టీ20 వరల్డ్‌కప్: టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ టీమిండియా కొంపముంచిందా.. టాస్ అంత కీలకం ఎందుకు?

టీమిండియా

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/ICC VIA GETTY IMAGES

    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 టోర్నీలో భాగంగా ఎక్కువగా రోజుకు రెండు మ్యాచ్‌లు జరుగుతూ వచ్చాయి. మధ్యాహ్నం, సాయంత్రం వీటిని నిర్వహిస్తున్నారు. సూపర్ 12లో కూడా అదే కొనసాగింది.

అయితే, భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 తర్వాత అంటే యూఏఈలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ టాస్ ఓడిపోవడంతో మొదట బ్యాటింగ్ చేసింది.

అంటే, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆడే సమయానికి కొత్త బంతి స్వింగ్ అవుతుంది. తర్వాత బౌలింగ్ చేసే సమయానికి వికెట్ మీద మంచు వల్ల బౌలర్లు బంతి మీద పట్టు సాధించడం కష్టం. అది ప్రత్యర్థి జట్టుకు ప్లస్ అవుతోంది.

అయితే, భారత్‌కు డే మ్యాచ్‌లు లేకుండా సాయంత్రం మ్యాచ్‌లే ఎందుకు ఆడాల్సి వచ్చింది. భారత ఓటమికి ఇది కూడా ఒక కారణమా.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆదేశ్ కుమార్ గుప్తా దీనికి సమాధానం ఇచ్చారు.

"దీనికి ప్రధాన కారణం వ్యూయర్‌షిప్. సాయంత్రం జరిగే మ్యాచ్‌లకు ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉంటుంది. పగటి పూట జరిగే మ్యాచ్‌లు చూసేవారు తక్కువ. దాంతోపాటూ సాయంత్రం జరిగే మ్యాచ్‌ల సమయం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ లాంటి దేశాల్లో అక్కడివారు చూడ్డానికి అనువుగా ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్ లాంటి జట్లు ఆడే మ్యాచ్‌లు ఎక్కువగా సాయంత్రమే ఉంటాయి. నమీబియా, స్కాట్లాండ్ లాంటి వాటితో ఆడే మ్యాచ్‌లు పగటి పూట నిర్వహిస్తున్నారు" అని చెప్పారు.

అయితే, అసలు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ షెడ్యూల్ ఎలా ఉంటుంది. ఇందులో ఏయే గ్రూపుల్లో ఏ జట్లు ఉండాలో డ్రా తీస్తారా. లేక ఐసీసీకి దీని వెనుక ఏదైనా లెక్క ఉంటుందా.

కొన్ని టీముల మధ్య జరిగే మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉండడంతోపాటూ, ఆ మ్యాచ్‌ల వల్ల వచ్చే ఆదాయం కూడా ఇవి ఒకే గ్రూప్‌లో ఉండేలా ఫిక్స్ చేయడానికి ప్రధాన కారణం అంటారు ఆదేశ్ కుమార్ గుప్తా.

"భారత్-పాకిస్తాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఎక్కువ వ్యూయర్ షిప్ ఉంటుంది. అందుకే వరల్డ్ కప్ ప్రకటించగానే టోర్నీలో ఇవి ఒకే గ్రూప్‌లో తలపడేలా ప్లాన్ చేస్తారు. అలా చేయడం వల్ల ప్రతి ఐసీసీ టోర్నీలో ఇవి సెమీ ఫైనల్ చేరినా.. చేరకపోయినా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడుతాయి. ఈ మ్యాచ్ వల్ల ఐసీసీకి భారీ ఆదాయం కూడా లభిస్తుంది. టెలివిజన్ రైట్స్‌తోపాటూ ఈ మ్యాచ్‌ల టికెట్లు కూడా గంటల్లోనే అమ్ముడవుతాయి" అన్నారు.

ముఖ్యంగా భారత్-పాక్‌ను ఐసీసీ ఒకే గ్రూప్‌లో ఉంచడానికి ఆదేశ్ కుమార్ గుప్తా మరో కారణం కూడా చెప్పారు.

"భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా పక్కా ప్లాన్ ప్రకారమే సెట్ చేశారు. చిరకాల ప్రత్యర్థులు అయిన ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎలాగూ జరగడం లేదు కాబట్టి, వాటి మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఉండేలా ప్లాన్ చేశారు. రెండు దేశాల మధ్యా ఒక్క మ్యాచ్ జరిగినా కళ్లుతిరిగే ఆదాయం వస్తుంది" అంటారు ఆదేశ్ కుమార్ గుప్తా.

