డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చేశారు?

- రచయిత, రెబెకా సీల్స్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్షుడంటే కేవలం అమెరికాకు నాయకుడు మాత్రమే కాదు. ఈ భూమి మీద అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి. ఆయన ప్రతి చర్యా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. డోనల్డ్ ట్రంప్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. మరి తన పదవీ కాలంలో ఈ ప్రపంచం మీద ట్రంప్ ఎలాంటి ముద్ర వేశారు ?
ప్రపంచం దృష్టిలో అమెరికా
“అమెరికా ప్రపంచంలో అతి గొప్పదేశం.’’ ట్రంప్ తన ప్రసంగాలలో పదే పదే చెప్పే మాట ఇది. అయితే, అమెరికా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి ట్రంప్ చేసిందేమీ లేదని ఇటీవల ప్యూ రీసెసెర్చ్ సెంటర్ అనే సంస్థ 13 దేశాలలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
ఐరోపా దేశాలలో అమెరికా కీర్తి గత 20సంవత్సరాలతో పోలిస్తే అతి తక్కుగా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ తేల్చింది. అమెరికాపట్ల బ్రిటన్‌లో 41%మంది సానుకూలత వ్యక్తం చేయగా, ఫ్రాన్స్‌లో 31%, జర్మనీలో 26%శాతం సానుకూలత వ్యక్తమైంది.
జర్మనీలో 2003 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడిపట్ల వ్యక్తమైన అతి తక్కువ సానుకూలత ఇదే.
కరోనా వైరస్‌ను అమెరికా డీల్ చేసిన తీరుపై సర్వేలో పాల్గొన్నవారందరిలో కేవలం 15%మందే సానుకూలత వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్యావరణం విషయంలో వెనకడుగు
పర్యావరణం గురించి ట్రంప్ ఆలోచనా విధానమేంటో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కాలుష్యం సహా అది ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రంప్ ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందిస్తుంటారు. పర్యావరణ సమస్య అనేది ఓ అబద్ధపు ప్రచారమని ఒకసారి, ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అని మరోసారి స్పందిస్తుంటారు ట్రంప్.
ప్రపంచ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల మేరకు తగ్గించాలని 200 దేశాలు అంగీకారానికి వచ్చి పారిస్ ఒప్పందంపై సంతకం చేస్తే, తాను పదవిలోకి వచ్చిన ఆరు నెలలకే దీన్నుంచి వైదొలిగారు ట్రంప్. ఆయన వైఖరి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే దేశం అమెరికాయే. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడైతే గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని కాపాడటం కష్టమని కొందరు పర్యావరణవేత్తలు వ్యాఖ్యానించారు.
ఇలా నిబంధనలు విధించుకుంటూపోతే అమెరికాలో కంపెనీలన్నీ మూసేయాల్సి వస్తుందంటూ పారిస్ ఒప్పందాన్ని తిరస్కరించారు. అంతేకాదు ఆయిల్, బొగ్గు, గ్యాస్ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం కోసం కాలుష్య నివారణ చట్టాలను ట్రంప్ సరళతరం చేశారు.
తక్కువ ధరకే లభించే సహజ వాయువు నుంచి ఏర్పడిన పోటీ, పునరుత్పాదక శక్తి వనరులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో అమెరికాలోని అనేక బొగ్గుగనులు మూతపడ్డాయి.
2019లో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం బొగ్గుకన్నా, పునరుద్పాదక శక్తి వనరులతో ఎక్కువ ప్రయోజనాలు నెరవేరాయని తేలింది. 130 సంవత్సరాలలో ఈ తరహా ఫలితాలు రావడం ఇదే తొలిసారి.
పారిస్ ఒప్పందం నుంచి బైటికి రావడమనే నిర్ణయం అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక అంటే నవంబర్ 4 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే తాను అధికారంలోకి వస్తే అమెరికాను ఈ ఒప్పందంలో చేరుస్తానని జో బైడెన్ ప్రకటించారు.
