ట్రంప్ - రష్యా: మొత్తం సీరియల్ 250 పదాల్లో

ఫొటో సోర్స్, Getty Images
డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచీ అమెరికా రాజకీయాల్లో చాలా కీలకంగా మారిన అంశం.. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం. ట్రంప్ అధ్యక్షుడైన ఆ ఎన్నికలకు సంబంధించిన ఈ వివాదం చాలా సంక్లిష్టమైనది.
ఈ వివాదం.. దానికి సంబంధించి ఇప్పటివరకూ జరిగిన ముఖ్య పరిణామాలు క్లుప్తంగా..
అసలేమిటీ వివాదం?
అధ్యక్ష ఎన్నికలను ట్రంప్‌కు అనుకూలంగా మలుపుతిప్పటానికి రష్యా ప్రయత్నించిందని అమెరికా నిఘా సంస్థలు విశ్వసిస్తున్నాయి. ట్రంప్ ప్రచార బృందంలో ఎవరైనా ఇందులో కుమ్మక్కయ్యారా అనే అంశాన్ని ప్రత్యేక అధికారి దర్యాప్తు చేస్తున్నారు.
సాక్ష్యముందా?
ట్రంప్ బృందంలోని సీనియర్ సభ్యులు రష్యా అధికారులను కలిశారు. ఆ భేటీల్లో కొన్నిటి గురించి ముందుగా బయటపెట్టలేదు.
ఏమిటా భేటీలు?
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి ముందు.. అమెరికాలో రష్యా రాయబారితో తన భేటీ గురించి మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పారు.
డోనల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ఎన్నికల ప్రచారం సమయంలో రష్యా న్యాయవాది ఒకరిని కలిశారు.
హిల్లరీ క్లింటన్‌ను అపఖ్యాతి పాలుచేసే సమాచారం తన దగ్గర ఉందని ఆ న్యాయవాది జూనియర్ డోనల్డ్‌కి చెప్పారు.
రష్యా మధ్యవర్తులుగా భావిస్తున్న వారితో తన భేటీల గురించి ఎఫ్‌బీఐతో అబద్ధం చెప్పానని ట్రంప్ సలహాదారుడు జార్జ్ పాపడోపోలస్ అంగీకరించారు.
ఇంకెవరి పాత్ర ఉంది?
ప్రత్యేక అధికారి దర్యాప్తు ఫలితంగా మరో ఇద్దరు కీలక వ్యక్తులు కూడా జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి ఉంది.
రష్యాలో తన మాజీ బాస్ (ట్రంప్) వాణిజ్య లావాదేవీల గురించి కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పినట్లు ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కొహెన్ అంగీకరించారు.
ట్రంప్ ఎన్నికల ప్రచారానికి చైర్మన్‌గా వ్యవహరించిన పాల్ మానఫోర్ట్.. ఉక్రెయిన్‌లో తను పనిచేసిన అంశం గురించి ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పారని ప్రత్యేక అధికారి రాబర్ట్ ముల్లర్ పేర్కొన్నారు. బ్యాంకు మోసంలో మాన్‌ఫోర్ట్ ఇప్పటికే దోషిగా నిర్ధారితుడయ్యారు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తున్నారు.
అధ్యక్షుడి సంగతేమిటి?
ఈ దర్యాప్తుల్లో ఒక విభాగానికి సారథ్యం వహిస్తున్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీని ట్రంప్ విధుల నుంచి తొలగించారు. దీనివల్ల.. న్యాయానికి అధ్యక్షుడు అవరోధం కల్పించారా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
అటార్నీ జనరల్‌గా ఉన్న జెఫ్ సెషన్స్‌ని కూడా విధుల నుంచి తొలగించారు. దీంతో రష్యా జోక్యంపై దర్యాప్తు దెబ్బతింటుందన్న ఆందోళన రేగింది.
ఇదంతా 'రాజకీయ ప్రతీకారం' అని అధ్యక్షుడు పదే పదే అభివర్ణిస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








