కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోస్ కార్లోస్ క్వెటో
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
బ్రిటన్‌కు చెందిన 90 ఏళ్ల మహిళ మార్గరేట్ కీనన్ ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్ 19 వ్యాక్సీన్‌ను తీసుకొని ఏడు నెలలు దాటింది. అప్పుడే వైరస్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాటం మొదలైంది.
దేశంలో కరోనాకు పూర్వమున్న పరిస్థితులు నెలకొల్పడానికి అందించాల్సిన టీకాల పరిమాణానికి బ్రిటన్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు దగ్గరగా వచ్చినట్లే కనిపిస్తున్నాయి.
ఈ 7 నెలల వ్యాక్సినేషన్ ప్రక్రియ పేద, ధనిక దేశాల్లో అసమానతలను బయటపెట్టింది. కొత్త వేరియంట్స్ ముప్పులకు గురైంది.
అయినప్పటికీ, గుర్తింపు పొందిన చాలా వ్యాక్సీన్లు సీరియస్ కేసులపై, మరణాల నియంత్రణపై ప్రభావవంతంగా పనిచేశాయి. మరికొన్ని గుర్తింపు లేని వ్యాక్సీన్లు కూడా ఈ సమయంలోనే తమ ఉనికి చాటుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
థర్డ్ డోస్ వ్యాక్సీన్ అవసరముందా?
ఇటీవల కొన్ని వారాలుగా థర్డ్ డోస్ వ్యాక్సీన్‌పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
అమెరికా ఔషధ నియంత్రణ అధికారుల నుంచి థర్డ్ బూస్టర్ డోస్‌ను అభ్యర్థించేందుకు ఫైజర్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
వైరస్ హాని అధికంగా ఉన్న రోగులకు యూకే ఆరోగ్య వ్యవస్థ థర్డ్ డోసు టీకాను అందిస్తోంది.
ఇజ్రాయెల్ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, వ్యాక్సీన్ రక్షణ అవసరమైన వారికి థర్డ్ డోస్ టీకాను ఇవ్వడం మొదలు పెట్టింది.
చాలా వారాల పాటు ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల్లో కరోనా కొత్త కేసుల నమోదు, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. కానీ వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ కారణంగా ఇటీవల ఈ రెండు దేశాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరిగాయి. డెల్టా వేరియంట్‌ను తొలుత భారత్‌లో గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మూడో డోసును వ్యతిరేకిస్తూ, పేద దేశాలకు వ్యాక్సీన్ డోసులను విరాళంగా ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తోంది. అయినప్పటికీ ఈ మూడో డోసు అందించడానికి అవసరమైన ప్రయోగాలు గురించి నిపుణుల విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
అమెరికాలోని యమో క్లినిక్‌కు చెందిన డాక్టర్ ఆండ్రూ బ్యాడ్లీ మాట్లాడుతూ ' బూస్టర్ వ్యాక్సీన్ ఉపయోగానికి మద్దతునిచ్చేందుకు సరిపడినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు' అని అన్నారు.
'డెల్టా వేరియంట్‌తో సహా మిగతా మ్యుటేషన్ల ద్వారా కలిగే తీవ్ర దుష్పరిణామాలను, మరణాలను, ఆసుపత్రుల్లో చేరికలను ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ టీకాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని ' బీబీసీతో చెప్పారు.
'పూర్తిస్థాయి డోసుల్ని తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. కానీ ఇవి ఆసుపత్రుల్లో చేరేంతగా, మరణం సంభవించేంతగా ప్రజారోగ్యానికి నష్టం కలిగించడం లేదు. సాధారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉండదు' అని యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన విల్బర్ చెన్ అన్నారు.
'వైరస్‌కు చెందిన అత్యంత తీవ్ర లక్షణాల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తూనే ఉంటుంది' అని పేర్కొన్నారు.
భవిష్యత్‌లో దీన్నుంచి ఏమైనా మినహాయింపులు ఉండొచ్చు.
