పిల్లలపై లైంగిక వేధింపులు: ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’

ఫొటో సోర్స్, Cecilia Tombesi
- రచయిత, మాటియస్ జిబెల్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
అత్యారానికి గురైన మహిళలు గర్భవతులైతే వారికి అబార్షన్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈక్వెడార్ కోర్టు ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పు ఆ దేశంలో అనేకమంది బాధితులకు ఊరటనిచ్చింది.
అయితే, ఈ తీర్పుకు ముందు అనేమంది అత్యాచార బాధితులు గర్భాన్ని తొలగించుకోలేక ఇబ్బందులు పడ్డారు. వీరిలో చాలామంది చిన్నవయసులో, అదీ సొంత బంధువుల చేతిలోనే అత్యాచారానికి గురయి గర్భవతులయ్యారు.
''ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు మా మొర వినలేదు'' అన్నారు సారిత. ఇది ఆమె అసలు పేరు కాదు. తన పేరు బయటపెట్టొద్దన్న ఒప్పందంతో బీబీసీకి 40 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు సారిత.
ఈక్వెడార్‌లో బాలికలు తల్లులు కావడం కొత్త విషయం కాకపోయినా, ఇంత చిన్న వయసులో సారిత నలుగురు పిల్లల్ని సాకుతోందని తెలిస్తే ఆశ్చర్యం కలిగక మానదు.
ఆమె మొదటి సంతానం అత్యాచార ఫలితం కాగా, తర్వాత ఇద్దరు పిల్లలు తన విడిపోయిన భర్త వల్ల కలిగిన పిల్లలు. నాలుగో చిన్నారి అత్యాచార బాధితురాలైన తన చెల్లెలి సంతానం.
సారిత వయసు 25 ఏళ్లలోపే ఉంటుంది. కానీ, పదేళ్ల వయసులో సవతి తండ్రి అత్యాచారం చేసినప్పుడే ఆమె తనలోని పసితనాన్ని కోల్పోయారు.
''ఇప్పుడు నేను పెద్దగా అయ్యాను. కానీ, నాకు ఇప్పటికీ చీకటంటే భయం'' అన్నారు సారిత.

ఫొటో సోర్స్, MATIAS ZIBELL/BBC
ఆ చీకటి సాక్షిగా
''ఆయన నన్ను పట్టుకుని అత్యాచారం చేయబోయినప్పుడు నేను వద్దు వద్దు అని అరుస్తూ విడిపించుకుని ఎటు వెళుతున్నానో కూడా తెలియకుండా చీకటిలోకి పారిపోయాను. కానీ, నన్ను పట్టుకున్నారు'' అన్నారామె.
ఏప్రిల్ 28న, ఈక్వెడార్ న్యాయస్థానం అత్యాచారం కేసులలో గర్భస్రావాన్ని సమర్థించింది. బాధితులు మానసిక వికలాంగులైతే తప్ప గర్భస్రావం చేయరాదని అప్పటి వరకు ఉన్న చట్టాలు చెబుతున్నాయి.
ఈ తీర్పు ఈక్వెడార్‌లో గర్భవిచ్ఛిత్తి వ్యతిరేకులు, అనుకూలుర మధ్య ఘర్షణగా మారింది. తీర్పు వెలువడటానికి ముందు డజన్ల సంఖ్యలో మహిళలు కోర్టు వద్దకు చేరుకున్నారు. తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
ఈక్వెడార్‌లోని చిన్నారులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తరచూ అత్యాచారాలకు గురవుతుంటారు. నిందితులు సాధారణంగా తండ్రి, సవతి తండ్రి, తాత, మేనమామ, సోదరుడు...ఇలా దగ్గరి వారే అయ్యుంటారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
''వారి శరీరంలో మార్పు వస్తోందని చాలామందికి తెలియదు. పిండం బాగా అభివృద్ధి చెందే వరకు వారు దీన్ని గ్రహించలేరు'' అని మహిళల సంతాన హక్కులపై ఉద్యమించే న్యాయవాది అనా వెరా బీబీసీతో అన్నారు.
