తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వడిశెట్టి శంకర్, శుభం ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఉప ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.
కోవిడ్ నిబంధనల మధ్య ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉండబోతున్నాయి.
రెండు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉన్న సమయంలో వస్తున్న ఈ ఉప ఎన్నికల కోసం అటు అధికార పక్షాలు, ఇటు ప్రతిపక్షాలు వ్యూహరచనలో తలమునకలై ఉన్నాయి.

బద్వేలులో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో 15వ శాసనసభ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. కడప జిల్లా బద్వేలు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో ఈ ఎన్నికలు వచ్చాయి.
కడప జిల్లా బద్వేల్‌ని 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రిజర్వుడు కేటగిరీలో చేర్చారు. ఎస్సీలకు ఈ స్థానం రిజర్వ్ చేశారు. గడిచిన మూడు ఎన్నికలను పరిశీలిస్తే 2009లో కాంగ్రెస్ విజయం సాధించగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు.
1955 నుంచి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు కాంగ్రెస్ గెలిచింది. తొలి ఎన్నికల్లో ప్రజా సోషలిస్టు పార్టీ, 1962లో స్వతంత్ర పార్టీ, 1978లో జనతాపార్టీ అభ్యర్థులు గెలిచారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985, 1994, 99 లో మూడు సార్లు గెలిచింది. ఆపార్టీ తరుపున బిజివేముల వీరారెడ్డి మూడు సార్లు గెలిచారు. అంతకుముందు 1972, 1983 ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం.
మొత్తం అయిదుసార్లు ఆయన బద్వేల్ నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
ఇక 2004 నుంచి ఒక్కసారి కూడా టీడీపీ ఇక్కడ విజయం దక్కించుకోలేకపోయింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీదే గెలుపు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున వెంకట సుబ్బయ్య భారీ విజయాన్ని నమోదు చేశారు.
మొత్తం 60.89 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ అభ్యర్థికి 44,734 ఓట్ల ఆధిక్యం లభించింది.

స్వరూపం ఇదే..
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. బద్వేల్, కలసపాడు, బి కోడూరు, పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, శ్రీ అవధూత కాశీనాయన మండలాలకు చెందిన 2,6,139 మంది ఓటర్లున్నారు.
వారిలో పురుషులు 1,08,777 మంది కాగా, స్త్రీలు 1,07,340 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇతరులు 22 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
రెండో ఉప ఎన్నిక..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీకి ఇది రెండో ఉప ఎన్నిక. 2017లో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంధ్యాల ఉప ఎన్నికలు జరిగాయి.
ఇటీవల తిరుపతి లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా సిట్టింగ్ వైసీపీ ఎంపీ మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు.
కరోనా కారణంగా బద్వేల్ ఉప ఎన్నికలు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
అభ్యర్థులు ఖరారు
ఈ ఎన్నికల్లో పోటీకి రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను ప్రకటించారు.
అంతకు ముందే టీడీపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన ఓబుళాపురం రాజశేఖర్‌ని మరోసారి బరిలో దింపుతున్నట్టు టీడీపీ అధినేత ప్రకటించారు.
బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించే యోచనలో ఉంది. ఇతర పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికల బరిలో దిగాలనే ఆసక్తితో ఉన్నాయి.
ఇప్పటికే అధికార పార్టీ బద్వేల్ కి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. జూలై నెలలోనే స్వయంగా సీఎం వై.ఎస్.జగన్ బద్వేలులో పర్యటించారు. రూ.130 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సాగునీటి పనులకు మరో రూ. 110 కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించింది.
వాటితో పాటుగా బద్వేల్ ని రెవెన్యూ డివిజన్ చేయాలంటున్న స్థానికుల డిమాండ్ కి అనుగుణంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ తమకు ఉపయోగడతాయని ఆ పార్టీ ఆశిస్తోంది.
ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దీనివల్ల తమకు విజయావకాశాలుంటాయని టీడీపీ భావిస్తోంది. ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ గోపవరం మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు టీడీపీ ఖాతాలో చేరాయి. దాంతో ఉప ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు తమ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తున్నాయి.
ఉప ఎన్నికలను కూడా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కీలక నేతలు కూడా ప్రచారానికి రంగంలో దిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, FACEBOOK/HUZURABAD MUNCIPALITY
హుజూరాబాద్‌లో....
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేంధర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. గత రెండు టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో "ఈటల" ఆర్థిక-పౌరసరఫరాలు, వైద్య-ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసారు. ఈ మధ్య ఆయన బీజేపి పార్టీలో చేరారు.
ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పనిచేసారు.
నియోజకవర్గంలో బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
హుజూరాబాద్ నియోజకవర్గం లో సెప్టెంబర్ 28, 2021 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,283. ఇందులో పురుష ఓటర్లు 1,17,563 కాగా , మహిళా ఓటర్ల సంఖ్య 1,18,719. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ.
మొత్తం ఓట్లలో బీసీ, ఎస్సీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. మాదిగ, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ , ముదిరాజ్ సామాజిక వర్గాలు గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి.
ఈటల రాజేందర్ 'ముదిరాజ్' సామాజిక వర్గానికి 24 వేల ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో బీసీ ఓట్లు కీలకంగా మారాయి.
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ లో రాజకీయ అరంగేట్రం చేసిన ఈటల రాజేంధర్ 2004, 2008 (ఉప)ఎన్నికల్లో కమలాపూర్ స్థానం నుండి గెలిచారు. డీలిమిటేషన్ తో హుజురాబాద్ అసెంబ్లీ కి మారి 2009, 2011 (ఉప) 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయం సాధించారు. మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1957 లో ఏర్పడ్డ హుజూరాబాద్ స్థానానికి రెండు బై ఎలక్షన్ లతో కలిపి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు టీఆర్ఎస్, 4 సార్లు కాంగ్రేస్, 3 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. 2004 నుండి 2018 ఎన్నికల వరకు 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వరుస విజయాలు సాధించింది.
అధికార పార్టీ ఇక్కడ అభివృద్ది పనులకు నిధుల వరద కురిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'దళిత బంధు' స్కీమ్ ను సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో ప్రారంభించారు.

