రాజస్థాన్: పాకిస్తాన్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వాట్సాప్ స్టేటస్.. మోదీ స్కూల్ టీచర్‌పై వేటు, కేసు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మోహర్ సింగ్ మీనా
- హోదా, జైపూర్ నుండి, బీబీసీ కోసం
ఆదివారం భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాక్ విజయంపై హర్షం వ్యక్తం చేసినందుకు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ టీచర్‌ను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
మరోవైపు ఇదే తరహా మరో కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జోధ్‌పూర్‌లో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
వాట్సాప్ స్టేటస్‌పై వివాదం
ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్ ఆటగాడి చిత్రంతో 'జీత్ గయే.. మేం గెలిచాం' అని వాట్సాప్ స్టేటస్‌లో రాశారు.
ఉపాధ్యాయురాలి స్టేటస్‌ని పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి తండ్రి చూసి, మీరు పాకిస్తాన్‌కు మద్దతిస్తున్నారా? అని టీచర్‌కి మెసేజ్ చేశారు.
దీనికి సదరు టీచర్ - అవును! అని బదులిచ్చారు.

దీంతో ఈ వివాదం ముదిరింది. ఉపాధ్యాయురాలు నఫీసాతో చేసిన ఈ చాట్, స్టేటస్ స్క్రీన్‌షాట్‌లు స్థానిక మీడియా ఛానల్ కంటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నఫీసాను బహిష్కరిస్తూ పాఠశాల ప్రకటన విడుదల చేసింది.
నీర్జా మోదీ స్కూల్‌ను నిర్వహిస్తున్న సోజాతియా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం మేరకు నఫీసా అత్తారిని స్కూల్ నుంచి తక్షణమే తొలగించారు.
ఈ విషయంపై స్కూల్ డైరెక్టర్ మహేంద్ర సోజాటియా బీబీసీతో మాట్లాడుతూ.. ''సోషల్ మీడియా ద్వారా నాకు దీని గురించి సమాచారం వచ్చింది. మోదీ స్కూల్ ఇలాంటి వాటిని అస్సలు సహించదు'' అని అన్నారు.
ఉదయ్‌పూర్‌లోని అంబమత పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దల్పత్ సింగ్ రాథోడ్ బీబీసీతో మాట్లాడుతూ.. "ఈ ఘటనపై మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము. కొన్ని సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము. దర్యాప్తు కొనసాగుతోంది. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టినందుకు ఐపీసీ సెక్షన్ 153 (బీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము. ఇంకా అరెస్టు చేయలేదు" అన్నారు.
క్షమాపణ కోరిన టీచర్ నఫీసా
ఈ పూర్తి వ్యవహారంపై నఫీసా క్షమాపణ కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
"మేము మ్యాచ్ చూస్తున్నప్పుడు, ఇంట్లో రెండు గ్రూపులుగా విడిపోయి, ఎవరి జట్టుకు వారు మద్దతు తెలిపాము. అంటే నేను పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నానని దీని అర్థం కాదు" అని ఆమె అన్నారు.
"మీరు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నారా అని, ఎవరో నాకు మెసేజ్ చేశారు. ఆ సమయంలో అది ఒక జోక్‌గా భావించి, 'అవును' అని బదులిచ్చాను".
"నేను పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నానని అర్థం కాదు. నేను భారతీయురాలిని, ఐ లవ్ ఇండియా. మీ అందరిలాగే నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను".
"మీ అందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరి మనోభాలనైనా కించపరిచినట్టు భావిస్తే, నన్ను క్షమించండి".
ఇవి కూడా చదవండి:
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్‌ను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్ చేతులెత్తేసిందా?
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- 'అమ్మా నాన్నా అని పిలిపించుకోవడానికి మాకు 10 నెలలు పట్టింది'
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- ఖమ్మం: ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత
- సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









