అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం: ఫేస్‌బుక్ నుంచి పేపాల్ వరకు అన్నిటినీ వాడేసిన రష్యా

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష ఎన్నికల(2016)ను ప్రభావితం చేసేందుకు రష్యా అన్ని సామాజిక మాధ్యమాలను వాడిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, టంబ్లర్, ఇన్‌స్టాగ్రామ్.. చివరకు పేపాల్‌ను కూడా రష్యా ఇందుకోసం వాడుకుందని ఈ అధ్యయనం బయటపెట్టింది.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి రష్యా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసిందో వివరిస్తూ అమెరికా సెనేట్ సోమవారం(17.12.18) ఈ నివేదికను విడుదల చేసింది.
ఈ విషయంలో టెక్ సంస్థలు తమకు సకాలంలో, సమన్వయంతో సమాధానాలు చెప్పలేదని ఈ నివేదిక రూపొందించిన అధ్యయనకర్తలు విమర్శలు చేశారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ 'కంప్యుటేషనల్ ప్రొపగాండా ప్రాజెక్ట్' సామాజిక మాధ్యమాల విశ్లేషణ సంస్థ గ్రాఫికా సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి.
ట్విటర్, గూగుల్, ఫేస్‌బుక్‌లు సెనేట్ ఇంటిలిజెన్స్ కమిటీకి అందించిన లక్షలాది సోషల్ మీడియా పోస్టులను విశ్లేషించి చేసిన తొలి అధ్యయనం ఇది.
కాగా ఫేస్‌బుక్, ట్విటర్‌లు గతంలోనే రష్యా ప్రమేయంపై ఆధారాలను బయటపెట్టాయి. ఇప్పుడు మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకున్న తీరూ బయటపడింది.

ఫొటో సోర్స్, AFP
రష్యాకు చెందిన 'ఇంటర్నెట్ రీసెర్చి ఏజెన్సీ' అనే సంస్థ ఈ ప్రచార పనులు చూసుకుందని.. రష్యా ప్రభుత్వంతో దీనికి సంబంధాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
వలసలు, జాతి భేదాలు, తుపాకుల లైసెన్సులకు సంబంధించిన పోస్టులను కన్జర్వేటివ్‌లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున పంపించారని పేర్కొన్నారు.
దాంతోపాటు ఆఫ్రికన్ అమెరికన్ల ఓటింగ్ శాతం తగ్గించే లక్ష్యంతో ఆ వర్గాలకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తప్పుడు సమాచారాలు పంపించేవారట.
ప్రత్యేకించి ఆఫ్రికన్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా చేసిన ప్రయత్నాలను బయటపెడుతూ 'న్యూ నాలెడ్జ్' అనే సంస్థ ఇచ్చిన నివేదికను కూడా సెనేట్ సోమవారం విడుదల చేసింది.
ఆక్స్‌ఫర్డ్, గ్రాఫికా నివేదిక 'బ్లాక్ మేటర్స్ యూఎస్' అనే 'ఇంటర్నెట్ రీసెర్చి ఏజెన్సీ' ప్రచారాన్ని ఉటంకించింది. ఇది ఫేస్ బుక్, ట్విటర్, ఇన్‌స్టా, యూట్యూబ్, గూగుల్ ప్లస్, టంబ్లర్, పేపాల్‌లో ప్రచారమైంది. ఈ ఏజెన్సీకి చెందిన అనేక ఖాతాలు సామాజిక మాధ్యమాల్లో ఒకరి పోస్టులను మరొకరు పోస్ట్ చేస్తూ విపరీతంగా ప్రచారమయ్యేలా చేస్తాయి.
దీన్ని ఫేస్‌బుక్ సస్పెండ్ చేయగా ట్విటర్‌లో ఈ గ్రూప్ ఖాతాల నుంచి ఫేస్‌బుక్ సంస్థకు వ్యతిరేకంగా ఫిర్యాదులు మొదలయ్యాయి.
శ్వేతజాతి ఆధిపత్యం అంటూ ఫేస్‌బుక్ చర్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున కేంపెయిన్ మొదలుపెట్టారు అప్పట్లో.
వీటన్నిటి పరిశీలించిన అధ్యయనకర్తలు.. ''ఇదంతా రిపబ్లికన్ పార్టీకి, డొనాల్డ్ ట్రంప్‌కు మేలు చేకూర్చేందుకు జరిగిని ప్రయత్నం' అని తమ నివేదికలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









