ప్రపంచాన్ని భయపెడుతున్న డెల్టా వేరియంట్

ఇండోనేసియాలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇండోనేసియాలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు

ప్రపంచవ్యాప్తంగా 124 ప్రదేశాలలో కోవిడ్-19 డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మరికొద్ది నెలల్లో దీని ప్రభావ తీవ్రత మరింత పెరగొచ్చని.. కొన్ని వారాల వ్యవధిలోనే 20 కోట్లకు పైగా కేసులు నమోదు కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.

యూరప్, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

మరణాల రేటు తగ్గడంతో కొన్ని పాశ్చాత్య దేశాలు కోవిడ్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి.

కానీ, వ్యాక్సీన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని దేశాలు.. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరగని దేశాలకు ప్రాణాంతకమైన ముప్పు పొంచి ఉంది.

డెల్టా వేరియంట్ కోవిడ్ మరణాలకు ఎలా కారణమవుతోందో.. ముందుముందు ఇది ఎలాంటి ప్రభావం చూపనుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీబీసీ పాత్రికేయులు వివరిస్తున్నారు.

ఇండోనేసియాలో డెల్టా కేసులు

ఇండోనేసియా: భారీగా పెరిగిన అంత్యక్రియలే సూచన

- వాల్ద్యా వరపుత్రి, బీబీసీ న్యూస్ ఇండోనేసియా

రోజుకు 1300 కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్న ఇండోనేసియా ఇప్పుడు ఆసియాలో కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది.

ఆసుపత్రులలో బెడ్‌లు దొరక్క హోం ఐసోలేషన్‌లో ఉన్న వేలాది మంది కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.

రాజధాని జకార్తాకు చెందిన వీరవాన్ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తుంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆయన వివరించారు.

ఆయన తన బృందంతో కలిసి ఇళ్ల నుంచి మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు.

ఇండోనేసియాలో తాజా వేవ్‌కు ముందు ఆయన రోజు రెండు శవాలకు అంత్యక్రియలు చేసేవారు.

కానీ, ఇప్పుడు రోజుకు సుమారు 25 ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

అంత్యక్రియలు చేయడానికి ఆయన బృందానికి ఉన్న సామర్థ్యం కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. దాంతో చాలా మృతదేహాలను వెంటవెంటనే దహనం చేయడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారాయన.

ప్రస్తుతం ఇండోనేసియాలో రోజుకు 50 వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

ప్రభుత్వం అక్కడ కోవిడ్ ఆంక్షలను కనీసం ఈ నెలాఖరు వరకు పొడిగించొచ్చు. సోమవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇండోనేసియాలో వ్యాక్సీన్ వేయించునే వయసు గలవారు 20.6 కోట్ల మంది ఉండగా ఇప్పటి వరకు 1.6 కోట్ల మందికి మాత్రమే రెండు డోసుల టీకా వేశారు.

ట్యునీషియాలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Getty Images

ట్యునీషియా : వ్యాక్సీన్ వేయించుకుంటే పిజ్జా ఫ్రీ

- రానా జవాద్, బీబీసీ నార్త్ ఆఫ్రికా కరస్పాండెంట్

ట్యునీషియాలో కరోనా ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ట్యునీషియాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ కేసులు మాత్రం చాలావేగంగా పెరుగుతున్నాయి.

దేశంలోని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.

ఎవరిని బతికించాలని, ఎవరిని వదిలేయాలని అనేది నిర్ణయించుకోలేక వైద్యులు కన్నీరు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ట్యునీషియాలో కేసులు చాలా వేగంగా పెరుగుతుండగా వ్యాక్సినేషన్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 8 శాతం కంటే తక్కువ జనాభాకు రెండు డోసుల వ్యాక్సీన్ అందింది అక్కడ.

ప్రభుత్వం ఈ సంక్షోభ సమయంలో సరైన చర్యలు తీసుకోలేకపోతోందని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. మంగళవారం ఆ దేశ ఆరోగ్య మంత్రిని పదవి నుంచి తప్పించారు.

