సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ

జ్యూయల్

ఫొటో సోర్స్, GUADALUPE BASAGOITIA

ఫొటో క్యాప్షన్, వ్యభిచార వృత్తి నుంచి బయటపడిన తరువాత తన పెళ్లి సందర్భంగా ముస్తాబవుతున్న జ్యూయల్

ఏటా వేల మంది మహిళలను యూరప్ దేశాల్లోని వివిధ నగరాలకు అక్రమంగా తరలించి వాళ్లతో వ్యభిచారం చేయిస్తున్నారు. నైజీరియా నుంచి ఇలాగే తీసుకొచ్చిన జ్యూయల్ (గోప్యత కోసం పేరు మార్చాం) అనే యువతి ఎలాగోలా తప్పించుకుని ఈ ఊబి నుంచి బయటపడింది.

డెన్మార్క్‌కు తాను ఎలా వచ్చాను.. తనను ఏం చేయమన్నారు... తాను ఎలా బయటపడ్డానన్నది ఆమె 'బీబీసీ'తో చెప్పారు.

ఆసుపత్రిలో వృద్ధులకు సేవలందించే ఉద్యోగం కోసమంటూ జ్యూయల్‌ను డెన్మార్క్ తీసుకొచ్చారు. నైజీరియా నుంచి డెన్మార్క్ వెళ్లే విమానం ఎక్కిన ఆమె మనసు నిండా అవే ఆలోచనలు.. దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకొన్న ఆమె డెన్మార్క్‌లో దిగిన తరువాత వీలైనంత వేగంగా ఉద్యోగంలో చేరిపోవాలని కలలు కన్నారు.

''మానవ అక్రమ రవాణా అయితే లిబియా మీదుగా యూరప్ తరలిస్తారు. బస్సులు, బోట్లలో తీసుకెళ్తారు. కానీ, ఇలా విమానంలో తీసుకెళ్లడంతో తనకు ఎలాంటి అనుమానం రాలేదు'' అన్నారు జ్యూయల్.

'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్' అంచనా ప్రకారం నైజీరియా నుంచి భూమార్గంలో ప్రయాణించి మధ్యధరా సముద్రం మీదుగా యూరప్‌లోకి వచ్చే మహిళల్లో 80 శాతం మంది సెక్స్ ట్రేడ్‌ కోసం మానవ అక్రమ రవాణాకు గురైనవారే.

ఎంతో ప్రమాదకరమైన ప్రయాణం చేసిన తరువాత అలాంటి సెక్స్ ట్రేడ్ ఊబిలో చిక్కుకున్న మహిళల గురించి జ్యూయల్‌కు తెలుసు.. కాబట్టి ఆమె తన ప్రయాణం లాగోస్ విమానాశ్రయం నుంచి ప్రారంభం కావడంతో అలాంటి అనుమానాలేమీ పెట్టుకోలేదు.

వీడియో క్యాప్షన్, భార్యకు ఇష్టంలేకుండా భర్త ఆమెతో సెక్స్‌లో పాల్గొనొచ్చా?

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఆమెను ఒక నైజీరియా మహిళ కలిశారు. ఆ మరుసటి రోజు జ్యూయల్‌ను ఆమె కోపెన్‌హాగన్‌లోని రెడ్ లైట్ ఏరియా వెస్టర్‌బ్రోకు తీసుకెళ్లారు.

''ఆసుపత్రి ఏదైనా కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాను నేను'' అని ఆ రోజును గుర్తు చేసుకున్నారు జ్యూయల్.

కొద్దిసేపు ఇద్దరూ వీధిలో నడుచుకుంటూ వెళ్లిన తరువాత.. చుట్టూ గమనించమని జ్యూయల్‌తో చెప్పారా నైజీరియన్ మహిళ.

అప్పుడా మహిళ చెప్పిన మాటకు బాంబు పడినట్లయింది జ్యూయల్‌కు.

''ఇక్కడే నువ్వు పని చేయబోతున్నావ్'' అని ఆమె చెప్పగానే ఏదైనా భవనాన్ని చూపిస్తుందేమో అనుకున్నాను. కానీ, మేం నడుస్తున్న వీధిలోనే నేను పనిచేయబోతున్నానని చెప్పారామె.

అక్కడ నేను వేశ్యావృత్తి చేయాలని చెప్పారామె. అక్కడే కస్టమర్లను పట్టుకోవాలని చెప్పారు.