అమెరికా ఒప్పందం నుంచి బైటికి రావడం వల్ల ప్రపంచానికి నిజంగా ఎంత నష్టం జరుగుతుందన్నది పక్కనబెడితే ఆ దేశ వైఖరిని అడ్డుపెట్టుకుని బ్రెజిల్, సౌదీ అరేబియాలాంటి దేశాలు కూడా నిబంధనలను పట్టించుకోకుండాపోయే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కొందరికి సరిహద్దుల మూసివేత
తాను అధికారం చేపట్టిన వారంలోనే ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలపై కఠిన నిర్ణయాలకు దిగారు ట్రంప్. ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రయాణికులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే కాక, 13 దేశాల నుంచి వచ్చే వారిపై కూడా అనేక ఆంక్షలు విధించారు.
అయితే 2016తో పోలిస్తే 2019 అమెరికాలో నివసించే విదేశీయుల సంఖ్య 3% పెరిగింది. కాకపోతే దేశంలో వచ్చే వర్గాలలో మాత్రం మార్పు కనిపించింది.
ట్రంప్ పాలనా కాలంలో మెక్సికోలో జన్మించే అమెరికా పౌరుల సంఖ్య క్రమంగా తగ్గగా, ఇతర లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులకు వలస వెళ్లే వారి సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారి వీసాల విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేశారు.
ముఖ్యంగా అక్కడ ఇప్పటికే నివసిస్తున్న వారి బంధువులు అమెరికాలో స్థిరపడేందుకు ఉన్న అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేశారు.
దేశంలోకి వలసలపై ట్రంప్ విధానాలకు చిహ్నంగా మారింది అమెరికా-మెక్సికోల మధ్య నిర్మించిన గోడ. ఈ ఏడాది అక్టోబర్ మూడోవారం నాటికి 371 మైళ్ల గోడ నిర్మాణం పూర్తయిందని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
అయితే ఇంత చేసినా అమెరికాకు రావాలనుకునే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చే వారి సంఖ్య 2019లో అత్యధిక స్థాయికి చేరుకుంది. గత ఏడాది నమోదైన గణాంకాలు గత 12 సంవత్సరాలలోనే అత్యధికం.
ఇక శరణార్ధులకు ఆశ్రయమిచ్చే విషయంలో కూడా అమెరికా నిబంధనలను కఠినం చేసింది. 2016లో 85,000మంది శరణార్ధులు అమెరికాలో స్థిరపడగా, ఆ మరుసటి సంవత్సరం దాన్ని 54,000కు కుదించారు. 2021 నాటికి ఈ సంఖ్య 15,000కు తగ్గించాలన్నది అమెరికా ఆలోచన.

ఫొటో సోర్స్, Reuters
పెరిగిన ‘ఫేక్‌న్యూస్’
“నాకు తెలిసిన పెద్ద మాటల్లో ఫేక్ అనేది కూడా ఒకటి’’ అని 2017 అక్టోబర్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫేక్‌న్యూస్ అనే మాటను కనుక్కోకపోయినా, దాన్ని పాపులర్ చేసిన ఘనత మాత్రం ట్రంప్‌కే దక్కుతుంది.
గూగుల్ సెర్చ్‌లో ఫేక్‌న్యూస్ అని సెర్చ్ చేస్తే 1.1 బిలియన్ ఫలితాలు వస్తాయి. అయితే 2016-17లో వాటి సంఖ్య ఎక్కువగా పెరగడం గమనించవచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరమే ట్రంప్ ఫేక్‌న్యూస్ అవార్డ్స్ అంటూ తనకు తెలిసిన అనేక అవాస్తవ కథనాలు ఇవి అంటూ బైట పెట్టారు.
2016కు తర్వాత విస్తృత ప్రయోగంతో ఫేక్‌న్యూస్ అనే మాటకున్న అర్ధం కూడా మారిపోయింది. తనకు నచ్చని న్యూస్ స్టోరీలను ఫేక్‌న్యూస్ అంటూ ట్రంప్ తరచూ విమర్శిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా సంస్థలను అమెరికాకు శత్రువులుగా ప్రకటించారు ట్రంప్.
ఫేక్‌న్యూస్ అనే మాటను ట్రంప్ విస్తృతంగా వాడటం మొదలుపెట్టిన తర్వాత థాయిలాండ్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, బహ్రయిన్‌లాంటి దేశాల అధినేతలు కూడా తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలు, జర్నలిస్టులను ఫేక్‌న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో వేధించడం మొదలు పెట్టారు.
ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీసే క్రమంలో నిజాయితీగా పని చేసే మీడియా సంస్థలను ఫేక్‌న్యూస్ పేరుతో తక్కువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది ‘ఫేక్‌న్యూస్’ అని ఒక ప్రముఖ వ్యక్తి ఆరోపించగానే సహజంగా ప్రజలు కూడా అదే నిజమనుకుంటారని మేధోవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఆగని అమెరికా యుద్ధం
“గొప్ప దేశాలు అంతులేని యుద్ధాలు చేయవు” అంటూ ట్రంప్ గత ఏడాది ఫిబ్రవరిలో సిరియా యుద్ధం నుంచి తప్పుకుంటున్న సమయంలో ప్రకటించారు.
అయితే అక్కడున్న గణాంకాలు మాత్రం వేరే కథ వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో తన చమురు బావులను, స్థావరాలను కాపాడుకోవడానికి అమెరికా ఇంకా 500 దళాలను సిరియాలో కొనసాగిస్తోంది.
ఇరాన్, సిరియాలతో సహా అఫ్గానిస్థాన్ నుంచి కూడా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించినా, ఇంకా పూర్తి స్థాయిలో ఆ నిర్ణయం అమలు కాలేదు.
అయితే సైన్యాలు లేకపోయినా కూడా తన ప్రభావాన్ని వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదన్నది ఇజ్రాయెల్ రాజధానిని టెల్అవీవ్ నుంచి జెరూసలేంకు మార్పించడాన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు 2018లో ట్రంప్ ప్రకటించారు.
మరోవైపు మధ్యప్రాచ్యంలో తానొక శాంతిదూత అనిపించుకునే క్రమంలో ట్రంప్ ఇజ్రాయెల్‌కు, యూఏఈ, బహ్రయిన్‌లాంటి అరబ్ దేశాలకు మధ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నించారు. ఈ దేశాల మధ్య ఒప్పందానికి ట్రంప్ మధ్యవర్తిగా నిలిచారు.
ఆయన చొరవ కారణంగానే 1948 తర్వాత రెండు గల్ఫ్‌దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒప్పందాలు కుదుర్చుకునే కళ
తన ప్రమేయంలేని ప్రతి ఒప్పందం సరైనది కాదనే భావనలో ఉంటారు ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్‌షిప్ పేరుతో ఒబామా కాలంలో 12 దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్‌ను రద్దు చేశారు. ఇదో భయంకరమైన ఒప్పందం అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఆసియా-పసిఫిక్‌లో తన ప్రభావాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసినదే ఈ ఒప్పందమని భావిస్తున్న చైనా, అమెరికా నిర్ణయంతో కొంత వరకు లాభపడింది. ఇటు అమెరికన్లు కూడా ఉద్యోగాల కొరతకు కారణమవుతుందన్న అభిప్రాయంతో ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించారు.
ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తనకు తెలిసిన అత్యంత చెత్త ఒప్పందంగా పేర్కొన్న ట్రంప్ దాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. కుదరక పోవడంతో కొద్దికొద్ది మార్పులతోనే కొనసాగిస్తున్నారు.
వాణిజ్య ఒప్పందాలతో దేశానికి ఎంత లాభం కలిగించాలి అన్నదానిపై ట్రంప్ దృష్టిపెట్టారు. అయితే చైనాతో వాణిజ్య యుద్ధం చేదు ఫలితాలను ఇచ్చింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలు తాము దిగుమతి చేసుకునే వస్తువులపై పరస్పరం పన్నులు విధించుకున్నాయి. దీనివల్ల అమెరికాలో సోయా రైతులు ఇబ్బందిపడగా, చైనా తన నష్టాలను తగ్గించుకోడానికి తయరీసంస్థలను వియత్నాం, కాంబోడియాలాంటి దేశాలకు తరలించాల్సి వచ్చింది.
2019నాటికి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య 2016తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికీ అమెరికా ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో కయ్యం
1979లో అమెరికా తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ట్రంప్ తాను ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టక ముందు అంటే 2016 డిసెంబర్ 2న తైవాన్ అధ్యక్షుడికి ఫోన్ చేశారు. దీంతో అమెరికాపై చైనాకు కోపం పెరిగిందని బీబీసీ చైనా ఎడిటర్ క్యారీగ్రాసీ అభిప్రాయపడ్డారు.
