లవ్ స్టోరి సినిమా రివ్యూ: ‘సెక్స్ ఎడ్యుకేషన్‌ను బూతులా చూసే తల్లిదండ్రుల వరకు ఇలాంటి చిత్రాలు చేరటం అవసరం’

ఫొటో సోర్స్, FB/sekhar kammula
- రచయిత, సరిత భూపతి
- హోదా, బీబీసీ కోసం
టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల సినిమాలంటే ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ సహజంగా ఉంటుంది.
ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడినప్పటికీ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా దానికోసం ఎదురుచూశారంటే అది శేఖర్ కమ్ముల కోసమే.
దర్శకుడు శేఖర్ కమ్ముల, అచ్చమైన పల్లెటూరి అమ్మాయి, అందులోనూ తెలంగాణ అమ్మాయికి పెట్టింది పేరులా ఉండే సాయిపల్లవి, సౌమ్యంగా కనిపించే కుదురైన హీరో అక్కినేని నాగచైతన్య.. ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఆ మాత్రం ఎదురుచూడటంలో ఆశ్చర్యం లేదు.
అలా భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన 'లవ్ స్టోరి' ప్రేక్షకుల్ని ప్రేమతో ముంచెత్తిందా? నిలువునా ముంచేసిందా? కథేమిటి?
ఆర్మూర్‌కు చెందిన రేవంత్(నాగచైతన్య) ఒక మధ్యతరగతి కుర్రాడు. హైదరాబాద్‌లో జుంబా సెంటర్ నడుపుతూ సొంత కాళ్ళ మీద నిలబడతాడు. జీరో నుంచి సొంతంగా ఎదిగిన ఆతను జీవితంలో ఏదో సాధించాలనే కసితో ఉంటాడు.
అదే ఊరికి చెందిన మౌనిక(సాయిపల్లవి) బీటెక్ చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఊరి నుంచి బయటికొచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఉంటుంది.
మళ్ళీ చెప్పుకోలేని రుగ్మత ఏదో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంటే, ఇక ఉద్యోగం రాదేమోనని నిస్సహాయత, ఏదేమైనా 'నీ వల్ల కాదు' అనే వాళ్ళకు సాధించి చూపాలనే ఆత్మాభిమానం.
ఇలాంటి పరిణామాల మధ్య వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత వారిద్దరి లవ్ స్టోరీ ఎన్నెన్ని మలుపులు తిరిగింది? ఇది కేవలం ప్రేమకథేనా? ఇంకా ఏమేం అంశాలు స్పృశించారు అనేది మిగతా కథ.

ఫొటో సోర్స్, Twitter/chaitanya akkineni
ఏమిటా విభిన్న అంశాలు?
శేఖర్ కమ్ముల సినిమాటిక్ ఉద్వేగాలు కాకుండా హృద్యమైన భావోద్వేగాలు ఆవిష్కరిస్తుంటారనేది తెలిసిన విషయమే. ఈ కుల వివక్ష, మహిళా సాధికారత లాంటి అంశాలతో పాటు ఈసారీ అత్యంత సున్నితమైన చైల్డ్ అబ్యూజ్ విషయం తెర మీదకు తెచ్చారు. తెలుగు సినిమాలో ఇది దాదాపు మొదటి ప్రయత్నమనే చెప్పచ్చు.
ఇళ్లల్లో, ఆడపిల్లలపై జరిగే లైంగిక హింస అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. అది ఒక ప్రేమకథలో ఇమిడేలా చెప్పడం, అందులో సఫలం కావడం అనేది సాహసం. తెలుగు సినిమాలకు అది మంచి పరిణామం. ఇలాంటి ఒక సామాజిక అంశం గురించి చెబితే శేఖర్ కమ్ములే చెప్పాలి అన్నంత హృద్యంగా దీన్ని తెరకెక్కించారు.
పదీ పన్నెండేళ్ళ ఆడపిల్లల మీద బాబాయిలు, మామయ్యలు, చుట్టాలు, ఇరుగు పొరుగువారు చూపే లైంగిక వాంఛలో క్రూరత్వం ఆ పసితనానికి అర్థం కాకపోయినా, అది నింపే భయం జీవితాంతం ఎలా వేధిస్తుందో ఇంట్లో తల్లిదండ్రులకు అర్థంకావాలి.
బడుల్లో నేర్పే గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ను మించి ఇంటి ఆవరణలో జరుగుతున్న రాక్షసత్వం గురించి ఆడపిల్ల తల్లికి చెప్పుకోగలగాలంటే, వారు ఇరవయేళ్ళ కూతురు ఎట్లాంటి బట్టలేసుకోవాలి, ఎవరితో మాట్లాడుతోంది లాంటివి ఆరా తీయడం కాకుండా.. పదేళ్ళ కూతురు ఎవరితోనూ ఎందుకు మాట్లాడ్డం లేదు అనే విషయం అర్థం చేసుకోగలిగే పరిస్థితులు ఉండాలి.
సెక్స్ ఎడ్యుకేషన్‌ని బూతులా చూసే ఊళ్లో తల్లిదండ్రుల వరకూ ఇలాంటి సినిమాలు చేరటం అవసరం. ఆ రకంగా ఇది అంతకు ముందు శేఖర్ కమ్ముల తీసిన చిత్రాలకంటే విభిన్న కథ. ఆయన గౌరవాన్ని పెంచేలా చేసిన కథ కూడా.