''ఆ మాటలతో ఒక్కసారిగా డెన్మార్క్ మొత్తం నాపై కూలిపోయినట్లుగా అనిపించింది'' అన్నారు జ్యూయల్.

అదే రోజు రాత్రి జ్యూయల్‌కు అనుకోని విధంగా ఒక వ్యక్తి కలిశారు.

సెక్స్ కోసం డెన్మార్క్‌‌కు అక్రమంగా తీసుకొచ్చే మహిళలను రక్షించే స్వచ్ఛంద సంస్థ 'హోప్ నౌ'కి చెందిన మిషెల్ మైల్డ్‌వాటర్ .. భయం భయంగా కనిపిస్తున్న 20 ఏళ్ల జ్యూయల్‌ను చూసి తన ఫోన్ నంబర్ ఉన్న కార్డును ఆమె చేతిలో పెట్టారు.

మిషెల్ మైల్డ్‌వాటర్
ఫొటో క్యాప్షన్, మిషెల్ మైల్డ్‌వాటర్

కోపెన్‌హాగన్ రాగానే జ్యూయల్‌ను కలిసి రెడ్ లైట్ ఏరియాకు తీసుకొచ్చిన ఆ నైజీరియన్ బాస్('మేడమ్').. బైక్ మీద అక్కడ తిరిగే ఇంగ్లిష్ మహిళను అస్సలు నమ్మొద్దని జ్యూయల్‌కు చెప్పారు.

ఆ వెంటనే జ్యూయల్‌ను ఒక కస్టమర్‌కు అప్పగించిందా నైజీరియన్ బాస్.

'ఆ కస్టమర్ నాకు 4,000 క్రోనార్లు (సుమారు రూ. 35,000) ఇచ్చి ఆయన ఇంటికి రమ్మన్నారు. ఆ వెంటనే మేడమ్ నన్ను ఆయన దగ్గర వదిలి వెళ్లిపోయారు'' అని జ్యూయల్ గుర్తు చేసుకున్నారు.

''ఆయన నన్ను తన కారులో తీసుకెళ్లారు. నాకు ఆయన మాట్లాడుతున్న భాష రాకపోవడంతో ఏం చెబుతున్నారో అర్థం కాలేదు. ఇద్దరం గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయంతో మాట్లాడుకున్నాం. అదో భయంకర అనుభవం''

అక్కడి నుంచి కొన్ని నెలల పాటు సెక్స్ వ్యాపారంలో కొనసాగడమనేది ఆమెకు అంత సులభంగా సాధ్యం కాలేదు.

వీడియో క్యాప్షన్, సెక్స్ తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

''ఈ పని నేను సరిగా చేయలేకపోయాను. అక్కడ వీధి మూలల్లో సిగ్గుతో నిల్చుండేదాన్ని. కానీ, నన్ను ఎవరో ఒకరు పిలిచేవారు. నిత్యం అక్కడికి వచ్చేవారికి నేను కొత్తగా అక్కడికి వచ్చినట్లు తెలిసేది. దాంతో కొత్త అమ్మాయిని కోరుకునే మగవాళ్లు నన్ను తీసుకెళ్లేవారు.''

యూరోపియన్ యూనియన్ ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2017/2018లో 14,000 కంటే ఎక్కువ మంది అక్రమ రవాణా బాధితులు నమోదయ్యారు.

ఇది చాలా చిన్న సంఖ్య.. ఎందుకంటే గుర్తించిన కేసులకు సంబంధించిన లెక్క మాత్రమే ఇది. ఇందులో సగం మంది యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందనివారు. యూరోపియన్ యూనియన్‌కు మహిళలు అక్రమ రవాణా అవుతున్న అయిదు ప్రధాన దేశాలలో నైజీరియా ఒకటి.

యూరోపియన్ కమిషన్ లెక్కల ప్రకారం ఈ అక్రమ రవాణా ప్రధానం ఉద్దేశం లైంగిక దోపిడీయే. నేరస్థులు మానవ అక్రమ రవాణా ద్వారా ఒక్క ఏడాదిలో పొందిన ఆదాయం 1400 కోట్ల యూరోలని అంచనా. అంటే సుమారు లక్షా 22 వేల కోట్ల రూపాయలు.

