గర్భాశయంలో కణితులు: ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎవరెవరికి ముప్పు ఎక్కువ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిథాలీ వసావడా
- హోదా, బీబీసీ కోసం
మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి వచ్చే సమస్యల్లో ఎక్కువగా కనిపించేది గర్భాశయ కణితులు.
చాలాసార్లు ఈ కణితులు బయటకు ఎలాంటి లక్షణాలనూ చూపించవు. అందుకే వాటిని గుర్తించడం కూడా కష్టమవుతుంటుంది.
చాలా కేసుల్లో వేరే ఆరోగ్య సమస్య గురించి పరిశీలిస్తున్నప్పుడు ఈ కణితులు బయటపడుతుంటాయి.
దాదాపు ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి ఇలాంటి కణితుల సమస్యలు వస్తాయి.
ఈ కణితుల వల్ల రుతుస్రావం ఎక్కువగా కావడం, పొత్తి కడుపులో అదేపనిగా నొప్పి రావడం, రుతుక్రమం మధ్య తక్కువ వ్యవధి ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు కూడా నొప్పి అనిపించేలా ఈ కణితులు ఉంటుంటాయి.
నడుము నొప్పి, గర్భధారణ సమస్యలు, మిస్ క్యారేజ్ వంటి లక్షణాలు కూడా గర్భాశయ కణితులు ఉన్నవారిలో కనిపించొచ్చు.
కణితులు పెద్దగా ఉన్న కేసుల్లో మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి... పదే పదే మూత్రం వచ్చే సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా రావొచ్చు.
ఈ గర్భాశయ కణితులు ఏర్పటడానికి ప్రధాన కారణం స్త్రీల శరీరంలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్.
అందుకే మెనోపాజ్ దశ చేరుకున్న మహిళల్లో ఈ కణితులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి వస్తాయి?
30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారికి ఎక్కువగా ఈ గర్భాశయ కణితులు వస్తుంటాయి.
స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల శరీరాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి ఈ ముప్పు ఎక్కువ.
ఎప్పుడూ గర్భం ధరించని మహిళల్లోనూ ఇలాంటి కణితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
పరిమాణంలో ఈ కణితులు... వేరుశెనగ గింజ నుంచి పుచ్చకాయ సైజు వరకూ రకరకాల స్థాయిల్లో ఉంటుంటాయి. కణితి ఎంత పెద్దదైతే, దాని వల్ల కలిగే బాధ కూడా అంత ఎక్కువగా ఉంటుంది.
గర్భాశయంలో కణితి ఎక్కడ ఉందన్నదాన్ని బట్టి దాని రకాన్ని వైద్యులు వర్గీకరిస్తారు. ఎక్కువగా గర్భాశయ గోడల మధ్యలో ఇవి కనిపిస్తుంటాయి.
గర్భాశయ లోపలి గోడల్లో కణితి ఏర్పడినప్పుడు ఎక్కువగా రుతుస్రావం కావడం, మిస్ క్యారేజీ లాంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సార్లు గర్భాశయ బయటి గోడలపై కూడా కణితులు ఏర్పడుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏంటి?
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే, ఆరంభ దశలోనే ఈ కణితులను గుర్తించవచ్చు.
ఈ కణితులకు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి మందులతో కణితిని తగ్గించడం. రెండోది శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం.
ఒకవేళ బాధితులకు రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే, ముందుగా అనిమీయాకు (రక్త హీనత సమస్యకు) చికిత్స చేస్తారు.
రక్తస్రావం తక్కువగానే ఉంటే, మందులను సూచిస్తారు. ఎక్కువగా హార్మోన్‌లను నియంత్రించే ఔషధాలను వైద్యులు రాస్తారు.
కొందరు బాధితులు హార్మోన్ ఔషధాలు తీసుకునే స్థితిలో ఉండరు. అలాంటివారికి శస్త్ర చికిత్స చేయడం ఒక్కటే మార్గం.
శస్త్ర చికిత్సలు కూడా రెండు విధాలుగా ఉంటాయి. ఒకదానిలో కణితిని మాత్రమే తొలగిస్తారు. రెండో దానిలో మొత్తంగా గర్భాశయాన్నే తీసేస్తారు.
భవిష్యతులో గర్భం దాల్చాలనుకునేవారికి కణితిని తొలగించే శస్త్రచికిత్సే చేస్తారు.
మహిళల్లో గర్భాశయ కణితులు రావడం సాధారణమే. అందుకే, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముందుగా గుర్తిస్తే, దీన్ని సులభంగా నయం చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