కొత్త చట్టం ప్రకారం ఒక మహిళకు గర్భస్రావం చేయాలా వద్దా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది.
''నేను గర్భందాల్చానని నాకు తెలియలేదు. నా బొడ్డు పెరుగుతోంది, కానీ అది ఎందుకో అర్ధం కాలేదు'' అన్నారు సారిత.
ప్రసవించిన తరువాత, ఆమె తన కూతురిని వంతెన కింద వదిలేశారు. కానీ, ఎవరూ తీసుకెళ్లక పోవడంతో తిరిగి తెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, EPA
నూటికి 65 మంది
ఈక్వెడార్‌లో ప్రతి 100 మంది మహిళల్లో 65మంది ఏదో ఒక రకమైన హింసకు గురవుతున్నట్లు కుటుంబ సంబంధాలు, మహిళలపై జరిగే హింసపై 2019లో నిర్వహించిన జాతీయ సర్వే వెల్లడించింది.
ఇందులో 32.7% మంది లైంగిక హింసకు గురయ్యారు. ''ఇది ఇంకా చాలా తక్కువ''అన్నారు అనా వెరా. న్యాయ వ్యవస్థ నిస్తేజంగా ఉండటం వల్ల చాలామంది తమపై జరిగిన దాడులను చెప్పుకోలేదని ఆమె అన్నారు.
రేపిస్టులు తమ ఇంట్లోని వాళ్లు, బంధువులే కాబట్టి సారిత లాంటి వాళ్లు ఫిర్యాదు కూడా చేయరు. ఇక్కడ వారు దగ్గరి బంధువు కావడం ఒక అంశమైతే, రెండోది నిందితుడు ఆ ఇంటిని పోషించేవాడు కూడా కావడం మరో అడ్డంకి.
''నా తల్లి మౌనంగా ఉండటానికి ప్రాధాన్యమిచ్చారు'' అన్నారు సారిత. పైగా తననే తప్పుబట్టారని కూడా సారిత వెల్లడించారు. ''మా అమ్మ కూడా ఇలాంటి వేధింపులకు బలైన వ్యక్తే'' అని ఇంటర్వ్యూలో వెల్లడించారు సారిత.
ఎంత మంది మైనర్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారో తెలుసుకోవటానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ సెన్సస్( ఐఎన్ఈసీ) జనన రిజిస్ట్రీని పరిశీలించాల్సి ఉంటుందని 'ది ఇన్విజిబుల్ గర్ల్స్ ఆఫ్ ఈక్వెడార్'' రిపోర్ట్ రూపకర్త అనా అకోస్టా అన్నారు.
'ఇది తల్లి వయస్సు ప్రకారం పిల్లల జననాలను నమోదు చేసే రిజిస్ట్రీ. 14 ఏళ్ల లోపు పిల్లలు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ఈక్వెడార్‌లో చట్ట విరుద్ధం. అలాంటి వారు గర్భాన్ని దాల్చితే దాన్ని తొలగించుకునే మార్గం లేదు'' అన్నారు అకోస్టా.
2020 సంవత్సరంలో ఈక్వెడార్‌లో పదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు బాలికల్లో సంతానాన్ని కన్నవారు రోజుకు నలుగురు చొప్పును నమోదైనట్లు తేలింది.
రహస్యంగా గర్భస్రావం చేయించుకున్నవారు, ఆరోగ్య కారణాల వల్ల గర్భాన్ని పోగొట్టుకున్న వారిని ఇందులో చేర్చలేదు.
కౌమార దశలో ఉన్న బాలికలు గత దశాబ్దంలో 21,165 మందిని ప్రసవించగా, గత సంవత్సరంలోనే అతి తక్కువ మంది ఇలాంటివారు ప్రసవించారు.