వెస్టర్‌బ్రోలో వీధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెస్టర్‌బ్రోలో వీధులు

వ్యభిచారం చేసి బాగా డబ్బు సంపాదించినా అందులో ఎక్కువ మొత్తం ప్రయాణ ఖర్చులు, వసతి సమకూర్చినందుకు అక్రమంగా రవాణాదారులకే ఇచ్చేయాల్సి ఉంటుందని ఈ వృత్తిలోని మహిళలు చెబుతున్నారు.

డానిష్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మైగ్రేషన్ విభాగంలో సీనియర్ రీసెర్చర్ సైన్ ప్లాంబెచ్ దీనిపై మాట్లాడుతూ... ఇలాంటి మహిళలంతా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటారని చెప్పారు.

''వలస వచ్చిన మహిళల్లో అత్యధికంగా అప్పులు ఉన్నవారు నైజీరియా సెక్స్ వర్కర్లు. 10 వేల నుంచి 60 వేల యూరోల వరకు వారికి అప్పులు ఉంటాయి'' అని ఆయన చెప్పారు. అంటే సుమారు రూ. 9 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వారికి అప్పులుంటాయి.

''అప్పులు భారీగా ఉన్నప్పుడు వేగంగా డబ్బు సంపాదించాలి. ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన పత్రాలు లేకపోతే వేగంగా డబ్బు సంపాదించే మార్గం సెక్స్ వ్యాపారం'' అంటారు ప్లాంబెచ్.

తనను డెన్మార్క్ తీసుకొచ్చినవారికి జ్యూయల్‌ 42 వేల యూరోలు(సుమారు రూ. 35 లక్షలు) చెల్లించాల్సి ఉంది.

ఆమె నైజీరియా నుంచి బయలుదేరడానికి ముందు రోజు ఒక శ్మశానానికి తీసుకెళ్లి ఆమెకు అప్పు తీర్చాల్సిన విషయం గట్టిగా చెప్పారు.

''ఎలాగైనా అప్పు తీరుస్తానని.. నన్ను ఎవరు ఇక్కడకు తీసుకొచ్చారో ఎవరికీ చెప్పనని బలవంతంగా ప్రమాణం చేయించుకున్నారు. ఒకవేళ ఎవరికైనా చెబితే నేను, నా కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు' అన్నారు జ్యూయల్.

జ్యువెల్ డెన్మార్క్‌లో ఉన్నప్పుడు నైజీరియాలోని ఆమె కుటుంబాన్ని అక్రమ రవాణాదారులు బెదిరించారు.

వీడియో క్యాప్షన్, కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు?

జ్యూయల్ విపరీతమైన ఒత్తిడిలో ఉండేది కాబట్టి.. వెస్టర్‌బ్రో వీధుల్లోని కార్లలో, కార్ల మధ్య కానీ.. లేదంటే ఇళ్లకు తీసుకెళ్లిన కస్టమర్లకు సర్వీస్ అందించడంలో ఎలాంటి తేడాలు చూపుతుందని భావించలేదు.

''కాదు అని చెప్పడానికి వీలుండదు అక్కడ. అవుననాల్సిందే. మీరు కాదంటే మరో 10 నుంచి 15 మంది మహిళలు సిద్ధంగా ఉంటారు'' అని అక్కడి పరిస్థితులను వివరించారు జ్యూయల్.

కానీ కస్టమర్ల ఇళ్లకు వెళ్లడం చాలా ప్రమాదకరం.

''ఆ రోజు నేను చనిపోయినంత పనైంది. నేను బాత్‌టబ్‌లో ఉండాల్సి వచ్చింది'' ఒక రాత్రి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

''నన్ను తీసుకెళ్లిన వ్యక్తి బాత్‌టబ్‌లోకి వెళ్లమని చెప్పాడు. బాత్ టబ్‌లో కూర్చున్న తరువాత రెండు బకెట్ల ఐస్ తీసుకొచ్చి నాపై పోశాడు. మంచి శీతాకాలం అది. నగ్నంగా ఉన్న నేను ఆ మంచులో ఉండలేకపోయాను'' అని ఆనాటి అనుభవాన్ని చెప్పారామె.

జ్యూయల్ వేసిన చిత్రం

ఫొటో సోర్స్, Jewel

వెస్టర్‌బ్రో ప్రధాన వీధిలో బార్లు, క్లబ్బులు, వ్యభిచార గృహాలు ఉంటాయి. ఒక శనివారం రాత్రి రణగొణ ధ్వనుల మధ్య విద్యుద్దీపాలలో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గుంపులు గుంపులుగా వస్తున్న మగవాళ్ల అడుగులు తాగిన మత్తులో సరిగా పడడం లేదు.

