ఒక్క చిట్కా మీ జీవితాన్ని 7 రకాలుగా మార్చేస్తుంది, ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ లక్ష్యాలను ప్రాధాన్యతాక్రమంలో ఒక జాబితాలో రాసుకోవడం కంటే మంచి పద్ధతి ఇంకేముంటుంది?

చేయాల్సిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో మీరెంత కచ్చితంగా ఉంటారు?

అవి మీ జీవితాశయాలు కావొచ్చు లేదా రోజూ చేయాల్సిన పనులు కావచ్చు.

కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక క్రమబద్ధమైన జాబితాను రూపొందించుకోవడం వల్ల మనం ఆ దిశగా తొలి అడుగు వేసినట్లు అవుతుంది.

మన ప్రణాళికలను, ఆలోచనలను, గుర్తుంచుకోవాల్సిన అంశాలను ఒక జాబితాగా రాసుకుంటే, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తుంది. ఆ జాబితా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

జాబితా తయారీ, దాని ఉపయోగాలపై మీకు ఇంకా అనుమానాలుంటే కింద ఇచ్చిన ఆశ్చర్యం కలిగించే అంశాలను చదివి, దాని ఉపయోగం గురించి తెలుసుకోండి.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు తెలుస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.

1. గజి బిజి ఆలోచనల నుంచి క్లారిటీ వస్తుంది

పనులను ఒక క్రమపద్ధతిలో పూర్తి చేయడం ఎప్పుడూ మంచిదే. కానీ మనం చేయాల్సిన పనులను పూర్తిచేయడానికి మనం ఊహించిన దానికంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

మనం చేయాల్సిన పనులన్నింటినీ కాగితంపై రాసుకోవడం వల్ల ఒక ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తిచేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి, మన ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోడానికి, పెద్ద పెద్ద ప్రాజెక్టులను విడతల వారీగా పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది.

పైగా మన మెదడులో తిరుగుతున్న ఆలోచనలన్నింటినీ పేపర్ మీద పెట్టడం వల్ల మనకు ఆ ఆలోచనల నుంచి విముక్తి లభిస్తుంది.

అంతేకాదు, రాసుకున్న జాబితాలో, పూర్తి చేసిన పనులను కొట్టేస్తున్నప్పుడు మనకు ఒక సంతృప్తి కూడా లభిస్తుంది. మిగతా పనులను పూర్తి చేయగలమనే నమ్మకం వస్తుంది.

ఇంకా నమ్మకం కలగడం లేదా?

"మన మెదడు ఒక సమయంలో 4 అంశాలను మాత్రమే గుర్తుంచుకోగలదు. కాబట్టి, మనం ఏదో మరచిపోయామనే భావనను పోగొట్టుకోవడానికి, మన ఆలోచనలను పంచుకోవడానికి జాబితాలు అవసరం" అని న్యూరో సైంటిస్ట్ డేనియల్ కూడా చెప్పారు.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉన్నత శిఖరాలపై ఉన్న ఫీలింగ్ వస్తుంది

2. మరింత విజయం సాధించొచ్చు

జాబితాలు మిమ్మల్ని మరింత విజయవంతంగా, ఉత్పాదకత సాధించే విధంగా ప్రోత్సహిస్తాయి.

లక్ష్యం నిర్దేశించుకోవడంపై సైకాలజిస్ట్ జోర్డాన్ పీటర్ సన్ ఒక అధ్యయనం చేశారు.

అందులో కొందరు విద్యార్థులు తమ పాత అలవాట్లు ప్రతిబింబించేలా, భవిష్యత్‌లో కొత్త లక్ష్యాలను చేరుకునేలా తయారు చేసుకున్న ఒక జాబితా ప్రకారం నడుచుకున్నప్పుడు, వారు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారని తేలింది.

