వాతావరణ మార్పులు: కర్బన ఉద్గారాల కట్టడికి ఆరు శక్తిమంతమైన మార్గాలు...

వాతావరణ మార్పులు

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘‘వాతావరణ మార్పులు.’’

ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు, శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తున్నారు.

బీబీసీ సీరీస్ ‘‘భూమిని కాపాడుకొనేందుకు 39 మార్గాలు"లో భాగంగా వాతావరణ మార్పులను అరికట్టేందుకు ఆరు ఉత్తమ పరిష్కారాలను ఇక్కడ చర్చించబోతున్నాం.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Amelia Flower @ameliaflower

స్త్రీ విద్య

విద్య ఆవశ్యకతను చాలా కాలం కిందటే మనం తెలుసుకున్నాం. విద్య ద్వారా సాధించగలిగే విజయాలనూ చవి చూశాం.

విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో చర్చలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా, స్త్రీ విద్య ద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మనకు తెలుసు.

అయితే, అమ్మాయిలు చదువుకుంటే వాతావరణ మార్పులనూ అరికట్టవచ్చనే విషయం మీకు తెలుసా?

అమ్మాయిలు చదువుల్లో పడిపోతే పెళ్లిళ్లు కావడం, పిల్లల్ని కనడం ఆలస్యమవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలందరూ వారి పాఠశాల విద్యను మధ్యలో ఆపేయకుండా పూర్తి చేస్తే 2050 నాటికి ఎంత జనాభా ఉంటుందని అంచనా వేస్తున్నామో అంతకన్నా 84 కోట్ల జనాభా తగ్గే అవకాశం ఉంది.

అయితే, జనాభాకు, వాతావరణ మార్పులకు ఉన్న సంబంధం కొంత వివాదాస్పదమైనదే. ధనిక దేశాల్లో, పేద దేశాల కన్నా చాలా ఎక్కువ స్థాయిలో కార్బన్ ఉద్గారాలు వెలువడుతాయి. సాధారణంగా పేద దేశాలు అధిక జనాభా కలిగి ఉంటాయి.

ఈ విరుద్ధాలు ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్న వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. అందులో జనాభా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నది కాదనలేని సత్యం.

స్త్రీ విద్య జనాభా పెరుగుదలను అరికట్టడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచేందుకు తోడ్పడుతుంది.

ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం.. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది.

మహిళల నాయకత్వంలో వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలను మెరుగైన రీతిలో రూపొందించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Amelia Flower @ameliaflower

అయితే ఎలా?

పురుషుల కన్నా మహిళలకు శాస్త్రీయ దృక్పథం ఎక్కువ ఉంటుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే విధానాల విషయంలో కూడా ఇది నిరూపణ అయింది.

స్త్రీ విద్య కోసం అనేక స్వచ్చంద సంస్థలు భారీగా నిధులను సమకూరుస్తున్నాయి. అది ఫలితాలను ఇస్తోంది కూడా.

ప్రపంచవ్యాప్తంగా, పాఠశాలల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోంది.

బంగ్లాదేశ్ లాంటి దేశంలో 1980లలో మాధ్యమిక విద్యలో బాలికలు 30 శాతం ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 70 శాతానికి పెరిగింది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Rohan Dahotre @rohandahotre

వెదురు - గొప్ప విజయాలను అందిస్తుంది

వెదురు.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొక్క. ఇది ఒక రోజులో ఒక మీటర్ వరకు పెరుగుతుంది. ఇది, ఇతర చెట్ల కన్నా వేగంగా కార్బన్‌ను పీల్చుకుంటుంది. దీన్ని చక్కగా మలచుకుంటే, ఉక్కు కంటే దృఢంగా నిలబడుతుంది.

ఈ ప్రత్యేకతలే దీనికి ఫర్నీచర్ తయారీలో ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. ఒకప్పుడు వెదురును పేదల ఇంటి కలపగా చూసేవారు. కానీ ఈ పరిస్థితి మారుతూ వస్తోంది. స్టీలు, పీవీసీ, అల్యూమినియం, కాంక్రీటులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వినియోగిస్తున్నారు.