వ్యాక్సీన్ వేసుకునే వారికి అక్కడ కొన్ని ప్రభుత్వ, వ్యాపారసంస్థలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.

వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ట్యునీషియా నేషనల్ టెలికం ఏజెన్సీ 1జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా ఇస్తోంది.

ట్యూనిష్‌లోని కొన్ని పిజ్జా హౌస్‌లు వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆధారం చూపించినవారికి పిజ్జాలపై 10 శాతం ఆఫర్ ఇస్తున్నాయి.

వచ్చే నెల నాటికి ట్యునీషియాలో పరిస్థితులు చక్కబడొచ్చని భావిస్తున్నారు. యూరప్, అరబ్ దేశాలు ట్యునీషియాకు సహాయం చేయడానికి ఇప్పటికే హామీ ఇవ్వడంతో ఆయా దేశాల నుంచి మందులు, ఆక్సిజన్ ట్యాంకులు, వ్యాక్సీన్‌లు, నిధులు రానున్నాయి.

థర్డ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ మెక్సికోలో కోవిడ్ ఆంక్షలేమీ లేవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థర్డ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ మెక్సికోలో కోవిడ్ ఆంక్షలేమీ లేవు

మెక్సికో: ప్రజలు అలసిపోయారు

- మార్కోస్ గొంజాలెజ్ డియాజ్, బీబీసీ ముండో కరస్పాండెంట్

మెక్సికోలో ప్రస్తుతం కోవిడ్ మూడో వేవ్ తీవ్రంగా ఉంది. రోజుకు 15 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాజధాని మెక్సికో సిటీలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం డెల్టావేరియంట్ కేసులే ఉంటుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికా, మెక్సికోల మధ్య సాధారణ ప్రయాణాలకు అనుమతిస్తూ సరిహద్దును మూసివేయకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని మెక్సికో ప్రభుత్వం అంటోంది.

కోవిడ్ బారినపడుతున్నవారిలో ఎక్కువ మంది వ్యాక్సీన్ వేయించుకోనివారు, 18 ఏళ్ల లోపువారే.

అయితే, అక్కడ ఇంకా 65 శాతం ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉండడం ఊరట కలిగించే విషయం.

మెక్సికోలో ప్రజలు కోవిడ్‌తో విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. థర్డ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ పనుల కోసం, బతుకుతెరువు కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు.

ఈ కారణం వల్లే ప్రభుత్వం కూడా ఆంక్షలేమీ విధించలేదు.

రువాండాలో కోవిడ్ మరణాలు

రువాండా: డెల్టా వేరియంట్ వల్ల కొత్తగా ఆంక్షలు

- సాంబా క్యూజుజో, బీబీసీ గ్రేట్ లేక్స్ డిజిటల్ జర్నలిస్ట్

వైరస్ నియంత్రణలో సత్వర, సమర్థ నిర్ణయాలు అమలు చేసినందుకు గాను ఇటీవల వరకు ప్రపంచమంతా రువాండాను కొనియాడింది.

కానీ జూన్ రెండో వారం నుంచి పరిస్థితులు తలకిందులయ్యాయి.

ఒక్కో వారం దాటుతుంటే కేసులు, మరణాలు చాలావేగంగా పెరిగాయి.

జులై ప్రారంభం నాటికి రువాండాలోని కోవిడ్ ఆసుపత్రిలన్నీ రోగులతో నిండిపోయి కొత్తగా ఎవరికీన చేర్చుకోలేని పరిస్థితికి చేరుకున్నాయి.

'ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ మేం చూడలేదు' అని జులై 6న ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అక్కడికి రెండు రోజుల తరువాత ఆయన దేశంలో డెల్టా వేరియంట్ ప్రవేశించిందని ప్రకటించారు.

జులై 17న రాజధాని కిగాలి, మరో 8 జిల్లాలలో పది రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. అయినా, కేసులు కానీ మరణాలు కానీ తగ్గలేదు.

రువాండాలో 4 లక్షల మందికి పైగా(జనాభాలో 3 శాతం) రెండు డోసుల వ్యాక్సీన్ వేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)