అరుణాచల్ సరిహద్దుల్లో చైనా రైల్వే ప్రాజెక్టు భారత్‌కు ప్రమాదకరమా ?

ఫొటో సోర్స్, China News Service/getty images
- రచయిత, సర్వప్రియ సంగ్వాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సిచువాన్-టిబెట్ రైల్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల తన దేశ రైల్వే అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులోని యాన్-లిన్షి రైల్వేలైన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు.
యాన్-లిన్షి రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌ను టిబెట్‌లోని లిన్షి ప్రాంతంతో కలుపుతుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత-చైనా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది.
సరిహద్దుల్లో స్థిరత్వానికి ఈ రైల్వే ప్రాజెక్టు చాలా కీలకమైందని షి జిన్‌పింగ్ అన్నారు. చైనా ప్రభుత్వ మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం ఈ ప్రాజెక్ట్ విలువ 47.8 బిలియన్ డాలర్లు.
ఈ రైల్వేలైన్ మొదలైతే సిచువాన్ రాజధాని చెంగ్డూ నుంచి టిబెట్‌లోని లాసాకు 13గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 48 గంటలు.

ఫొటో సోర్స్, TPG/getty images
ఈ రైల్వేలైన్ భారత్‌కు ప్రమాదకరమా?
లిన్షి ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్ దానిని ఖండిస్తోంది.
భారత్-చైనాల మధ్య ఈ వివాదం చాలాకాలం నుంచి కొనసాగుతోందని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్‌లో చైనీస్ స్టడీస్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ అల్కా ఆచార్య అన్నారు.
"రెండుదేశాల మధ్య సరిహద్దు నిర్ణయం కాలేదు. ఎవరికి వారు బలం చూపెట్టేందుకు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకుంటున్నారు. అందుకే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను పెంచుతోంది. గత 7-8 సంవత్సరాల్లో ఇక్కడ సౌకర్యాలు బాగా పెరిగాయి. అయితే భారత్‌కంటే చైనా ప్రాజెక్టులు ఖరీదైనవి" అన్నారు అల్కా ఆచార్య.
చైనా ప్రాజెక్టుల వెనక మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ ప్రొఫెసర్ ఫూంచుక్ స్టోబ్డాన్ వెల్లడించారు.
“ఈ ప్రాజెక్టుల ద్వారా చైనా ఇక్కడికి ఆయుధాలను, క్షిపణులను సులభంగా తీసుకురాగలదు. అప్పుడు వారికి అణ్వాయుధాల అవసరం కూడా ఉండదు. చైనా అనుసరిస్తున్న ఈ విధానం కజకిస్తాన్, కిర్గిస్తాన్ వంటి ప్రదేశాలలో నేను గమనించాను. ఇది వారి క్షిపణి సామర్థ్యాన్ని పెంచుతుంది. భారతదేశం, పాకిస్తాన్ అణుబాంబుల గురించి మాట్లాడతాయి. చైనా ఎప్పుడూ అణ్వాయుధాల గురించి మాట్లాడదు" అన్నారు స్టోబ్డాన్.

ఫొటో సోర్స్, FREDERIC J. BROWN/getty images
భారత్‌కు ఎందుకు ఆందోళన?
అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు బ్రహ్మపుత్ర నది ప్రధాన నీటి వనరు. ఈ పరిస్థితుల్లో చైనా ఆ నీటి మొత్తాన్ని తనకే మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతంలో చైనా సైన్యపు కదలికలు పెరుగుతాయి. ఒకప్పుడు చైనా సైన్యం ఈ ప్రాంతానికి చేరుకోడానికి 36గంటలు పట్టేది. ఇప్పుడు కేవలం 9-10 గంటల్లో చేరుకోవచ్చు. చైనా తన ట్యాంకులు, క్షిపణులను సులభంగా భారత సరిహద్దుకు చేర్చగలదు.

ఫొటో సోర్స్, Barcroft Media/getty images
టిబెట్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం
టిబెట్‌లో దశాబ్దాలుగా చైనా మౌలిక సదుపాయాల నిర్మాణానికి కృషి చేస్తోందని జేఎన్‌యూ ప్రొఫెసర్ బీఆర్ దీపక్ అన్నారు.
"1962కి ముందు చైనా తన సిచువాన్ ప్రావిన్స్ పక్కనే ఉన్న తూర్పు టిబెట్‌లో రోడ్ నెట్‌వర్క్ ప్రారంభించింది. ఈ ప్రాంతానికి చేరుకోవడం ప్రమాదకరమని చైనాకు తెలుసు. ఇది ఒక పీఠభూమి ప్రాంతం. 1951లో చైనా బలగాలు టిబెట్‌లోకి ప్రవేశించినప్పుడు, టిబెటన్లు ఎత్తైన కొండల మీద నుంచి చైనా సైన్యంపై దాడి చేశారు. టిబెటన్ సైన్యం బలహీనంగా ఉన్నప్పటికీ, చైనా సైన్యం వారి ధాటికి తట్టుకోలేక పోయింది. అందుకే వారు ఇక్కడ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు’’ అని ప్రొఫెసర్ దీపక్ అన్నారు.
1957కల్లా చైనా అక్సాయ్‌చిన్‌కు రహదారిని సిద్ధం చేసిందని, అప్పట్లో భారత-చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి అది కూడా ఒక కారణమని ప్రొఫెసర్ దీపక్ వెల్లడించారు.
చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో టిబెట్ సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ఇందుకోసం 20 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కూడా కేటాయించిందని ప్రొఫెసర్ దీపక్ చెప్పారు.
"టిబెట్ సెక్టార్‌లో చైనా 90వేల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. బీజింగ్ నుండి లాసా వరకు హైవే నిర్మించారు. 3-4రోజుల్లో 3వేల కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవచ్చు" అన్నారు దీపక్.

