ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ పోటాపోటీగా ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?

ఫొటో సోర్స్, Pool/gettyimages
- రచయిత, శ్రేయాస్ రెడ్డి
- హోదా, బీబీసీ మానిటరింగ్
ప్యాంగ్‌యాంగ్ చేపట్టిన క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రపంచం ఎప్పటి నుంచో గమనిస్తోంది. ఉత్తర కొరియా ఆంక్షలకు కూడా గురైంది.
కానీ, సియోల్‌పై సుదీర్ఘ కాలంగా ఉన్న ఆంక్షలను ఈ ఏడాది మేలో ఎత్తివేసిన తర్వాత మాత్రం దక్షిణ కొరియా తమ సొంత క్షిపణుల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని చూస్తోంది.
ఉత్తర కొరియాకు ధీటుగా నిలిచేందుకు తమ ఆయుధ సంపత్తిని పెంచుకునే విషయంలో దక్షిణ కొరియా ముందడుగు వేస్తున్న తీరు ఆ దేశ అణ్వాయుధ లక్ష్యాల గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇందుకు దక్షిణ కొరియాకు అంతర్గతంగా కూడా మద్దతు లభిస్తోంది.
ఇరు దేశాలూ పరస్పర చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తూనే ఆయుధ సంపత్తి కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నాయి. కానీ, వారి ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య చర్చలకు ఆటంకంగా నిలవనున్నాయి.
సెప్టెంబరు 11, 12న ఉత్తర కొరియా అకాడెమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ కొత్త రకమైన లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు సెప్టెంబరు 13న ఉత్తర కొరియా మీడియా ప్రచురించింది.
ఈ కొత్త క్షిపణులు కోడిగుడ్డు, ఎనిమిది సంఖ్య ఆకారంలో సుమారు 2 గంటల పాటు ఎగిరాయని ఆ కథనం పేర్కొంది.
1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలిగే క్షిపణుల సామర్ధ్యాన్ని ప్రభుత్వ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.
ఈ ప్రకటన చేసిన రెండు రోజుల తర్వాత ఉత్తర కొరియా కొత్త రైల్వే బార్న్ మిస్సైల్ రెజిమెంట్‌ను కూడా ప్రయోగించింది. ఈ క్షిపణులను మార్పులు చేర్పులు చేసిన ఒక రైలు నుంచి ప్రయోగించారు.
వీటిని బాలిస్టిక్ క్షిపణులని దక్షిణ కొరియా మిలటరీ వర్ణించింది. ఈ క్షిపణులు తూర్పు సముద్రంలో ల్యాండ్ అవ్వడానికి ముందు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి.
సెప్టెంబరు 28న నార్త్ కొరియా కొత్త హసొంగ్-8 హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. 2021-26 మధ్య ఐదు సంవత్సరాల సైనిక అభివృద్ధి ప్రణాళికలో పేర్కొన్న "ఐదు అతి ముఖ్యమైన" కొత్త ఆయుధ వ్యవస్థలలో ఈ కొత్త మిస్సైల్ ఒకటని ఆ దేశం పేర్కొంది.
ప్యాంగ్‌యాంగ్ గతంలో కూడా మే 2019 - మార్చి 2021 మధ్యలో చాలా ఆయుధ పరీక్షలను నిర్వహించింది.
అక్టోబర్‌లో జరిగిన పరేడ్‌లో చాలా కొత్త రకమైన ఆయుధాలను ప్రముఖంగా ప్రదర్శించింది.
ఒక వైపు ఉత్తర కొరియా కొత్త క్షిపణులను ప్రయోగిస్తుంటే, దక్షిణ కొరియా కూడా నెమ్మదిగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆయుధాలను ఆవిష్కరిస్తోంది.
సెప్టెంబరు 15న అధ్యక్షుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ దేశీయంగా అభివృద్ధి చేసిన జలాంతర్గామి నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించారు.
దీనికి హ్యున్ మూ 4-4 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇది పాత హ్యున్ మూ 2బి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఎస్‌ఎల్‌బిఎమ్) తరహాలోనే మరొక రకమని భావిస్తున్నారు.
ఈ క్షిపణులను 3000 టన్నుల బరువుండే డోసన్ ఆహ్న్ చాంగ్ హో జలాంతర్గామి నుంచి ప్రయోగించారు.
దేశీయంగా తయారు చేసిన మూడు జలాంతర్గాముల్లో ఇది మొదటిది. ఇవి 500 కిలోమీటర్ల దూరం వరకూ లక్ష్యాన్ని చేధించగలవు.
షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి, జలాంతర్గాములు మాత్రమే దక్షిణ కొరియా సాధించిన కొత్త విజయాలు కావు. సెప్టెంబరు 15న దక్షిణ కొరియా "లాంగ్ రేంజ్ ఎయిర్ టూ సర్ఫేస్ క్షిపణి" కూడా ప్రయోగించింది.
అదే రోజు సియోల్ రక్షణ మంత్రిత్వ శాఖ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని, అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది.
2024కల్లా అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపించేందుకు వాడాలనుకుంటున్న కొత్త రకమైన ప్రొపెల్లన్ట్ విధానాన్ని కూడా పరీక్షించారు.

ఫొటో సోర్స్, Pool/gettyimages
ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం
1960లలో ఉత్తర కొరియా ప్రక్షేపకాలను అభివృద్ధి చేసుకోవడం కేవలం తమ సొంత వెర్షన్లతో కూడిన రక రకాల రాకెట్ లాంచర్లను తయారు చేసుకోవడానికే పరిమితమై ఉండేది.
అయితే, 1965లో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ II సంగ్ బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చినప్పటి నుంచీ ఈ విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు.
యుద్ధం ఏర్పడిన పక్షంలో వాషింగ్టన్, టోక్యో జోక్యాన్ని నిరోధించేందుకు, జపాన్ వరకూ ఎగరగలిగేంత సామర్ధ్యం ఉన్న రాకెట్లను ఉత్తర కొరియా సొంతంగా ఉత్పత్తి చేయాలని ఆయన అన్నారు.
1960, 70ల చివర్లో ప్యాంగ్‌యాంగ్ క్షిపణులను మిత్రదేశాలైన సోవియెట్ యూనియన్, చైనా నుంచి సమకూర్చుకునేది.
నెమ్మదిగా, స్థానికంగా ఆయుధాలను జత చేసుకునేందుకు, ఆయుధాల్లో వాడే విడి భాగాలను స్థానికంగా ఉత్పత్తి చేసుకునేందుకు స్వదేశంలోనే కేంద్రాలను ప్రారంభించడం మొదలుపెట్టింది.
1976 - 1981 మధ్యలో ఉత్తర కొరియా సోవియెట్ స్కడ్ -బి క్షిపణులను ఈజిప్టు నుంచి తెప్పించుకుంది.
ఇదే ప్యాంగ్యాంగ్ క్షిపణి కార్యక్రమానికి ఆధారంగా మారింది.
1984లో ఉత్తర కొరియా దేశీయంగా తయారు చేసిన స్కడ్ బి క్షిపణి హాసంగ్ -5 ను పరీక్షించింది. ఆ తరువాత సంవత్సరాల్లో ఇది ఆయుధాలను తయారు చేసి మిత్ర దేశాలకు అమ్మడం కూడా మొదలుపెట్టింది.
1993లో ఉత్తర కొరియా తన తొలి మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి నో డాంగ్‌ను ప్రయోగించింది. 1998లో టేపోడాంగ్ 1 ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ద్వారా సాటిలైట్‌ను పంపేందుకు ప్రయత్నించి విఫలమయింది.
ఒక వైపు ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం అభివృద్ధి చెందడంతో పాటు ఇతర దేశాలకు చేస్తున్న ఆయుధ విడిభాగాలు, ఆయుధ సరఫరా కూడా ఆ దేశపు అణ్వాయుధ లక్ష్యాల పట్ల ఆందోళనలను పెంచాయి.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పై 1985లో సంతకం చేసిన ఉత్తర కొరియా ఆ ఒప్పందం నుంచి 2003లో వైదొలిగింది.
అక్టోబరు 09, 2006లో ఉత్తర కొరియా భూగర్భ అణ్వస్త్ర పరీక్ష జరిపినప్పుడు ఆ దేశం గురించి వ్యక్తమవుతున్న భయాలు నిజమయ్యాయి.
దీనిపై అంతర్జాతీయ చర్చలు కొనసాగుతూ, ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా, 2009లో ఈ దేశం రెండవ అణ్వాయుధ పరీక్షను నిర్వహించింది.
2011లో ఉత్తర కొరియా ప్రస్తుత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్షిపణి, అంతరిక్ష కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2016-2017 వచ్చేసరికి వరుస ప్రయోగాలతో ఇవి మరింత తీవ్రతరమయ్యాయి.
