టీ20 వరల్డ్‌కప్‌ : ఐపీఎల్‌ ప్రభావం టీమ్‌ ఇండియాపై పడిందా?

Virat Kohli

ఫొటో సోర్స్, ALEX DAVIDSON/GETTY IMAGES

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం గ్రూప్‌-బిలో భారత్‌, న్యూజిలాండ్‌లు తలపడ్డాయి. భారత్‌పై న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. 111 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

న్యూజిలాండ్‌లో డారెల్ మిచెల్ 49 పరుగులు చేయగా, కేన్ విలియమ్సన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. చాలా కీలకమైన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా చాలా తక్కువ స్కోరుకే భారత్‌ పరిమితమైతే, బౌలర్లు మాత్రం మ్యాచ్‌ని ఎలా కాపాడగలుగుతారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి.

భారత్‌, న్యూజిలాండ్‌లను ఓడించి పాకిస్తాన్ గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో కొనసాగుతుండగా, కీలక సమయంలో భారత్‌పై నెగ్గి, న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది.

India vs Newzeland

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/ICC VIA GETTY IMAGES

భారత్ సెమీఫైనల్ చేరే ఛాన్స్‌ ఉందా?

''మొదట పాకిస్తాన్‌తో, ఇప్పుడు న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం క్లిష్టతరమైంది. భారత్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవడంతోపాటూ, అఫ్గానిస్తాన్ న్యూజిలాండ్‌ను ఓడించాలి. వీటితోపాటూ భారత్‌ అధిక రన్ రేట్‌తో ముందంజలో ఉండాలి. అప్పుడే సెమీ-ఫైనల్‌లో చోటు సంపాదించే అవకాశం ఉంటుంది'' అని క్రికెట్ సమీక్షకులు విజయ్ లోక్‌పల్లి పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్ గ్రూప్‌ బిలో ఐదో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పాకిస్తాన్‌, రెండో స్థానంలో అఫ్గానిస్తాన్‌ ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గాన్‌లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడగా, ఇందులో పాకిస్తాన్ మూడు విజయాలు సాధించింది. అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లు గెలిచింది.

ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది.

India vs Newzeland

ఫొటో సోర్స్, ALEX DAVIDSON/GETTY IMAGES

ఆదివారం మ్యాచ్

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కివీస్‌ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని వారి బౌలర్లు నిరూపించారు.

పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన జట్టులో భారత్ రెండు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా వచ్చారు.

India vs Newzeland

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES

రాణించిన బోల్ట్‌, సౌదీ, సోధీ

ట్రెంట్ బోల్ట్ న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి, ఈ పిచ్‌పై న్యూజిలాండ్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే సంకేతాలు పంపాడు.

ఈ భయాందోళనలు నిజం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. మూడో ఓవర్‌లోనే భారత్ స్కోరు 11 పరుగుల వద్ద ఇషాన్ కిషన్(4) ట్రెంట్ బోల్ట్ వేసిన బంతిని మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇషాన్ కిషన్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి రాగానే రోహిత్ శర్మకు ఓ లైఫ్‌ లభించింది. ఆడమ్ మిల్నే క్యాచ్‌ను జారవిడవడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా రోహిత్ శర్మ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 14 బంతులు ఎదుర్కొని 14 పరుగులు మాత్రమే చేశాడు.

రోహిత్‌కంటే కాస్త ముందే ఓపెనర్ కేఎల్‌ రాహుల్ మూడు ఫోర్ల సహాయంతో 18 పరుగులు చేసి టిమ్ సౌదీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడు భారత్ స్కోరు 35 పరుగులు మాత్రమే.

కేవలం జట్టు స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించాక, సోధీ వేసిన బంతికి రోహిత్ శర్మ కూడా మార్టిన్ గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7.4 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి నలభై పరుగులు.

India vs Newzeland

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES

70 పరుగులకే ఐదు వికెట్లు

ఈ సంక్షోభ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లపై భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీరు కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

క్రీజ్‌లో నిలదొక్కుకునే లోపే సోధీ వేసిన బంతికి విరాట్ కోహ్లి ట్రెంట్ బోల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 48 పరుగులు మాత్రమే. విరాట్ కోహ్లి తర్వాత రిషబ్ పంత్‌ వికెట్‌ను న్యూజిలాండ్ తీసింది. రిషబ్ పంత్ 19 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా అవుట్‌

విమర్శల నడుమ జట్టులో చోటు దక్కించుకోగలిగిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా న్యూజిలాండ్ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ట్రెంట్ బోల్ట్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా కూడా మార్టిన్ గప్టిల్‌కి క్యాచ్ ఇచ్చి 24 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు.