'వ్యాక్సీన్ ప్రభావానికి లొంగని ప్రభావవంతమైన వేరియంట్ కోసం, ప్రత్యేక డోసును రూపొందించాల్సి ఉంటుందని' బ్యాడ్లీ పేర్కొన్నారు.
'కానీ, సమీప భవిష్యత్‌లో ఇది జరుగుతుందో, లేదో ఎవరికీ తెలియదని' చెన్ బీబీసీతో అన్నారు.
వ్యాక్సిన్లకు ప్రతీ ఒక్కరి శరీరం ఒకేలా స్పందించదు అనే సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
'ముఖ్యంగా తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారు, అవయవ మార్పిడికి గురైన రోగుల శరీరం వ్యాక్సిన్లకు స్పందించే తీరు ఇతరులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది'.
'ఇప్పటికీ థర్డ్ డోస్ ఆవశ్యకతపై సరైన అవగాహన లేనప్పటికీ, ఆరోగ్య అధికారుల ఆమోదం పొందిన బూస్టర్ డోస్‌లను అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ఒకవేళ అవసరమైన పక్షంలో వెంటనే వినియోగించుకోవచ్చు' అని యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన వండర్బిట్ మెడికల్ యూనివర్సిటీ ప్రివెంటివ్ మెడిసన్ ప్రొఫెసర్ విలియమ్ షాఫ్నర్ అభిప్రాయ పడ్డారు.
ఇప్పటికిప్పుడే, సాధారణ జనానికి అదనంగా మూడో డోస్ అవసరమా,లేదా అని చెప్పడం కష్టమే. టీకాల వల్ల కలిగిన రోగనిరోధకత ఎంతకాలం ఉంటుందనే అంశంపై, కొత్త వేరియంట్ల తీరుపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, TOLGA AKMEN / GETTY
వ్యాక్సిన్ రక్షణ క్షీణిస్తోందా?
'సూపర్ మార్కెట్ ఉత్పత్తుల్లో పండ్లకు తక్కువ జీవిత కాలం ఉంటే... ప్రాసెస్డ్ ఫుడ్‌కు కాస్త ఎక్కువ ఉంటుంది. మరి వ్యాక్సిన్లు కల్పించే రక్షణకు జీవిత కాలం ఎంత?
మన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికే 7 నెలలు గడిచింది. వ్యాక్సిన్ల నుంచి లభించే రక్షణ భవిష్యత్‌లో ఎంత కాలం ఉంటుందనే అంశంపై ఇప్పటికీ ఎలాంటి ఆధారం లేదు.
కాలం గడిచిన కొద్దీ దీనికి సంబంధించి ఎక్కువ డేటా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు శాస్త్రవేత్తలు టీకా రక్షణ క్షీణించడం ఎప్పుడు మొదలవుతుందో అనే అంశాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతారు.
'ఇన్‌ఫ్లూయెంజా, టైఫాయిడ్ టీకాలు కొంత కాలం వరకే రక్షణ కల్పిస్తాయి. అందుకే వాటికి బూస్టర్ డోస్‌లు అవసరం. ఎల్లో ఫీవర్, మీజిల్స్ వంటి వాటికి అందించే టీకాలు సుదీర్ఘ కాలం పాటు రక్షణగా ఉంటాయి' అని చెన్ వివరించారు.
వైరస్‌ను తటస్థీకరించడానికి మన శరీరం ఉపయోగించే ఆత్మరక్షణ వ్యవస్థలోని రకాలు కూడా... వ్యాక్సీన్ల రక్షణ ఎంతకాలం ఉంటుందో తెలుసుకోలేకపోవడానికి కారణం అవుతాయి.
'యాంటీ బాడీల స్థాయిలు ఎల్లప్పుడూ రక్షణను అంచనా వేయలేవు. దీనికోసం ప్రస్తుతమున్న డేటా ప్రకారం 'బి సెల్ మెమెరీ'పై మనం ఎక్కువగా ఆధారపడొచ్చు. దీని గురించి మరింత బాగా అర్థం చేసుకున్నప్పుడే... కాలక్రమేణా క్షీణించే రోగ నిరోధక శక్తి కోసం బూస్టర్ డోస్‌ల అవసరం పడొచ్చు' అని బ్యాడ్లీ వివరించారు.
