌ను ఉరకలు పెట్టించాడు.
అయితే, కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ, 48 పరుగుల తేడాతో భారత్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. తర్వాత రెండు మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే, నాలుగో టెస్టుకు ముందే తను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు.
మొదట్లో కోహ్లీ కనబరిచిన రికార్డు ప్రదర్శన ఇటీవల కాలంలో కనిపించకుండా పోయింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ అదే జరిగింది.
తను సారథ్యం వహించిన 68 టెస్టు మ్యాచ్‌లలో కోహ్లీ 20 సెంచరీలు కొట్టాడు. ఇది ఏ భారత కెప్టెన్‌కూ లేని రికార్డు.
టెస్టు మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కేవలం గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాడు. 109 మ్యాచ్‌లలో ఆయన 25 సెంచరీలు కొట్టాడు. కోహ్లీ ఇలానే ఆట కొనసాగిస్తే, 90 టెస్టుల కల్లా ఆ రికార్డును అధిగమించేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కోహ్లీ పేరు చెబితే...
గత ఏడేళ్లలో భారత జట్టును కోహ్లీ పటిష్ఠంగా తీర్చిదిద్దాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు వరుసగా 42 నెలలు అంటే మూడేళ్ల ఆరు నెలలపాటు (ఆగస్టు 2016 నుంచి మార్చి 2020) టెస్టుల్లో నంబర్ 1గా కొనసాగింది.
కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆ దేశంలోనే ఆ జట్టును ఓడించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ వరకు వెళ్లింది.
మరోవైపు భారత గడ్డపై మ్యాచ్‌లలోనూ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. గత 14 సిరీస్‌లలో దానిలోనూ ఓటమి లేదు. మొత్తం 24 టెస్టు సిరీస్‌లు ఆడితే, రెండింటిలోనే ఓటమి చూడాల్సి వచ్చింది.
కోహ్లీ సారథ్యంలో భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన మెరుగుపడింది. ఇదివరకు భారత్ పేరు చెబితే స్పిన్ బౌలర్లు మాత్రమే కనిపించారు. కోహ్లీ సారథ్యంలో ఫాస్ట్ బౌలర్లు మంచి ఫామ్‌లోకి వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ఐసీసీ ట్రోఫీ దక్కలేదు..
కోహ్లీ కెప్టెన్సీలో అన్నీ సవ్యంగా జరిగాయని చెప్పడానికి కూడా వీళ్లేదు. ఎందుకంటే ప్రధాన టోర్నమెంట్లలో భారత్ వరుస ఓటములు చవిచూసింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. మరోవైపు 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 2021 వరల్డ్ టీ20ల్లో కనీసం సెమీస్‌లలోకి కూడా అడుగుపెట్టలేదు.
మరోవైపు ఐపీఎల్‌లో తన జట్టు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుకు ఒక్కసారి కూడా కోహ్లీ ట్రోఫీ తెచ్చిపెట్టలేదు.
అయితే, పరాజయాల కంటే కోహ్లీ ఆవేశమే తాజా పరిస్థితికి కారణమని చెప్పుకోవచ్చు. గ్రౌండ్‌లో కోహ్లీ విజయాల కంటే ఆవేశం గురించే ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. మూడో టెస్టు మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోహ్లీ ఎలా ఆవేశపడ్డాడో అందరూ చూశారు.
పోరాట స్ఫూర్తిని గౌరవిస్తున్నట్లు కోహ్లీ ఎక్కడా కనిపించడు. ఈ విషయంలో తోటి ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడమూ ఉండదు. అతడికి విజయమే సర్వస్వం. ఓటమిని జీర్ణించుకోవడం అతడు మరచిపోయాడా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. తన ముందుండే ఎవరి మాటనూ కోహ్లీ వినిపించుకోడు. అనిల్ కుంబ్లే ఉదంతాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కోహ్లి-శాస్త్రి ద్వయం ముందు అనిల్ కుంబ్లే నిలవలేకపోయాడు.
అయితే, పరిస్థితులు అన్నిసార్లూ ఒకేలా ఉండవు. పనితీరు మెరుగ్గా ఉన్నంతవరకు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ పనితీరు కాస్త తగ్గిన వెంటనే, తప్పులను ఎత్తి చూపడం మొదలవుతుంది.
భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తును బీసీసీఐ అమోదించగానే, ఇక కోహ్లి ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగలేడనే ఊహాగానాలు వెలువడ్డాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్న ఈ సమయంలో భారత క్రికెట్ సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లికి ఇంతకన్నా మంచి వీడ్కోలు లభించే అవకాశమే లేదా అనే సందేహం చాలా మందిలో రాకమానదు.
సగటు భారతీయ క్రికెట్ అభిమాని మనసులో ఈ ప్రశ్న తప్పక తలెత్తుతుంది. కానీ భారత క్రికెట్‌ను సుదీర్ఘకాలంగా అనుసరించేవారికి, బీసీసీఐ ముందు స్టార్ క్రికెటర్ల పరిస్థితి ఏంటో చాలా బాగా తెలుసు.
ఒక్క సచిన్ టెండూల్కర్‌ను మినహాయిస్తే, ఏ భారతీయ క్రికెటర్‌కు కూడా చిరస్మరణీయ వీడ్కోలు లభించినట్లు మీకు అనిపించదు. ఇక్కడ మీరు మరొకటి మరిచిపోకూడదు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ కూడా బీసీసీఐకి వ్యతిరేకంగా వెళ్లలేదు.

ఫొటో సోర్స్, ANI
ముందున్న సవాళ్లు
అయితే, విరాట్ కోహ్లిలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందా అనేది ఇప్పుడు ఎదురవుతోన్న పెద్ద ప్రశ్న. కచ్చితంగా చెప్పాలంటే, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది.
గత రెండేళ్లలో కోహ్లి సెంచరీ చేయలేకపోయినప్పటికీ, అతను నిలకడగా పరుగులు సాధించాడు. పరుగులు చేయడం కోసం శ్రమిస్తున్నట్లుగా ఎప్పుడూ కనిపించలేదు. సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టే పోటీదారుల్లో నేటికీ కోహ్లినే ముందుంటాడు. అయితే, అందుకోసం కోహ్లి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సి ఉంటుంది.
కోహ్లి ఖాతాలో మొత్తం 70 శతకాలు ఉన్నాయి. అందులో టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. కానీ ఇప్పుడు ఈ లక్ష్యం దిశగా దూసుకెళ్లడం అనుకున్నంత సులువు కాదు.
''బ్యాట్స్‌మన్‌గా కోహ్లి, గతం కంటే మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. అంతే కాకుండా, కొత్త కెప్టెన్‌తో సర్దుబాటు చేసుకోవాలి. ఒక సిరీస్‌లో పేలవ ప్రదర్శన కూడా అతన్ని జట్టుకు దూరం చేయగలదు. జట్టులో స్థానాన్ని కాపాడుకోవడం కోసం కోహ్లి నిలకడగా, మెరుగ్గా ఆడాలి'' అని సి. శేఖర్ లూథరా అన్నారు.
విరాట్ కోహ్లి తనవైపు నుంచి బీసీసీఐతో శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నించాడని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు అరుణ్ జైట్లీ తరహాలో బీసీసీఐలో అతన్ని కాపాడే బలమైన వ్యక్తి లేడు. కాబట్టి సహజంగానే ఇప్పుడు విరాట్ కోహ్లి మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది.
బ్యాటింగ్ టెక్నిక్ పరంగా చూస్తే కోహ్లి మరో రెండు, మూడేళ్లు నిస్సందేహంగా క్రికెట్ ఆడగలడు. కానీ శనివారం నుంచి కోహ్లి బ్రాండ్ విలువ తగ్గుతుందనేది కూడా నిజం. ఆ విలువ ఎంత మేరకు తగ్గుతుందనేది కూడా అతని బ్యాటింగ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
- Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్... వీసా రద్దుపై చేసిన అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు
- కరోనావైరస్: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: బీజేపీలో తిరుగుబాటు రగులుతోందా?
- ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ భూతవైద్యం, మంత్రాలతో దెయ్యాన్ని తరిమికొట్టానంటూ వీడియో - ప్రెస్‌రివ్యూ
- చైనా, తైవాన్‌ల మధ్య ఎందుకీ ఘర్షణ? మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













