'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు', అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Rajesh arya
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
బాలికలు, యువతులు తమ కుటుంబ సభ్యుల చేతిలో దాడులకు గురి అవుతున్నారనే వార్తలు ఇటీవల కాలంలో భారత్‌లో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి.
బాలికలు, మహిళలకు సొంత ఇళ్లలోనే భద్రత ఉండటం లేదని ఈ ఘటనలు నొక్కి చెబుతున్నాయి.
గత వారం, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 17ఏళ్ల నేహా పాస్వాన్ జీన్స్ ధరించిందనే ఆగ్రహంతో దగ్గరి బంధువులు ఆమెను కొట్టి చంపారనే ఆరోపణలు వచ్చాయి.
నేహా తల్లి శకుంతలా దేవి బీబీసీ హిందీతో మాట్లాడారు.
‘‘నేహా వేసుకున్న దుస్తుల గురించి ఇంట్లో గొడవ జరిగింది. ఆమె తాతయ్య, బాబాయిలు కర్రలతో నేహాను బాగా కొట్టారు’’ అని ఆమె చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగా వెనబడిన జిల్లాల్లో ఒకటైన దేవరియాలోని సవ్రేజీ ఖార్గ్ వీరి సొంత ఊరు.
‘తను ఆ రోజంతా ఉపవాసంలో ఉంది. సాయంత్రం జీన్స్, టాప్ వేసుకుని పూజలో పాల్గొంది. ఆమె తాతయ్య, నాన్నమ్మలు దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్‌ను తయారు చేసింది ధరించడానికే అని, తాను కచ్చితంగా వాటిని వేసుకుని తీరతానని నేహా చెప్పింది’ అని శకుంతలా తెలిపారు. ఆ తర్వాత ఈ గొడవ పెద్దదైందని, చివరకు హింసకు దారి తీసిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Rajesh arya
ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు..కానీ
స్పృహ తప్పి నేల మీద పడిపోయిన నేహాను, ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు తన ఇంట్లో వారు చెప్పారని శకుంతలా వెల్లడించారు.
‘నన్ను వారితోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. నేను మా బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాను. వారు జిల్లా ఆసుపత్రికి వెళ్లి నేహ కోసం చూశారు. కానీ ఆమె ఎక్కడుందో ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం గండక్ నదిపై ఉన్న బ్రిడ్డికి ఓ అమ్మాయి మృతదేహం వేళాడుతోందని వారికి సమాచారం అందింది. వాళ్లు అక్కడికి చేరుకుని ఆ మృతదేహం నేహాదేనని గుర్తించారు’ అని శకుంతలా వివరించారు.
హత్యతోపాటు సాక్ష్యాధారాలను తారుమారు చేయడంపై పోలీసులు 10మందిపై కేసును నమోదు చేశారు. వీరిలో నేహా నానమ్మ, తాతయ్య, బాబాయిలు, చిన్నమ్మలు, సోదరులు, ఆటో డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనపై నిందితులు ఇంకా స్పందించడం లేదు.
నేహా నానమ్మ, తాతయ్య, బాబాయి, ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి శ్రీయాష్ త్రిపాఠి బీబీసీ హిందీతో చెప్పారు. మిగిలిన వారికి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేహా తండ్రి అమర్నాథ్ పంజాబ్‌లోని లూథియానాలో నిర్మాణ పనుల్లో కూలీగా పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆయన ఇంటికి తిరిగొచ్చారు. నేహాతో పాటు తన బిడ్డలను బడికి పంపేందుకు తాను కష్టపడి పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నేహా ఓ పోలీసు అధికారిణి కావాలనుకుంది అని శకుంతలా చెప్పారు. కానీ, ‘ఆమె కల ఇక ఎప్పటికీ నెరవేరదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకోవద్దని నేహాపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినట్లు శకుంతలా తెలిపారు. భారతీయ సంప్రదాయ దుస్తులు మినహా మరే ఇతర దుస్తులూ వేసుకోవద్దని ఆమెను గద్దించేవారని కూడా చెప్పారు.
నేహాకు మోడర్న్ దుస్తులు వేసుకోవడం అంటే ఇష్టం. ఆమె కుటుంబం బీబీసీకి ఇచ్చిన రెండు ఫోటోల్లో ఒకదానిలో పొడవాటి దుస్తులు వేసుకోగా.. మరోదానిలో జీన్స్, జాకెట్ ధరించింది.

ఫొటో సోర్స్, Rajesh arya
మహిళలు, బాలికలపై జరుగుతున్న గృహ హింసకు సమాజంలో బలంగా నాటుకున్న భావజాలమే కారణమని మహిళా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ పెద్దల్లో ఈ భావజాలం కనిపిస్తోందని వివరిస్తున్నారు.
