కాసిం సులేమానీ అంతిమ యాత్రకు భారీగా హాజరైన జనం.. బగ్దాద్‌లో పేలుళ్లు.. అమెరికా జోలికి వస్తే ‘గట్టిగా కొడతాం’ అన్న ట్రంప్

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ ఆర్మీ కమాండర్ జనరల్ కాసిం సులేమానీ శవయాత్రలో పాల్గొనడానికి ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో జనం భారీగా వీధుల్లోకి వచ్చారు.
గురువారం అమెరికా దాడిలో కాసిం సులేమానీ మృతిచెందారు. బగ్దాద్ విమానాశ్రయం బయట జరిగిన డ్రోన్ దాడుల్లో సులేమానీ సహా ఐదుగురు ఇరాకీలు కూడా చనిపోయారు.
సులేమానీ ఇరాన్‌లో కీలకమైన కడ్స్ దళం అధ్యక్షుడు. ఈ దళం ఇరాన్ తరఫున విదేశాల్లో సైనిక ఆపరేషన్లను అమలు చేసేదిగా పేరు సంపాదించింది.
ఎన్నో ఏళ్లుగా లెబనాన్, ఇరాక్, సిరియా, మిగతా గల్ఫ్ దేశాల్లో వ్యూహాత్మక దాడులు చేస్తూ, ఇరాన్, దాని సహచరుల స్థితిని బలోపేతం చేసేందుకు సులేమాన్ పనిచేస్తున్నారు.
శనివారం బగ్దాద్‌లో జరిగిన ఒక భారీ సంతాప సభ తర్వాత సులేమానీ మృతదేహాన్ని ఇరాన్ పంపించారు. సెంట్రల్ ఇరాన్‌లో సులేమానీ సొంత జిల్లా కేరమాన్‌లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
బగ్దాద్‌లో గుమిగూడిన జనం కమాండర్ అబూ మహదీ అల్-ముహాదిస్ మృతికి కూడా సంతాపం తెలిపారు. కమాండర్ అబూ ఇరాన్‌కు మద్దతిచ్చే కతాయిబ్ హిజ్బుల్లా గ్రూప్ అధ్యక్షుడు.
అయితే, ఇరాక్‌లో ఒక వర్గం సులేమానీ చనిపోయారనే వార్తలు రాగానే సంబరాలు చేసుకుంది. గతకొన్ని నెలలుగా శాంతిపూర్వక ప్రదర్శనలు చేస్తున్న ప్రజాస్వామ్య సమర్థకులపై సులేమానీ దళాలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డాయని వారు ఆరోపించారు.
సులేమానీ శవయాత్రలో పాల్గొనడానికి ఉదయం నుంచే బగ్దాద్ వీధుల్లో జనం గుమిగూడడం మొదలైంది.

ఫొటో సోర్స్, AFP
మూడు రోజుల సంతాపం
రోడ్లపై భారీగా చేరుకున్న జనం చేతుల్లో ఇరాక్ జెండాలు ఉన్నాయి. కొంతమంది కాసిం సులేమానీ, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ఫొటోలు పట్టుకున్నారు. 'అమెరికా డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు.
స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం సులేమానీ శవాన్ని శనివారం సాయంత్రం విమానంలో ఇరాన్ తీసుకెళ్లారు. అక్కడ ఇప్పటికే మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.

విశ్లేషణ
లీజ్ డుసెట్, బీబీసీ చీఫ్ అంతర్జాతీయ ప్రతినిధి
ఇప్పుడు కాసిం సులేమానీ మృతిపై ఒక గట్టి సందేశం ఇవ్వడం ఇరాన్ నేతల ప్రాధాన్యం. దానివల్ల సులేమానీ ఇరాన్‌కు ఎంత ముఖ్యం అనేది తెలుస్తుంది.
సులేమానీ ఒక సైనికాధికారిగా ఇరాన్‌కు చాలా ముఖ్యులు. ఆయన ఒక ముఖ్యమైన నిఘా అధికారి. ఆయన్ను ఇరాన్‌లో అత్యంత కీలకమైన రాజకీయ ప్రముఖుడుగా చెప్పడం తప్పు కాదు.
పశ్చిమాసియాలో ఇరాన్ ఆశయాల వెనుక, కాసిం సులేమానీ ఒక మాస్టర్ మైండ్. యుద్ధం, శాంతి విషయానికి వస్తే, ఆయనను వాస్తవానికి విదేశాంగ మంత్రిలా చూస్తారు.
అందుకే ఇరాన్ దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో ఒక ప్రముఖ నేత మృతిలా ఊరేగింపులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది. ఆయన్ను ఒక అమరవీరుడిలా చూపించేందుకు కూడా ప్రయత్నిస్తుంది.

అమెరికా లక్ష్యంగా బగ్దాద్‌లో పేలుళ్లు
ఇటు, శుక్రవారం సులేమానీ హత్య జరిగిన 24 గంటల తర్వాత ఇరాక్‌లో మరో వైమానిక దాడి జరిగిందని ఇరాక్ టీవీ చానల్ చెప్పింది.
ఇరాక్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఉదయం జరిగిన మరో వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని రాయిటర్స్ చెప్పింది.
అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలోని గ్రీన్ జోన్ వద్ద, అమెరికా దళాలు ఉన్న బలాద్ వైమానిక స్థావరం వద్ద కూడా పలు పేలుళ్లు జరిగాయి.
కాగా, ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇరాన్ అనుకూల మిలిటెంట్లు ఇలాంటి తాజా దాడులకు కారణమని ఆరోపిస్తున్నారు.
కాసిం సులేమానీని చంపిన అమెరికాపై పగ తీర్చుకోవాలని ఇరాన్ నాయకులు అంటున్నారు.
అయితే, అమెరికా ప్రజలను కానీ, అమెరికా ఆస్తులను కానీ ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటే ‘చాలా వేగంగా.. చాలా గట్టిగా’ బదులిస్తామని, అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని డోనల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే రెండో వైమానిక దాడి వెనుక అమెరికా దళాల హస్తం లేదని అమెరికా ఆర్మీ ప్రతినిధి స్పష్టం చేశారు.
సులేమానీ మృతి తర్వాత ఇరాన్ నుంచి జరిగే ఎలాంటి దాడులకైనా సమాధానం ఇచ్చేందుకు పశ్చిమాసియాలో మూడు వేల మంది అదనపు సైనిక దళాలను మోహరించాలని నిర్ణయించినట్లు అమెరికా చెప్పింది.

ఫొటో సోర్స్, AFP/GETTY
సులేమానీ అమెరికాకు శత్రువు ఎలా అయ్యాడు
అమెరికా 2007లో కడ్స్ ఫోర్స్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థతో జరిగే అమెరికా లావాదేవీలను పూర్తిగా నిషేధించింది.
2011లో సిరియా అంతర్యుద్ధం రాజుకున్నప్పుడు, అమెరికా అక్కడి బషర్ అల్-అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటే, సులేమానీ అసద్ ప్రభుత్వానికి సాయం చేయమని తన దళాలకు చెప్పాడు.
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్ వైపు నుంచి ఉన్న ఒత్తితి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య తన దేశ ప్రభావం పెంచడానికి, చెప్పాలంటే దానిని కొనసాగించడంలో జనరల్ కాసిం సులేమానీ కీలక పాత్ర పోషించారు. అందుకే అతడు అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కళ్లలో పడ్డారు.
అమెరికా అతడిని తీవ్రవాదిగా కూడా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