2018- 19లో ఒలింపిక్స్ స్పూర్తితో వచ్చిన అవగాహనతో ఉత్తర కొరియా దౌత్యమార్గాన్ని అవలంబించింది. కానీ, మే 2019 నుంచి తిరిగి ఆయుధాలను అభివృద్ధి చేసే మార్గానికే కట్టుబడింది.
అప్పటి నుంచి, ప్యాంగ్యాంగ్ అనేక కొత్త ఆయుధ విధానాలను అభివృద్ధి చేస్తూ వస్తోంది. ఇందులో పాత వాటితో పాటు కొత్త ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Pool/gettyimages
దక్షిణ కొరియా క్షిపణి కార్యక్రమం
దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పార్క్ చంగ్ హీ 1975 నాటికల్లా 200 కిలోమీటర్ల దూరంలో పేల్చగలిగే క్షిపణి ఉండాలని పట్టుబడటంతో 1971లో సొంతంగా క్షిపణి తయారు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
అయితే, ఇది అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేకపోయింది. 1979లో అమెరికాతో జరిగిన ఒప్పందం కారణంగా సియోల్ మరింత కఠినమైన నిర్బంధనలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ కొరియాకు క్షిపణుల తయారీకి అవసరమైన సాంకేతికత, పదార్ధాలను వాషింగ్టన్ సరఫరా చేస్తుంది. కానీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకతను దృష్టిలో పెట్టుకుని క్షిపణులు పేలే రేంజ్ ను 180 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేసింది.
1986లో దక్షిణ కొరియా తన తొలి బాలిస్టిక్ క్షిపణి హ్యున్ మూ-1ను విజయవంతంగా ప్రయోగించింది. కానీ, 1979 ఒప్పందం ప్యాంగ్‌యాంగ్ వేగంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణి కార్యక్రమాన్ని అందుకునే విషయంలో వెనుకంజలోనే ఉంచింది.
సియోల్ శక్తివంతమైన క్షిపణులను తయారుచేయగలిగే సామర్ధ్యాన్ని అమెరికాతో జరిగిన ఒప్పందం పరిమితం చేసింది. కానీ, రష్యా సహకారంతో, సియోల్ క్షిపణి కార్యక్రమం వేగవంతం అయింది.
మాస్కో రుణాలను డబ్బు రూపంలో చెల్లించలేక అధునాతన ఆయుధ సాంకేతికతను అందచేస్తామనే ప్రతిపాదనను చేసింది.
1994లో మొదలైన "ఆపరేషన్"సైబీరియన్ బేర్" పేరిట మొదలైన కార్యక్రమంతో దక్షిణ కొరియా కూడా తన మిలటరీ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ, క్షిపణులను అభివృద్ధి చేసుకోవడం మరింత పెంచింది.
సియోల్ మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ (ఎంటిసిఆర్) లోకి అడుగుపెట్టడంతో 2001లో అమెరికా విధించిన ఆంక్షలకు కూడా కొంత వరకు సడలింపు లభించింది. ఎంటిసిఆర్ ద్వారా సియోల్ ప్రయోగించే క్షిపణులు 300- 500 కిలోమీటర్ల పే లోడ్ పరిధిలోనే ఉంటాయి. 2012 నాటికి ఈ పరిధి 800 కిలోమీటర్లకు పెరిగింది.
ఈ కొత్త పరిస్థితుల నడుమ, దక్షిణ కొరియా కూడా తన క్షిపణి కార్యక్రమాన్ని విస్తృతం చేసుకుంటూ వస్తోంది.
దాంతో, 2008-2020 మధ్యలో అనేక హ్యున్ మూ సిరీస్ బాలిస్టిక్ , క్రూయిజ్ క్షిపణులను ఆవిష్కరించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , మూన్ జే ఇన్ మధ్య దక్షిణ కొరియాపై సుదీర్ఘ కాలంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు మే 2021లో పరస్పర అంగీకారం కుదిరింది, దీంతో, దక్షిణ కొరియా క్షిపణి, అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధికి మార్గం సుగమం అయింది.

ఫొటో సోర్స్, KCNA
ఎవరి బలం ఎంత?
కొరియా దేశాల సైన్యానికి శక్తి సామర్ధ్యాలు, బలహీనతలూ వేర్వేరుగా ఉన్నాయి. ఇవి కొరియా యుద్ధం తర్వాత ఆయా దేశాల అభివృద్ధికి ప్రతిబింబం పడుతున్నాయి.