అక్కడ ఒళ్లమ్ముకోవడానికి ఉన్న మహిళలు(ఎక్కువగా నైజీరియా, తూర్పు యూరప్ దేశాల వారు) చక్కని తలకట్లు, మేకప్‌తో ఒంపులన్నీ కనిపించేలా బిగుతైన దుస్తుల్లో, జిమ్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కొన్ని హైహీల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతేకానీ, అశ్లీల వస్త్రధారణల్లో ఎవరూ లేరు.

విదేశీ వేశ్యలను ఆ వృత్తిలోంచి బయటపడేందుకు దశాబ్ద కాలంగా సహకరిస్తున్న మిషెల్ మైల్డ్‌వాటర్ అక్కడ తిరుగుతున్నారు.

అక్కడున్న వేశ్యలకు తన విజిటింగ్ కార్డు ఇచ్చి సహాయం, కౌన్సిలింగ్ ఆఫర్ చేస్తున్నారు.

అక్కడ వీధి జీవితం ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలుసు.. అక్కడి హోటళ్లలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనలు కూడా ఆమె గుర్తు చేశారు.

''ఎన్నో అత్యాచారాలు జరిగాయి ఇక్కడ. ఒళ్లంతా రక్తంతో మహిళలు వీధిలో పరుగులు తీసిన సందర్భాలున్నాయి'' అన్నారామె.

వీడియో క్యాప్షన్, కరోనా వల్ల వేశ్యాగృహాలు మూతపడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న సెక్స్ వర్కర్లు

వారాంతాల్లో డానిష్ ఎన్‌జీవోలు వ్యభిచార వృత్తిలోని మహిళలకు సహాయం అందిస్తాయి. రెడెన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒక కేఫ్ నడుపుతోంది. కస్టమర్‌కి కస్టమర్‌కి మధ్య దొరికిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, స్నాక్స్ తినడానికి అక్కడ అవకాశం కల్పిస్తారు.

ఆ పక్కనే మరో వీధిలో ఇలాంటి మహిళలు ఎదుర్కొనే హాని ప్రభావం తక్కువగా ఉండేలా సహాయ కార్యక్రమం నిర్వహిస్తోంది ఇంకో ఎన్‌జీవో.

దీనిని రెడ్ వ్యాన్ అంటారు.. ఆ వ్యాన్‌లో అందమైన దీపాల వెలుతురులో ఒక బెడ్ ఉంుటంది. కండోమ్‌లు, వైప్‌లు ఉచితంగా అందిస్తారక్కడ.

ఏమాత్రం భద్రత లేని ప్రదేశాలకు సెక్స్ వర్కర్లు వెళ్లకుండా కస్టమర్లకు ఈ వ్యాన్‌లో సర్వీస్ అందించొచ్చు.

ఈ వ్యాన్ రాత్రంతా బిజీగా ఉంటుంది. సెక్క్‌వర్కర్లు, వారి కస్టమర్లకు ప్రైవసీ ఉండేలా వలంటీర్లు కొంచెం దూరంలో ఉంటారు.

అదే సమయంలో సెక్స్ వర్కర్‌కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే సహాయపడడానిక అందుబాటులో ఉండేంత దూరంలోనే ఉంటారు.

నాలుగు గంటల షిఫ్టులో 28 సార్లు ఈ వ్యాన్‌ను వాడుకోవచ్చు.

రెడ్ వ్యాన్

ఈ రెడ్ వ్యాన్‌లో పనిచేసే వలంటీర్లలో సైన్ ప్లాంబేచ్ కూడా ఒకరు.

డెన్మార్క్‌లో ఒళ్లమ్ముకోవడం కానీ, వేశ్య వద్దకు వెళ్లడం కానీ చట్టవిరుద్ధం కాదు. కానీ, సెక్స్ వర్కర్లకు కూడా వర్క్ పర్మిట్ ఉండాలి.

అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించేయాలనేది డెన్మార్క్ విధానం. మానవ అక్రమ రవాణాకు గురైనవారిగా గుర్తించినా కూడా కొన్నాళ్ల పాటు ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉంచిన తరువాత వారు తమ సొంత దేశానికి వెళ్లిపోవాలని డెన్మార్క్ సూచిస్తుంది.

