చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా

ఒక పక్క సరిహద్దు వివాదాలు కొనసాగుతుండగానే చైనా కొత్తగా సరిహద్దు చట్టాన్ని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకపక్క సరిహద్దు వివాదాలు కొనసాగుతుండగానే చైనా కొత్తగా సరిహద్దు చట్టాన్ని ప్రకటించింది.
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌‌తో సరిహద్దు వివాదాల నడుమ, బోర్డర్స్‌లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చైనా శనివారం కొత్త చట్టాన్ని ఆమోదించింది. చైనా రూపొందించుకున్న ఈ సరిహద్దు చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి రాబోతోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

2020 ఏప్రిల్‌ నుంచి భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం, మియాన్మార్ నుండి అక్రమంగా సరిహద్దును దాటుతున్న వారి కారణంగా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కోవడం చైనాకు సవాలుగా మారింది.

అలాగే తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను చైనా నిరంతరం గమనిస్తోంది. మరోవైపు షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్ ముస్లింవర్గానికి చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు సరిహద్దు దాటి తన వైపుకు రావచ్చని చైనా భయపడుతోంది.

చైనా సరిహద్దు చట్టంలో ఏముంది?

సరిహద్దు భద్రతా ఏర్పాట్లపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి స్పష్టత లేనప్పటికీ, దీనికి, ఇండియా-చైనా సరిహద్దు వివాదానికి సంబంధం ఉందని చాలామంది భావిస్తున్నారు.

సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించి చైనా ఒక చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు. చైనా 14 దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.

ఇందులో 12 దేశాలతో భూ సరిహద్దు వివాదాన్ని చైనా పరిష్కరించుకుంది. భూటాన్‌తో 400 కిలోమీటర్ల ప్రాంతంలో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు మూడు దశల రోడ్‌ మ్యాప్‌పై ఈ ఏడాది అక్టోబర్ 14న చైనా సంతకం చేసింది. చైనాకు సరిహద్దు వివాదం మిగిలి ఉన్న ఏకైక దేశం ఇండియానే.

గత ఏడాది ఏప్రిల్ నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

కొత్త చట్టం ఏం చెబుతోంది?

తూర్పు లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనాల మధ్య దీర్ఘకాలంగా వివాదం ఉంది. ఈ సమయంలో చైనా కొత్త చట్టం తీసుకు వచ్చింది. కమాండర్ స్థాయి చర్చలు అనేక రౌండ్లు జరిగినప్పటికీ, తూర్పు లద్ధాఖ్‌లో ఏడాదికి పైగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. .

కొత్త భూ సరిహద్దు చట్టంలో చైనా సరిహద్దు రక్షణను 'చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత'తో ముడిపెట్టింది.

భూ సరిహద్దు చట్టం తర్వాత సరిహద్దు భద్రతా పద్ధతులను మార్చాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ, దాని సరిహద్దుల నిర్వహణతో చైనాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఈ చట్టం ఏర్పాటు చెప్పకనే చెబుతోంది.

సైనిక వివాదం లేదా సరిహద్దు భద్రతకు ముప్పు కలిగించే యుద్ధం జరిగితే చైనా తన సరిహద్దులను మూసివేయవచ్చని చట్టం పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లో 'నిర్మాణ పనులు' మెరుగు పరచడంపై కూడా చట్టం దృష్టి పెట్టింది.

సరిహద్దు వెంబడి, సరిహద్దు ప్రాంతాలలో నిర్మాణ పనులను మెరుగుపరచడం, ఆ నిర్మాణాలకు మద్దతును బలోపేతం చేయడం కూడా కొత్త చట్టంలో చేర్చారు.

సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సపోర్టుగా ఉండటానికి, సరిహద్దు ప్రాంతాలలో ప్రజా సేవలను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చైనా చర్యలు తీసుకోవచ్చని చట్టం చెబుతోంది.

చైనాకు దీటుగా భారత్ కూడా ఎల్ఏసీ వద్ద అనేక నిర్మాణాలు చేపడుతోందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాకు దీటుగా భారత్ కూడా ఎల్ఏసీ వద్ద అనేక నిర్మాణాలు చేపడుతోందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు.

భారత్ ఆందోళన చెందాలా?

"చైనా 1963లో పాకిస్తాన్‌తో సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం 'తాత్కాలికం'. కానీ చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం రహస్యం కాదు'' అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ చెప్పారు.

అంటే ఇప్పుడు చైనాకు సరిహద్దు వివాదం కేవలం భారత్, భూటాన్‌‌లతోనే ఉంది. భూటాన్‌‌తో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో చైనా కొత్త చట్టంతో తలనొప్పులు భారతదేశానికే ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.

"చైనా కొత్త చట్టంలో సముద్ర సరిహద్దుల ప్రస్తావన లేదు. ఈ చట్టం కేవలం భూ సరిహద్దుకు మాత్రమే వర్తిస్తుంది. దీంతోపాటు చట్టంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంది. మొదటిది 'రక్షణ' రెండవది 'వినియోగం'

కొత్త చట్టంలో పేర్కొన్న 'సరిహద్దు ప్రాంతాల' వినియోగం చాలా ముఖ్యమైనదని ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ అన్నారు.

"భారతదేశం దృష్టిలో, చైనా ఇప్పుడు రక్షణ నిర్వహణను సరిహద్దుతో మాత్రమే కాకుండా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతపు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ముడి పెట్టింది" అన్నారు.

