బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

బంగ్లాదేశ్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో ఒక పూజా మండపంలో ఖురాన్‌ దొరకడంతో ఢాకా, కుమిల్లా, ఫెనీ, కిషోర్‌గంజ్, చాంద్‌పూర్ సహా బంగ్లాదేశ్‌లోని ఎన్నో ప్రాంతాల్లో ఆలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగాయి.

పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలపై వివిధ జిల్లాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో కొంతమంది పేర్లను నిందితులుగా చేర్చారు. కొన్ని వందల, వేల మంది గుర్తు తెలియని నిందితులుగా పేర్కొన్నారు.

బుధవారం ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకూ ఆరుగురు మృతిచెందారు. వందల మంది గాయపడ్డారు.

బంగ్లాదేశ్ దాడులు

ఫొటో సోర్స్, EPA

ఢాకాలో 4 వేల మందికి పైగా అజ్ఞాత నిందితులు

శుక్రవారం ఢాకా కాకరయిల్‌లో పోలీసులతో ఘర్షణలకు దిగడంపై రమనా, పల్టన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 21 మంది నిందితుల పేర్లు చేర్చారు. మరో 4 వేల మందిని గుర్తు తెలియని నిందితులుగా చెప్పారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత వందల మంది బైతుల్ ముకరమ్ మసీదు నుంచి ర్యాలీగా వెళ్లారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ప్రభుత్వ చర్యలకు అడ్డు తగలడం, పోలీసులపై దాడికి నిరసనకారులు అందరిపైనా కేసులు నమోదు చేశారు.

రమనా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 10 మంది పేర్లు చేర్చిన పోలీసులు గుర్తు తెలియని మరో 1500 మందిని కూడా నిందితులుగా చెప్పారు.

శుక్రవారం ఘర్షణలు జరిగిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు రమనా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మొనిరూల్ ఇస్లామ్ చెప్పారు.

అదే రోజు పల్టన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 11 మంది పేర్లు ఉన్నాయి. ఇదే కేసులో గుర్తు తెలియని నిందితులుగా మరో 2500 మందిని చేర్చారు.

"శుక్రవారం మధ్యాహ్నం నమాజు సమయంలో ఆరుగురిని అరెస్ట్ చేశాం. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సలావుద్దీన్ చెప్పారు.

హిందూ ఆలయాల విధ్వంసం

చట్‌గావ్‌లో 84 మంది అరెస్ట్

చట్‌గావ్‌లో పూజా మండపాలపై దాడికి సంబంధించి శనివారం కేసు నమోదైంది. ఇందులో 84 మంది పేర్లతోపాటూ మరో 500 మంది గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా చెప్పారు.

ఈ దాడులు శుక్రవారం చట్‌గావ్ జేఎమ్ సేన్ హాల్లో జరిగాయి.

ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో కుమిల్లాలో అందర్ కిలా షాహీ జమా మసీదులో శుక్రవారం నమాజు చేసిన తర్వాత ఊరేగింపుగా వెళ్లిన నిరసనకారులు జేఎం సేన్ పూజా మండపంపై దాడి చేశారు.

అక్కడి సీసీటీవీ ఫుటేజ్, ఫొటోల ఆధారంగా దాడిలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారిని గుర్తించామని, వారిని అరెస్ట్ చేశామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి నిజాముద్దీన్ చెప్పారు.

మతపరమైన భావాలను కించపరచడం, పోలీసులపై దాడి, ప్రత్యేక హక్కుల చట్టం సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు.

బంగ్లాదేశ్ దాడులు

ఫొటో సోర్స్, EPA

కుమిల్లాలో 40 మంది అరెస్ట్

కుమిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ 40 మందిని అరెస్ట్ చేశారు.

"ఖురాన్‌ను అవమానించడం, విగ్రహాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశాం. ఆర్ఏబీ తరఫున మరో కేసు నమోదైంది" అని కుమిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి అన్వారుల్ అజీమ్ చెప్పారు.

వీటిలో ఇతర మతాలను కించపరచడం, డిజిటల్ భద్రతా చట్టం, ప్రత్యేక హక్కుల చట్టం కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో మొత్తం 40 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గుర్తు తెలియని వందల మందిని నిందితులుగా పేర్కొన్నారు.

