50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది

మండుతున్న వేసవి రోజులు పెరుగుతున్నాయి
    • రచయిత, బెకీ డేల్, నౌసెస్ స్టాయలియానో
    • హోదా, బీబీసీ డేటా జర్నలిస్టులు

50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదయ్యే రోజుల సంఖ్య 1980 తర్వాత నుంచి ఏటా పెరుగుతున్నట్లు బీబీసీ విశ్లేషణలో తేలింది.

గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి మనుషుల ఆరోగ్యం, జీవనశైలికి పెను సవాలుగా మారుతోంది.

1980 తర్వాత నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల సంఖ్య ప్రతి దశాబ్దంలో పెరుగుతూ వచ్చింది.

1980 నుంచి 2009 మధ్య ప్రతి ఏటా ఇలాంటివి సగటున దాదాపు 14 రోజులు ఉన్నాయి. ఆయా రోజుల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటింది.

2010 నుంచి 2019 మధ్య ఇలా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన రోజులు సంఖ్య 26కు పెరిగింది.

అదే సమయంలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న రోజులు కూడా ప్రతి ఏటా రెండు వారాలకు పైనే ఉన్నాయి.

ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు నూటి నూరు శాతం శిలాజ ఇంధనాలే కారణం అని చెప్పవచ్చు అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ డైరెక్టర్ ప్రెడెరిక్ ఒట్టో అన్నారు.

రాబోవు రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే రోజులు సర్వ సాధారణం అయిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అత్యధిక వేడి మనుషులకు, ప్రకృతికి ప్రాణాంతకం కావచ్చు. దాని వల్ల భవనాలు, రోడ్లు, విద్యుత్ వ్యవస్థలో కూడా సమస్యలు ఎదురుకావొచ్చు.

ప్రధానంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతాల్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

కానీ, ఈ ఏడాది వేసవిలో ఇటలీలో రికార్డు స్థాయిలో 48.8 డిగ్రీల సెంటీగ్రేడ్, కెనడాలో 49.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దీంతో, శిలాజ ఇంధనం వినియోగం ఆపకపోతే, ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో కూడా 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మండుతున్న వేసవి రోజులు పెరుగుతున్నాయి

"మనం త్వరగా చర్యలు చేపట్టాలి. మనం ఎంత త్వరగా ఉద్గారాలను తగ్గించగలిగితే, అంత మెరుగైన స్థితిలో ఉంటాం" అని ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ద ఎన్విరాన్‌మెంటల్ పరిశోధకులు డాక్టర్ సిహాస్ లీ అన్నారు.

"ఈ ఉద్గారాల విడుదల ఇలాగే కొనసాగితే, దీనిపై తగిన చర్యలు చేపట్టకపోతే, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే రోజుల సంఖ్య పెరగడమే కాదు, ఆ పరిస్థితి నుంచి బయటపడడం పెను సవాలుగా నిలుస్తుంది" అంటారు డాక్టర్ లీ.

1980 నుంచి 2009 వరకూ దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఇటీవల దశాబ్దంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుదల ఉన్నట్లు బీబీసీ విశ్లేషణలో కూడా తేలింది.

కానీ, ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచంలో అన్ని చోట్లా ఒకేలా లేవు. తూర్పు యూరప్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 సెంటీగ్రేడ్‌కు పైగానే పెరిగాయి. ఆర్కిటిక్, మధ్యప్రాచ్యంలో ఈ పెరుగుదల రెండు సెంటీగ్రేడ్ కంటే ఎక్కువే ఉంది.

దీనిపై వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల నేతలు శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

ఈ నవంబర్‌లో గ్లాస్గోలో ఐక్యరాజ్యసమితి సదస్సు జరగబోతోంది. గ్లోబల్ వార్మింగ్‌, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అందులో ప్రభుత్వాలకు చెప్పనున్నారు.

మండుతున్న వేసవి రోజులు పెరుగుతున్నాయి
వాతావరణ మార్పులు

అత్యధిక వేడి ప్రభావం

బీబీసీ 'లైఫ్ అట్ 50C' పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ ప్రారంభించింది. అందులో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రజల జీవితాలపై ప్రభావం పడుతోందో తెలుసుకోనున్నారు.

50 సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, అధిక వేడి, తేమ ఆరోగ్యానికి పెను ముప్పు తీసుకురావచ్చు.

అత్యధిక వేడి ప్రభావం

గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుత స్థాయి పెరుగుతుంటే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.2 బిలియన్ల మంది హీట్ స్ట్రెస్‌కు గురికావచ్చని అమెరికాలోని ఓ యూనివర్సిటీ గత ఏడాది ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది.

చుట్టుపక్కల పరిస్థితులు మారడం వల్ల ప్రజలకు ప్రత్మామ్నాయం ఎంచుకోవడం కష్టంగా మారుతుంది.

తీవ్రమైన వేడి వల్ల కరువు, కార్చిచ్చు లాంటివి పెరుగుతాయి.

డారి ప్రాంతాలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు దానికి ముఖ్యమైన కారణం.

షేక్ కాజ్మీ అల్ కాబీ
ఫొటో క్యాప్షన్, షేక్ కాజ్మీ అల్ కాబీ

షేక్ కాజ్మీ అల్ కాబీ మధ్య ఇరాక్‌లో ఉంటారు. ఆయన గోధుమలు పండిస్తారు. ఆయన పొలంలో ఇప్పుడు దిగుబడి ఇంతకుముందులా రావడం లేదు. ఆయన, ఇరుగు పొరుగువారు ఎలాగోలా జీవించేవారు. కానీ మెల్లమెల్లగా ఆ భూమి ఎండిపోయి బంజరుగా మారిపోయింది.

"ఈ భూమంతా పచ్చగా కళకళలాడుతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పచ్చదనమంతా పోయింది. ఇప్పుడు ఇదంతా ఎడారి" అన్నారు.

ఆయన గ్రామంలో దాదాపు అందరూ వేరే పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

"నేను నా తమ్ముడిని, స్నేహితులను, నమ్మకస్తులైన ఇరుగు పొరుగు వారిని, నా నవ్వును కూడా కోల్పోయాను. వాళ్లు నాతో అన్నీ పంచుకునేవారు. ఇప్పుడు నాతో ఎవరూ ఏదీ పంచుకోరు. ఇప్పుడు నేను, నా ఖాళీ భూమి మాత్రమే మిగిలాం" అంటున్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)