94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయాయి. ఈ సమయంలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లు క్రీజ్‌లో ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ ఖాతా కూడా తెరవకుండానే బోల్ట్ వేసిన బంతికి గప్టిల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

చివర్లో, రవీంద్ర జడేజా 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మహ్మద్ షమీ నాటౌట్‌గా నిలిచాడు.

India vs Newzeland

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/ICC VIA GETTY IMAGES

పటిష్టవంతంగా న్యూజిలాండ్‌ బౌలింగ్‌

ట్రెంట్ బోల్ట్ 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, సోధి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

వీరితో పాటు టిమ్ సౌదీ 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ఆడమ్ మిల్నే కూడా ముప్పై పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌కి వికెట్ దక్కలేదు కానీ, నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత బ్యాట్స్‌మెన్‌లను పరుగులు చేయకుండా కట్టడి చేశాడు.

''భారత బ్యాట్స్‌మెన్‌లపై న్యూజిలాండ్‌ పూర్తి పట్టుసాధించింది. స్లో పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాట్స్‌మెన్‌లు షాట్లు ఆడడంలో విఫలమయ్యారు. అంటే వారి షాట్ ఎంపిక సరైనది కాదు'' అని భారత జట్టు ఓటమి గురించి క్రికెట్ సమీక్షకులు విజయ్ లోక్‌పల్లి బీబీసీతో అన్నారు.

India vs Newzeland

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC/ICC VIA GETTY IMAGES

జట్టు ఎంపికపై కూడా విజయ్ లోక్‌పల్లి పలు ప్రశ్నలు సంధించారు. న్యూజిలాండ్‌పైనే కాదు, పాకిస్తాన్‌తో కూడా సరైన జట్టు ఆడలేదు. జట్టులో అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్‌పై హార్దిక్ పాండ్యా మినహా భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు.

''భువనేశ్వర్ కుమార్ వేగం తగ్గించాడు. హార్దిక్ పాండ్యా బంతితో చాలా సింపుల్‌గా కనిపించాడు. ఈ భారత జట్టు అంతర్జాతీయంగా ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్ అలసత్వం తొలి మ్యాచ్ నుంచే జట్టులో స్పష్టంగా కనిపించింది. ఏదైనా అద్భుతం జరిగితే గెలవాలనే తొందరలోనే జట్టు ఉన్నట్టు అనిపించింది'' అని లోక్‌పల్లి అన్నారు.

జట్టు బాడీ లాంగ్వేజ్‌ నుంచి గేమ్‌ వరకు అంతా నిరాశపరిచిందని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.

ఐపీఎల్ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టును ఫేవరేట్ జట్టుగా అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆటలో ప్రదర్శన చూస్తుంటే మాత్రం అసలు ఇది భారత జట్టేనా అంటూ బాధపడుతున్నారు. 10 నెలల కిందట ప్రతికూల పరిస్థితుల్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై చారిత్రక సిరీస్ గెలిచింది.

ఇక తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు, ఒక మ్యాచ్ డ్రాతో దాదాపు సిరీస్ కైవసం చేసుకున్నంత పని చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అక్కడి నుంచి నేరుగా టీమిండియా యూఏఈలో అడుగుపెట్టింది. ప్రస్తుత ప్రపంచ కప్ జరుగుతున్న చోటే ఐపీఎల్ 14వ సీజన్‌లోని రెండో దశ జరిగింది. ఇక్కడ దాదాపుగా భారత ఆటగాళ్లందరూ సత్తా చాటినవారే ఉన్నారు.

అందరూ మంచి ఫామ్‌లో ఉండటంతో భారత అభిమానులకు జట్టుపై భారీగా అంచనాలున్నాయి.

కానీ, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత జట్టు దారుణంగా విఫలమైంది. దీంతో స్టార్ ఆటగాళ్లున్న జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో అభిమానుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.

భారత జట్టు వైఫల్యానికి ఐపీఎల్ కారణమంటూ దాన్ని బ్యాన్ చేయాలంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

దీంతో ట్విట్టర్‌లో #BanIPL అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మరోవైపు టీమిండియా ఓటమికి ఇదే కారణం తప్ప మరోటి కనిపించడం లేదా అంటూ మరికొందరు ఐపీఎల్‌ను వెనకేసుకొస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లకు శారీరక శ్రమ ఎక్కువై, కీలక టోర్నీలకు వచ్చే సరికి ఆడలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)