భారత్‌లో కొడుకులు కావాలనే ఆంకాక్ష వల్ల బాలికలు పిండం దశ నుంచే ముప్పులు ఎదుర్కొంటున్నారు. గృహ హింస కూడా అధికంగా ఉంది. తక్కువ వరకట్నం తెచ్చారన్న కారణంతో సగటున రోజుకు 20 మంది మహిళలు హత్యకు గురవుతున్నారు.
చిన్నపట్టణాలు, గ్రామాల్లో నివసిస్తున్న మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలి? ఎలా నడుచుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? అనే విషయాలను గ్రామ పెద్దలు లేదా కుటుంబ పెద్దలే నిర్ణయిస్తున్నారు. వీటిలో ఏ తప్పులు దొర్లినా వారు విధించే శిక్షలను భరించాల్సివస్తోంది.
ఇలా అమ్మాయిలు, మహిళలపై సొంత కుటుంబీకులే దాడి చేస్తున్న ఘటనలు షాక్‌కు గురి చేస్తున్నాయి. నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు క్రూరమైన దాడిని ఎదుర్కొన్న నేహాలాంటి చాలా కేసులు నమోదు అవుతున్నాయి.
గత నెలలో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువతిని ఆమె తండ్రి, ముగ్గురు సోదరులు దారుణంగా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్తారింటి నుంచి పారిపోయి వచ్చినందుకే ఆమెను శిక్షిస్తున్నట్లు వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Rajesh arya
ఈ ఘటనకు వారం రోజుల ముందు పక్కనున్న ధర్ జిల్లాలోని వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న ఇద్దరు బాలికలను వారి కుటుంబ సభ్యులు కనికరం లేకుండా చావబాదారు. ఇద్దరిలో ఒకరిని జుట్టు పట్టుకుని లాక్కుంటూ వచ్చి, నేలపై పడేశారు. కాళ్లతో తన్నారు. కర్రలతో కొట్టారు.
ఈ దారుణమైన వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేశారు.
గత నెలలో గుజరాత్‌లో ఇలాంటి మరో సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడినందుకు ఇద్దరు యువతులను 15 మంది కుటుంబ సభ్యులు చావబాదారని పోలీసులు వెల్లడించారు.
‘జీన్స్ ధరించినందుకు, ఫోన్లో మాట్లాడినందుకు బాలికలపై దాడులు జరుగుతున్నాయి. హత్యలు చేయడం నిజంగా షాక్ కలిగించే విషయం’ అని జండర్ యాక్టివిస్టు రాలీ శివ్‌హరే ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Rajesh arya
భారత్‌ను వేధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పితృస్వామ్యం ఒకటని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు, లీడర్లు తరచూ మహిళల పట్ల చిన్నచూపుతో వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశాలు చేరుతున్నాయన్నారు.
‘ప్రభుత్వాలు బాలికలకే తమ ప్రాధాన్యమని చెబుతాయి. భారీ పథకాలను ప్రకటిస్తాయి. కానీ, కింది స్థాయిలో ఏమీ మార్పు రాదు’ అని శివ్‌హరే చెప్పుకొచ్చారు.
పాశ్చాత్య దేశాల్లో, సొంత కుటుంబం నుంచే ప్రమాదం ఉందని భావిస్తే పిల్లలు, మహిళలను ప్రత్యేక వసతి గృహాలకు తరలించే అవకాశం ఉంటుంది.
‘భారత్‌లో ఉన్న వసతి గృహాలు చాలా తక్కువ. వాటినీ సరిగా నడపడం లేదు. దాంతో ఎవరూ అక్కడికి వెళ్లి జీవించాలని అనుకోవడం లేదు. మన ప్రభుత్వం వీటికి నిధులను కేటాయించి, వాటి దీనావస్థను మార్చాలి’ అని శివ్‌హరే కోరారు.
‘కానీ ఈ సమస్యకు దీర్ఘకాల సమాధానం మాత్రం బాలికలకు వారి హక్కులపై అవగాహన కల్పించినప్పుడే లభిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'మా జీవితం మీ పోర్న్ సినిమా కాదు' అంటున్న దక్షిణ కొరియా స్పై కెమేరా బాధితులు
- చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన వీగర్లు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు
- తరుణ్ తేజ్‌పాల్ ఎవరు... బీజేపీ నేతలపై ఆయన ఎందుకు ఆరోపణలు చేశారు?
- రైతు నిరసనల్లో పాల్గొన్న యువతిపై అత్యాచారం, ఎవరు ఏం చెబుతున్నారు
- రేప్ చేసిన వారిని ఆమె క్షమించారు... తనలో కన్నీరు ఎప్పుడో ఇంకిపోయిందన్నారు
- ఆదివాసీ బాలిక, యువకుడిని కట్టేసి ఊరేగించారు.. అసలేం జరిగింది
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