వెదురు పెంచడంతో పర్యావరణానికి చాలా లాభాలు ఉంటాయి. ఇవి చెద పురుగులను తట్టుకుని నిలబడగలవు. అంతేకాదు మట్టి సారాన్ని పెంచుతాయి. నేల కోతకు గురికాకుండా అడ్డుకోవడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Rohan Dahotre @rohandahotre

ఇండోనేసియాలో ఎన్విరాన్‌మెంటల్ బాంబూ ఫౌండేషన్‌ను ఆరిఫ్ రబిక్ నడిపిస్తున్నారు. వెదురుతో మట్టిలో పోషకాలను పెంపొందించడమే వీరి లక్ష్యం. కార్బన్‌ను కట్టడి చేసేందుకు వెయ్యి వెదురు గ్రామాలను నెలకొల్పాలని వీరు ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడ ప్రతి గ్రామంలో 20 చ.కి.మీ. పరిధిలో వెదురు మొక్కలు, ఇతర పంటలు పండిస్తున్నారు. అడవులను తలపించే ఈ ప్రాంతాల్లో జంతువులు కూడా ఉంటాయి. ఈ విధానాలను తొమ్మిది ఇతర దేశాల్లోనూ మొదలుపెట్టాలని ఆరిఫ్ ప్రయత్నిస్తున్నారు.

‘‘ఈ విధానంతో మనం ఏటా బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను పర్యావరణం నుంచి తొలగించొచ్చు’’అని ఆయన చెప్పారు.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Rohan Dahotre @rohandahotre

చట్టాలతో పోరాటం

వాతావరణ మార్పులపై పోరాడేందుకు చట్టాలు పదునైన అస్త్రాల్లాంటివని పర్యావరణ న్యాయవాదులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాలుష్యానికి కారణమయ్యే కంపెనీలు, ప్రభుత్వాలను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

కర్బన ఉద్గారాల కట్టడికి పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన నిబంధనలకు ఓ చమురు సంస్థ కట్టుబడి ఉండాలని నెదర్లాండ్స్‌లోని ఓ కోర్టు ఆదేశించింది. దీన్ని చరిత్రాత్మక కేసుగా మీడియా అభివర్ణించింది.

కర్బన ఉద్గారాలకు పర్యావరణ చట్టాలతో కళ్లెం వేయొచ్చు. అంతేకాదు మేలిమి నైపుణ్యాలు గల పర్యావరణ న్యాయవాదులు.. సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలనూ అన్వేషించగలరు. ప్రస్తుతం చాలాచోట్ల మానవ హక్కుల చట్టాలు, కార్మిక చట్టాలతో పర్యావరణ సమస్యలకు వారు పరిష్కారాలు కనుగొంటున్నారు.

2020లో కేవలం 35 డాలర్ల విలువైన షేర్లున్న ఓ మదుపర్ల సంస్థ.. పోలండ్‌లో ఓ బొగ్గు కర్మాగారాన్నే అడ్డుకుంది. ఇది ఎలా సాధ్యమైంది?

పోలిష్ ఎనర్జీ కంపెనీలోని తమ షేర్లతో పర్యావరణ సంస్థ ‘‘క్లైంట్ ఎర్త్’’ ఈ ఘనత సాధించింది. బొగ్గుతో నడిచే విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఫలితంగా ఆ కార్మాగారాన్ని నెలకొల్పకూడదని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Dandy Doodlez @dandydoodlez

ఫ్రిడ్జ్, ఏసీలతోనూ ముప్పు

అన్ని ఫ్రిడ్జ్‌లు, ఏసీల్లో ‘‘హైడ్రోఫ్లోరో కార్బన్లు (హెచ్‌ఎఫ్‌సీ)’’లుగా పిలించే రసాయన సమ్మేళనాలుంటాయి. గాలిని శీతలీకరించే వీటితో పర్యావరణానికి చాలా ముప్పు.

హెచ్‌ఎఫ్‌సీలు గ్రీన్‌హౌస్ వాయువులు. ఇవి కార్బన్ డైఆక్సైడ్ కంటే ప్రమాదకరమైనవి. 2017లో వీటికి కళ్లెం వేస్తామని ప్రపంచ నాయకులు అంగీకరించారు. వీటికి అనుకున్నట్లుగా కళ్లెం వేయగలిగితే, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 0.5 డిగ్రీలకు పరిమితం చేయొచ్చు.

