జపాన్: రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన రాజకుమారి

మాకో, కొమురో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలేఖరుల సమావేశంలో ప్రేమ జంట

జపాన్ రాకుమారి మాకో తన ప్రియుడు కొమురోను పెళ్లి చేసుకున్నారు. రాజకుటుంబానికి చెందని సామాన్యుడు, ఒకప్పటి తన కాలేజిమేట్‌ అయిన కొమురోను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె తన రాచరిక స్థాయిని వదులుకున్నారు.

జపాన్ చట్టం ప్రకారం, రాజకుటుంబానికి చెందిన మహిళలు 'సామాన్యడి'ని పెళ్లి చేసుకుంటే రాచరిక గౌరవాన్ని వదులుకోవాలి. మగవాళ్లకు మాత్రం ఈ నియమం లేదు.

మాకో తనకు నచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఘనమైన రాచరిక సంప్రదాయ రీతులను కూడా వద్దన్నారు. రాచకుటుంబం నుంచి వెళ్లిపోతున్నందుకు రాకుమార్తెలకు ఇచ్చే నగదు నజరాను కూడా ఆమె తీసుకోవడానికి నిరాకరించారు. జపాన్ రాజ కుటుంబంలో ఈ రెండింటినీ వద్దనకున్న తొలి మహిళ ఆమే.

పెళ్లి చేసుకున్న ఈ జంట అమెరికాలో స్థిరపడనుంది. కొమురో అమెరికాలో లాయర్‌గా పని చేస్తున్నారు. ఈ జంటను అనివార్యంగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మేఘన్ మర్కల్, ప్రిన్స్ హ్యారీల జంటతో పోల్చి చూస్తున్నారు. మాకో, కొమురోలను జపాన్‌లో ఇప్పుడు 'జపాన్ హ్యారీ, మేఘన్‌లు' అని పిలుస్తున్నారు.

మాకోతో ప్రేమ బంధాన్ని ప్రకటించిన తరువాత కొమురోను కూడా మేఘన్‌ పూర్వాపరాలను పరిశీలించినట్లుగానే తనిఖీ చేశారు. ఇటీవల ఆయన జపాన్‌కు వచ్చినప్పుడు పోనీ టెయిల్‌తో కనిపించడంపై చాలా మంది విమర్శించారు.

జపాన్ సంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఆయన హెయిర్ స్టయిల్‌పై స్థానిక పత్రికలు, టాబ్లాయిడ్లలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకుమారిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనను తాను కోల్పోతున్నారనే వ్యాఖ్యలూ వినిపించాయి. మంగళవారం జరిగిన వారి పెళ్లి పట్ల కూడా దేశంలో కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.

మాకో, కొమురో

ఫొటో సోర్స్, Getty Images

ఆయనకు సాటి మరొకరు లేరు

మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాకో, తన పెళ్లి మూలంగా ప్రజలకు ఏదైనా కష్టం కలిగించి ఉంటే క్షమించాలని కోరారు.

"మా పెళ్లి వల్ల కలిగిన అసౌకర్యానికి నేను చాలా చింతిస్తున్నాను. అయితే, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు సంబంధించినంత వరకు కొమురోకు ప్రత్యామ్నాయం లేదు. ఇది మేమిద్దరం కోరుకున్న పెళ్లి" అని మాకో చెప్పినట్లు ఎన్‌హెచ్‌కె రిపోర్ట్ చేసింది.

మాకోను ప్రేమించానని, ఆమెతోనే జీవితం గడపాలని కోరుకున్నానని కొమురో అన్నారు. "నాకు మాకో అంటే ప్రేమ. మాకున్నది ఒకటే జీవితం. ఈ ఒక్క జీవితాన్ని ప్రేమించిన వ్యక్తితో గడపాలనుకున్నాను. మాకో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అకారణ ఆరోపణలతో మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యారు" అని కొమురో అన్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

వారి పెళ్లిని నిరసిస్తూ మంగళవారం నాడు ఒక పార్కులో ప్రదర్శనలు నిర్వహించారు. కొమురో కుటుంబం మీద, ముఖ్యంగా ఆయన తల్లి మీద ఉన్న ఆర్థికపరమైన ఆరోపణల గురించి వారు నినాదాలు చేశారు.

జపాన్

ఫొటో సోర్స్, Getty Images

మాజీ రాకుమారి 2017లోనే కొమురోతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొమురో తల్లికి ఆర్థిక సమస్యలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో వారి పెళ్లి వాయిదా పడింది. ఆమె తన మాజీ ప్రియుడి వద్ద నుంచి రుణం తీసుకుని ఎగవేశారని ఆరోపణలు వచ్చాయి.

అయితే, ఆ ఆరోపణలకూ, పెళ్లికీ ఎలాంటి సంబంధం లేదని రాచకుటుంబం ప్రకటించింది. కానీ, ఆ జంట పెళ్లి జరగడానికి ముందే డబ్బు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం మంచిదని క్రౌన్ ప్రిన్స్ కుమిహితో అప్పట్లోనే అన్నారు. కానీ, జపాన్‌లోని సంప్రదాయవాదులు రాకుమారిని పెళ్లి చేసుకునే అర్హత కొమురోకు లేదని అభ్యంతరపెట్టడమే పెళ్లి ఆలస్యం కావడానికి కారణమని బీబీసీ టోక్యో విలేఖరి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేయస్ తెలిపారు.

న్యూయార్క్‌లోని అత్యున్నత న్యాయ వ్యవహారాల సంస్థలో ఉద్యోగావకాశం సొంతం చేసుకున్న కొమురోది నిరాడంబర నేపథ్యం. స్థానిక పత్రికలు ఆయన గతాన్ని తవ్వి ఆ కుటంబానికి మరకలు అంటించేందుకు చాలా ఏళ్లు శ్రమించాయి. ఆయన తల్లి మీద ఆరోపణలు చేస్తూ వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)