'సోషల్ మీడియాలో నా పోస్టులు, ఫోటోలకు లైకులు, కామెంట్లు వస్తే ఆయనకు నచ్చేది కాదు, చివరికి ఎలా తయారయ్యారంటే...'

ఇందు హరికుమార్ 'లవ్ సెక్స్ అండ్ టెక్ సిరీస్'లోని ఒక చిత్రం

ఫొటో సోర్స్, Indu Harikumar

    • రచయిత, గీత పాండే
    • హోదా, బీబీసీ విమెన్ ఎఫైర్స్

ఇందు హరికుమార్ ప్రేమలో పడినప్పుడు ఆమె తనది చాలా గొప్ప ప్రేమ కథగా భావించారు. కానీ, కొన్ని రోజుల్లోనే వారి బంధంలో ఉన్న బలహీనతలు బయటపడ సాగాయి. ముఖ్యంగా, ఆమె ఇంటర్నెట్లో పోస్టు చేసే విషయాలపై తరచుగా కలహాలు చోటు చేసుకోవడం మొదలయ్యాయి.

"ఆయన ఏ విషయానికి ఎలా స్పందిస్తారో నాకర్ధం అయ్యేది కాదు. నేను సోషల్ మీడియాలో సెల్ఫీ కానీ, ఫోటో కానీ షేర్ చేసినప్పుడు ఆ ఫోటోపై లైక్లు, కామెంట్లు చేసే వ్యక్తుల విషయంలో కూడా ఆయన కృంగిపోయేవారు" అని ఇందు బీబీసీతో చెప్పారు.

అతనికి కోపం తెప్పించకూడదని ఆమె తన స్నేహితుల జాబితాను కుదించుకున్నారు. ఆమె పాత బాయ్ ఫ్రెండ్స్‌ను లిస్ట్ నుంచి తొలగించారు. తన జాబితాలో ఉండే పురుషులను తగ్గించారు.

"నేను ఏ పోస్టు పెడితే ఎలా స్పందిస్తారో అని ఆలోచించడం మొదలు పెట్టేదానిని. ఆన్‌లైన్‌లో ఉండే నిబంధనలే నేను నా జీవితంలో కూడా అమలు చేసుకోవడం ప్రారంభించాను. నేను అప్పటికే ముళ్ల పై నడుస్తున్నాను" అని ఆమె అన్నారు.

"కానీ, అదేమీ మా బంధం నిలబెట్టుకోవడానికి సహకరించలేదు. ఆయనకు కోపం రావడానికి ఏదో ఒక కారణం ఉండేది."

ఇందు హరికుమార్ 'లవ్ సెక్స్ అండ్ టెక్ సిరీస్'లోని ఒక చిత్రం

ఫొటో సోర్స్, Indu Harikumar

ఒక రోజు ఎవరో అపరిచిత వ్యక్తి "ముక్కుపుడక పెట్టుకున్న వారి కోసం నేనేదైనా చేస్తాను అని ట్వీట్ చేసారు. నా స్నేహితురాలు ఒకామె ఆ ట్వీట్ లో నన్ను ట్యాగ్ చేసి , "అయితే నువ్వు ఇందు వైపు చూడాలి" అని కామెంట్ చేశారు. ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

"నేను అసలు ఆ ట్వీట్ చూడలేదు. నా భాగస్వామి ఆ ట్వీట్ చూసి 'నీకు అత్యున్నత స్థానాలలో బ్రోకర్ పనులు చేసే వాళ్ళు ఉన్నారన్నమాట' అని అన్నారు. నేను ఎదుర్కొన్న నిందలు అంతటితో ఆగలేదు" అని ఆమె చెప్పారు.

ఇందు హరికుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్, సెక్స్ అండ్ టెక్ అనే ఆర్ట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా వరకు ఆమె స్వీయ అనుభవాలతో పాటు ఆన్‌లైన్‌లో మహిళలు ఎదుర్కొనే వేధింపుల గురించి పొందుపరుస్తున్నారు .

డిజిటల్ స్పేస్ ని మహిళలకు సురక్షితంగా మార్చేందుకు జరుగుతున్న 'టేక్ బ్యాక్ ది టెక్' అనే అంతర్జాతీయ ప్రచారోద్యమం కూడా వీరికి మద్దతు ఇస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ వేధింపులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ వేధింపులకు మహిళలు ఎక్కువగా గురవుతూ ఉంటారు. మహిళలు రాజాకీయాల గురించి కానీ, మరే విషయాల గురించి కానీ అభిప్రాయాలు వెల్లడిస్తే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చవి చూడాల్సి వస్తుంది. చాలా మంది తమకు లైంగిక వేధింపులతో పాటు అత్యాచారం చేస్తామనే బెదిరింపులు కూడా వస్తూ ఉంటాయని చెప్పారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2017లో ఎనిమిది దేశాల నుంచి 4000 మంది మహిళల దగ్గర నుంచి ఆన్‌లైన్‌వేధింపుల గురించి సమాచారం సేకరించింది.