ఆదివారం సెలవు దినం కావడంతో భారత్ ఆ రోజున ఆడే మ్యాచ్‌లకు వ్యూయర్‌షిప్ విపరీతంగా ఉంటుందని, అందుకే వీలైనంత వరకూ భారత జట్టు ఆడే మ్యాచ్‌లను ఆరోజే ఉండేలా సెట్ చేస్తారని కూడా ఆయన వివరించారు.

బుమ్రా బౌలింగ్

ఫొటో సోర్స్, ALEX DAVIDSON/GETTY IMAGES

ఈ టోర్నీలో టాస్ ఎందుకు అంత కీలకం

టీ20 వరల్డ్ కప్‌లో ఒక వింత ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో టాస్ గెలవడమే ఆలస్యం ఎక్కువగా బ్యాటింగ్ ఎంచుకునేవారు. మొదట ఒక మోస్తర్ స్కోర్ చేసి, కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్ చేజిక్కించుకోవచ్చని భావించేవారు.

టాస్ గెలిచాక ఏది తీసుకోవాలి అనేది పూర్తిగా ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. జట్టులో ఉన్న బెస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్స్ ఒంటిచేత్తో విజయం అందించగలరని భావించేవారు.

కానీ, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో గేమ్ ప్లాన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి మ్యాచ్‌కూ టాస్ మెయిన్ ప్లేయర్ అయిపోయింది.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచే ఈ కొత్త ట్రెండ్ కనిపించింది. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న శ్రీలంక విజయం సాధించింది.

అదే రోజు భారత్-పాకిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ఎప్పుడూ మొదట బ్యాటింగ్ చేయాడనికే ఇష్టపడే పాక్.. ఈ మ్యాచ్‌లో మొదట ఫీల్డింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి తమ నిర్ణయం సరైనదే అని నిరూపించింది.

ఇక అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు మినహా దాదాపు అన్ని టీములూ టాస్ గెలవడమే ఆలస్యం బౌలింగ్ ఎంచుకుంటూ వచ్చాయి. విజయం సాధించి టాస్ ఈ టోర్నీలో ఎంత ముఖ్యం అనేది ప్రూవ్ చేశాయి.

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లే చూసుకుంటే.. శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి, భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ వరకూ టాస్ గెలిచిన దాదాపు ప్రతి కెప్టెన్ బౌలింగే కోరుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో స్కోర్ కట్టడి చేసి, ఒత్తిడి పెంచి ప్రత్యర్థిని చిత్తు చేశాడు.

ఇప్పటివరకూ వెస్టిండీస్-బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్‌లలో మాత్రమే టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసిన జట్లు ఓడిపోయాయి.

వెస్టిండీస్‌పై విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరంకాగా 9 పరుగులు మాత్రమే చేయగలిగిన బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో తృటిలో విజయం చేజార్చుకుంది.

సోమవారం(నవంబర్ 1) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక, ఇంగ్లండ్ ఇచ్చిన 164 పరుగుల విజయలక్ష్యం అందుకోలేక 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్‌ టాస్ ఓడినా విజయం సాధించడం ఇది రెండోసారి. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌, తన నిర్ణయానికి చింతించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో బంగ్లా 124 పరుగులే చేయడంతో, ఇంగ్లండ్ ఈజీగా మ్యాచ్ విన్నర్ అయ్యింది.

ఈ మొత్తం టోర్నీలో ఇప్పటివరకూ టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకుంటున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్ మాత్రమే. స్కాట్లాండ్‌, నమీబియాతో జరిగిన మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆ జట్టు మ్యాచ్ విజేతగా కూడా నిలిచింది.

కానీ, పాకిస్తాన్‌తో మాత్రం అఫ్గానిస్తాన్ అంచనాలు గల్లంతయ్యాయి. కానీ, ఆ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు పాకిస్తాన్‌ వెన్నులో వణుకు పుట్టించింది. చివరి ఓవర్ వరకూ దోబూచులాడిన విజయం ఆసిఫ్ అలీ నాలుగు సిక్సర్ల పుణ్యమా అని పాకిస్తాన్‌కు దక్కింది.

ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లు బట్టి, టాస్ గెలిచిన వారిదే మ్యాచ్ అనేది స్పష్టంగా నిరూపితం అవడంతో.. బరిలోకి దిగే ముందు కెప్టెన్లు కూడా మొదట టాస్ గెలవాలనే కోరుకుంటున్నారు. టాస్ ఓడగానే అదనపు ఒత్తిడికి గురవుతున్నారు.