అయితే, బాధితులు, నిందితులు ఒకేచోట ఉండటానికి మహమ్మారి అవకాశం కల్పించింది. దీనికితోడు ఈక్వెడార్ ప్రభుత్వం మైనర్లలో గర్భధారణ నివారణ పథకాలకు స్వస్తి పలకడంలో 2021లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ఏడాది గణాంకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, RODRIGO BUENDIA/AFP VIA GETTY IMAGES
అయినవాళ్ల అఘాయిత్యాలు
సారితపై మొదటిసారి అత్యాచారం జరిగినప్పుడు ఆమె వయసు 10 ఏళ్లు. పదమూడో ఏట ఆమె తొలిసారి ప్రసవించారు.
కానీ, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని ఆమె తన 7వ ఏటనే గ్రహించారు. ఆమె మారు తండ్రి ఆమె సోదరి ఒకరిని వేధింపులకు గురి చేయడం సారిత స్వయంగా చూశారు.
''నాకు అప్పుడే తెలిసింది. కానీ, పిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను త్వరగా మర్చిపోతాం. కానీ, నాకు కూడా అలాగే జరిగిప్పుడు బాధితుల బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది'' అన్నారు సారిత.
కానీ, సారిత తల్లిదండ్రులు విడిపోవడానికి ఇది కారణం కాదు. ఆమె తల్లి అప్పటికే భర్త నుంచి వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు.
భర్త వేధింపులను తాళ లేక సారిత తల్లి అతనితో విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలను తన దగ్గర ఉండేలా, ఒక కొడుకు, మరో కూతురు భర్త దగ్గర ఉండేలా ఒప్పందం కుదిరింది.
తర్వాత సారిత తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే, సారిత సవతి తండ్రి ఆ ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడి గర్భవతులను చేశాడు.
''మేం నాన్నా అని అతన్ని పిలుస్తాం. కానీ, అతను అలా చేయడం సరికాదు'' అన్నారు సారిత.

ఫొటో సోర్స్, MATIAS ZIBELL/BBC
వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?
లైంగిక నేరాలు, చిన్న వయసులో బాలికలు తల్లులు కావడానికి కారణమని తెలిసినప్పటికీ, బలాత్కారాలపై పెద్దగా పరిశోధన జరగలేదని, ఈక్వెడార్‌లో దీనిని పెద్ద నేరంగా పరిగణించకపోవడమే కారణమని ''బాడీస్ దట్ డు మ్యాటర్'' పరిశోధనకర్త, సైకాలజిస్ట్ ఫెర్నాండా పోరాస్ అన్నారు.
బాలికలు, మహిళలపై హింస కేసులను చాలా తక్కువగా చూపిస్తున్నారని న్యాయవాది అనా వెరా అభిప్రాయ పడ్డారు.
కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంట్లోనే పరిష్కరించుకోవాల్సిన సమస్యగా భావిస్తారని, మరికొన్ని చోట్ల నిందితులపై బాధితుల తల్లులు ఆర్ధికంగా, మానసికంగా ఆధారపడి ఉన్నందున దీనిని సీరియస్‌గా తీసుకోరన్న అభిప్రాయం ఉంది.
సారిత, ఆమె ఇద్దరు అక్కచెల్లెళ్లు, మరో బంధువుకు అన్యాయం జరిగినట్లు ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇటు న్యాయవ్యవస్థ కూడా గుర్తించ లేకపోవడం దారుణమని న్యాయవాది అనా వెరా ఆవేదన వ్యక్తం చేశారు.
మైనర్లను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని రక్షించడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని ఆమె అన్నారు.
చట్టాలు ఉన్నా..
అంతర్జాతీయ చర్చలు, ఒప్పందాలపై సంతకాలు చేయడంతో దేశంలో మహిళలు, బాలికలపై అన్ని రకాల హింసలను అంతం చేయడానికి ఈక్వెడార్ 40 ఏళ్ల కిందట చర్యలు ప్రారంభించింది.
మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి హింసను కఠినంగా అదుపు చేయాలన్నది దేశ పాలనా విధానంగా నిర్ణయిస్తూ 2007లో ఒక డిక్రీని జారీ చేశారు. 11 సంవత్సరాల తర్వాత దాన్ని చట్టం మార్చారు.
ఇంత జరిగినా, మహిళలపై జరిగే ఇలాంటి లైంగిక నేరాలలో వెనెజ్వెలా తర్వాత ఈక్వెడార్ రెండో స్థానంలో ఉందని తేలింది. సంవత్సరాలు గడుస్తున్నా బాలికల్లో సంతానోత్పత్తి రేటు తగ్గడం లేదు.

ఫొటో సోర్స్, RAFAEL RODRIGUEZ/NURPHOTO VIA GETTY IMAGES
ప్రభుత్వం మోయగలదా?
చిన్నతనంలోనే తల్లులైన వారిని, వారి సంతానాన్ని పోషించే బాధ్యతను తామే తీసుకుంటామని 2021 ఏప్రిల్ 11న ఎన్నికైన కొత్త అధ్యక్షుడు గిలెర్మో లాసో ప్రకటించారు.
ఈక్వెడార్‌లో తల్లి కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారని, అలాంటి దేశంలో గర్భవిచ్ఛిత్తిని ఎంచుకోవడం చాలామందికి కష్టమైన పని అని న్యాయవాది అనా వెరా అన్నారు.
గర్భం తీసేయించుకోవడం ఇష్టంలేక కొనసాగించే వాళ్లు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరికి సాయపడటం ప్రభుత్వానికి కూడా కష్టమేనని మహిళా హక్కుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
గర్భస్రావం ఎప్పుడు?
పిల్లకు తల్లి అయిన తర్వాత సారిత చదువును కొనసాగించలేక పోయింది. ఇటీవలే ఆమె తొలిసారి బ్యాంకు ఖాతాను తెరవగలిగింది. తన విడిపోయిన భర్త నుంచి భృతి పొందడానికి ఆమెకు ఉన్న ఏకైక మార్గం అదే.
''నేను అబార్షన్ గురించి ఆలోచించ లేదు. అతన్ని వదిలించుకోవడం గురించి మాత్రమే ఆలోచించాను'' అన్నారు సారిత.
''అమ్మాయికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కొన్నిసార్లు అబార్షన్‌కు కుటుంబం ఇష్టపడదు. కొన్నిసార్లు అమ్మాయి ఇష్టపడదు. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకే వదిలేయాలి'' అన్నారు సారిత.
నగరాలలోనే న్యాయం
గ్రామీణ ప్రాంతాలలో న్యాయస్థానాలు ఎక్కువగా లేకపోవడం వల్ల ఇలాంటి వాటిపై న్యాయం కోరడం, తీర్పులను ఆశించడం కష్టమవుతుందని న్యాయవాది అనా వెరా అన్నారు.
కొన్నిచోట్ల ఫిర్యాదు చేయడం కూడా కష్టమేనని , ఒక్కోసారి ఊరి ప్రజలంతా ఫిర్యాదుదారును వెలివేసినట్లుగా చూస్తారని ఆమె తెలిపారు.
ఈక్వెడార్ గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలలో సిజేరియన్ ఆపరేషన్ చేసే సౌకర్యాలు కూడా లేవు.
’’మారుమూల ప్రాంతాలలో లింగ వివక్ష, సామాజిక అసమానత, జాత్యహంకారంలాంటి వన్నీ కలిసి పోయి బాధితులకు ఆరోగ్య సేవలు, న్యాయం అందకుండా చేస్తున్నాయి'' అని ఆంథ్రోపాలజిస్ట్ లిసెట్ కోబాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