బూస్టర్ డోస్‌లకు, డోస్ మార్పిడిలకు మధ్య ఉన్న తేడాను గుర్తించాల్సిందిగా నిపుణులను కోరారు.
'టీకాల వల్ల ఏర్పడిన రక్షణను, కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్ క్షీణింపజేసిన పక్షంలో దానిని నిర్వీర్యం చేయడానికి మనకు కొత్త టీకా తయారీ అనివార్యమవుతుంది' అని విలియం షాఫ్నర్ వివరించారు.
ఇలాంటి పరిస్థితి తలెత్తితే కొత్త టీకా తయారీ కన్నా అందుబాటులో ఉన్న టీకాలో మార్పుచేర్పులు చేయడం సులభమైన పద్ధతి అని నిపుణులు అంటున్నారు. వారాలు లేదా నెలల వ్యవధిలో వేగంగా వ్యాక్సిన్ మార్పిడి పూర్తి చేయవచ్చని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, NICOLAS AGUILERA / GETTY
వ్యాక్సీన్ల మార్పిడి
'ప్రతీ ఏడాది ఉత్పరివర్తనం చెందే ఇన్‌ఫ్లూయెంజా వైరస్ రకాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు జరిగాయి. ఈ వైరస్ మ్యుటేషన్ ప్రతీ ఖండంలో ఒకేలా ఉండదు. కాబట్టి ప్రతీ దేశం తమ ప్రాంతంలో ఉన్న వేరియంట్‌కు అనుగుణంగా నిర్దిష్ట వ్యాక్సిన్‌ను తయారు చేస్తుంటుంది. ఇదే పరిస్థితి తలెత్తితే కరోనా వైరస్ విషయంలోనూ ఇలాగే చేయాల్సి ఉంటుంది' అని స్పెయిన్‌లోని కంప్లూటెన్స్ యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జోస్ మాన్యుల్ కొన్ని నెలల క్రితం బీబీసీకి వివరించారు.
ఏదేమైనా, ప్రస్తుతం తీసుకుంటోన్న రోగ నిరోధక ప్రయత్నాలకు హాని కలిగించే కొత్త వేరియంట్స్‌ను అడ్డుకోవడానికి వైరస్‌ను కట్టడి చేయడం అవసరం. వీలైనంత త్వరగా ప్రపంచంలోని పెద్ద సంఖ్యలో జనాభాను వైరస్ బారిన పడకుండా కాపాడటం ముఖ్యం.
అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్ డోస్‌లకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. గ్లోబల్ ఇమ్యూనైజేషన్‌ను సాధించాకే బూస్టర్ డోస్‌ల గురించి ఆలోచించాలని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అందరూ వ్యాక్సీన్ తీసుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
ధనిక దేశాలైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్‌తో పాటు యూరోపియన్ యూనియన్ సగటున తమ జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సిన్‌ను అందించాయి. అంటే సమూహ రోగనిరోధక శక్తికి దగ్గరలో ఉన్నాయి.
తక్కువ వనరులు కలిగిన దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు చాలా వెనుకబడి ఉంది. లాటిన్ అమెరికాలో చిలీ తప్ప మిగతా దేశాలు తమ జనాభాలో 10 నుంచి 40 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించాయి. సెంట్రల్ అమెరికాలో మరింత తక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది.
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 10 శాతం కూడా మించలేదు.
ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ అందించడానికి ప్రస్తుతమున్న రేటు ప్రకారం అయితే 2023 వరకు పడుతుందని ప్రతిష్టాత్మక సైంటిఫిక్ జర్నల్ లాన్సెట్ ఎడిటర్ ఇన్ చీఫ్ జాన్ మెక్ కానెల్ బీబీసీ బ్రెజిల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు.
'వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థంగా లేని చాలా దేశాలకు వరల్డ్ కమ్యూనిటీ సహాయం అవసరం. ఇక్కడ మానవతావాదానికి మించి ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అణచివేయడానికి, కొత్త వేరియంట్ల పుట్టుకను నిరోధించడానికి ప్రతీ ఒక్కరి స్వీయ ఆసక్తి ఉండాలి' అని షాఫ్నర్ పేర్కొన్నారు.
'బూస్టర్ డోస్‌లను సమర్థించడానికి శాస్త్రీయ ఆధారాలు లేనందున, వాటి ప్రాధాన్యం ప్రకారం ప్రపంచాన్ని విభజించలేం. ఇది కేవలం ధనిక దేశాలకు మాత్రమే లాభదాయకం' అని చెన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్లోబల్ వ్యాక్సినేషన్ అంటే కరోనాకు ముగింపేనా?
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి గ్రూప్ ఇమ్యూనిటీ ద్వారా వ్యాధిని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు.
కానీ వైరస్‌ను నియంత్రించడం అంటే... దాన్ని నిర్మూలించినట్లు కాదు. ఈ రెండూ ఒక్కటి కాదు. నియంత్రణ తర్వాత కూడా వైరస్ గణనీయంగా పెరగవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
'కరోనా వైరస్ శాశ్వతంగా అంతమవుతుందని ఊహించడం మనం మానుకోవాలి. అది అసాధ్యం. ఇన్‌ప్లూయెంజా తరహాలో సార్స్ కోవ్ 2 కూడా మన సూక్ష్మజీవుల వాతావరణంలో కలిసిపోయింది. దాంతో మనం వేగాల్సిందే... ఇక ముందు మన జీవితాల్లో వైరస్ కూడా ఒక భాగం' అని షాఫ్నర్ అన్నారు.
కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఈ అంశాన్ని నమ్మడం ప్రారంభించాయి.
దాదాపు సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ అందించిన యునైటెడ్ కింగ్‌డమ్ ఇటీవల గణనీయంగా కేసులు పెరుగుతున్నప్పటికీ... జూలై 19 నుంచి దేశంలో అన్ని ఆంక్షలను ఎత్తివేసింది.
ఈ చర్య ప్రభుత్వంపై అనేక విమర్శలకు తావిచ్చింది. శాస్త్రవేత్తలు కూడా దీన్ని ప్రమాదకరంగా పరిగణించారు. అయినప్పటికీ బ్రిటీష్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ తమ చర్యను సమర్థించుకున్నారు. 'వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందే. దేశాన్ని ఆంక్షల నుంచి తప్పించడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదు' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, MAYNOR VALENZUELA / GETTY
వైరస్‌ను శాశ్వతంగా వదిలించుకోవడం అసాధ్యమని పేర్కొన్న విల్బర్ చెన్... సైద్ధాంతికంగా వదిలించుకునే మార్గాలున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఒకవేళ మనం యువతకు, పిల్లలకు, పెద్దలకు, వ్రుద్దులకు వ్యాక్సిన్ ఇవ్వగలిగితే... వైరస్‌ను తొలగించే అవకాశం ఉండవచ్చు. కానీ ఇది కొత్త వైరస్ పుట్టుకను మాత్రం అడ్డుకోలేదు' అని వివరించారు.
'మశూచిని వ్యాక్సిన్ల ద్వారా నిర్మూలించాం. పోలియోను కూడా దాదాపుగా అంతమొందించాం. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రియాశీలంగా లేని ప్రాంతాల్లో మళ్లీ ఈ వ్యాధులు పునర్జీవం పొందడం మనం స్పష్టంగా చూడవచ్చు' అని ఆయన ఉదహరించారు.
ఈ కరోనా వైరస్‌ను అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఉనికిలో లేని కొన్ని వైరస్‌లు అంతమవుతాయి. కొత్తవి పుట్టుకొస్తాయి. వీటికి సరైన ఆయుధం వ్యాక్సిన్లే. వాటిని మనం తయారు చేసుకున్నాం కూడా. కాబట్టి వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేసుకోండి.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