జ్యూయల్ నాలుగు నెలల పాటు డెన్మార్క్ వీధుల్లో సెక్స్ వర్కర్‌గా పనిచేసి.. తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి తన ప్రాణాలు తానే తీసుకోవాలని ప్రయత్నించిన తరువాత కూడా తాను ట్రాఫికింగ్ బాధితురాలినని అధికారులకు ఫిర్యాదు చేయాలనుకోలేదు.

ఇంకా అప్పు తీరకపోవడంతో తనకు, నైజీరియాలోని తన కుటుంబానికి హాని తలపెడతారేమోనన్న భయంతో ఆమె ఫిర్యాదు చేయలేదు.

అయితే, నాలుగు నెలల తరువాత ఆమె జీవితం మారింది. జ్యూయల్ తాను కలిసిన ఒక డానిష్ వ్యక్తిని కలుసుకుని అతని ప్రేమలో పడింది. వారి ఫస్ట్ డేట్‌లో శృంగారం తరువాత తన కథ మొత్తం ఆయనకు చెప్పింది.

ఆ తరువాత వారిద్దరూ కలిసి జీవించారు.

నాటకం ప్రదర్శిస్తున్న జ్యూయల్

ఫొటో సోర్స్, Jewel

ఫొటో క్యాప్షన్, నాటకం ప్రదర్శిస్తున్న జ్యూయల్

జ్యూయల్ తీర్చాల్సిన అప్పు వారం వారం తీర్చేలా ఆయన సహకరించడంతో ఆమె వేశ్యావృత్తి నుంచి బయటపడ్డారు. ఆ జంట తమకు తగిన సలహా ఏదైనా కావాలనుకున్నారు. తెలిసివారెవరైనా ఉన్నారా అని జ్యూయల్‌నే అడిగాడాయన.

అప్పుడు మిషెల్ మైల్డ్‌వాటర్ తనకు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ గుర్తొచ్చింది జ్యూయల్‌కు.

జ్యూయల్ జంటకు మిషెల్ కౌన్సెలింగ్ చేశారు. జ్యూయల్‌కు తన జీవితాన్ని నాశనం చేసినవారితో పోరాడే ధైర్యాన్నిచ్చారు మిషెల్. అంతేకాదు.. అప్పు తీర్చడానికి వారం వారం చెల్లించే ఇన్‌స్టాల్‌మెంట్లు కూడా ఆపించేశారు.

అయితే, అలా ఆపించేసినా జ్యూయల్‌పై కానీ, ఆమె కుటుంబంపై కానీ ప్రతీకారం తీర్చుకోలేదు ఆ అక్రమ రవాణాదారులు.

బహుశా వారు అంత బలమైన నేర ముఠా కాదేమో.. అందుకే జ్యూయల్‌పై ప్రతీకారానికి సాహసించలేదు.

వీడియో క్యాప్షన్, శృంగార జీవితంపై కరోనావైరస్ ఎలాంటి ప్రభావం చూపింది?

ప్రస్తుతం జ్యూయల్ డెన్మార్క్‌లోనే ఉండిపోయేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడామె డానిష్ భాష కూడా బాగా మాట్లాడుతున్నారు. ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు.

జ్యూయల్ వివాహ సమయంలో మిషెల్ పెళ్లి పెద్దగా వ్యవహరించారు.

బిజినెస్ స్కూల్‌లో చేరాలని.. వీధుల్లో సెక్స్ వర్కర్లకు సహాయపడే వలంటీరుగా పనిచేయాలని జ్యూయల్ భావిస్తున్నారు.

మానవ అక్రమ రవాణాకు గురైన మహిళ కథతో నాటకం రాసి కోపెన్‌హాగన్‌లో ప్రదర్శించాలని జ్యూయల్‌ను మిషెల్ ప్రోత్సహించారు.

జ్యూయల్ ఆమె చెప్పినట్లే నాటకం ప్రదర్శించారు. ''నేను ప్రదర్శన ఇచ్చినప్పుడు నా శరీరం నుంచి నేను వేరయినట్లు అనిపించింది. ప్రేక్షకుల్లో నేనూ ఒకరినైనట్లు అనిపించింది. ఎందుకంటే ఇదంతా కథ కాదు.. ఒక వాస్తవం'' అన్నారు జ్యూయల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)