తైవాన్ తమదేశంలో అంతర్భాగంగా చైనా భావిస్తుండగా, అమెరికా మాత్రం దాన్ని స్వతంత్ర దేశంగా పరిగణిస్తుంది.
దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని ప్రయత్నించడం ద్వారా చైనాను మరింత కవ్వించింది అమెరికా. వాటికి తోడు టిక్‌టాక్, వీచాట్‌లాంటి యాప్‌లను నిషేధించడంతోపాటు 5జి టెక్నాలజీని అందించే టెలీకాం దిగ్గజ కంపెనీ హువావేను జాతీయ భద్రత పేరుతో తమ దేశంలోకి రాకుండా నిరోధించింది.
అయితే అమెరికా-చైనాల మధ్య కయ్యానికి ట్రంప్ ఒక్కరినే కారణమని చెప్పడానికి లేదు. 2013లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమలు చేయడానికి ప్రయత్నించడం, వీగర్ ముస్లింలను వేధించడంలాంటివి ఇందులో కొన్ని.
కోవిడ్-19కు ట్రంప్ ఏకంగా చైనా వైరస్ అని పేరు పెట్టారు. తన పాలనలో ఆ వైరస్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ, ఒకవేళ కొత్త నాయకత్వం వచ్చినా, చైనాపై వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ చైనా అధినేతను బందిపోటు(థగ్)గా అభివర్ణించారు. ఆయన శరీరంలో అసలు ఎముక ఉండకపోవచ్చని షి జిన్‌పింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, EPA
ఇరాన్‌పై యుద్ధ విన్యాసాలు
“మా స్థావరాలపై దాడి చేసి నష్టానికి కారణమైతే, దానికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది’’ అని 2019 ఆరంభంలో కొత్త సంవత్సరం రోజే ట్రంప్ ట్వీట్ చేశారు.
దాని తర్వాత కొద్దిరోజులకే ఇరాన్ ఆర్మీ జనరల్ కాసీం సులేమానీని అమెరికా డ్రోన్ ఎటాక్ ద్వారా చంపి సంచలనం సృష్టించింది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ ప్రాభవాన్ని పెంచుతున్నందున అమెరికా ఆయనపై కక్షగట్టిందన్న ఆరోపణలు వినిపించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బేస్‌ల మీద ఆయుధాలతో దాడి చేసింది. ఈ దాడుల్లో వందలమంది అమెరికా సైనికులు గాయపడ్డారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత దాదాపు యుద్ధంలాగానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అక్కడ యుద్ధం లేదు. కానీ అమాయకులు మాత్రం చనిపోయారు. ఉక్రెయిన్‌కు చెందిన ప్రయాణికులు విమానంపై జరిగిన దాడిలో 176మంది మరణించారు.
1979 నుంచీ అమెరికా ఇరాన్‌ల మధ్య సత్సంబంధాలు లేవు. ఇరాన్ నియంతకు ‘షా’కు అప్పట్లో అమెరికా మద్దతిచ్చింది. తర్వాత ఇరాన్ విప్లవంతో షా గద్దెదిగాల్సి వచ్చింది.
2015నాటి అణు ఒప్పందాన్ని తిరగదోడి ఇరాన్ మీద ఆర్ధిక ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య మళ్లీ చిచ్చు మొదలైంది.
అణు ఒప్పందంతో ఇరాన్‌ను మెడలు వంచాలన్న అమెరికా ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇరాన్ ఆర్ధికవ్యవస్థ కుంగి పోవడం మొదలుపెట్టింది. ఆ దేశంలో ఆహారం ధరలు 60%శాతం పెరిగాయి. ఆకలి కేకలతో ఇరాన్‌లో ప్రజలు ఆందోళనలకు దిగారు.
కరోనా మహమ్మారి రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను కాస్త తగ్గించినప్పటికీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే మార్గాలకన్నా సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- మాన్సాస్ ట్రస్టు: విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- మహాత్మాగాంధీతో బెజవాడ నాస్తిక కేంద్రానికి ఉన్న బంధం ఏంటి?
- కంజర్ భట్ ముఠా..కంటెయినర్ల నుంచి సెల్ఫోన్లు దోచుకుని బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్న ఏపీ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








