'చైనా దుమ్ముతో కరోనావైరస్ వస్తోంది’ - ఉత్తర కొరియా హెచ్చరికలు

కేసీటీవీ

ఫొటో సోర్స్, KCTV

చైనా నుంచి తమ భూభాగం మీదకు వీస్తున్న 'పసుపచ్చని ధూళి' ద్వారా కరోనావైరస్ రావచ్చునంటూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఉత్తర కొరియా తన పౌరులను హెచ్చరించింది.

ఈ హెచ్చరిక నేపథ్యంలో దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరం వీధులు గురువారం దాదాపు నిర్మానుష్యంగా మారినట్లు వార్తలు వచ్చాయి.

ఉత్తర కొరియా తమ దేశంలో కరోనావైరస్ లేదని ప్రకటిస్తోంది. అయితే.. జనవరి నుంచి అత్యధిక అప్రమత్తతతో ఉంది. సరిహద్దులు మూసివేయటంతో పాటు, ప్రజల రాకపోకల మీద తీవ్ర ఆంక్షలు విధించింది.

ఈ సీజన్‌లో వచ్చే ధూళి మేఘాలకు, కరోనావైరస్‌కి మధ్య సంబంధం ఉన్నట్లు ఎటువంటి నిర్ధారణ జరగలేదు.

అయితే.. ఆ ధూళికి, కరోనావైరస్‌కు సంబంధం ఉందని చెప్తున్న దేశం ఉత్తర కొరియా ఒక్కటే కాదు. తుర్కెమినిస్తాన్ కూడా తన ప్రజలను మాస్కులు ధరించాలని చెప్పటానికి కారణం.. వైరస్‌తో కూడిన ధూళి రావటమేనని ఆరోపించినట్లు బీబీసీ డిజిన్ఫర్మేషన్ టీమ్ పేర్కొంది. దేశంలో కరోనావైరస్ విజృంభణ విషయాన్ని దాచిపెట్టటానికి ప్రయత్నిస్తున్నామనే వాదనను తుర్కెమినిస్తాన్ తిరస్కరించింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

''దుష్ట వైరస్‌ల దురాక్రమణ''

గురువారం నాడు ఎల్లో డస్ట్ (పసుపుపచ్చని ధూళి) దురాక్రమణకు వస్తోందని హెచ్చరిస్తూ.. ఉత్తర కొరియా ప్రభుత్వ యాజమాన్యంలోని కొరియన్ సెంట్రల్ టెలివిజన్ (కేసీటీవీ) బుధవారం నాడు ప్రత్యేక వాతావరణ వార్తలు ప్రసారం చేసింది. ఆరుబయట నిర్మాణ పనుల మీద దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు కూడా ప్రకటించింది.

ఎల్లో డస్ట్ అంటే.. మంగోలియా, చైనా ఎడారుల నుంచి ఒక ఏడాదిలో నిర్దిష్ట కాలాల్లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా భూభాగల మీదకు వీచే ఇసుక. అందులో విషపూరిత ధూళి కలగలిసి ఉండటం.. చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాల్లో ఆరోగ్య సంబంధిత ఆందోళనలకు కారణమవుతోంది.

ప్రభుత్వ ప్రచారాంగమైన రోడాంగ్‌సిన్మున్ వార్తాపత్రిక గురువారం నాడు.. ''దురాక్రమిస్తున్న దుష్ట వైరస్‌ల ప్రమాదాన్ని కార్మికులందరూ తప్పనిసరిగా స్పష్టంగా గుర్తించాలి'' అంటూ ఈ ధూళి మేఘాల గురించి హెచ్చరించినట్లు బీబీసీ డిజిన్ఫర్మేషన్ టీమ్ పేర్కొంది.

ఈ విషయంలో ఉత్తర కొరియా ఆందోళనల గురించి తమకు హెచ్చరికలు అందాయని పలు రాయబార కార్యాలయాలు కూడా నివేదించాయి.

ప్యాంగ్యాంగ్‌లోని రష్యా రాయబార కార్యాలయం.. ఈ ధూళి తుపాను గురించి తమకు, ఇతర దౌత్య కార్యాలయాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి గురువారం హెచ్చరికలు అందాయని తన ఫేస్‌బుక్ పేజ్‌లో తెలిపింది. విదేశీయులందరూ ఇళ్లలోనే ఉండాలని, తలుపులు, కిటికీలను గట్టిగా మూసివేసుకోవాలని సూచించారని వివరించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ధూళి మేఘాలు కరోనావైరస్‌ను మోసుకొస్తాయా?

కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనే అంశంపై పరిశోధనలను బట్టి.. తమ ''భూభాగం మీదకు వస్తున్న ఎల్లో డస్ట్ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది'' అనేది ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వాదన.

కరోనావైరస్ గాలిలో ''కొన్ని గంటల పాటు'' నిలిచివుంటుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పింది. అయితే.. ఈ రకంగా ఆ వైరస్ సోకటం, ప్రత్యేకించి ఆరుబయట గాలి ద్వారా సోకటం చాలాచాలా అరుదని కూడా ఆ సంస్థ పేర్కొంది.

ఈ వైరస్ సోకిన వారికి దగ్గరగా నిలబడి ఉన్నపుడు.. ఆ వైరస్ సోకిన వారు దగ్గటమో, తుమ్మటమో, మాట్లాడటమో చేసినపుడు వారి ఉమ్ము తుంపర్ల ద్వారా వైరస్ ప్రధానంగా సోకుతుంది.

చైనా నుంచి వచ్చే పుసుపుపచ్చని ధూళి ద్వారా ఉత్తర కొరియాలోకి కరోనావైరస్ వస్తుందనే వాదనను పొరుగు దేశమైన దక్షిణ కొరియా కూడా కొట్టివేసిందని.. అలా జరగటం అసాధ్యమని చెప్పిందని ఎన్‌కే న్యూస్ తెలిపింది.

ఉత్తర కొరియాలో కోవిడ్ కేసులేవీ లేవని గట్టిగా చెప్పుకుంటున్నప్పటికీ.. దేశంలో ఈ వ్యాధి వ్యాప్తిపై తీవ్ర భయాలు ఉన్నాయి. కఠినమైన ఆంక్షలు అమలయ్యేలా దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఉత్తర కొరియాలో ఎటువంటి కరోనావైరస్‌ కేసులు లేకపోవటమనేది అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)