వాతావరణ మార్పులపై ఐపీసీసీ నివేదిక: భవిష్యత్తును నిర్ణయించే ఐదు కీలక అంశాలు

ఐపీసీసీ

ఫొటో సోర్స్, COPERNICUS/SENTINEL-2

    • రచయిత, మాట్ మెక్ గ్రాత్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్మెంట్ కరస్పాండెంట్

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధాన అంశాలపై బీబీసీ ఎన్విరాన్మెంట్ కరస్పాండెంట్ మాట్ మెక్‌గ్రాత్ అందిస్తున్న కథనం.

వాతావరణ మార్పుల పరిధి చాలా విస్తృతమైంది. ఇవి చాలా వేగంగా, తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా మానవ చర్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయి. 'వాతావరణ మార్పులు అనేది ఏదో భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కానే కాదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావాలను మనం చూస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయి' అని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) రిపోర్టును రూపొందించిన వారిలో ఒకరైన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రైడెరిక్ ఒట్టో హెచ్చరించారు.

శాస్త్రవేత్తలు ఇప్పుడు చేస్తున్న వాదనలకు, ఈ కొత్త నివేదిక బలాన్ని చేకూరుస్తోంది.

40 పేజీల నివేదికలో 'చాలా అవకాశం ఉంది' అనే పద బంధం 42 సార్లు కనిపించింది. శాస్త్రీయపరంగా చూస్తే, 90 నుంచి 100 శాతం జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పడానికి ఈ పదబంధం ఉపయోగపడుతుంది.

ఉష్ణోగ్రతలు

ఫొటో సోర్స్, Getty Images

పటిష్టమైన ఐపీసీసీ నివేదిక

''కనీసం ఒక్కటి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే కొత్త విషయం లేదని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందెన్నడూ తయారు చేయనంత పటిష్టంగా ఐపీసీసీ నివేదికను తయారు చేశారు'' అని యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) ప్రొఫెసర్ ఆర్థర్ పీటర్సన్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ప్రొఫెసర్ పీటర్సన్ ఐపీసీసీలో డచ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి. అంతేకాకుండా ఈ నివేదికను రూపొందించిన కమిటీలో పరిశీలకుడిగా కూడా ఉన్నారు.

'దీనిలో అంశాల గురించి పెద్దగా చర్చ జరగడంలేదు. దీనిలో ఎలాంటి ఆరోపణలు లేవు, సూటిగా సుత్తి లేకుండా ఒకదాని తర్వాత మరో అంశాన్ని ప్రస్తావించారు'

వాతావరణ మార్పులకు మానవాళిదే బాధ్యత అని నివేదిక కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

ఇకపై ఎలాంటి సంకోచం అవసరం లేదు. దీనికి కారణం మనమే అని ఆయన అన్నారు.

వరదలు

ఫొటో సోర్స్, Reuters

1.5 డిగ్రీల పరిమితి

2013లో ఐపీసీసీ వాతావరణ మార్పులపై నివేదికను ప్రచురించింది. 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పరిమితిని నాడు అంతగా పరిగణనలోకి తీసుకోలేదు.

2015లో పారిస్ ఒప్పందానికి దారి తీసిన రాజకీయ చర్చలలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు, పలు ద్వీపాలు ఈ తక్కువ ఉష్ణోగ్రత పరిమితిని ముందుకు తీసుకువచ్చాయి. ఇది వారి మనుగడకు సంబంధించిన విషయం అని వాదించాయి.

దీంతో 2015 ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూ ఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు.

భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం వల్ల భారీ ప్రయోజనాలు ఉన్నట్లు 2018లో వెలువడిన ఓ నివేదిక పేర్కొంది.

1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పరిధిలోనే ఉండటానికి కార్బన్ ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించాలని, 2050 నాటికి ఈ ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలని స్పష్టం చేసింది. లేకపోతే ఈ పరిమితిని 2030 నుంచి 2052 మధ్యలో దాటేస్తామని హెచ్చరించింది.

శిథిలమైన పడవ

ఫొటో సోర్స్, WATERAID/ DENNIS LUPENGA

నియంత్రించకపోతే..

ఇవే విషయాలను కొత్త నివేదిక పునరుద్ఘాటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్గారాలను నియంత్రించకపోతే మరో దశాబ్దంలోనే 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదలను, 2040 కల్లా 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదలను చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

శుద్ధిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సున్నాకి తగ్గించవచ్చు. మిగిలిన ఉద్గారాలను మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో అదుపులోకి తీసుకురావొచ్చు.