ఈ నివేదిక ప్రకారం ఆన్‌లైన్‌లో వేధింపులకు గురైనవారిలో 76 శాతం మంది ఆన్‌లైన్‌వాడకాన్ని తగ్గించినట్లు తెలిపారు. 32 శాతం కొన్ని అంశాల పై తమ అభిప్రాయాలను వెల్లడి చేయడం ఆపేసారు. భారతదేశంలో కూడా ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తపరిచే మహిళల పై ఆన్‌లైన్‌వేధింపులు ఎక్కువైనట్లు నివేదిక తెలిపింది.

ఈ ఆన్‌లైన్‌వేధింపుల ద్వారా మహిళలను తక్కువ చేసి, చులకనగా చూసి, బెదిరించి చివరకు వారి నోళ్లు మూయించే శక్తి కలిగి ఉంటాయని ప్రచారకర్తలు చెబుతున్నారు.

కానీ, ఈ ఊరు పేరు లేని వారు ట్రోలింగ్ చేయడం ఒక ఎత్తైతే, ప్రేమించే వారి నుంచి వచ్చే వేధింపులను ఎదుర్కోవడం మరో పెద్ద సమస్యగా నిలుస్తోంది.

ఇందు హరికుమార్ 'లవ్ సెక్స్ అండ్ టెక్ సిరీస్'లోని ఒక చిత్రం

ఫొటో సోర్స్, Indu Harikumar

ఈ అంశాల గురించే లవ్, సెక్స్ అండ్ టెక్ తమ ప్రాజెక్టులో పొందుపరుస్తోంది. కొన్ని బంధాలలో ఉండే లైంగిక హింస ఆన్‌లైన్‌లో మహిళల పాత్రను ఎంత వరకు తగ్గిస్తుందనే అంశాల గురించి ఈ ప్రాజెక్ట్ పరిశీలిస్తోంది.

ఆన్‌లైన్‌లో ఉండటానికి మహిళల పై ఉండే నిబంధనలు, నియంత్రణ, పర్యవేక్షణ గురించి మహిళలను వారి కథలను చెప్పమని కోరినప్పుడు వారి నుంచి పెద్దగా స్పందన వస్తుందని ఊహించలేదని హరి కుమార్ చెప్పారు.

ముందు ఆమె ప్రాజెక్ట్ కి లవ్, సెక్స్ , వయొలెన్స్ అని పేరు పెట్టారు. "కానీ, భారతదేశంలో చాలా రకాల హింసలను హింసగానే గుర్తించరు అని, ముఖ్యంగా మానసిక హింసను హింసగానే పరిగణించరు", అని ఆమె చెప్పారు.

దీంతో ఆమె హింస గురించి మరింత విపులంగా వివరించాల్సి వచ్చింది.

"మీరు ఎవరితోనైనా చేసిన సంభాషణను బయట పెడతాననే బెదిరింపులు, మీ నగ్న చిత్రాలను బయట పెడతానని లాంటి బెదిరింపులతో పాటు మీ మానసిక, శారీరక లైంగిక హాని తలపెట్టాలని అనుకోవడం, లేదా మీరు ఆమోదించని అంశాలను ఆన్‌లైన్‌లో పోస్టు చేయడం, లేదా మీ పరికరాలలో నిఘా యంత్రాలను అమర్చడం లాంటి పనులన్నీ హింస కిందకే వస్తాయని విశదీకరించాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.

అతి కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వారు ఎదుర్కొన్న అనుభవాలు, లైంగిక వేధింపులు, మానసిక హింస గురించి చెప్పడం మొదలు పెట్టారు.

అంత మంది తమ అనుభవాలను చెబుతారని నేననుకోలేదు అని ఆమె అన్నారు. చాలా మంది మహిళలు తమ బాధను తమలోనే అణచి వేసుకున్నారని , వారి కథలు చాలా ఉద్విగ్నభరితంగా ఉన్నాయని ఆమె చెప్పారు. వారి కథలు తమ లాంటి పరిస్థితిలో ఉన్న లాంటి వారికి ఒక హెచ్చరిక కావాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.

ఒక మహిళ నగ్న చిత్రాన్ని ఆమె ప్రియుడు ఆమె అంగీకారం లేకుండా ఆన్‌లైన్‌లో షేర్ చేశారని చెప్పారు.

"ఆ ఫోటో షేర్ చేసిన మూడు వారాల తర్వాత, నువ్వు దీనిని సదుద్దేశంతో అర్ధం చేసుకుంటావని అనుకుంటున్నాను" అని అన్నట్లు చెప్పారు. "నా ఫోటో చూసిన చాలా మంది నా పై కామ వాంఛను ప్రదర్శించడం పట్ల అతను చాలా సంతోషపడుతున్నాడ"ని చెప్పారు.

