భారత్, చైనా సరిహద్దు వివాదం: ఎల్ఓసీ, ఎల్ఏసీ, సరిహద్దు... అర్థాలు ఏమిటి?

వీడియో క్యాప్షన్, భారత్, చైనా సరిహద్దు వివాదం: ఎల్ఓసీ, ఎల్ఏసీ, అంతర్జాతీయ సరిహద్దు... వీటి అర్థం ఏంటి?

లిపులేఖ్, కాలాపానీల విషయమై భారత్, నేపాల్‌‌లకు ఏర్పడిన వివాదం సద్దుమణగక ముందే భారత సైనికులు, చైనా సైనికుల మధ్య ఘర్షణ రేగింది. ఈ ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అని పిలుస్తారు.

పాకిస్తాన్, చైనా, నేపాల్‌లతో భారత సరిహద్దు వివాదాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ), అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని మనకు పదేపదే వినిపిస్తుంటాయి.

అసలు ఈ రేఖలకు అర్థం ఏంటి? వాటి మధ్య తేడాలేంటి?

భారత్‌కు మొత్తంగా ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భౌగోళిక సరిహద్దు ఉంది. సముద్ర జలాల సరిహద్దు పొడవు 7516.6 కి.మీ.లు.

బంగ్లాదేశ్ (4,096.7 కి.మీ.లు), చైనా (3,488 కి.మీ.లు), పాకిస్తాన్ (3,323 కి.మీ.లు), నేపాల్ (1,751 కి.మీ.లు), మయన్మార్ (1,643 కి.మీ.లు), భూటాన్ (699 కి.మీ.లు), అఫ్గానిస్తాన్ (106 కి.మీ.లు)లతో ఈ భౌగోళిక సరిహద్దులు ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ

చైనాతో భారత్ భౌగోళిక సరిహద్దు పొడవు 3,488 కి.మీ.లు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల గుండా ఇది ఉంది.

ఈ సరిహద్దును మూడు సెక్టార్లుగా విభజించారు. ఒకటి పశ్చిమ సెక్టార్, అంటే జమ్మూకశ్మీర్. మరొకటి మిడిల్ సెక్టార్, అంటే హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మూడోది తూర్పు సెక్టార్, అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.

భారత్, చైనాల మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు. కొన్ని ప్రాంతాల విషయమై ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

పశ్చిమ సెక్టార్‌లోని అక్సాయ్ చిన్ తమ భూభాగమని భారత్ అంటోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. భారత్‌తో 1962లో జరిగిన యుద్ధం సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది.

మరోవైపు తూర్పు సెక్టార్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని, ఇది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా అంటోంది. టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉన్న మెక్‌మోహన్ రేఖను చైనా అంగీకరించడం లేదు. అక్సాయ్ చిన్ తమదని భారత్ చేస్తున్న వాదనను కూడా ఆ దేశం ఖండిస్తోంది.

ఈ వివాదాలన్నింటి కారణంగా భారత్, చైనాల మధ్య సరిహద్దులు నిర్ణయం కాలేదు. యథాస్థితిని కొనసాగించేందుకు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అనే పదాన్ని వాడతారు. అయితే, ఈ రేఖ విషయంలోనూ అస్పష్టతలు ఉన్నాయి. భారత్, చైనా ఎల్ఏసీల మధ్య తేడాలున్నాయి.

పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)