టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు: తెలంగాణ ఎన్నికలు 2018

ఫొటో సోర్స్, facebook
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. డిసెంబరు 7న పోలింగ్ జరగనున్న తెలంగాణలో ఈసారి పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), ఆ పార్టీతో స్నేహపూర్వకమైన పక్షంగా ఎంఐఎం పోటీ చేస్తుండగా... కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ సహా మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా... సీపీఎం, మరికొన్ని పార్టీలు కలిసి బహుజన లెఫ్ట్ ప్రంట్‌గా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి.
హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల పోరులో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. దీంతో ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనంటూ టీఆర్ఎస్, మహాకూటమి రెండూ దేనికది ఘంటాపథంగా చెబుతున్నాయి.
అయితే, అటు టీఆర్ఎస్.. ఇటు మహాకూటమి రెండింటి ముందూ ఎన్నో సవాళ్లున్నాయి. ఎన్నికల్లో విజయం అందుకోవడంలోను, ఒకవేళ విజయం అందుకున్నా ఆ తరువాత పాలనలోనూ రెండు పక్షాల ముందు సవాళ్లున్నాయి.
టీఆర్ఎస్ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలనే నమ్ముకోగా.. హామీల అమలు తీరు, వైఫల్యాలే ప్రధానాస్త్రాలుగా మహాకూటమికి ముందుకెళ్తోంది.

ఫొటో సోర్స్, facebook/HarishRaoTanneeru
తెలంగాణ రాష్ట్ర సమితి
2014 ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో 63 సీట్లను గెలుచుకుని టీఆర్ఎస్ కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే, ఎన్నికలకు ముందే.. 60 ఏళ్లపాటు అన్యాయమైపోయిన తెలంగాణను పునర్నిర్మించాల్సిన బాధ్యత ఉద్యమ పార్టీగా తమపై ఉందంటూ, తమనే గెలిపించాలని కోరుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏమేం చేస్తామో టీఆర్ఎస్ తమ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది.
ఆ మేనిఫెస్టోయే ఇప్పుడు టీఆర్ఎస్‌కు అతి పెద్ద సవాల్‌గా మారింది. తమ విజన్ ఇదీ అంటూ ప్రజల ముందుంచిన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన మాటలను టీఆర్ఎస్ నిలుపుకోలేకపోయిందని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ తరుణంలో టీఆర్ఎస్ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజుల పాలనలో విజయాలు, వైఫల్యాలు అన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఘనతలా.. గొప్పలా?
టీఆర్ఎస్ ప్రధానంగా అయిదు అంశాలను తమ ప్రభుత్వ ఘనతలుగా చెప్పుకొంటోంది. ఈ అంశాలలో తాము ఎంతో ప్రగతి సాధించామని.. దశాబ్దాల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా తెలంగాణ ప్రజలను ఆదుకున్నామని చెబుతోంది.
1) 24 గంటల విద్యుత్
2) కల్యాణ లక్ష్మి పథకం
(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి రూ.1,00,116 ఆర్థిక సహాయం చేసే పథకం.)
3) రైతు బంధు
(రైతులకు ఎకరాకు సీజన్‌కు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.8 వేలు సాయం అందించడం)
4) కేసీఆర్ కిట్
(పేద గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సురక్షితమైన ప్రసవాలు జరిగేలా తీసుకొచ్చిన పథకం. కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు చేయడమే కాకుండా ప్రసవాలు కూడా చేస్తున్నారు. గర్భిణులు పనులకు వెళ్లకుండా నగదుతోపాటు బాలిక సంరక్షణకు కిట్‌లు పంపిణీ చేశారు. మగపిల్లాడు పుడితే కిట్‌తోపాటు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే కిట్‌తోపాటు రూ.13 వేలు చొప్పున ఇచ్చారు)
5) సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్టులతో సుమారు 10 లక్షల హెక్టార్లకు కొత్తగా నీరందించడం.