మండపంలో ఖురాన్ ఉన్న వైరల్ వీడియోను మొబైల్ ఫోన్‌తో తీసి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసు బలగాలు

ఫొటో సోర్స్, EPA

హాజీగంజ్‌లో 2 వేల మందికి పైగా నిందితులు

చాంద్‌పూర్ హాజీగంజ్‌లో బుధవారం జరిగిన హింసకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2 వేల మందికి పైగా నిందితులు ఉన్నారు.

హాజీగంజ్ పోలీస్ స్టేషన్ మీద దాడి, పోలీసుల గాయపడిన ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు. దీనితోపాటూ రెండు ఆలయాల అధికారులు కూడా రెండు కేసులు పెట్టారు.

"ఒక పెద్ద ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ వెళ్లడం, పోలీసులపై దాడి చేసిన ఘటనలో 2 వేల మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశాం. దానితోపాటూ ఆలయ అధికారులు కూడా రెండు కేసులు పెట్టారు" అని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ సోహెయిల్ మహమూద్ బీబీసీకి చెప్పారు..

ఈ కేసులో ఇప్పటివరకూ 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఆలయం ధ్వంసం

కిశోర్ గంజ్‌లో ఆలయం ధ్వంసం

శుక్రవారం సాయంత్రం కిశోర్‌గంజ్ కరీంగంజ్ ఉప జిల్లా గుంధార్‌లోని కాదిమ్ మాయిఝాటీ గ్రామంలో ఆందోళనకారులు ఒక ఆలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనిపై ఒక కేసు నమోదైంది.

ఈ కేసులో 9 మంది పేర్లు ఉన్నాయని, గుర్తు తెలియని మరో 35 మంది నిందితులను అందులో చేర్చామని కరీం గంజ్ పోలీస్ స్టేషన్ అధికారి మోమినుల్ ఇస్లాం చెప్పారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.

బంగ్లాదేశ్ దాడులు

ఫొటో సోర్స్, EPA

ఫెనీలో హిందువుల నిరసనలు

శుక్రవారం ఘర్షణలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని, వివిధ సెక్షన్ల కింద మొదటి కేసులో 250 మందిని, రెండో కేసులో 150 మంది నిందితులుగా చేర్చామని ఫెనీ పోలీస్ స్టేషన్ అధికారి మొహమ్మద్ మునీర్ హుసేన్ చెప్పారు. అయితే ఇప్పటివరకూ వీరిలో ఎవరినీ ఆరెస్ట్ చేయలేదు.

శుక్రవారం సెంట్రల్ పెద్ద జామా మసీద్ ఎదుట మధ్యాహ్న ప్రార్థనల తర్వాత ఈ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.

మరోవైపు, దుర్గా పూజా మండపాలపై దాడి, విధ్వంసానికి నిరసనగా హిందువులు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా హింస చెలరేగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

నోవాఖాలీలో ఇద్దరు మృతి

బంగ్లాదేశ్ నోవాఖాలీలోని బేగంగంజ్ చౌముహానీలో శుక్రవారం జరిగిన దాడులపై ఇస్కాన్ ఆలయ అధికారులు హత్య కేసు నమోదు చేశారు. ఆలయంపై దాడి, విధ్వంసం ఆరోపణలు కూడా చేశారు. ఈ దాడిలో ఇద్దరు చనిపోయారు.

ఇస్కాన్‌ ఆలయంపై దాడికి సంబంధించి ఒక కేసు నమోదైందని. ఎఫ్ఐఆర్‌లో దాదాపు 250 మంది నిందితులు ఉన్నారని నోవాఖాలీ బేగంగంజ్ సర్కిల్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ షా ఇమ్రాన్ చెప్పారు.

పోలీసులు దీనితోపాటూ గొడవ, విధ్వంసం, నిప్పు పెట్టడం లాంటి మరో మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 200 మంది నిందితుల పేర్లతోపాటూ 2500 మంది వరకూ గుర్తు తెలియని వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

దాడులకు గురైన అన్ని ఆలయాల అధికారులతో కేసులు పెట్టాలని కోరామని, కానీ చాలా ఆలయాల అధికారులు దానికి సిద్ధంగా లేరని ఇమ్రాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)