అయితే, ప్రస్తుతం ఫ్రిడ్జ్‌లు, ఏసీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు వీటిలో చాలా వరకు పాతబడుతున్నాయి. అంటే, వీటి నుంచి వచ్చే ఉద్గారాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే వీటిని రీసైకిల్ చేయడం చాలా ముఖ్యం.

రిఫ్రిజిరేటర్ల నుంచి వచ్చే ఉద్గారాలకు కళ్లెంవేసేందుకు ఓ నిపుణుల బృందం కృషి చేస్తోంది. హానికర వాయువులను కట్టడి చేసేందుకు పనిచేస్తున్న ‘‘ట్రేడ్ వాటర్’’ సంస్థ డైరెక్టర్‌గా మరియా గ్యూటిరెజ్ పనిచేస్తున్నారు. ఆమెను అందరూ ‘‘గోస్ట్ బస్టర్’’అని పిలుస్తుంటారు. ఎందుకంటే పాత కాలం విధానాలను అనుసరించే రిఫ్రిజిరేటర్ కర్మాగారాలకు కళ్లెం వేసేందుకు ఆమె కృషిచేస్తున్నారు.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Kingsley Nebechi @kingsleynebechi

పడవ ప్రయాణం ఇలా...

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నౌకాయానం కీలకమైనది. 90 శాతం ప్రపంచ వాణిజ్యం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఉద్గారాల్లో దీని వాటా కేవలం 2 శాతం మాత్రమే.

రానున్న దశాబ్దాల్లో ఈ ఉద్గారాలు పెరిగే అవకాశముంది. మనం నౌకాయాణంపై చాలా ఆధారపడి జీవిస్తున్నాం. అయితే, దీని వల్ల సముద్ర జీవులు ప్రభావితం అవుతున్నాయి.

సముద్రంలో ఉండే జీవుల వల్ల నౌకల డీజిల్ వినియోగం 25 శాతం వరకు పెరగొచ్చు. బ్రాంకెల్స్‌గా పిలిచే ఓ రకం సముద్రపు జీవులు నౌకలకు అంటిపెట్టుకుంటాయి. వీటిని తొలగించేందుకు డీజిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఏటా వీటి వల్ల 31 బిలియన్ డాలర్ల చమురు అదనంగా ఖర్చు అవుతోందని అంచనాలు ఉన్నాయి.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Kingsley Nebechi @kingsleynebechi

దీని వల్ల కర్బన ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. బ్రాంకెల్స్ అంటుకోకుండాచూసే విధానాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు.

కొత్తరకం యూవీ పెయింట్లను నౌక అడుగుభాగంలో వేయడం నుంచి కొత్త విధానాల వరకు పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Sarina Mantle @wildsuga

సూపర్ రైస్...

మీకు తెలుసా? వరి ఉత్పత్తి కూడా కర్బన ఉద్గారాలకు కారణం అవుతుంది. దీని నుంచి వెలువడే ఉద్గారాలు వైమానిక ఉద్గారాలతో సమానం. ఎందుకంటే చాలా వరకు నీళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వరిని పండిస్తారు.

మట్టిలోకి ఆక్సిజన్ వెళ్లకుండా నీరు అడ్డుకుంటుంది. ఫలితంగా బ్యాక్టీరియా.. మీథేన్‌ను ఉత్పత్తి చేసేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. కార్బన్‌తో పోలిస్తే మీథేన్ వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే ముప్పు 25 రెట్లు ఎక్కువ.

ఈ పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సరికొత్త వరి వంగడాలపై పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా పొడి నేలల్లో పండించగలిగే వరిని వారు అభివృద్ధి చేస్తున్నారు.

ఈ పరిశోధనలు ఫలిస్తే.. రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఉద్గారాలు కూడా తగ్గుతాయి. వచ్చే దశాబ్దంలో ఇలాంటి వరి వంగడాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)