ఫొటో సోర్స్, HarishRaoTanneeru/Facebook
అయితే, టీఆర్ఎస్ ఘనంగా చెప్పుకొంటున్న ఈ విజయాల్లోని లోపాలనూ విపక్షాలు ఎత్తి చూపుతున్నాయి.
విద్యుత్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోందని.. నిజానికి, దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందని విపక్ష నేతలు అంటున్నారు.
''ఈ నాలుగున్నరేళ్లలో కొత్తగా ఒక్క మెగావాట్ కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్పత్తి చేయలేదు, విద్యుత్ లభ్యత విషయంలో ఈ ప్రభుత్వం ఘనత ఏమీ లేదు'' అన్న తెలంగాణ టీడీపీ నేత దుర్గాప్రసాద్ వ్యాఖ్యలే దానికి ఉదాహరణ.
మరోవైపు టీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకొంటున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వాల కాలంలో ప్రారంభమైనవేనని.. రీడిజైనింగ్ పేరుతో వాటి అంచనాలను భారీగా పెంచి ఈ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందనీ విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు బంధు పథకం కేవలం పెద్ద రైతులకు మేలు చేయడానికి తెచ్చిందని, అసలు వ్యవసాయం చేసే కౌలు రైతుకు దీనివల్ల రూపాయి కూడా ప్రయోజనం దక్కలేదని ఆరోపిస్తున్నారు.
''కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటివన్నీ సంక్షేమ పథకాలని.. సంక్షేమ పథకాలు అమలు చేయడం అన్ని ప్రభుత్వాలకూ సాధారణమేనని ఇందులో ఘనతేమీ లేదని కాంగ్రెస్ నేత ఎం.రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TSSCCFC.CGG.GOV.IN
కేసీఆర్ వైఫల్యాలు.. విపక్షాల చేతి అస్త్రాలు
అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఆర్భాటంగా హామీలివ్వడం తప్ప వాటిని అమలు చేయలేకపోయిందని కాంగ్రెస్, టీడీపీలు విమర్శించాయి.
మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ.. సొంతంగా పోటీ చేస్తున్న బీజేపీ ప్రధానంగా 5 అంశాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
1) పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు:
కేసీఆర్ ప్రభుత్వంలోని ఆకర్షణీయ పథకాల్లో ఇదొకటి. రెండు పడకగదులు, హాల్ వంటగది, టాయిలెట్ ఉన్న ఇళ్లు పేదలకు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. రూ.16,975 కోట్లతో 2,72,763 డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వీటిలో పూర్తయినవి 5,824 మాత్రమే.
2) దళితులకు మూడెకరాల భూపంపిణీ
వ్యవసాయ భూమిలేని దళితులకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఎకరాలు ఇస్తామని కేసీఆర్ సర్కార్ చెప్పింది. గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసైనా దళితులకు ఇస్తామని చెప్పింది.
అయితే, ఇప్పటివరకు 4,984 మంది దళితులకు 12,853.05 ఎకరాల భూ పంపిణీ మాత్రమే పూర్తయింది.
3) కేజీ టు పీజీ విద్య
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సదుపాయం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఆ దిశగా అడుగులు పడలేదు.
4) లక్ష ఉద్యోగాలు
కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా బాగా ఇబ్బంది పెట్టిన అంశమిది. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో 22 వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదని టీజేఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
5) మిగులు నిధులున్న రాష్ట్రం నుంచి రూ.2 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంగా మారడం
2015-16 నాటికి తెలంగాణకు రూ.90 వేల కోట్లు అప్పు ఉండగా 2018-19 బడ్జెట్ ప్రకటించే నాటికి అది రూ.1.80 లక్షల కోట్లకు చేరింది. ప్రతిపక్షాలు దీన్ని తమ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ పేద రాష్ట్రంగా మార్చారని ఆరోపిస్తున్నారు.
ఇవి కాకుండా కొత్తగా ఏర్పాటైన 21 జిల్లా కేంద్రాల్లో 21 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడం, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన వంటి టీఆర్ఎస్ గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో నేతలు, అభ్యర్థులు ఎండగడుతున్నారు.

