క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్‌నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా

ఫొటో సోర్స్, ANI
జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో జూలై 8 సాయంత్రం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా యాత్రికుల శిబిరాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరదల్లో చాలామంది చనిపోయారని అధికారులు చెప్పారు.
గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇంతకూ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? దీని గురించి వాతావరణ శాఖ ముందుగానే సమాచారం అందిస్తుందా? క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?
దిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్) అధిపతి డాక్టర్ కుల్దీప్ వీటన్నిటి గురించి ఇలా వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు.
ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.
క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?
ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి.
ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి.
పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి.
వర్షాకాలంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?
సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.
నెలల్లో చెపాలంటే మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పర్వత ప్రాంతాల్లోనే మేఘాల విస్ఫోటనం జరుగుతుందా?
అలాగని చెప్పలేం. దిల్లీ, పంజాబ్, హరియాణా లాంటి సమతల ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు.
అయితే, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉత్తరాదినే సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తులో చిన్న చిన్న పర్వతాలు అనేకం ఉంటాయి. అలాంటిచోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు అధికం.
ఈశాన్య (నార్త్-ఈస్ట్) ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?
చిరపుంజీలాంటి ప్రాంతాల్లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ సంభవమే.
అక్కడ చాలాసార్లు మేఘాల విస్ఫోటనం జరిగింది. కానీ అక్కడి ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉంటారు.
నీరు ఒకేచోట పేరుకుపోదు. త్వరగా పల్లానికి తరలిపోతుంది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించరు. అందుచేత అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం అరుదు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క గంటలో 10 సె.మీ వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లదు. సమీపంలో నది లేదా సరస్సు ఉంటే, కుంభవృష్టి వలన వాటిల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Reuters
క్లౌడ్ బరస్ట్‌ను ముందే అంచనా వేయొచ్చా?
ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.
రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం.
ఇవి కూడా చదవండి:
- హిమాలయాల్లో పొంచి ఉన్న పెను ప్రమాదాలు.. ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు?
- ఒక్క చిట్కా మీ జీవితాన్ని 7 రకాలుగా మార్చేస్తుంది, ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు
- టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన జపాన్ బాలిక, 13 ఏళ్లకే పసిడి పతకం
- ప్రశాంత్ కిశోర్: జనాన్ని మెప్పించి ఎన్నికల్లో గెలవడం ఎలా?
- 35 సంవత్సరాల క్రితం అదృశ్యమైన విమానం జాడ ఇప్పుడు దొరికింది
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- వాతావరణ మార్పులు: కర్బన ఉద్గారాల కట్టడికి ఆరు శక్తిమంతమైన మార్గాలు...
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- అధ్యయనం: రోజుకు 3 కప్పుల కాఫీతో ’ఆరోగ్యానికి మేలు జరగొచ్చు’
- మనం సగం మనుషులమే! మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