వీడియో క్యాప్షన్, ధృవపు ఎలుగుబంట్లు అంతరించిపోతున్నాయా?

పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, ఇది ఆకస్మిక విపత్తుకు దారి తీయదు.

'1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదల అనేది రాజకీయంగా ఒక ముఖ్యమైన పరిమితి. అయితే, వాతావరణ దృక్కోణం నుండి చూస్తే, ఇదేమి కొండ అంచున ఉన్నట్టు కాదు. ఒకసారి 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల దాటితే, ప్రతిదీ విపత్తుగా మారుతుంది' అని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అమండా మేకాక్ వివరించారు.

కొత్త నివేదికను రూపొందించిన వారిలో ఈయన ఒకరు.

సముద్ర మట్టం

ఫొటో సోర్స్, Getty Images

సముద్రమట్టాల స్థాయిలో పెరుగుదల

గతంలో, సముద్ర మట్టం పెరిగే ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు ఐపీసీసీ మూస ధోరణితో వ్యవహరించేదని విమర్శలు వచ్చేవి. గ్రీన్ ల్యాండ్, అంటార్కిటిక్‌లలో మంచు పలకలు కరగడంతో వచ్చే ప్రభావాలను మునుపటి నివేదికల్లో పేర్కొనలేదు. సరైన పరిశోధనా ఫలితాలు లేకపోవడమే దీనికి కారణం.

కానీ ఈసారి అలా జరగలేదు.

ప్రస్తుత పరిస్థితులలో ఈ శతాబ్దం చివరి నాటికి 2 మీటర్లు, 2150 నాటికి 5 మీటర్ల వరకు సముద్రమట్టాలు పెరగనున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ఇవి అంత కచ్చితమైన గణాంకాలు కానప్పటికీ, అధిక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా ఈ అవకాశాలను అంత సులువుగా తోసిపుచ్చలేం.

2100 నాటికి ఉద్గారాలను నియంత్రించి, 1.5 డిగ్రీల పరిధిలోకి ఉష్ణోగ్రతల పెరుగుదలను తీసుకొచ్చినా సముద్ర మట్టాల స్థాయి మాత్రం పెరుగుతుందని పేర్కొనడం విచారకరం.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ నుంచి తేనెటీగలు ఎందుకు పారిపోతున్నాయ్?

'దీర్ఘకాలంలో సముద్ర మట్టాల స్థాయి గణాంకాలను చూస్తుంటే ఓ గొరిల్లాను దగ్గరి నుంచి చూసినట్టు భయానకంగా ఉంటుంది' అని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాల్టే మీన్‌షౌసెన్ తెలిపారు.

ఈయన కూడా ఐపీసీసీ రిపోర్టును రూపొందించిన వారిలో ఒకరు.

'దీర్ఘకాలంలో భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల.. సముద్ర మట్టాల స్థాయిలో రెండు మూడు మీటర్ల పెరుగుదల చూడనున్నామని నివేదికను బట్టి తెలుస్తోంది. ఇవి 2150 నాటికి సంభవించే అవకాశం ఉంది. ఇది మన జీవితకాలంలో జరగకపోవొచ్చు. కానీ, మానవ మనుగడకు, మన భూగ్రహానికే ఇదొక ప్రశ్నార్ధకంగా మారుతోంది' అని అన్నారు.

సునామీ

ఫొటో సోర్స్, Getty Images

సిద్ధం కావడం ముఖ్యం

'క్రమంగా సముద్ర మట్టాలు పెరగడంతో.. శతాబ్దానికి ఒకసారి మాత్రమే సముద్రాల్లో సంభవించే విపత్కర సంఘటనలు భవిష్యత్తులో మరింత తరచుగా జరుగుతాయి' అని ఐపీసీసీ వర్కింగ్ గ్రూప్ కో-ఛైర్ వాలెరీ మాసన్-డెల్మోట్టే చెప్పారు.

'గతంలో శతాబ్దానికి ఒకసారి మాత్రమే సంభవించినవి ప్రస్తుతం దశాబ్దానికి ఒకటి లేదా రెండుసార్లు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో మేం అందించే సమాచారం పరిగణనలోకి తీసుకుని, వీటికి సిద్ధం కావడం చాలా ముఖ్యం' అని ఆయన సూచించారు.

వీడియో క్యాప్షన్, అందమైన ఈ గ్రామం మునిగిపోతోంది.