ఫొటో సోర్స్, kcr/fb
అన్ని వైపుల నుంచీ ఒత్తిడి
ఇవన్నీ పాలనాపరమైన సానుకూల, ప్రతికూల అంశాలు కాగా ఎన్నికల వేళ టిక్కెట్ల కేటాయింపు మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్‌కు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. టిక్కెట్లు దక్కని సిటింగ్ ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీ, కాంగ్రెస్‌లలో చేరి పోటీ చేస్తుండగా మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల ప్రతికూల సంకేతాలు పంపింది.
వీటన్నిటితో పాటు మహాకూటమి తరఫున కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు, టీడీపీ నేత చంద్రబాబు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తుండడం.. బీజేపీ కూడా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి స్టార్ క్యాంపెయినర్లను, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ వంటివారిని ప్రచార క్షేత్రంలోకి తేవడంతో బీజేపీ వైపు నుంచీ పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెరసి.. నాలుగున్నరేళ్ల పాలనపై నిలదీస్తున్న విపక్షాలు, ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలే ఇచ్చిన షాక్‌లను తట్టుకుంటూ కేసీఆర్ ఈ 2018 అసెంబ్లీ ఎన్నికలను ఎలా దాటుతారు? ప్రజల నమ్మకాన్ని మరోసారి చూరగొంటారా..? లేదంటే ఒక్క విడతకే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని పక్కకు తొలగుతారా అనేది చూడాలి.

ఫొటో సోర్స్, facebook/Kodandaram
మహాకూటమి.. టీం వర్క్ గెలిపిస్తుందా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఆకాంక్షలను టీఆర్‌ఎస్ నెరవేర్చలేకపోయిందని.. అలాంటి ప్రభుత్వం ఉంటే మరింత నష్టమే తప్ప తెలంగాణకు మేలు జరగదని చెబుతూ టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి జోడెద్దుగా బండి లాగిన ప్రొఫెసర్ కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తరువాత విభేధిస్తూ వచ్చారు. చివరకు సొంత పార్టీ పెట్టుకుని కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ చలవేనని.. కేసీఆర్ ఆ ఘనతను తనదిగా చెప్పుకోవడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాశనానికి అన్ని ప్రయత్నాలూ చేశారన్న కారణంతో కాంగ్రెస్ కూడా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని ప్రతిన పూనింది.
ఇక తెలంగాణ ఏర్పాటు తరువాత 2014 ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా వారిలో ఇద్దరు మినహా అందరినీ కేసీఆర్ తమ పార్టీలోకి తీసుకెళ్లడం.. ఇతర కారణాలతో తెలుగుదేశం పార్టీ కూడా టీఆర్ఎస్ ఓటమి అవసరమని చెప్పింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌తో కలవడడం చారిత్రక అవసరమని టీడీపీ చెప్పింది.
దీనికి కేంద్రంలోని పరిణామాలూ తోడై కాంగ్రెస్, టీడీపీల మధ్య దోస్తీ కుదిరింది. అప్పటికే కాంగ్రెస్, తెలంగాణ జనసమితి కూడా జత కట్టాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోరాదన్న కారణం చూపుతూ ఆ రెండూ పార్టీలు చేయి కలపగా.. వీటికి సీపీఐ వంటి పార్టీలూ కలిశాయి.

ఫొటో సోర్స్, facebook
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకరణ, కేసీఆర్ వైఫల్యాలే అస్త్రాలుగా..
కాంగ్రెస్, టీడీపీ, మహాకూటములు వేర్వేరుగా పోటీ చేయడం కంటే ఇలా కూటమిగా ఏర్పడడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమికి పడే అవకాశం ఉంటుంది.
కూటమిలోని పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకుని పోటీ చేయడం వల్ల చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడానికి అవకాశం ఏర్పడింది.
కాంగ్రెస్, టీడీపీ వంటి క్యాడర్ ఉన్న పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి సాగడమనేది సానుకూల ఫలితాలు అందించే వ్యూహమని ఆ రెండు పార్టీలూ చెబుతున్నాయి..
వీటితో పాటు కేసీఆర్ పాలనా వైఫల్యాలే అస్త్రాలుగా మహాకూటమి ప్రజల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ తెలంగాణ యువతను మోసగించారంటూ బలంగా ప్రచారం చేయగలుగుతోంది.
డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా అతి తక్కువ మందికే దక్కాయని, రైతుబంధు వల్ల కౌలు రైతులకు న్యాయం జరగలేదని చెబుతూ ప్రజల్లోకి వెళ్తోంది. దీంతోపాటు తమకు అధికారమిస్తే ఏమేం చేస్తామనే విషయంలోనూ మహాకూటమి టీఆర్ఎస్ కంటే ముందుగానే మేనిఫెస్టో విడుదల చేసి అందులోని అంశాలను ప్రచారం చేస్తోంది.

