బ్రసెల్స్‌: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..

యూనిస్ ఒసాయండే చిత్రంతో నిరసనకారులు

ఫొటో సోర్స్, Kevin Van den Panhuyzen/BRUZZ

ఫొటో క్యాప్షన్, యూనిస్ ఒసాయండే చిత్రంతో నిరసనకారులు
    • రచయిత, మేఘ మోహన్
    • హోదా, జెండర్ అండ్ ఐడెంటిటీ ప్రతినిధి

అసంతృప్తితో ఉన్న ఒక కస్టమర్ కొట్టిన దెబ్బలకు యూనిస్ ఒసాయండే అనే సెక్స్ వర్కర్ జూన్ 2018లో ప్రాణాలు కోల్పోయారు.

యూరోప్‌లో పని దొరుకుతుందని చెప్పిన మాటలను నమ్మి భవిష్యత్తుపై ఆశలతో 2016లో ఒసాయండే బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో అడుగుపెట్టారు.

తనను యూరోప్‌కు రమ్మని ఆహ్వానించిన వ్యక్తులు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తారని ఆమె భావించారు. నిజానికి వారు మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు.

బ్రసెల్స్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆమెను వ్యభిచారంలోకి నెట్టారు. ఆమెను ఆ దేశం తీసుకుని వచ్చినందుకు, ఇంటి అద్దెకు, వారి ఖర్చులకు మొత్తం 52,000 డాలర్లు బాకీ ఉన్నట్లు వారు చెప్పారు.

ఆమె మరణానికి కొన్ని రోజుల ముందే, ఆమె తను అనుభవిస్తున్న హింస గురించి, పనిలో ఆమెకు ఎదురవుతున్న బెదిరింపుల గురించి ఒక సెక్స్ వర్కర్ స్వచ్చంద సంస్థను సంప్రదించి వారికి చెప్పారు.

ఆమె చట్టబద్ధమైన వలసదారు కాకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు.

జూన్ 2018లో గరే డు నార్డ్ జిల్లాలో ఒక కస్టమర్ ఆమెను 17 సార్లు తీవ్రంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణించే నాటికి ఆమెకు 23 సంవత్సరాలు.

బ్రసెల్స్‌లో సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్న వలసదారులంతా దీనిపై నిరసనలు నిర్వహించారు.

పని చేసే స్థలంలో మెరుగైన పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ రంగంలో పని చేసే వారికి స్పష్టమైన నియమావళిని రూపొందించాలని నిరసనకారులు అధికారులను కోరారు.

బెల్జియంలో వ్యభిచారం నేరం కాదు. కానీ, వారికి దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండే నియమాలు లేవు. ఈ నిరసనను బ్రసెల్స్‌లో యూటీఎస్‌ఓపీఐ సెక్స్ వర్కర్స్ యూనియన్ డైరెక్టర్ నిర్వహించారు.

యూనిస్ ఒసాయండే చిత్రంతో నిరసనకారులు

ఫొటో సోర్స్, Kevin Van den Panhuyzen/BRUZZ

ఫొటో క్యాప్షన్, యూనిస్ ఒసాయండే చిత్రంతో నిరసనకారులు

"అనధికారికంగా దేశంలో అడుగు పెట్టి సెక్స్ వర్కర్లుగా మారిన వలసదారులకు యూనిస్ మరణం చాలా వేదనను కలిగించింది" అని ఆమె బీబీసీతో అన్నారు.

"ఈ రంగంలో హింస పెరుగుతోంది. ముఖ్యంగా బలహీనమైన మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అని చెప్పారు.

ఒసాయండే హత్యకు కారణమని అనుమానిస్తున్న 17 సంవత్సరాల యువకుడిపై అభియోగం నమోదు చేశారు. ఈ కేసు పై విచారణ జరగాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేసిన మానవ అక్రమ రవాణా ముఠాకు సంబంధించిన మరో నలుగురు వ్యక్తులకు నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడింది.

ఒసాయండే పేరును బ్రసెల్స్‌లో ఒక కొత్త వీధికి పెట్టడం ద్వారా మానవ అక్రమ రవాణాకు, లైంగిక హింసకు, ఇతర లైంగిక నేరాలకు బలై మరుగున పడిపోయిన మహిళల గురించి అందరూ ఆలోచించేలా చేయడమే లక్ష్యమని అధికారులు చెప్పారు.

"ఒక వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి" అని బెల్జియం బ్రాడ్‌కాస్ట్ సంస్థ ఆర్‌టిబిఎఫ్ పేర్కొంది.

ఈ వీధి బ్రసెల్స్‌‌కు ఉత్తరం వైపు ఉంటుంది. మహిళల పేర్లతో ఎక్కువ వీధుల పేర్లు పెట్టాలని బ్రసెల్స్‌లో కౌన్సిల్ కొత్తగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది జరుగుతోంది.

ఇప్పటికే కౌన్సిల్ ఇక్కడ చాలా వీధులకు ప్రముఖ మహిళల పేర్లు పెట్టింది. అందులో తిరుగుబాటుదారులువోన్ నీవీజీన్, ఆండ్రీ డి జోంగ్ పేర్లు కూడా ఉన్నాయి. బెల్జియంలో స్వలింగ సంపర్కుల ఉద్యమకారిణి సూజన్ డానియెల్ పేరును కూడా ఒక బ్రిడ్జి కు పెట్టారు.

"మా దృష్టిలో ఫెమినిజం అంటే వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న మహిళల గురించి మాట్లాడటం మాత్రమే కాదు. అన్ని రకాల సామాజిక స్థాయిల్లోనూ మహిళల హక్కులు, పోరాటం గురించి మాట్లాడితేనే, ఇంక్లూజివ్ ఫెమినిజం అవుతుంది" అని బ్రస్సెల్స్ కౌన్సిల్ సభ్యురాలు ఆన్స్ పెర్‌సూన్స్ అన్నారు.

బెల్జియంలో 16 - 69 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 42 శాతం మంది మహిళలు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక హింసకు గురయ్యే ఉంటారని పెర్‌సూన్స్ చెప్పారు.

"ఈ హింస సెక్స్ వర్కర్స్‌కు మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే, యూనిస్ ఒసాయండే పేరును ఒక వీధికి పెట్టాలని నిర్ణయించుకున్నాం" అని అన్నారు.

నిర్మాణంలో ఉన్న ఈ వీధిని మరి కొన్ని నెలల్లో అధికారికంగా తెరవనున్నారు.

ఈ వీధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెక్స్ వర్కర్లు, వలసదారుల కుటుంబాలను ప్రసంగించేందుకు ఆహ్వానిస్తామని సిటీ కౌన్సిల్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)