అలాగే ఉద్యోగులకు కచ్చితమైన, సవాలుతో కూడిన, వాస్తవికతకు దగ్గరగా ఉన్న లక్ష్యాల జాబితాను నిర్దేశిస్తే వారి ఉత్పాదకత 10 శాతం పెరుగుతుందని 2013లో జరిగిన ఎఫ్‌ఎల్ స్మిత్ అధ్యయనం వెల్లడించింది.

దీర్ఘకాలిక, నిర్మాణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల వ్యక్తిగత ఆకాంక్షలు కూడా నెరవేరతాయి.

అందుకే వెంటనే పేపర్, పెన్ తీసుకొని మీ పెద్ద ఆశయాల జాబితాను తయారు చేసుకోండి.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్బులను మీరు ఎలా ఖర్చు చేస్తారు?

3. డబ్బు ఆదా చేయొచ్చు

తీసుకురావల్సిన వస్తువుల జాబితా రాసుకోవడం వల్ల మనం బజారులో కొనాల్సిన చిన్న వస్తువును కూడా మర్చిపోకుండా ఉండవచ్చు. కాలక్రమేణా అది మనల్ని దుబారా ఖర్చు నుంచి కాపాడుతుంది.

అదే సయంలో మార్కెట్‌కు వెళ్లేముందే కొనాల్సిన వస్తువుల జాబితా రాసుకోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనకుండా జాగ్రత్త పడొచ్చు.

కానీ, దానికి కొంచెం స్వీయ క్రమశిక్షణ కూడా అవసరం. మీకు నచ్చిన వస్తువును కొనకుండా మీరు ఉండలేకపోవచ్చు. అప్పుడు జాబితాలో లేని వస్తువులను కూడా కొని చూడండి.

అప్పుడు, ఆ పెరిగిన ఖర్చును భరించలేక మీకు మీరే షాపింగ్ చేయాల్సిన ఖర్చుపై పరిమితిని విధించుకుంటారు.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

4. ఆత్మస్థైర్యం పెరుగుతుంది

జీవితం చప్పగా, ఉదాసీనంగా సాగిపోతున్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తే, ఆ భావన నుంచి బయటకు రావడానికి ఈ జాబితా ఉపకరిస్తుంది.

మీరు సాధించిన విజయాలు విద్యాపరమైనవి, వృత్తిప‌ర‌మైన‌వి లేదా మీ వ్యక్తిగతమైనవి కూడా కావచ్చు. ఆ చిన్న, పెద్ద విజయాల జాబితా రాసుకుంటే మీరెంత గొప్పవారో మీకే అర్థమవుతుంది.

ఆత్మ స్థైర్యం తక్కువగా ఉన్న వ్యక్తుల కోసం బ్రిటన్‌కు చెందిన హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్ 'మైండ్' కొన్ని సిఫారసులు చేసింది.

మీలో మీకు నచ్చిన 50 అంశాలతో ఒక జాబితాను తయారు చేయాలని కోరింది. అది తయారు చేయడానికి మీకు వారాలు పట్టినా, ఇతరుల సహాయంతో దాన్ని పూర్తి చేయాలని చెప్పింది.

ఒక్కసారి అది పూర్తి కాగానే, ప్రతిరోజూ ఆ జాబితాలోని వివిధ అంశాలను చదవండి. ఇది మీలోని అద్భుతమైన లక్షణాల గురించి మీకు అర్థమయ్యేలా చేస్తుంది అని తెలిపింది.

మీలో ఆత్మ స్థైర్యం తక్కువగా ఉందని మీరు అనుకుంటే మీరు కూడా ఓసారి ఇలా చేసి చూడండి.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ చెక్‌లిస్ట్‌కు కట్టుబడి ఉంటే ఎన్నో సమస్యల నుంచి మీరు తప్పించుకోవచ్చు.

5. తప్పులు చేయకుండా కాపాడుతుంది

మనం తప్పులు చేయకుండా కాపాడే జాబితా ఒకటుంది. అదే చెక్ లిస్ట్.

