బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ మండపాలు, హిందూ ఆలయాలపై దాడులు.. ముగ్గురు మృతి - Newsreel

దాడుల్లో ధ్వంసమైన మండపాలు
ఫొటో క్యాప్షన్, దాడుల్లో ధ్వంసమైన మండపాలు

బంగ్లాదేశ్‌లో ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌పై చెలరేగిన వివాదం నేపథ్యంలో అనేక దుర్గా పూజ మండపాలను కొందరు ధ్వంసం చేశారు. అక్కడ మైనారిటీలుగా ఉన్న సుమారు 150 కుటుంబాలపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని బంగ్లాదేశ్ అధికారులు ధ్రువీకరించారు.

బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలో దుర్గా పూజ మండపాల వద్ద ఖురాన్‌కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అల్లర్లు జరిగాయి.

దీంతో పెద్దసంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. హిందూ ఆలయాలు, హిందువుల ఇళ్లు, దుకాణాల ధ్వంసంతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 10 మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమబెంగాల్‌లోని హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ ఈ దాడులను ఖండించాయి.

తైవాన్

ఫొటో సోర్స్, EPA

తైవాన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 46 మంది మృతి

దక్షిణ తైవాన్‌లో గురువారం తెల్లవారుజామున ఓ 13 అంతస్తుల టవర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 46 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి.

కావోసియుంగ్ నగరంలో వాణిజ్య, నివాస సముదాయాలున్న ఈ టవర్‌లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి దాదాపు నాలుగు గంటలు పట్టింది.

ప్రస్తుతం 79 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది బీబీసీకి తెలిపారు.

అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియడం లేదు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలు చెలరేగే ముందు పేలుడు జరిగినట్లు ఒక పెద్ద శబ్దం వచ్చిందని చుట్టుపక్కల ఉండే స్థానికులు వివరించారు.

''బహుశా విద్యుత్ తీగల నుంచి ఆ శబ్దం వచ్చి ఉండొచ్చు''అని రాయిటర్స్ వార్తా సంస్థతో ఓ స్థానికుడు చెప్పారు.

ఈ టవర్‌లో దాదాపు 120 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో నివసిస్తున్నవారిలో చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)