క్రికెట్ ఆస్ట్రేలియా: దశాబ్దపు వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కిందని.. అది కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ధోనీకి సముచిత స్థానాన్ని కట్టబెట్టిందని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇక ధోనితో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు సైతం తమ దశాబ్దపు వన్డే జట్టులో చోటు కల్పించింది.
ఈ వన్డే జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్‌ను సీఏ తీసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్‌కు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చోటు ఇచ్చింది. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లున్న సీఏ వన్డే జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు.
బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్ ఉండగా, ఇంగ్లండ్ నుంచి జోస్ బట్లర్‌కు చోటు కల్పించింది. న్యూజీలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్‌లు ఉన్నారు. శ్రీలంక నుంచి లసిత్ మలింగా చోటు దక్కించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. సీఏ ప్రకటించిన తమ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ఈ టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది.
దశాబ్దపు సీఏ వన్డే జట్టు ఇదే: ఎంఎస్ ధోని (కెప్టెన్ - వికెట్ కీపర్), రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షకీబుల్ హసన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగా
దశాబ్దపు సీఏ టెస్టు జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ.. గంగూలీ చర్చలు
అంతా సవ్యంగా సాగితే క్రికెట్ ఆడే పెద్ద దేశాలు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, మరో దేశం కలిసి 2021 నుంచి ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ అడే అవకాశముందని 'ఈనాడు' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. నాలుగు దేశాల టోర్నీ గురించి ఆయా దేశాల బోర్డులతో చర్చిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పినట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
''క్రికెట్‌పై ప్రభావం చూపే అంశాల గురించి చర్చించేందుకు క్రికెట్ అగ్ర దేశాల అధికారులతో మేం తరచుగా సమావేశమవుతుంటాం'' అని ఈబీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
''డిసెంబరులో బీసీసీఐతో జరిగిన సమావేశంలో నాలుగు దేశాల టోర్నమెంట్ ప్రతిపాదన వచ్చింది. దానిపై ఇతర ఐసీసీ సభ్యదేశాలతో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పింది.
ప్రతి ఏటా ఓ మేజర్ ఈవెంట్‌ను నిర్వహించకుండా ఐసీసీని అడ్డుకొనే ప్రయత్నంలో భాగమే ఈ నాలుగు దేశాల టోర్నీ అని భావిస్తున్నారు. అయితే.. తన బహుళ దేశాల రోస్టర్‌లో భాగం కాని.. మూడు కన్నా ఎక్కువ జట్లు పాల్గొనే టోర్నమెంట్లకు ఐసీసీ అనుమతి ఇవ్వదు.

ఫొటో సోర్స్, Getty Images
విశాఖలో బ్యాండ్మింటన్ అకాడమీకి స్థలాన్ని పరిశీలిస్తున్న సింధు
బ్యాండ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు పి.వి.సింధు మంగళవారం విశాఖపట్నంలో స్థలాన్ని పరిశీలించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఆర్‌డీఓ కె.పెంచల కిషోర్, చినగదిలి మండల తహసీల్దార్ నరసింహమూర్తిలు.. వివిధ ప్రాంతాల్లోని స్థలాలను సింధుకు చూపించారు.
విశాఖలో బ్యాండ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం ఐదు ఎకరాల స్థలం కావాలని సింధు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అందుకు ప్రభుత్వం అంగీకరించి, అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
పరిశీలించిన స్థలాల్లో ఏది అనుకూలంగా ఉంటుందో తెలియజేస్తానని రెవెన్యూ అధికారులకు సింధు తెలిపింది.

ఫెడ్‌కప్ జట్టులో సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నాలుగేండ్ల తర్వాత భారత ఫెడ్‌కప్ జట్టులోకి వచ్చిందని 'నమస్తే తెలంగాణ' ఓ కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. 2016లో చివరిసారి ఫెడ్‌కప్ బరిలో దిగిన సానియా.. 2017 అక్టోబర్ నుంచి మైదానానికి దూరంగా ఉంటున్నది. గతేడాది బాబుకు జన్మనిచ్చిన సానియా.. గ్రౌండ్‌లో అడుగుపెట్టటం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఐదుగురు సభ్యలుతో కూడిన జట్టులో భారత సింగిల్స్ నంబర్‌వన్ ప్లేయర్ అంకిత రైనా, రియా భాటియా, రుతుజ భోంస్లే, కమ్రన్ కౌర్ ధండీలతో కలిసి సానియా భాగం పంచుకోనుంది.
ఈ జట్టుకు విశాల్ ఉప్పల్ కెప్టెన్ కాగా.. అంకిత బాంబ్రీ కోచ్‌గా వ్యవహరించనుంది. తెలుగు ప్లేయర్ భవిశెట్టి సౌజన్య రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా ఫెడ్‌కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చైనా, చైనీస్ తైపీ, ఇండొనేసియా, కొరియా, ఉజ్బెకిస్తాన్‌తో కలిసి బరిలో దిగనున్న భారత్.. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మిగిలిన ఐదు జట్లతో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపై రవిశాస్త్రి ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా...
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- ‘పాకిస్తాన్లో ఉండే హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలనుకున్నా, వారికి స్వాగతం’ అని గాంధీ అన్నారా?
- అమెజాన్‌కు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