మిలటరీ అనాలిసిస్ సైట్ గ్లోబల్ ఫైర్ పవర్ విశ్లేషించిన 140 దేశాల సైనిక బలగాల జాబితాలో నార్త్ కొరియా 28వ ర్యాంకులో, దక్షిణ కొరియా ఆరవ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
ఉత్తర కొరియా ప్రపంచంలోనే నాలుగవ పెద్ద సైన్యంగా 1.3 మిలియన్ సైనిక సిబ్బందితో ఉండగా , దక్షిణ కొరియాకు 600,000 మంది సైనిక సిబ్బంది ఉన్నారు.
కానీ, ఉత్తర కొరియాలో ఉన్న సోవియెట్ , చైనా ఆయుధ సామగ్రి దక్షిణ కొరియా సంప్రదాయ ఆయుధాలతో పోలిస్తే చాలా వెనుకంజలో ఉంది.
ఉత్తర కొరియా ఆయుధాల అభివృద్ధితో తన మిలిటరీ సంపత్తిని ఆధునీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ఈ దేశంతో పొంచి ఉన్న అణ్వాయుధ ముప్పే ఈ దేశానికి అతి పెద్ద బలం.
గతంలో దక్షిణ కొరియా కూడా అణ్వాయుధాలను తయారు చేసే కార్యక్రామానికి ఆసక్తి చూపింది కానీ, అమెరికా తెచ్చిన ఒత్తిడితో అణ్వస్త్ర కార్యక్రమాలను శాంతియుత ప్రయోజనాలకు పరిమితం చేస్తూ 1975లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది.
ఇటీవల చేసిన ప్రయోగంతో అణ్వస్త్ర రహిత దేశాల్లో ఎస్‌ఎల్ బిఎం ను కలిగిన దేశం ఒక్క దక్షిణ కొరియా మాత్రమే. దీంతో, ఆ దేశ అణ్వస్త్ర లక్ష్యాల పై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
2020లో సియోల్ నేషనల్ యూనివర్సిటీలో నిర్వహించిన సర్వేలో 46.9 శాతం దక్షిణ కొరియా ప్రజలు అణ్వస్త్ర ఆయుధాలు కలిగి ఉండటానికి మద్దతు పలకగా, 21.8 శాతం మంది వ్యతిరేకించారు.
అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలనే ఆకర్షణకు లోను కావడానికి నార్త్ కొరియా దాడులకు ఎదురు నిలవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
సెప్టెంబరు 15న జరిపిన క్షిపణి ప్రయోగం తర్వాత కొత్త ఎస్‌ఎల్‌బిఎంతో పాటు ఇతర ఆయుధాలు ఉత్తర కొరియా ప్రేరేపిత చర్యలను తప్పనిసరిగా తిప్పి కొడతాయని అధ్యక్షుడు జే ఇన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
హాట్ లైన్లు తిరిగి పనిచేస్తాయా?
దక్షిణ కొరియా ప్యాంగ్‌యాంగ్ ఆయుధాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడాన్ని కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ విమర్శించారు.
మరో వైపు సియోల్ ఆయుధ సంపత్తిని సొంతంగా పెంచుకుంటూ వెళుతోంది.
సెప్టెంబరు 21న మూన్ కొరియా యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడంతో కిమ్ యో జోంగ్ కాస్త నెమ్మదించారు. ఇరు దేశాలూ 1953లో చేసుకున్న యుద్ధ విరమణ ఒప్పందంతో కొరియా యుద్ధం ముగిసింది.
కొరియా యుద్ధాన్ని అంతం చేసే ప్రతిపాదన ప్రశంసించే విధంగా ఉందంటూ, ఇది సాధ్యం కావాలంటే దక్షిణ కొరియా తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.
మూన్ ప్రతిపాదన పట్ల నార్త్ కొరియా విదేశాంగ మంత్రి అనుమానాలు వ్యక్తం చేశారు. అంతులేని ఆయుధ పోటీలో ఇరు దేశాలు మునిగిపోతాయని హెచ్చరించారు.
కొరియా దేశాల మధ్య దెబ్బ తిన్న హాట్ లైన్లను పునరుద్ధరిస్తామని కిమ్ జోంగ్ ఉన్ ప్రతిపాదన చేసిన తర్వాత వచ్చే సంవత్సరం మూన్ పదవీకాలం ముగిసే లోపు చర్చలు జరగాలని సియోల్ ఎదురు చూస్తోంది.
ఇరు దేశాలూ తమ క్షిపణి, అంతరిక్ష కార్యక్రమాలను విస్తృత పరుచుకుంటున్న నేపథ్యంలో, ఇరు దేశాలూ ప్రేరేపణలకు, సంప్రదింపులకు మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