ఫొటో సోర్స్, facebook/KodandaRam
యువతే లక్ష్యంగా లక్ష ఉద్యోగాల హామీ
* టీఆర్ఎస్ విఫలమైన చోటి నుంచి తాము మొదలు పెట్టాలని తెలంగాణ ప్రజా సమితి అనుకుంటోంది. ఆ క్రమంలోనే 'పీపుల్స్ ఫ్రంట్ ఉద్యమ ఆకాంక్షలు' పేరుతో విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో.. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అక్కడి నుంచి క్రమం తప్పకుండా భర్తీ చేయడానికి వార్షిక ప్రణాళిక కూడా రూపొందిస్తామని చెప్పింది.
* ఒక్కో రైతుకు రూ.2 లక్షల పంటరుణం ఒకే విడతలో మాఫీ.
* 100 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచితంగా విద్యుత్
* 51 నెలల కేసీఆర్ పాలనలో విస్మరణకు గురైన అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

ఫొటో సోర్స్, facebook/KodandaRam
లుకలుకలు, అలకలు, సవాళ్లు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయిచేయి కలిపిన కూటమి ప్రజాక్షేత్రానికి వెళ్తున్న తరుణంలో కొన్ని సవాళ్లనూ ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా కూటమిలో కొట్లాటలు సీట్ల సర్దుబాటు నుంచే మొదలవడంతో టికెట్ల పంపిణీలో తీవ్రమైన జాప్యం ఏర్పడింది.
దీనివల్ల టీఆర్ఎస్‌తో పోల్చితే కూటమి అభ్యర్థులకు ప్రచారానికి వ్యవధి బాగా తగ్గిపోయింది.
పైగా సీట్ల సర్దుబాట్లకు అంగీకరించని పలువురు నేతలు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇది కూటమి ఏర్పాటు లక్ష్యంలో ఒకటైన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకరణ అవకాశాన్ని దెబ్బతీయనుంది.
అదే సమయంలో కూటమి కన్వీనర్, ఉద్యమ నేత కోదండరాం కోరుకున్న సీటు ఇవ్వకపోవడం కూడా తెలంగాణ ప్రజా సమితిలో చాలామందికి ఆగ్రహం కలిగిస్తోంది.
మరోవైపు దశాబ్దాలుగా తమపై పోరాడిన బద్ధ శత్రువు తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెస్ కలిసి ఈ ఎన్నికల్లో తమపై పోటీ చేస్తుండడాన్ని టీఆర్ఎస్ తప్పు పడుతోంది.
టీడీపీ, చంద్రబాబు తెలంగాణకు శత్రువులని.. నీళ్ల విషయంలో ఆయన అడ్డంకులు సృష్టించారంటూ టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో... తమ కలయికకు సమర్థనీయమైన కారణాలను ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్, టీడీపీలు ఎంతవరకు సఫలమవుతాయో.. సమష్టి పోరుతో ఉమ్మడి రాజకీయ శత్రువుపై విజయం సాధించగలుగుతాయో లేదో అన్నది తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
అలాగే లక్ష ఉద్యోగాల హామీని నెరవేర్చలేదన్న విమర్శలను టీఆర్ఎస్ ఎదుర్కొంటుండగా మహాకూటమి కూడా అదే హామీని ఎత్తుకుని, అది కూడా ఏడాదిలోనే ఇస్తామని చెప్పింది.. కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ హామీ కూటమి ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి పెంచనుంది.
ఇవి కూడా చదవండి:
- ఈ శతాబ్ధంలో మహిళల్ని వెనక్కు లాగుతున్నవేంటి?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








