సెక్స్ వర్క్: దేశంలో వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తామన్న స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్-Newsreel

సెక్స్‌వర్క్: దేశంలో వ్యభిచారాన్ని నిషేధిస్తామని ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్న పెడ్రో సాంచెజ్

దేశంలో సెక్స్‌వర్క్(వ్యభిచారం)ను నేరంగా పరిగణిస్తామని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. వ్యభిచారం మహిళలను బానిసలుగా మారుస్తోందని, అందుకే దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని సాంచెజ్ అన్నారు.

వాలెన్సియాలో అధికార సోషలిస్ట్ పార్టీ మూడు రోజుల సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు.

స్పెయిన్‌లో వ్యభిచారం నేరం కాదని 1995లో ప్రకటించారు. ఆ దేశంలో 2016 నాటికి సెక్స్ వ్యాపారం సుమారు రూ.32వేల కోట్ల వరకు ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

2009లో జరిగిన ఒక సర్వేలో ప్రతి ముగ్గురు స్పానిష్ పురుషులలో ఒకరు సెక్స్ కోసం డబ్బు చెల్లిస్తున్నారని తేలింది. అదే సంవత్సరం ప్రచురితమైన మరో రిపోర్టు ఈ సంఖ్య 39% కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేసింది.

2011లో ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం థాయిలాండ్, ప్యూర్టో రికోల తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యభిచార కేంద్రం స్పెయిన్ అని తేలింది.

బహిరంగ ప్రదేశాలలో జరగనంత వరకు స్పెయిన్‌లో వ్యభిచారంపై ఎలాంటి నియంత్రణలు లేదు. డబ్బు తీసుకుని ఇష్టప్రకారం లైంగిక సేవలు అందించే వారికి స్పెయిన్ దేశంలో ఎలాంటి శిక్షలు లేవు.

అయితే, వ్యభిచారులకు, కష్టమర్లకు మధ్యవర్తిత్వం మాత్రం చట్ట విరుద్ధం. గతంలో వ్యభిచారం నేరం కాదని ప్రకటించడంతో స్పెయిన్ లో ఈ పరిశ్రమ విపరీతంగా వృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా 3 లక్షలమంది మహిళలు వేశ్యావృత్తిలో ఉన్నట్లు అంచనా.

సెక్స్ వర్కర్ -ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్కర్ -ప్రతీకాత్మక చిత్రం

మాఫియా అడ్డా

స్పెయిన్‌ లో జరిగే సెక్స్ వ్యాపారం 95%శాతం మహిళల ఇష్టప్రకారం జరగడం లేదని, బలవంతంగా జరుగుతోందని సెక్స్ పరిశ్రమపై పరిశోధన చేసిన స్పానిష్ జర్నలిస్ట్ సీజర్ జారా ఈఎఫ్ఈ వార్తా సంస్థతో అన్నారు.

''సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య ఈ సెక్స్ వ్యాపారం జరుగుతోంది'' అని సీజర్ జారా అన్నారు.

స్పెయిన్‌ లో సెక్స్ వ్యాపారం అంతర్జాతీయ మాఫియా కు స్వర్గం వంటిదని జారా వ్యాఖ్యానించారు. జర్మనీ తర్వాత యూరప్‌లో రెండో అతి పెద్ద వ్యభిచార మార్కెట్ స్పెయిన్‌ దేనని ఆయన అన్నారు.

''సెక్స్ కోసం డబ్బు చెల్లించడం మామూలు విషయమేనని, తమకు కావల్సిన రీతిలో సుఖం అందించడం మహిళల బాధ్యత అని ఇక్కడ యువకులు భావించడం దారుణం'' అన్నారు జారా.

2019 లోనే సాంచెజ్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యభిచారాన్ని నిషేధిస్తానని ప్రకటించారు. ఇది ఎక్కువమంది మహిళా ఓటర్లను ఆకర్షించిందని చెబుతారు.

అయితే ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా, ఇంకా ఎలాంటి చట్టాన్ని రూపొందించలేదు.

పార్లమెంటుకు ఒక బిల్లును సమర్పించడానికి ముందు అధికార పార్టీ, వామపక్ష పోడిమోస్ సంకీర్ణ భాగస్వాములతో ముసాయిదాపై ఏకాభిప్రాయం తీసుకురావాల్సి ఉందని స్పానిష్ మీడియా చెబుతోంది. అంటే ఇది చట్ట రూపం దాల్చడానికి చాలా ప్రక్రియ ఉంది.

తొలి ఆఫ్రికన్ అమెరికన్ విదేశాంగ మంత్రిగా కోలిన్ పావెల్ చరిత్రలో నిలిచిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలి ఆఫ్రికన్ అమెరికన్ విదేశాంగ మంత్రిగా కోలిన్ పావెల్ చరిత్రలో నిలిచిపోయారు.

కోలిన్ పావెల్ మృతి

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్ మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పావెల్ వయసు 84 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.

2001లో జార్జ్ డబ్ల్యూబుష్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వంలో పావెల్ విదేశాంగ మంత్రిగా పని చేశారు.

గతంలో యూఎస్ మిలిటరీలో పని చేసిన ఆయన, విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా రికార్డులకెక్కారు.

కొన్నాళ్లుగా కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న కోలిన్ పావెల్ వ్యాక్సీన్ పూర్తి డోసులు కూడా తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

పావెల్ మరణంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూబుష్ ''ఒక కుటుంబ సభ్యుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయాను'' అంటూ స్పందించారు.

రెండుసార్లు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ను అందుకున్న ఘనత పావెల్‌ కే దక్కిందని బుష్ వ్యాఖ్యానించారు.

అప్పట్లో తనను తాను మోడరేట్ రిపబ్లికన్‌గా చెప్పుకున్న కోలిన్ పావెల్, 2008లో ఒబామాను అధ్యక్షుడిని చేయాలని కోరుతూ తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు.

ఇరాక్ యుద్ధం విషయంలో తాను ఇంటెలిజెన్స్ రిపోర్టులను నమ్మానని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో మాట్లాడుతూ పావెల్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ ప్రసంగం తన కెరీర్‌పై మాయని మచ్చగా మారిందని తర్వాత పావెల్ వ్యాఖ్యానించారు.

వియత్నాం యుద్ధంలో పాల్గొన్న పావెల్ అందులో గాయపడ్డారు. ఆ యుద్ధం తర్వాత ఆయన రాజకీయ, మిలటరీ వ్యూహకర్తగా అనుభవం సంపాదించారని చెబుతారు. పలువురు రాజకీయ నేతలకు మిలిటరీ సలహాదారుగా పావెల్ పని చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)