ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూళ్లలో 'నో అడ్మిషన్' బోర్డులు, సీట్లు లేవంటే ఏం చేయాలి?

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్, కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం..

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. కొత్తగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి.

తల్లిదండ్రులు కూడా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను కాదని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిచోట్ల ‘నో అడ్మిషన్’ బోర్డులు వెలుస్తున్నాయి.

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ కల్పించలేమని చెబుతున్న తీరు మీద పలు అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది, స్కూల్లో సీటు లేదంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఏం చేయాలన్నది చర్చనీయాంశం అవుతోంది.

ఆరు లక్షల మంది చేరారు...

గడిచిన రెండేళ్లలోనే అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లుతున్నారు. సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సగటున ఏటా లక్ష మంది చొప్పున కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారు.

కానీ, ఇటీవల ఆ సంఖ్యలో మెరుగుదల కనిపిస్తోంది. దానికి అనేక కారణాలున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి ఏపీలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2018-19 విద్యా సంవత్సరంలో 70.43 లక్షలుగా ఉంది. అది 2020-21 వచ్చే సరికి 73.05 లక్షలకు చేరింది.

కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యనే తీసుకుంటే 2018-19లో 37.2 లక్షలుగా ఉండేది. అది అనూహ్యంగా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 43.43 లక్షలకు చేరుకుంది.

ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 45 లక్షలు దాటిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

అంటే, కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారు 3 లక్షల మంది విద్యార్థులుంటే ప్రైవేటు స్కూళ్లలో టీసీలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన వారి సంఖ్య మరో 3 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

బడిఈడు పిల్లలందరికీ నిర్బంధ విద్య బోధించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది.
ఫొటో క్యాప్షన్, బడిఈడు పిల్లలందరికీ నిర్బంధ విద్య బోధించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది.

కరోనా తర్వాత అడ్మిషన్లు పెరిగాయి..

కరోనాకి ముందు కొంతమంది అడ్మిషన్లు కోసం వచ్చేవారు. కానీ ఈ రెండు విద్యా సంవత్సరాల్లో ఆ సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా కారణంగా ప్రైవేటు స్కూళ్లు సక్రమంగా నడిచే అవకాశం లేనందున వేలకు వేలు ఫీజులు కట్టడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. దాంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

వారంతా ప్రభుత్వ బడుల్లో కొనసాగుతారా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేం. కానీ లాక్ డౌన్ తో స్కూళ్లు నడవకపోయినా ఫీజులు చెల్లించడానికి మాత్రం వారు సిద్ధంగా లేరనే చెప్పాలి.

''ఈ ఏడాది కూడా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారంతో ఎన్నాళ్ల పాటు సాధారణ స్థితి ఉంటుందోననే సందేహాలు ఉన్నాయి. రెండు మూడు నెలలు మాత్రమే పాఠశాలలు నడిస్తే ఫీజులు చెల్లించడానికి సిద్ధంగా లేనివారంతా ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చేశారు'' అని పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎం.వెంకటరమణ అన్నారు.

ప్రైవేటు స్కూళ్లు మానేసి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ బడులకు రావడానికి నాడు-నేడు వంటి పథకాలు కూడా కొంత దోహద పడ్డాయని ఆయన బీబీసీకి తెలిపారు.

'ఇప్పటికీ వస్తున్నారు.. ఎక్కడ చేర్చుకోవాలి'

లాక్‌డౌన్ సడలించి, బడులు తెరిచిన మూడు నెలల తర్వాత ఇంకా కొత్తగా అడ్మిషన్ల కోసం వస్తున్నారని విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఎస్‌.డి.ఎం.వై.ఆర్‌.ఆర్. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం.మురళీ శ్రీనివాస్ తెలిపారు.

