ఉత్తర కొరియా: ఆంక్షల్ని ధిక్కరిస్తూ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ ప్రయోగం

ఫొటో సోర్స్, Reuters
కొత్త యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణిని పరీక్షించినట్లు గురువారం ఉత్తర కొరియా ప్రకటించింది. నెల వ్యవధిలో ఉత్తర కొరియాకు ఇది నాలుగో ఆయుధ పరీక్ష.
కొద్దిరోజుల క్రితమే ఉత్తర కొరియా, న్యూక్లియర్ సామర్థ్యమున్న హైపర్ సోనిక్ మిసైల్‌ను పరీక్షించింది. మళ్లీ అంతలోనే తాజా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ పరీక్షను నిర్వహించింది.
''ఈ పరీక్షలు అస్థిరత, అభద్రతాభావానికి ఎక్కువ అవకాశాలు సృష్టిస్తాయని'' యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంథోని బ్లింకెన్ అన్నారు.
ఆత్మరక్షణ కోసం తమకు ఈ ఆయుధాలు అవసరమని ప్యాంగ్‌యాంగ్ పేర్కొంది. యూఎస్, దక్షిణ కొరియా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని ఆరోపించింది.
కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, ఆయుధాలను అభివృద్ధి చేసే అంశంలో ప్యాంగ్‌యాంగ్‌కు వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని తాజా పరీక్షల ద్వారా తెలుస్తోంది.
''కొత్తగా పరీక్షించిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ అద్భుతమైన పోరాట పటిమను చూపిందని, అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉందని'' ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది.
దక్షిణ కొరియాతో సంబంధాల పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య కీలకమైన కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పిన మరుసటి రోజే ఈ ప్రయోగం జరిగింది.
అలాగే, దౌత్యపరమైన సంబంధాల విషయంలో యూఎస్‌పై కిమ్ ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పడానికి, ఉత్తరకొరియా శత్రు వైఖరిని దాచే వ్యూహంలో భాగంగా ఆయన యూఎస్‌పై ఆరోపణలు చేశారు.
యూఎస్‌ను పక్కనబెట్టి, దక్షిణ కొరియాతో కమ్యూనికేషన్ కొనసాగించడం ద్వారా వాషింగ్టన్, సియోల్‌లను విడదీయాలని ప్యాంగ్‌యాంగ్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు, ఇతర రాయితీల కోసం అమెరికాను పక్కన పెట్టేందుకు సియోల్‌ను ఉత్తర కొరియా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా సంవత్సరానికిపైగా ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోకుండా ఒంటరిగా గడిపింది. కరోనా మహమ్మారి సమయంలో తమకు ఎంతో సన్నిహితమైన చైనాతో కూడా వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉందని, అక్కడి ఆహార కొరత ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని అందరూ భావిస్తున్నారు.
ఉత్తర కొరియా మార్చిలో ఆంక్షల్ని ధిక్కరించి మరీ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ చర్యపై అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఉత్తర కొరియాలో అణురియాక్టర్ తిరిగి పనిచేయడం మొదలుపెట్టిందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని గత నెలలో ఐక్యరాజ్య సమితి అణు ఏజెన్సీ వెల్లడించింది. ఈ అణు రియాక్టర్ ద్వారా న్యూక్లియర్ ఆయుధాల్లో ఉపయోగించే ఫ్లూటోనియంను ఉత్పత్తి చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- తెలంగాణ: కరెంటు కనెక్షన్ లేకున్నా లక్షల్లో బిల్లులు - ప్రెస్ రివ్యూ
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