మరింత స్పష్టతతో హెచ్చరికలు..

నేడు హెచ్చరికలు స్పష్టంగా, మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉపద్రవాలను అడ్డుకునే అవకాశాలు కూడా నేడు మన ముందున్నాయి.

తాము ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్‌.. వాతావరణాన్ని ప్రభావితం చేయగలదని చాలా కాలంగా పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.

కార్బన్ డయాక్సైడ్‌ స్థాయిలు రెట్టింపు అయితే పెరిగే ఉష్ణోగత్రలను నిర్వచించేందుకు ‘ఈక్విలిబ్రియం క్లైమేట్ సెన్సిటివిటీ' అనే పదబంధాన్ని ఉపయోగించారు.

మీథేన్

ఫొటో సోర్స్, Reuters

2013లో నివేదికలో ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. తాజా నివేదికలో మాత్రం శాస్ర్తవేత్తలు గరిష్ఠ ఉష్ణోగ్రతల పెరుగుదులను మూడు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేశారు.

ఇది ఎందుకు ముఖ్యం?

'మేం ఇప్పుడు దానిని కచ్చితత్వంతో అంచనాలు వేయగలుగుతున్నాం. మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించడానికి మేం గణాంకాలను ఉపయోగిస్తాం' అని నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన లీడ్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పియర్స్ ఫోర్సర్ట్ అన్నారు.

'దీని ప్రకారం.. ఉద్గారాల్లో నికర సున్నా లక్ష్యాలను అందుకోవడం సాధ్యమయ్యే పనే''

నివేదికలో మీథేన్ పాత్ర కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

ఐపీసీసీ ప్రకారం, ప్రస్తుతం ప్రతి 1.1 డిగ్రీల సెల్సియస్​ భూతాపంలో మీథేన్ వాటా 0.3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది​.

చమురు, గ్యాస్ పరిశ్రమ, వ్యవసాయం, వరి సాగు నుండి ఉద్గారాలను కట్టడి చేస్తే స్వల్పకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

'చమురు, గ్యాస్ వంటి రంగాల్లో చౌక అయిన వేగవంతమైన విధానాలతో మీథేన్ కాలుష్యం కట్టడికి అత్యవసర చర్చలు జరగాలన్న అంశాన్ని నివేదిక తోసిపుచ్చింది' అని అమెరికా పర్యావరణ రక్షణ నిధి నుండి ఫ్రెడ్ క్రుప్ వెల్లడించారు.

'భూతాపం విషయానికి వస్తే, అన్ని రకాల ఉద్గారాల కట్టడిపైనా మనం దృష్టిసారించాలి. ముఖ్యంగా మానవ చర్యలతో ఉత్పత్తి అయ్యే మీథేన్ ఉద్గారాలను తగ్గించడమే ఉత్తమమైన మార్గం'

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

గ్లాస్గో సమావేశానికి మార్గదర్శకంగా ఐపీసీసీ నివేదిక

గ్లాస్గోలో సీఓపీ26 వాతావరణ సమావేశానికి కొన్ని నెలల ముందు తాజా నివేదిక వెలువడింది. దీంతో గ్లాస్గోలో చర్చలకు ఇది మార్గదర్శకంగా ఉండనుంది.

ఐపీసీసీకి తనకంటూ ఓ గుర్తింపు ఉంది. 2013, 2014లో ఐపీసీసీ అంచనాలు ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి మార్గం సుగమం చేసింది.

రాజకీయ నాయకులు స్పందించకపోతే ఏం జరుగుతుందనే దాని గురించి ఈ కొత్త అధ్యయనం చాలా బలంగా, స్పష్టంగా చెప్పింది. వారు సకాలంలో స్పందించకపోతే సీఓపీ26 చర్చలు అసంతృప్తికరంగా ముగియవచ్చు. అప్పుడు కోర్టులు ఎక్కువగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

ఇటీవల సంవత్సరాలలో, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లలో పర్యావరణ ప్రచారకర్తలు వాతావరణ మార్పులపై కోర్టుకెళ్లి విజయం సాధించారు.

'నివేదికను పక్కన పెట్టడాన్ని మేం అంగీకరించం. అవసరమైతే నివేదికతో కోర్టులను కూడా ఆశ్రయిస్తాం' అని గ్రీన్‌పీస్ నార్డిక్ సీనియర్ రాజకీయ సలహాదారు కైసా కోసోనెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)