ఫొటో సోర్స్, Twitter/chaitanya akkineni
కథ ఎలా సాగింది?
ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రయాణం మొదలెట్టిన రేవంత్, తల్లికి ఆత్మగౌరవమైన పొలాన్ని తాకట్టుపెట్టి ఫిట్నెస్ సెంటర్ ప్రారంభిస్తాడు.
మధ్యలో ప్రేమలో పడి దుబాయి వెళ్లాలనే ప్లాన్ చేయడం, క్షణాల్లో పొలం తాకట్టు సంగతి, అంతకు ముందు చెప్పిన హీరోయిక్ స్టేట్మెంట్స్ మర్చిపోవడం తన క్యారెక్టరైజేషన్‌ని కాస్త తగ్గిస్తుంది.
చైల్డ్ అబ్యూజ్‌కి గురైన మౌనిక మానసిక రుగ్మతకు కారణం ఏంటో ద్వితీయార్థంలో బయటపెట్టడం, ఆ విషయాన్ని హృద్యంగా తగినంత సమయం తీసుకొని చెప్పడం కన్విన్సింగ్‌గా ఉంటుంది.
మధ్యలో పెళ్లి చేసుకోవడానికి ఆడే సూసైడ్ డ్రామా కాస్త బలవంతంగా సాగదీసినట్టుగా ఉంటుంది. అసందర్భంగా ఇరికించినట్టున్నా అప్పటికే జనాదరణ పొందిన జానపదం సారంగదరియా సాయి పల్లవి డాన్స్‌తో చూడముచ్చటగా అనిపిస్తుంది.
ఈ మధ్య ఎన్నో సినిమాల్లో కుల వివక్ష గురించి మాట్లాడినప్పటికీ, మరొక్కసారి ఈ సినిమాలోనూ చెప్పడం జరిగింది. హీరోని కన్వర్టెడ్ క్రిస్టియన్‌గా చెప్పటం మరో విషయం.
కుల వివక్ష భావజాలంలో పెరిగినప్పుడు ఆ తత్వం ఉన్న మనిషి కాకపోయినప్పటికీ హీరోయిన్ నోటి నుంచి కూడా ఒకసారి 'మీరు- మేము' అనిపించడం అసహజమైన సన్నివేశంలో చూపించినా సరే, సహజంగా కనిపించింది.
సాయి పల్లవి నాగచైతన్యల నటన ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇచ్చింది. సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి . తెలంగాణ యాస నాగ చైతన్యకి కొత్తయినా ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఆ చివర్లో చూపించే చెప్పు ఈ సినిమాలో చూపించిన 2, 3 సమాజపు వికృత తత్వాలకు ఛెళ్లుమనిపించే చెంపదెబ్బ.

ఫొటో సోర్స్, fb/sekhar kammula
సాయి పల్లవి తన డాన్స్‌తో మరోసారి ఫిదా అనిపించకమానదు. నాగచైతన్య క్యారెక్టరైజేషన్ మధ్యతరగతి కుర్రాళ్ళ జీవితాలను దగ్గరగా హత్తుకుంటుంది.
ఇది నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ చిత్రం అనొచ్చు. హీరో తల్లిగా చేసిన ఈశ్వరీరావు చాలా సహజ నటి. చక్కగా అభినయించారు.
చాలా రోజులకు కనిపించిన దేవయాని కొన్ని సన్నివేశాల్లోనే ఉన్నా.. హీరోయిన్ తల్లిగా మెప్పించారు.
హీరోయిన్ బాబాయ్‌గా రాజీవ్ కనకాలది బాగా స్కోప్ ఉన్న పాత్ర. దానికి న్యాయం చేశారు కూడా. ఉత్తేజ్‌ది కూడా కీలక పాత్రే. ఎప్పటిలాగే ఆకట్టుకునేలా నటించారు.
చెప్పదలుచుకున్న అంశాలన్నీ నిదానంగా అయినా సరే చెప్పితీరాలి అనుకున్న ప్రయత్నం బాగుంది. అన్నేసి సామాజిక అంశాలను హృద్యంగా చెప్పగలగడాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.
'లవ్ స్టోరీ' అనే టైటిల్ చూసి రొమాంటిక్ ప్రేమ కథ అనుకుని వెళ్లే ఆడియన్స్‌కు కొంత నిరాశ కలగవచ్చు. క్లైమాక్స్ చూసి ఆ ఫీలింగ్ మరీ కలగొచ్చు.
నటీనటులు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డాన్స్, కథ చిత్రానికి బలాలు. అక్కడక్కడ కథ చాలా నెమ్మదిగా సాగటం మైనస్. ఇది ప్రేమ మీద గౌరవం పెంచే 'లవ్ స్టోరీ'.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