పాక్ బౌలింగ్

ఫొటో సోర్స్, AAMIR QURESHI

మొదట బౌలింగ్ తీసుకోడానికి కారణం

యూఏఈలో టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా సాయంత్రం ప్రారంభం అవుతుండడంతో సాయంత్రం 8 గంటల తర్వాత మంచు కురుస్తుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్లు ఎక్కువగా బౌలింగ్ తీసుకుంటున్నారని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆదేశ్ కుమార్ గుప్తా బీబీసీకి చెప్పారు.

"యూఏఈలో జరిగే ఈ మ్యాచ్‌లు ఎక్కువగా సాయంత్రం ప్రారంభం అవుతాయి. ఇక్కడ రాత్రి 8 గంటల తర్వాత మంచు కురుస్తుంది. దాంతో మ్యాచ్ సెకండ్ హాఫ్‌లో బౌలర్లకు బంతిపై పట్టు దొరకదు. బంతికి తడి అంటడం వల్ల ఫాస్ట్ బౌలర్‌కు స్వింగ్ దొరకదు. స్పిన్నర్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. స్పిన్ కావడం, స్వింగ్ కావడం ఉండదు. దాంతో సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం లభిస్తుంది" అన్నారు.

"అంతే కాదు మ్యాచ్ రెండో అర్ధభాగంలో ఫీల్డింగ్ కూడా కష్టం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన ప్రతి జట్టూ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటోంది. బంతి కొత్తగా ఉంటంది కాబట్టి పరుగులు కట్టడి చేయడానికి ప్రయోజనం లభిస్తుంది. కానీ సెకండాఫ్‌లో కురిసే మంచు వల్ల బంతి స్వింగ్ కాకుండా నేరుగా బాట్ మీదకు వస్తుంది. దాంతో బ్యాట్స్‌మెన్ హిటింగ్‌కు సులభంగా ఉంటుంది"

మ్యాచ్ అనంతరం ఓటమి పాలైన కెప్టెన్లు కూడా చాలా వరకూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో ఆడిన మొదటి మ్యాచ్ తర్వాత మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్‌కు టాస్ కీలకం అయ్యిందని అంగీకరించాడు.

"అవును, ముఖ్యంగా ఈ టోర్నీలో టాస్ కచ్చితంగా ముఖ్యమైన అంశం కాబోతోంది. ఆట సెకండాఫ్‌లో మంచు కురుస్తూనే ఉంటే.. అందుకే, మనకు ఫస్టాఫ్‌లో కొన్ని అదనపు పరుగులు అవసరం అవుతాయి" అన్నారు.

భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కూడా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోడానికి కారణం అక్కడి పిచ్‌లపై మొదట బౌలింగ్ చేసినపుడు బంతి స్వింగ్ అవడం, బౌలర్లకు ప్రయోజనం లభించడమేనని అన్నారు.

"మొదటి విషయం ఏంటంటే భారత్ టాస్ ఓడిపోవడంతో అక్కడే జట్టు ఒత్తిడికి గురైంది. మొదట బౌలింగ్ చేసినపుడు బంతి దూసుకొస్తుంటే ఎవరూ ఏం చేయలేరు. తర్వాత బౌలింగ్ చేసిన జట్టుకు బంతి స్వింగ్ కాదు. అందుకే మొదట బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోవాల్సుంటుంది" అన్నారు.

యూఏఈ వికెట్‌పై మంచు పడడం వల్ల వచ్చే సమస్యను ఐపీఎల్ సమయంలోనే గమనించినట్లు న్యూజీలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా చెప్పారు. షార్జాలో పాకిస్తాన్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ విషయం బయటపెట్టారు.

"కాస్త మంచు కూడా ఉంది. ఐపీఎల్ ముగిసే సమయంలో మేం దాన్ని కాస్త చూశాం. అంటే ఆ పరిస్థితుల వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. మేం ఈ టోర్నీలోకి దిగబోతున్నప్పుడే మాకది తెలుసు" అన్నారు.

అయితే, మంచు కురవని సమయంలో పగటి పూట జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చాలా జట్లు మ్యాచ్‌ విజేతగా కూడా నిలిచాయి.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుని, తర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి కారణం ఏంటో వెస్టిండీస్ కెప్టెన్ చెప్పారు.

"ముఖ్యంగా ఇక్కడి వికెట్స్ ఫ్లాట్‌గా లేవు. దాంతో బౌలర్లకు ప్రయోజనం లభిస్తోంది. మేం బ్యాటింగ్ బాగా చేయాలంటే, పరిస్థితులను అంచనా వేసి, దానిని తగినట్లు ఆడాలి. వాటికి కచ్చితంగా అలవాటు పడాలి. మేం ఎదుర్కున్న సవాలు అదే" అని కగిసో రబడ కూడా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)