వ్యవసాయ ప్రధానమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా ధాన్యం, పత్తి పంటలు సాగవుతాయి. ఈ ప్రాంతం వరి విత్తనోత్పత్తికి ప్రసిద్ది. తెలుగురాష్ట్రాల్లో పెద్దదైన జమ్మికుంట పత్తి మార్కెట్ ఇక్కడే ఉంది. ఇక్కడి 'బిజిగిరి షరీఫ్ దర్గా' ఎంతో ప్రసిద్ది చెందింది.
మాజీ ప్రధాని పి.వి.నర్సింహరావ్ కు హుజురాబాద్ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్యలో కొంతభాగం హుజూరాబాద్ పాఠశాలలో జరిగింది.
డీలిమిటేషన్ కు ముందు పి.వి స్వగ్రామం 'వంగర' హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండేది. ఈ స్థానంలో గెలిచిన కెప్టెన్ లక్ష్మీకాంత రావ్, ఇనుగాల పెద్దిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా గతంలో పనిచేసారు.
ఇవి కూడా చదవండి:
- ‘వైసీపీకి భయం అంటే ఏమిటో చూపిస్తా: పవన్ కల్యాణ్
- వాతావరణ మార్పులు: బొగ్గు లేకుండా భారతదేశం మనుగడ సాగించలేదా?
- తాలిబాన్లు రావడం సంతోషమే అంటున్న ఓ అఫ్గాన్ కుటుంబం
- ఎంవీ రమణారెడ్డి మృతి: విప్లవం నుంచి వైసీపీ దాకా ప్రయాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూళ్లలో 'నో అడ్మిషన్' బోర్డులు, సీట్లు లేవంటే ఏం చేయాలి?
- భారత్ బంద్: వైసీపీ, టీడీపీల ద్వంద్వ వైఖరి.. పార్లమెంటులో అలా.. ఇప్పుడేమో ఇలా..
- కరోనా వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆక్స్ఫర్డ్ పరిశోధనలో ఏం తేలింది?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








