పల్లాడియం: ‘కేజీఎఫ్ గనుల్లో బంగారం కన్నా విలువైన లోహం.. వెలికితీతపై త్వరలో నిర్ణయం’ - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయని.. వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని కోలారు జిల్లా ప్రజలకు తీపి కబురు అందిస్తుందని లోక్‌సభ సభ్యుడు ఎస్.మునిస్వామి చెప్పినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిజిఎంఎల్ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు.
''ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపినపుడు.. బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను పునః ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు'' అని తెలిపారు.
పల్లాడియం అంటే: ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతకే కరుగుతుంది. ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున అరుదైన లోహంగా గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా ప్రపంచ డిమాండుకు సరిపోవడం లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువే.

ఫొటో సోర్స్, @TelanganaCMO
తెలంగాణలో పండిన యాపిల్ పండ్లు
తెలంగాణలో తొలిసారి యాపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలి కాతను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారని వెలుగు పత్రిక రాసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు యాపిల్ మెక్కను, పండ్ల బుట్టను ఆ రైతు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం యాపిల్ పంటను సాగుచేశారు.
పంట సాగులో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఎంతో సహకారం అందించిందని రైతు తెలిపారు. సీఎం ప్రోత్సాహంతో ఆపిల్ సాగుపై మరింత దృష్టి పెడతానన్నారు.
ఈ సందర్భంగా బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణలో నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పేందుకు ఇక్కడ యాపిల్ పండ్లు పండటమే ఉదాహరణ అన్నారు.

ఫొటో సోర్స్, facebook
తిరుమలలో 11 నుంచి దర్శనం పున:ప్రారంభం
ఈనెల 11 నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని 'ఈనాడు' ప్రధాన కథనంగా రాసింది.
జూన్ 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలను ప్రారంభించాలని, అంటే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు దర్శనం అవకాశం కల్పించి, నిబంధనల అమలులో ఇబ్బందులను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 8 నుంచి దర్శనాలు ప్రారంభమైనా 11వ తేదీ నుంచే సామాన్యులకు దర్శనం వీలవుతుందని కూడా ఈ కథనం పేర్కొంది. కరోనా నిబంధనలకు సంబంధించిన ట్రయల్ రన్‌లా ఈ మూడు రోజుల దర్శనాలు ఉండబోతున్నాయి.
ఇక సర్వ దర్శనానికి ఆన్‌లైన్‌లోనే బుకింగ్ నిబంధనలు కూడా టీటీడీ అధికారులు తీసుకురాబోతున్నట్లు 'ఈనాడు' కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, @YSRCP
జగన్ దిల్లీ పర్యటన అందుకే వాయిదా పడిందా?
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడిందంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం ఇచ్చింది.
హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం సమావేశం కావాల్సి ఉంది. అయితే ఆయన తుపాను, లాక్‌డౌన్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, అందుకే జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనంలో ఉంది. అయితే ఇది కేవలం ఒక కారణం మాత్రమేనని, అపాయింట్‌మెంట్ రద్దు వెనక వేరే కారణాలు కూడా ఉన్నాయంటూ ఆ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం...ఏపీలో పరిణామాలపై కేంద్రం కాస్త సీరియస్‌గా ఉంది. రాష్ట్రం నుంచి బీజేపీ నేతలు అందిస్తున్న ఫీడ్‌బ్యాక్‌తో ఆ పార్టీ అధిష్టానం జగన్‌పై అసంతృప్తితో ఉంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో ముందున్నారని ఫిర్యాదు చేయడమే కాక, ఇటీవల నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారాన్ని కూడా నేతలు అధిష్టానానికి వివరించారు.
జగన్‌ను కలిస్తే రాష్ట్రంలో పార్టీకి ఇబ్బంది కలుగుతుందని రాష్ట్రనేతలు హస్తిన బీజేపీ నేతలకు ఇప్పటికే చెప్పారని పేర్కొంది. కేంద్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు, వైసీపీ ప్రభుత్వానికి తమ సహకారం బ్లాంక్ చెక్ కాదని సంకేతాలు ఇవ్వడానికే అపాయింట్‌మెంట్ రద్దు చేసినట్లు ఈ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్‌లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