"సులభమైన భాషలో చెప్పాలంటే, సరిహద్దుల వెంట చైనా కొత్త నగరాలను ఏర్పాటు చేస్తుంది. వాటికి రైళ్లు, రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలను అనుసంధానిస్తుంది. సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధి ద్వారా చైనా తన భద్రత, సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది" అని స్వరణ్ సింగ్ వెల్లడించారు.

అయితే అంతకు ముందు ఉన్న 'సరిహద్దు ప్రాంతాన్ని' చైనా వదిలేసిందని కాదు.

గతవారం 'గ్లోబల్ టైమ్స్‌'లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 2020 చివరి నాటికి, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి టిబెట్ సరిహద్దులో చైనా 600 సరిహద్దు గ్రామాలను నిర్మించింది.

ఆ గ్రామాలను కలిపే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. కనీసం 130 రోడ్లు కొత్తవి లేదా మరమ్మతులు చేసినవి ఉన్నాయి. ఈ మొత్తం పని 3080 కి.మీ. విస్తీర్ణంలో జరిగింది.

మరి దీనివల్ల భారత్‌‌కు వచ్చే నష్టమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి సీనియర్ జర్నలిస్ట్ గజాలా వహబ్ సమాధానం చెప్పారు. ఆయన గజాలా ఫోర్స్ మ్యాగజీన్‌‌కు ఎగ్జిక్యుటివ్ ఎడిటర్. 'డ్రాగన్ ఆన్ అవర్ డోర్ స్టెప్' అనే పుస్తకం రాశారు.

''చైనాతో సరిహద్దు వివాదం చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని భారత్ ఇప్పటి వరకు భావిస్తూ వచ్చింది. కానీ సరిహద్దు వివాదాన్ని తన సార్వభౌమత్వానికి అనుసంధానం చేయడం ద్వారా చైనా దాని స్థాయిని పెంచింది. ఇప్పుడు కేవలం చర్చలతోనే సమస్య పరిష్కారం కాదు. చైనా నిబంధనల ప్రకారమే పరిష్కారం వెలువడుతుంది. చైనా భారత్‌కు ఏ ఆఫర్ ఇస్తుందో, దానిని భారతదేశం అంగీకరిస్తే సరే. లేకపోతే చైనా తాను చేయాలనుకున్నది చేస్తుంది. అందులో యుద్ధం కూడా ఒకటి" అని గజాలా వహబ్ బీబీసీతో అన్నారు.

చర్చల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారం సాధ్యమని మొదటి నుంచి భారత్ నమ్ముతోంది

ఫొటో సోర్స్, TWITTER@NARENDRAMODI

ఫొటో క్యాప్షన్, చర్చల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారం అవుతుందని మొదటి నుంచి భారత్ నమ్ముతోంది.

భారతదేశ సంసిద్ధత

భారతదేశం-చైనాల మధ్య 3,488 కి.మీ. భూ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.

ఇది మూడు భాగాలుగా ఉంది. పశ్చిమ సెక్టార్ అంటే జమ్మూ-కశ్మీర్, మధ్య సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.

ఇరు దేశాల మధ్య చాలా ప్రాంతాలకు సంబంధించి సరిహద్దు వివాదం ఉన్నందున ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవు. అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) అనే పదాన్ని యథాతథ స్థితిని కొనసాగించడానికి ఉపయోగిస్తారు.

''తన భూమిని భారత్ ఆక్రమించుకుందని కొత్త చట్టం ప్రకారం చైనా చెబుతుంది. ఇటు ఇండియా కూడా తన భూమిని చైనా ఆక్రమించుకుందని చెబుతోంది'' అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి బీబీసీతో అన్నారు

సంజయ్ కులకర్ణి 1982-84 మధ్య లద్ధాక్‌‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర పని చేశారు. ఆ తర్వాత 2013 నుండి 2014 వరకు, 14వ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు.

సరిహద్దు ప్రాంతంలో చైనా చేస్తున్న 'నిర్మాణ పనుల'పై భారత్ చేతులు కట్టుకుని కూర్చోలేదని, తాను కూడా ఈ దిశగా పని చేస్తోందని ఆయన వెల్లడించారు.

"భారత దేశం ఎల్ఏసీని విశ్వసిస్తుంది. దానిని దాటి వెళ్లదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎల్ఏసీపై భారత్ తన స్టాండ్‌ను బలోపేతం చేసింది. ఆ ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనలు, హెలిప్యాడ్‌లను నిర్మించింది. మరిన్ని రోడ్లు కూడా ఏర్పాటవుతాయి. అయితే ఎల్‌ఏసీ విషయంలో భారత్, చైనాల దృక్కోణం వేరు వేరుగా ఉంది'' అని సంజయ్ కులకర్ణి అన్నారు.

2018-19 సంవత్సరపు వార్షిక నివేదికలో చైనాతో సరిహద్దుల వద్ద రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం 3812 కి.మీ ప్రాంతాన్ని గుర్తించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీటిలో 3418 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)కి అప్పగించారు. వీటిలో చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

రెండు దేశాల మధ్య వివాదానికి అనేక కారణాలలో ఈ నిర్మాణ పనులు కూడా ఒకటని భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని విశ్లేషించే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి జరిగిన సంఘటనలు సరిహద్దు ప్రాంతాలలో శాంతికి తీవ్రంగా భంగం కలిగించాయి. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిందని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా గత వారం అన్నారు.

అయితే, ఈ న్యూస్ ప్రచురితమయ్యే వరకు భారత ప్రభుత్వం నుంచి కొత్తగా ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)