మహిళలకు బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉంటే ఆపరేషన్ చేసి గర్భాశయం తొలగించాల్సిందేనా... మరో మార్గం లేదా?

మహిళల్లో అధిక రక్త స్రావం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శైలజా చందు
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

“ఒక రెండు మూడు రోజుల్లో ఈ పరీక్షలన్నీ చేయించి సిద్ధంగా వుండండి. బుధవారం ఎడ్మిట్ అయితే, గురువారం ఆపరేషన్ చేసేద్దాం" అంటూ బెల్ కొట్టింది డాక్టరమ్మ.

నర్స్ వచ్చి, "రండమ్మా" అంటూ కన్సల్టేషన్ రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లింది. డాక్టర్ గారు చెప్పిన విషయం విన్నప్పటి నుండీ మణికి గుండె దడగా వుంది.

ఎన్నో అనుమానాలు, భయాలు.

“ఆపరేషన్ తప్పదా అమ్మా? వేరే మార్గం లేదా?” నర్సుని అడిగింది.

“చూడండీ. గురువారం లిస్ట్ లో, స్లాట్ దొరకడమే మీ అదృష్టం. ఈ హాస్పిటల్లో ఆపరేషన్ డేట్ ఇంత త్వరగా రావడం మొదటిసారి చూస్తున్నా. చాలామంది నెలల తరబడి వెయిటింగ్‌లిస్ట్‌లో వుంటారు. ఈ ఛాన్స్ వదులుకున్నారంటే మళ్ళీ ఆర్నెల్ల తర్వాతే. ఆలోచించుకోండి.”

"భయంగా వుందమ్మా. డాక్టర్‌గారిని మళ్లీ ఓ మాటడుగుతాను"

“ఓపీ చూశారా? ఎంతమంది వున్నారో. అవన్నీ ఇందాకే మాట్టాడాల్సింది”

"ఏమో, డాక్టర్‌గారి గదిలోకెళ్తే ఒక్క ముక్కా గుర్తురాలేదు”

అసలు తనకు ఆపరేషన్ అవసరమంటారన్న ఆలోచనే రాలేదు. ఏవో మందులిస్తారు, అవి కొనుక్కుని ఇంటికి వెళ్లడమే అనుకుందామె.

'ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎలా ? కొడుకు పరీక్షలు దగ్గర్లో వున్నాయి. ఆపరేషన్ అయ్యాక తను మూలన‌బడితే ఇల్లూ వాకిలీ ఎవరు సంబాళిస్తారు.

ఇంతకీ ఆపరేషన్ ఎందుకు? ఎంత త్వరగా చేయించాలి.

ఉద్యోగానికి ఎన్నిరోజులు సెలవు పెట్టాలి? ఆపరేషన్ పెద్దదా ? చిన్నదా?

చేయించుకోకపోతే ఏమవుతుంది?

చిన్నప్పట్నుండీ తనకెలాంటి అనారోగ్యం కూడా లేదు. అసలు ఆపరేషన్ అవసరమేనా?

ఎవర్నడగాలి?

డాక్టర్‌గారికి టైం లేదు.

హెవీ బ్లీడింగ్‌కు ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం లేదా ?'

ఆలోచిస్తూ ఇల్లు చేరింది.

అధిక రక్తస్రావం

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ అంటే మాటలా ?

ఇంటికెళ్లి విషయం భర్తకు చెప్పింది.

ఆపరేషన్ అవసరమంటున్నారని, నాలుగైదు రోజుల్లో డేట్ ఇచ్చారని.

“ఎల్లుండి హాస్పిటల్లో చేరి, ఆవలెల్లుండి ఆపరేషనంటే ఎట్టాగే?” అసహనంగా అరిచాడు.

“అంత అర్జంటా?”

“మందులతో పని కాదా?"

“వేరే మార్గమేమీ లేదా?”

భర్త ఏం అడుగుతున్నా, మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది.

“ఏంటే మాట్టాడవూ? డాక్టర్ గారిని అడగలేకపోయావూ?”

డాక్టర్‌ని అడగాలా?

చల్లని గది, తెల్లని గోడలు, ఇంకా తెల్లని డాక్టర్‌గారు. నోటికి తాళాలు పడిపోతాయి.

“పోనీ నర్సును అడ‌క్క‌పోయావా?”

పూజారికన్నా దేవుడే మెత్తన.

“మొగుడి మీద అరవమంటే అరుస్తావూ?”

ఆయనకు భయం వేసింది. ప్రతి చిన్న విషయానికీ భార్యే ధైర్యం చెప్పేది. ఇప్పుడామెకు ధైర్యం చెప్పడమెలాగో తెలియక, ఆమె మీదే అరిచాడు.

యూట్యూబుని దర్శించారు.

గూగుల్‌ని శోధించారు.

తెల్లారేసరికి అన్ని వ్యాధులూ ఆమెకే వున్నట్లనిపించింది.

ఇప్పుడా గర్భాశయాన్ని తీసెయ్యాల్సిందేనా?

తీసివెయ్యకుండా చికిత్స చేయలేమా?

ఎవరిని అడగాలి?

అధిక రక్తస్రావానికి ఆపరేషన్ అవసరం లేని చికిత్స అందుబాటులో ఉన్నాయి

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY

ఫొటో క్యాప్షన్, అధిక రక్తస్రావానికి ఆపరేషన్ అవసరం లేని చికిత్స అందుబాటులో ఉన్నాయి

గర్భాశయం

ఆ అవయవం ప్రాముఖ్యత ఏమిటి? దాని విధులేమిటి?

