తెలంగాణ ఎన్నికలు: ఓటరు కార్డు లేకుంటే ఏం తీసుకెళ్లాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మాల్కాజిగిరి నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆరుగురు పోటీ చేస్తున్నారు.

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో...
టీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ, టీజేఎస్,సీపీఐలతో కలిసి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడి పోటీకి దిగాయి. బీజేపీ 118 స్థానాల్లో పోటీలో ఉంది.
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి మద్దతిచ్చిన బీజేపీ అక్కడ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.
ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 11 స్థానాల నుంచి టీజేఎస్ 8 స్థానాల నుంచి, సీపీఐ 3 స్థానాల నుంచి బరిలోకి దిగాయి. బహుజన్ లెఫ్ట్ర్ ఫ్రంట్ 119 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం 8 స్థానాల్లో బరి దిగింది.

రాష్ట్రంలో తొలిసారి వీవీప్యాట్‌ల వినియోగం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఈవీఎంలకు అనుసంధానమై ఉండే వీవీప్యాట్‌లతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామనేది చూసుకోవచ్చు.
దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరుపై ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ఓటేసిన వెంటనే తమ ఓటు ఎవరికి నమోదైందో ఓటరు వీవీప్యాట్‌లో చూసుకోవచ్చు.
వీటిపై నిషేధం
పోలింగ్‌బూత్‌లలో సెల్‌ఫోన్‌లను నిషేధించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలపై కూడా ఆంక్షలు విధించారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రాలకు వస్తే అరెస్టు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.ఓటర్లను ఎవరైనా ప్రలోభపెడితే డయల్ 100కు కాల్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఇక్కడ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
సిర్పూరు, చెన్నూరు(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల, అసిఫాబాద్(ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఇల్లెందు(ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం(ఎస్టీ) నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు పోలింగ్ జరగుతుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఉర్దూ, మరాఠీలో ఓటర్ల జాబితా
హైదరాబాద్ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి 15 నియోజకవర్గాలతో పాటు, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ (అర్బన్) నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను ఉర్దూలో కూడా ఎన్నికల సంగం ప్రచురించింది. అలాగే, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా బోధ్, నిర్మల్ జిల్లా ముథోల్, నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గాల్లో మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను వెలువరించింది.

135 కోట్లు సీజ్
పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
ఓటర్లు గుర్తింపు కార్డులుగా ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసెన్స్, బ్యాంక్ పాస్ బుక్కులు, పాన్ కార్డు, ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఐడీ కార్డులు, పెన్షన్ పత్రాలు ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు సరైన పత్రాలు లేని 135 కోట్లు సీజ్ చేశామని తెలిపారు. పోయిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అని అన్నారు. ఇప్పటికీ డబ్బు పంపిణీపై ఇంకా పిర్యాదులు అందుతూనే ఉన్నాయన్నారు.
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం 53 మంది స్వతంత్ర అబ్జర్వర్లు ఉన్నారని వివరించారు. 26 డిసెంబర్ నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నారని ఆయన వెల్లడించారు. ఈసారి తెలంగాణలో కొత్తగా 20 లక్షల మంది ఓటర్లు పేరు నమోదు చేయించుకున్నారని తెలిపారు. 1లక్ష 16 వేల మంది డూప్లికేట్ ఓటర్లను గుర్తించామని ఆయన తెలిపారు.

ఇక్కడ నాలుగింటికే పోలింగ్ పూర్తి
సమస్యాత్మక ప్రాంతాలలో 4 గంటలకే ఓటింగ్ ముగిస్తున్నట్లు వెల్లడించారు.
వీవీపాట్, ఈవీఎం ఫెయిల్ అయితాయేమోనన్న అనుమానం వద్దని, ప్రతి చోటా తప్పకుండా ఎన్నికలు జరుగుతాయన్నారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్‌లకు వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.
పోలింగ్ పర్యవేక్షణ కోసం 446 బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయని, కొడంగల్‌లో జరిగిన సంఘటనల దృష్ట్యాల అక్కడ భారీ భద్రతా బలగాలను మోహరించామని తెలిపారు.

భారీ భద్రత
ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు.
30 వేల రాష్ట్ర పోలీసులు, 279 కంపెనీల పారా మిలటరీ బలగాలు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నాయని తెలిపారు.
గత 3 నెలలుగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామన్న రజత్ కుమార్.. ప్రజలంతా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఓట్లు వేయాలని.. ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
సీ విజిల్ యాప్ ద్వారా 8 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వాటిలో 250 కేసులు నగదు పంపిణీకి సంబంధించివని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









