చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికాతో భారత్ కీలక రక్షణ ఒప్పందం

భారత్, అమెరికా ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పెర్ భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌తో సమావేశం కాగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు

భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. శాటిలైట్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు భారతదేశం, అమెరికా కలిసి కీలకమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

మిస్సైళ్ళు, డ్రోన్లు లాంటి లక్ష్యాలను చేధించటానికి ఈ సమాచారం పనికొస్తుంది. దిల్లీలో ఇరు దేశాల మధ్య మంగళవారం జరిగిన 2 + 2 చర్చలు ముగిసిన తరువాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.

అమెరికా, భారత్ మధ్య బలపడుతున్న సంబంధాల ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయడమే కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పెర్ భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌తో సమావేశం కాగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు.

గత రెండు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని జై శంకర్ చెప్పారు. జాతీయ భద్రత విషయంలో ఇరు దేశాలు మరింత లోతుగా చర్చించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

అమెరికా తనకు దగ్గరగా ఉండే కొన్ని భాగస్వామిక దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలలో భౌగోళిక సమాచార విశ్లేషణలో సహకారం కోసం కుదుర్చుకునే బేసిక్ ఎక్స్చేంజి అండ్ కోపరేషన్ ఒప్పందం ఒకటి.

దీంతో భారతదేశానికి సైనిక చర్యలకు ఉపయోగపడే కీలకమైన భౌగోళిక, ఏరోనాటికల్ సమాచారాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది.

భారత సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇరు దేశాలు న్యూక్లియర్ శక్తి, భౌగోళిక విజ్ఞానం, ప్రత్యామ్నాయ వైద్య రంగాలకు సంబంధించిన మరి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అయితే, వీటన్నిటిలో భౌగోళిక సమాచార విశ్లేషణ కోసం చేసుకున్న ఒప్పందం కీలకమైనది.

ఈ ఒప్పందం వలన అమెరికా భారతదేశానికి సరఫరా చేసే విమానాలతో పాటు ఆధునిక వైమానిక పరికరాలను కూడా అందించటానికి ఉపయోగపడుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపింది.

హిమాలయ పర్వత ప్రాంతంలో భారతదేశానికి చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు ఎటూ తేలని నేపథ్యంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఏడాది జూన్ లో చైనా భారతదేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలలో 20 మంది భారత సైనికులు మరణించారు. ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్య సమావేశాలు ఒక కొలిక్కి రాలేదు. సైన్యాన్ని వెనకకు మరల్చడానికి కూడా ఈ చర్చలు సహకరించలేదు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో చైనా వ్యవహరించిన తీరును విమర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి.

అలాగే హాంగ్ కాంగ్‌లో తలెత్తిన భారీ నిరసనల తరువాత చైనా విధించిన కొత్త భద్రతా చట్టాన్ని కూడా అమెరికా తీవ్రంగా ఖండించింది.

ఇప్పుడు చేసుకున్న ఒప్పందం అమెరికా, భారత దేశాల మధ్య సంబంధాలను బలపరచవచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాలు కొనుక్కునే దేశం. కానీ, 60-70 శాతం పరికరాలు రష్యా సమకూరుస్తుంది.

మైక్ పాంపేయో దంపతులు

ఫొటో సోర్స్, INDIAN MINISTRY OF EXTERNAL AFFAIRS/HANDOUT

రజనీ వైద్యనాథన్ విశ్లేషణ

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పత్రికా విలేకరులకు కేటాయించిన స్థలంలో హ్యాండ్ శానిటైజర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులంతా మాస్కులు ధరించారు.

అమెరికాలో మరి కొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు సీనియర్ క్యాబినెట్ మంత్రులు భారతదేశంలో ప్రతినిధులతో సమావేశం కావడాన్ని పరిశీలిస్తే ఈ చర్చల ప్రాతినిధ్యం అర్ధం అవుతోంది.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయడమే ఈ పర్యటన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అమెరికా అధికారులు రానున్న రోజుల్లో శ్రీ లంక, మాల్దీవులు, ఇండోనేసియా కూడా పర్యటించనున్నారు. ఈ దేశాలన్నీ చైనాతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి.

అమెరికా భారతదేశానికి అత్యధికంగా రక్షణ పరికరాలు సమకూర్చే ఒక ముఖ్యమైన దేశంగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు ఇచ్చిన ప్రకటనలు ఇదే సందేశాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి.

ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలపర్చుకునేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది అని సింగ్ ఇచ్చిన ప్రకటన తెలుపుతోంది.

"మా చర్చలు సఫలీకృతమయ్యాయి" అని సింగ్ ట్వీట్ చేశారు.

అమెరికా ఇండియాల మధ్య వార్షికంగా జరిగే టూ ప్లస్ టూ సమావేశాల్లో ఈ సారి జరిగిన సమావేశం మూడవది. ఇవి తొలిసారి 2018లో జరిగాయి. ప్రస్తుతం జరిగిన చర్చలు ఈ ఏడాది మొదట్లో జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.

అమెరికా, భారత్ చర్చలు

ఫొటో సోర్స్, PIB

కీలకమైన దౌత్య వ్యవహారం: వికాస్ పాండే విశ్లేషణ

ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందం చాలా కీలకమైనదిగా కనిపిస్తోంది. ఇండియా చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను అమెరికా కనిపెట్టి తన ప్రాముఖ్యతను ఈ ప్రాంతంలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వాషింగ్టన్ ఇండియాని ఒక ముఖ్యమైన మిత్ర దేశంగా పరిగణిస్తున్నట్లు చైనాకి సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం పాడుతున్న చైనా వ్యతిరేక నినాదానికి మరింత బలం చేకూర్చే విధంగా భావించవచ్చు.

కానీ, భారతీయ అధికారులు మాత్రం ఈ విషయంలో దౌత్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

సరిహద్దులో సైన్యాన్ని వెనక్కి మరల్చేందుకు దిల్లీ ఇంకా బీజింగ్ తో చర్చలు జరుపుతోంది. ఒక వైపు కోవిడ్ తో పోరాటం జరుపుతున్న ఈ సమయంలో చైనాతో ఎటువంటి చిన్న ఉద్రిక్తతను కూడా కోరుకునే పరిస్థితిలో భారతదేశం లేదు.

ఇరు దేశాల నాయకులు మంగళవారం ఒక పత్రికా సమావేశంలో చేసిన ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వారి ప్రకటనల్లో చైనా పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఎస్పెర్, పాంపియో మాత్రం చైనా వైపు తమ బాణాలు విసిరారు.

ఇండియా రష్యా తో తనకున్న సంబంధాల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం మాస్కో, వాషింగ్టన్ లతో ఉన్న రక్షణ సంబంధాలను ఎలా సమతుల్యం చేస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)