సోనూ సూద్ స్ఫూర్తితో గ్రామానికి రోడ్డు వేసుకున్న ఉత్తరాంధ్ర గిరిజనులు

- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆ ఊరికి 70 ఏళ్లకు పైగా రోడ్డు లేదు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో నెలకొన్న కొదమ,చింతమాల, బారి, సిరివార గ్రామాలకు దగ్గరలో ఉన్న గ్రామాన్ని చేరాలంటే కొన్ని మైళ్ళ దూరం నడవాల్సిందే.
ఆ ఊరి ప్రజలకు అనారోగ్యం వచ్చినా, మరే ఉపద్రవం ముంచెత్తినా కొండల వెంబడి నడిచి రావడమే తప్ప మరో మార్గం లేదు. ఆపత్కర పరిస్థితుల్లో రోగులను, గర్భిణీలను డోలి కట్టి 5 మైళ్ళ వరకు నడిచి తీసుకుని రావడమే వారికున్న ఒకే ఒక్క దారి .
గత రెండు సంవత్సరాలలో రహదారి సౌకర్యం లేక గర్భిణీలను డోలీలో మోసుకుని వచ్చి, దారిలోనే డెలివరీలు చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
గతంలో ఈ ప్రాంతానికి రోడ్డు వేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు గిరిజన నాయకుడు చోడుపిల్లి మాలతి దొర బీబీసీ న్యూస్ తెలుగుకి చెప్పారు. “గతంలో మాకు గ్రామంలో తాగడానికి మంచి నీరు కూడా దొరికేది కాదు. ఇప్పుడు గ్రామాలకు బోర్లు వచ్చాయి . నిధులు మంజూరు అయినప్పటికీ, అధికారులు గ్రామానికి విచ్చేసి చూసి వెళ్లారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ” ఆయన చెప్పారు.
“గతంలో గిరిజనులకు అవగాహన ఉండేది కాదు. కానీ, నేటి యువత టెక్నాలజీ వాడటం వలన, యూ ట్యూబ్లో వీడియోలు చూడటం వలన వివిధ వ్యక్తుల సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొందారు" అని ఆయన అన్నారు.
కొదమ, చింతమాల గ్రామాలలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కొంత మంది చదువుకున్న యువకులు లాక్ డౌన్ సమయంలో సినీ నటుడు సోనూసూద్ వలస కార్మికులకు చేస్తున్న సహాయం చూసి స్ఫూర్తి పొందారు. తమకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎందుకు ఎదురు చూడాలని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టినదే తమ ఊరికి సొంతంగా రోడ్ వేసుకోవాలనే ఆలోచన.
అయితే, లాక్ డౌన్ లో సోనూసూద్ వలస కార్మికులకు చేస్తున్న సహాయం చూసి గ్రామంలో యువకులు ప్రభావితమయ్యారని, ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు కలిశెట్టి అప్పల నాయుడు చెప్పారు.
కొదమ, చింతలబడి గ్రామంలో నివాసముంటున్న కుటుంబాలన్నీ కలిసి అవసరమైన డబ్బులు సేకరించి తమకి తామే రోడ్డు వేసుకోవాలని అనుకున్నారు.

ఫొటో సోర్స్, APPALA NAIDU
“ఈ ప్రతిపాదనతో గ్రామస్థులందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చెప్పగానే గత కొన్నేళ్లుగా సమీప గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు అందరూ చందాలు వేసుకోవడానికి అంగీకరించారు”.
ఈ రెండు గ్రామాలలో మొత్తం 200 కుటుంబాల వారు ఎవరి తాహతుకు తగిన విధంగా 1000 రూపాయిల నుంచి 20,000 రూపాయల వరకు చందాలు ఇచ్చారు.గ్రామస్థులు రూ. 20 లక్షలు చందాలు ద్వారా సేకరించగా, మరో 10 లక్షలు దగ్గరలో ఉన్న పట్టణ వ్యాపారస్థుల దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకున్నట్లు అప్పల నాయుడు చెప్పారు.
మహిళలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా డబ్బులు ఇచ్చినట్లు మాలతి దొర చెప్పారు. ఈ గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తారు.
ఇలా సేకరించిన డబ్బులతో ఆంధ్ర ప్రదేశ్ లో సిరివార, చింతమల నుంచి ఒడిశాలో సబకుమరి వరకు 6 కిలోమీటర్ల మేర, కొదమ నుంచి బారి వరకు 5 కిలోమీటర్ల మేరకు రోడ్డు వేసుకున్నారు.
జులై మొదటి వారంలో ఈ రోడ్డు వేసుకునే పనులు ప్రారంభించి రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేసినట్లు అప్పల నాయుడు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేయాలి. ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో ఇక గ్రామంలో యువతే కల్పించుకుని తమ గ్రామానికి తామే రోడ్డు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు, అని అప్పల నాయుడు చెప్పారు.
ఈ పనుల నిమిత్తం అవసరమైన పరికరాలు, ప్రొక్లెయిన్లను పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి అద్దెకి తెచ్చినట్లు చెప్పారు. వీటికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపారు.

ఫొటో సోర్స్, APPALA NAIDU
కొదమ గ్రామం నుంచి సాలూరు పట్టణం 50 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 158 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొదమ నుంచి దగ్గరలో ఉండే సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాలకు వెళ్లాలంటే, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారి గ్రామానికి చేరాలి. అక్కడ నుంచి ఆటో కానీ, బస్సు సౌకర్యం కానీ ఉంటుంది.
ఈ ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 40 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామస్థులు చేసిన పనికి స్ఫూర్తి పొంది మిగిలిన గ్రామాల వారు కూడా త్వరలోనే తమ గ్రామాలకు కూడా రోడ్లు వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ట్విటర్ వేదికగా గ్రామస్థుల సేవలను ప్రశంసించారు.
‘మీలాంటి ఇంకెంతో మంది వ్యక్తులు ఇలాగే ముందుకు వచ్చి తమ పనులు తామే చక్కబెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలాంటివి మరిన్ని చూడాలని ఉంది. త్వరలోనే అక్కడికి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్ హీరోస్’’ అంటూ ట్విటర్ వేదికగా కొనియాడారు .
ఇకపై కావళ్లపై మనుషులను మోసుకెళ్లే అవసరం ఉండదంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి సడక్ యోజన పధకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 14564 కిలోమీటర్ల మేర రోడ్లను వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మార్చ్ 2017 నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 90 శాతం నిర్దేశిత లక్ష్యాలు పూర్తయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలు ఈ పధకం పరిధిలోకి రావు.
ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం 47,745 గ్రామీణ ఆవాసాలు ఉండగా ఇంకా 10,605 ఆవాసాలకు రోడ్డు సౌకర్యం లేదని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం 2018 లో విడుదల చేసిన అంచనాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి
- కశ్మీర్, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