పెళ్లి పనుల్లో ఉన్నా, విహార యాత్ర కోసం బయల్దేరుతున్నా అవన్నీ సక్రమంగా పూర్తి చేయాలంటే జాబితా అవసరం. ఈ జాబితా ఉంటే మనం ప్రతీ పనినీ మర్చిపోకుండా చేయగలం.

ఆసుపత్రుల్లో అయితే చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు రావొచ్చు. అందుకే, అక్కడ చెక్ లిస్ట్‌లు ప్రతిరోజూ రోగుల ప్రాణాలను కాపాడుతుంటాయి.

అమెరికాలోని ఆసుపత్రిలో తొలిసారిగా అధికారిక చెక్ లిస్ట్‌ ఉపయోగించారు. రోగి శరీరంలోకి ఇంట్రావీనస్ ట్యూబ్‌లను 5 దశల ప్రకారం అమర్చేందుకు ఈ చెక్ లిస్ట్‌లు అనుసరించారు.

ఫలితంగా 15 నెలల్లో ఇన్ఫెక్షన్ శాతం 4 నుంచి సున్నాకు పడిపోయింది. దీంతో దాదాపు 1500 మంది ప్రాణాలు కాపాడటంతో పాటు, 200 మిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏకాగ్రతకు భంగం కలగదు.

6. ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది

మీరెప్పుడైనా జిగర్నిక్ ప్రభావం గురించి విన్నారా? అది మీకు తెలీకుండానే మీ మార్గంలోకి చొరబడుతుంది.

ఇది ఒక మానసిక సూత్రం. దీని ప్రకారం మన మెదడు మనం విజయవంతంగా పూర్తి చేసిన విషయం కంటే, మనం సరిగా పూర్తి చేయని అంశాలనే బాగా గుర్తుపెట్టుకుంటుంది.

దాని ఫలితంగానే, మనం ఏదైనా ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏకాగ్రత కోల్పోతాం. మనం పూర్తి చేయని వేరే అంశాలపైకి మన దృష్టి మళ్లుతుంది.

దీనికి సమాధానమేంటి? మానసిక శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారం దీన్నుంచి బయటపడేందుకు... మనం పూర్తి చేయలేకపోయిన లక్ష్యాలు, పనుల జాబితా రాయాలి.

అలా చేయడం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ లక్ష్యాలను పూర్తి చేయడం గురించి మీరు ఆలోచిస్తున్నట్లు మీ మెదడు గుర్తిస్తుంది. ఫలితంగా మీ ముందున్న పనిని సవ్యంగా పూర్తి చేసేందుకు కావాల్సిన ఏకాగ్రత మీ సొంతమవుతుంది.

జాబితా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నచ్చని విషయాలు చాలా ఉంటాయి. వాటిని మైండ్‌లోంచి తొలగిస్తే ఉండే ప్రశాంతతే వేరు.

7. నచ్చని అంశాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది

మనకు నచ్చని, మనం తప్పకుండా చేయాల్సిన చాలా పనులు మన మెదడులో తిరుగుతుంటాయి.

వాటిని ఒక జాబితాగా రూపొందించడానికి ఇదే సరైన సమయం. అవి పూర్తి కాగానే వాటిని జాబితా నుంచి కొట్టివేయండి.

నచ్చని పనులను పూర్తిచేయడం వల్ల మనకు ఎంతో ఉల్లాసం లభిస్తుంది.

అవి పూర్తి చేయడం వల్ల మనసులో ఎంత భారం తగ్గుతుందో ఇక చెప్పనక్కర్లేదు.

వాటిని ఒక్కసారి ఎదుర్కుంటే... మిగతా పనులను పూర్తి చేయడం పెద్ద కష్టంగా అనిపించదు.

కాబట్టి ఆ పనులను పూర్తిచేసేందుకు ఒక జాబితా సిద్ధం చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)