"ఈ మగాళ్లంతా కేవలం నిన్ను కోరుకోగలరు. కానీ, నేను మాత్రమే నిన్ను అనుభవించగలను" అని అన్నారు. నా కళ్ళకు అతనొక మానసిక రోగిగా కనిపించారు. నా శరీర సౌందర్యం పట్ల నేను గర్వంగా భావించడానికే అలా చేశానని చెప్పారు. కానీ, నాకు అదెంతో అవమానంగా అనిపించింది" అని ఆమె అన్నారు.

ఇందు హరికుమార్ 'లవ్ సెక్స్ అండ్ టెక్ సిరీస్'లోని ఒక చిత్రం

ఫొటో సోర్స్, Indu Harikumar

ఫొటో క్యాప్షన్, ఇందు హరికుమార్ 'లవ్ సెక్స్ అండ్ టెక్ సిరీస్'లోని ఒక చిత్రం

మరొక మహిళ సెల్ఫీలు పోస్టు చేసిన ప్రతి సారీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను తక్కువ చేసి మాట్లాడుతూ పరుల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నావని అనడంతో ఆమె సెల్ఫీలు పోస్టు చేయడం మానేసినట్లు చెప్పారు.

ఇంకొకరు తన ఈ మెయిల్ పాస్ వర్డ్ ఇచ్చేవరకు తన భాగస్వామి ఊరుకోలేదని చెబుతూ, పాస్ వర్డ్ ఇవ్వలేదంటే నా నుంచి ఏదో దాయడం గానీ లేదా వేరే మగాళ్లతో మాట్లాడుతుండటం గానీ చేస్తూ ఉండి ఉంటావని అనేవారని అన్నారు.

మరో మహిళ నిద్రలో ఉండగా ఆమె భాగస్వామి ఫోన్ తెరిచి ఆమె చూసిన ఒక వీడియో గురించి సిగ్గు పడేలా మాట్లాడారని చెప్పారు.

హరికుమార్ చెప్పిన లాంటి అనుభవాల లాంటివే చాలా మంది మహిళలు పంచుకున్నారని ఆమె చెప్పారు. కొంత మంది అమ్మాయిలు కేవలం బంధాలు నిలబెట్టుకోవాలనే తపనతో వారి మాజీ బాయ్ ఫ్రెండ్ లతో మాట్లాడటం మానేసినట్లు, వారిని స్నేహితుల జాబితా నుంచి తొలగించి, సెల్ఫీలు పోస్టు చేయడం మానేసినట్లు చెప్పారు. అలాగే, అర్థనగ్న చిత్రాలను, పొగ తాగుతూ, మద్యం సేవిస్తూ ఉన్న ఫోటోలను తొలగించినట్లు చెప్పారు.

"వారు మంచివారనిపించుకోవడానికి ఆన్‌లైన్‌ హిస్టరీని కూడా తొలగిస్తున్నారు. చాలా మంది మహిళలు మంచి అమ్మాయి అని అనిపించుకోవాలనే చట్రంలో రక్షణ పొందుతూ ఉంటారు. చాలా మంది ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. అలా ఉండటంలో వారికి భద్రత ఉందనుకుంటారు. మహిళ అంటే రెండే రకాలుగా ఉండాలని మాకు తెలుసు. అయితే మదర్ మేరీ లా ఉండాలి, లేదా బరి తెగించిన మహిళగా ఉండాలి".

"మేము మంచివారిమని మేమనుకుంటే పరిస్థితులు సక్రమంగా ఉంటాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మమ్మల్ని మేమే నిందించుకుంటాం" అని ఇందు అన్నారు. .

కానీ, నాకు కథలు పంపిన చాలా మంది మహిళలు వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించి ఎదురు తిరిగినట్లు చెప్పారు.

ఒక అమ్మాయి తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమె ఫోటోలను తన తండ్రికి పంపిస్తానని బెదిరించినప్పుడు ఎలా ఎదురు తిరిగారో చెప్పారు. "మీ అమ్మాయి తిరుగుబోతు అని మీ నాన్నతో చెబుతాను" అని బెదిరించినట్లు చెప్పారు.

ఇంకొక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత ఆమె నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానని బాయ్ ఫ్రెండ్ ఆమెను బెదిరించినట్లు చెప్పారు. ఆమె పోలీసులకు ఈ విషయం చెబుతానని చెప్పగానే వెనక్కి తగ్గినట్లు చెప్పారు.

"మిమ్మల్ని వేధించే వారికి ఎదురు తిరగకపోతే , వారి మీద ద్వేషం కంటే మీ మీద మీకు కోపం పెరిగిపోతుంది. మీ కోసం మీరు నిలబడలేకపోయినందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు" అని హరికుమార్ అన్నారు.

మహిళలు తమకు ఎదురవుతున్న వేధింపులను గుర్తించి తమను వేదనకు గురి చేసేవారికి ఎదురు తిరిగి న్యాయంగా తమకు దక్కాల్సిన వర్చ్యువల్ స్పేస్ ని టెక్నాలజీని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న మహిళల కథలను ఆమె లవ్, సెక్స్ అండ్ టెక్ సిరీస్‌లో పొందుపరుస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అమ్మాయిలూ... ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఇలా తప్పించుకోండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)