ఫొటో సోర్స్, MONEY SHARMA/getty images
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు
గత కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేసిందని ప్రొఫెసర్ స్టోబ్డాన్ అన్నారు.
"లద్దాఖ్ సమీపంలోని దర్బుక్ నుండి దౌలత్‌బేగ్ ఓల్డి వరకు 255 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని భారత్ నిర్మిస్తోంది. దీనికి చైనా స్పందించింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారతదేశం కొత్తగా విమానాశ్రయాలను, రోడ్లను నిర్మిస్తోంది. ఇటీవల లద్దాఖ్‌లో అటల్ టన్నెల్‌ను కూడా ప్రారంభించింది" అని స్టోబ్డాక్ వెల్లడించారు.
భారత భద్రతా నిపుణుల ప్రకారం దౌలత్‌బేగ్ ఓల్డి రోడ్ ఒక వ్యూహాత్మక రహదారి. అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ)కు సమాంతరంగా వెళుతుంది. దీని ద్వారా టిబెట్‌లోని జిన్జియాంగ్ హైవే వరకు భారత సైన్యం వెళ్లగలదు.
అయితే చైనా సరిహద్దుతో పోలిస్తే, భారత సరిహద్దులో జరుగుతున్న ప్రాజెక్టులు చాలా తక్కువన్నారు ప్రొఫెసర్ దీపక్.
"భారతదేశపు సరిహద్దు ప్రాజెక్టులు 60-70కన్నా ఎక్కువ ఉండవు. అవి కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. తొమ్మిది కిలోమీటర్ల అటల్ టన్నెల్ కూడా చాలా ఏళ్లు నిర్మించారు. ఈ ప్రాంతంలో ఎన్ని వేల కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలి, దానికి ఎంత సమయం పడుతుందన్నదానిపై భారతదేశం దృష్టి పెట్టలేదు. అసోంలోని తేజ్‌పూర్‌కు వెళ్లాలంటే రోడ్డు అస్సలు బాగుండదు. కానీ 1962లోనే చైనా అక్కడికి చేరుకోగలిగింది" అని ప్రొఫెసర్ దీపక్ వివరించారు.

ఫొటో సోర్స్, TPG/getty images
ఉద్రిక్తతల సడలింపు కష్టమేనా?
భారతదేశాన్ని దిగ్బంధనం చేయడం కోసం చైనా ఇలా వ్యవహరించడంలేదని ప్రొఫెసర్ అల్కా ఆచార్య అంటారు.
"1980లలో స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ సిద్ధాంతం వినిపించింది. భారత్‌ను చైనా చుట్టుముడుతోందని, భారతదేశపు పొరుగు దేశాలలో పెట్టుబడులు పెట్టడం, ఓడరేవుల నిర్మాణాలు చేపడుతోందని వాదించేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా దృష్టికోణం మారింది. చైనా, భారతదేశం మధ్య దూరం చాలా భిన్నంగా మారింది. అందువల్ల చైనా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇవన్నీ చేస్తోందని చెప్పడం సరైన విశ్లేషణ కాదు’’ అన్నారు అల్కా ఆచార్య.
మరి ఈ భౌగోళిక క్రీడకు పరిష్కారం ఏంటి?
“అమెరికా ఎన్నికలు ముగిశాయి. ఈ ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. లేకపోతే భారతదేశం తన వనరులను సరిహద్దులకు తరలించాల్సి ఉండేది. తాను సరిహద్దుల్లో ప్రాజెక్టులు నిలిపేశానని, చైనా కూడా నిలిపేయాలని భారతదేశం వాదిస్తోంది. దీనికి ద్వైపాక్షిక చర్చలు పరిష్కారం కావచ్చు. కానీ ప్రస్తుతానికి దీనికి అవసరమైన యంత్రాంగం కూడా లేదు" అన్నారు ప్రొఫెసర్ స్టోబ్డాన్.
ఇవి కూడా చదవండి:
- సుప్రీంకోర్టు: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- కోవిడ్-19 వ్యాక్సీన్ గర్భిణులకు సురక్షితమేనా
- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను కేంద్రం ఏం చేయబోతోంది
- కరోనావైరస్: లాక్డౌన్ ప్రభావంతో పాఠశాలలు ఎలా మారిపోయాయంటే..
- ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