''అమ్మ ఒడి వంటి పథకాలు కూడా పిల్లలు స్కూల్లో చేరడానికి ఓ కారణం. రోజూ బడికి వస్తే విద్యాకానుక సహా వివిధ పథకాల్లో లబ్ది చేకూరుతోంది. మధ్యాహ్న భోజన పథకంలో కూడా నాణ్యత పెరిగింది. వాటికి తోడుగా తల్లిదండ్రులకు కూడా ఏటా రూ. 15వేలు అకౌంట్లో పడుతున్నాయి. అందుకే తమ పిల్లల్ని బడిలో చేర్చడానికి సిద్ధమవుతున్నారు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

''మా స్కూల్లో సుమారు 600 మంది పిల్లలుండేవారు. అప్పుడే సరిపడా తరగతి గదులు లేవు. కొత్తగా 100 మంది చేరారు. ఇంకా చేర్చుకుని పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థంకాక వచ్చిన వాళ్లందరినీ పొమ్మంటున్నాం. నో అడ్మిషన్ బోర్డులు కూడా అందుకే పెట్టాం'' అని మురళీ శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు.

కరోనా తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్‌లు పెరిగాయి.
ఫొటో క్యాప్షన్, కరోనా తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్‌లు పెరిగాయి.

'ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి'

పిల్లలు ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలకు వస్తే వసతి సరిపోవడం లేదని, లేదా ఇతర కారణాలు చూపించి అడ్మిషన్ ఇవ్వలేమనడం చట్ట విరుద్ధమని విద్యావేత్త ఎం.అరుణ్‌ కుమార్ అన్నారు.

''బడి వయసు పిల్లలందరినీ తరగతి గదిలో ఉండేలా చూడాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. కానీ ఇప్పుడు చదువుకుంటామని బడికి వస్తే చోటు లేదనడం సమజంసం కాదు. అదనపు వసతి ఏర్పాటు చేయాలి. టీచర్లను నియమించాలి. అందుకు భిన్నంగా అడ్మిషన్ ఇవ్వలేమని ఏ ప్రభుత్వ పాఠశాలలో చెప్పినా దానిని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయవచ్చు'' అన్నారాయన.

ఏపీలో ప్రభుత్వ విద్యారంగంలో చేరికలకు సంతోషించాలే తప్ప ఎక్కువయ్యారంటూ వెనక్కి పంపించడం, ఈ వ్యవహారంపై తాము విద్యా హక్కు ప్రచార వేదిక తరుఫున తగిన ఆధారాలు సేకరించి కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు.

ఓ స్కూలు ముందు సీట్లు లేవు అన్న బోర్డు (పాతచిత్రం)
ఫొటో క్యాప్షన్, ఓ స్కూలు ముందు సీట్లు లేవు అన్న బోర్డు (పాతచిత్రం)

విద్యా హక్కు చట్టం ఏం చెబుతోంది?

దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలుకోసమంటూ 2009లో విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 2009 ఆగస్టు 27న ఈ చట్టం అమలుకు రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. 2010 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది

ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంది.

బడి వయసు పిల్లలందరూ ఈడుకి తగిన తరగతి గదిలో ఉండాలి. నివాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల అందుబాటులో ఉండాలి.

విద్యారంగంలో ఖర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. పిల్లల నుంచి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు. ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదు.

బర్త్ సర్టిఫికెట్ లేదనే పేరుతో పాఠశాలలో చేర్చుకోవడానికి నిరాకరించకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట పాఠశాలల ప్రవేశాల సందర్భంగానూ రిజర్వేషన్లు అమలు చేయాలి. 25 శాతం సీట్లు బలహీనవర్గాల వారికి కేటాయించాలి.

ఇంకా అనేక అంశాలు విద్యా హక్కు చట్టంలో ఉన్నప్పటికీ పిల్లలకు ప్రవేశపరీక్షలు లేకుండా పాఠశాలల్లో ప్రవేశం కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం నో అడ్మిషన్ బోర్డులు దర్శనమివ్వడం విమర్శలకు దారితీస్తోంది.

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు.

'రెండు స్కూళ్లు తిరిగాం.. సీట్లు లేవన్నారు'

''మేము భవానీపురంలో ఉంటాం. నేను మిక్చర్ బండి నడుపుతుంటాను. మా అబ్బాయి. ఏడో తరగతి వరకూ ప్రైవేటు స్కూల్లో చదివాడు. ఈ ఏడాది ప్రభుత్వ స్కూల్లో చేర్చించాలని అనుకున్నాం. కానీ, మాకు దగ్గరలోని ఎస్‌.డి.ఎం.వై.ఆర్‌.ఆర్. స్కూల్‌కి రెండుసార్లు వెళ్లి అడిగాం. పిల్లలు ఎక్కువై పోయారు, సీట్లు లేవన్నారు. పక్కనే మునిసిపల్ హైస్కూల్‌కు వెళ్లినా ఖాళీ లేదన్నారు. దాంతో మళ్లీ ప్రైవేటు స్కూల్ కే పంపుతున్నాం. అమ్మఒడి వస్తోంది గానీ ఏడో తరగతికి ఫీజు రూ. 30వేలు కట్టాలి. ప్రభుత్వ స్కూల్లో సీటు ఇచ్చి ఉంటే అక్కడికే పంపేవాళ్లం'' అని విజయవాడకు చెందిన నీలాపు శరత్ రావు బీబీసీతో అన్నారు.

ప్రభుత్వ స్కూల్లో సీటు దొరక్క ఇలాంటి వాళ్లు ఇంకా చాలామంది ప్రైవేటు స్కూల్లోనే తమ పిల్లలను కొనసాగించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు.

ఏపీలోని నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి సహా వివిధ ప్రాంతాల్లో సుమారు 30 పాఠశాలల్లో ఇలాంటి నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దానివల్ల ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల వైపు రావాలని ఆశించిన వాళ్లకు నిరాశ ఎదురవుతోంది.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి.
ఫొటో క్యాప్షన్, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి.

'ప్రభుత్వం దృష్టి పెట్టాలి'

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పరిమితికి మించి విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు 15 శాతం ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

కొన్ని స్కూళ్లకు అడ్మిషన్లు ఆశించిన సంఖ్యలో లేకపోగా, కొన్ని చోట్ల మాత్రం ఎక్కువ మంది వస్తున్నారనే విషయం తాము గమనించామని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కె.ఎస్.ఎస్.ప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలకు గుర్తింపు ఉన్న చోట పెద్ద సంఖ్యలో విద్యార్థుల చేరికలున్నాయని ఆయన బీబీసీతో అన్నారు.

''ప్రభుత్వ స్కూళ్లలో తగిన సంఖ్యలో విద్యార్థులు లేరనే కారణంతో అనేక పాఠశాలలు మూసివేశారు. స్కూళ్లన్నీ అందుబాటులో ఉంటే ఇప్పుడీ రద్దీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం కొన్నిచోట్ల ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్న సమయంలో తగిన ఏర్పాట్లు చేయాలి. సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి. కానీ ప్రస్తుతం నూతన విద్యా విధానం పేరుతో క్రమబద్ధీకరణ అంటూ కొత్త పోస్టులు తీయడం లేదు'' అని ప్రసాద్ అన్నారు.

''పాఠశాలల్లో చేరడానికి వస్తున్న వారికి అవకాశం లేదని చెప్పే పరిస్థితి రాకుండా చూడాల్సి ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

'పాఠశాలలు మెరుగుపడుతున్నాయి'

ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరగడం శుభపరిణామమని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఫలితమని వారు అంటుననారు.

''కొన్నిచోట్ల నో అడ్మిషన్ బోర్డులు మా దృష్టికి కూడా వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ సీట్లు ఉంటాయి. ఒకవేళ సీట్లు లేని చోట సమస్య ఉంటే దగ్గరలోని స్కూళ్లకి వెళ్లేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఎవరికైనా ఆయా పాఠశాలల్లో అవకాశం లేదంటే ప్రత్యామ్నాయంగా మేమే ఏర్పాట్లు చేస్తాం'' అని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారికి కె.అబ్రహం స్పష్టం చేశారు.

అయితే ‘నో అడ్మిషన్’ బోర్డులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడిని బీబీసీ సంప్రదించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో ఉన్న స్కూళ్లలో ఈ సమస్య ఉందని, సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)