1. నెల నెలా ఋతుస్రావాన్ని బయటికి పంపించడం.

2. గర్భాన్ని తొమ్మిది నెలలపాటు కాపాడటం.

3. నెలలు నిండాక బిడ్డని కాన్పునొప్పులతో బయటికి పంపించడం.

ఇంత బాధ్యత గల అవయవంలో ఏదైనా మార్పు వస్తే తీసివెయ్యాల్సిందేనా?

ఎక్కువ బ్లీడింగ్ అవుతోందన్న ఫిర్యాదుతో ఎవరైనా స్త్రీ వచ్చినపుడు ఆమె నుండి వివరాలు సేకరించాలి.

ప్రతి స్త్రీ ఋతుక్రమం ఒకేలా వుండదు. కొన్ని భేదాలుంటాయి.

వ్యాధి వివరాలు సేకరించే క్రమంలో ఆ తేడాలు సహజమైనవే అని తేలినపుడు వాటికి చికిత్స అవసరం లేదు.

ఆమె శరీరాన్ని సమగ్రంగా పరీక్షించాలి. పరీక్ష చేసినపుడు, గర్భాశయం పరిమాణం సాధారణంగా వుండి, కాన్సర్‌వంటి ప్రమాదకరమైన వ్యాధి సూచనలేమీలేని పక్షంలో ఒకటి రెండు నెలల పాటు మందులు వాడడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చు.

ముఖ్యమైన రెండు ప్రాథమిక పరీక్షలు

1. అల్ట్రాసౌండ్ పరీక్ష: ఇదిపుడు సర్వసాధారణమైన పరీక్ష. ఇందులో గర్భాశయపు పరిమాణాన్ని, దానికి సంబంధించిన కణుతుల‌ని గమనించవచ్చు.

2. ఆఫీస్‌ హిస్టిరోస్కోపీ: ఇది ఔట్ పేషంట్ విభాగంలోనే నిర్వహించగలిగిన పరీక్ష. గర్భకోశపు లోపలి భాగాన్ని ,టెలిస్కోప్‌తో గమనించడం ద్వారా గర్భాశయపు లోపలి పొరల మందాన్ని అంచనా వేయగలం.

అంతే కాదు, గర్భ కోశంలో కణుతుల్నీ, కాయల వంటి పెరుగుదలనీ (Polyps) గుర్తించవచ్చు.

అధిక రక్తస్రావం

ఫొటో సోర్స్, NIRAJ GERA

ప్రత్యామ్నాయాలేంటి?

గర్భాశయపు పరిమాణం సాధారణంగానే ఉండి, లోపలి గోడలలో కూడా ఏ రకమైన కణుతులు లేని పక్షంలో ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయాలైన చికిత్సలు ఉన్నాయి.

1. మందుల వాడకం:

హార్మోన్లకు సంబంధంలేని మందులు. ఇవి పీరియడ్స్‌ సమయంలో వాడటం వల్ల 25% నుండి 50% వరకు రక్తస్రావాన్ని అరికట్టవచ్చు.

2. హార్మోన్‌ చికిత్స : గర్భ నిరోధక మాత్రలు

ఇవి ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించడమే కాకుండా, పీరియడ్స్‌ సమయంలో అధిక రక్తస్రావాన్ని, ఆ స‌మ‌యంలో వచ్చే నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

3. మిరీనా కాయిల్ ( LNG- IUS)

ఇది కాపర్ టీ వంటి సాధనం. బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే స్త్రీలలో , గర్భాశయంలో ఎటువంటి వ్యాధిలేనపుడు, కణుతులు 3 సెం.మీ.కన్నా తక్కువ సైజున్నపుడు, ఇది చాలా శక్తివంతంగా పని చేస్తుంది.

గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ వద్దనుకునే వారికి, ఇది చాలా ఉపయుక్తమైన పద్ధతి.

దీని నుండి విడుదల అయే ప్రొజెస్టోజెన్‌ అనే హార్మోన్‌ గర్భకోశపు లైనింగ్‌ మీద పని చేసి, ఋతుక్రమంలో అధిక రక్తస్రావాన్ని నిలుపు చేస్తుంది.

దీన్ని అమర్చడం కూడా చాలా తేలిక. డాక్టర్ త‌న క్లినిక్‌లో 5-10 నిముషాల వ్యవధిలో దీన్ని గర్భకోశంలో ప్రవేశపెడతారు.

అమర్చే సమయంలో మత్తు అవసరం లేదు.

ఇది అధిక రక్తస్రావాన్ని తగ్గించడమే కాకుండా, గర్భకోశపు కాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.

అంతేకాదు, సంతాన నిరోధకంగా కూడా పని చేస్తుంది.

ఒక సంవత్సరంలో బ్లీడింగ్ 97% తగ్గుదల కనిపిస్తుంది.

4. యుటిరైన్ ఆర్టెరీ ఎంబొలైజేషన్

గర్భాశయం పరిమాణం పెద్దదయినా, లేదా కణుతులున్నపుడు ( Fibroids), ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ముఖ్యమైనది యుటిరైన్ ఆర్టెరీ ఎంబొలైజేషన్.

ముందుగా స్త్రీ సంబంధిత వ్యాధి నిపుణులు మరియు రేడియాలజిస్ట్ కలసి పేషంట్ పరిస్థితి అంచనా వేసి, చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు.

ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, గర్భాశయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో ( Uterine artery ) కొన్ని సూక్ష్మ పదార్ధాలను పంపించి ఆ రక్తనాళాన్ని బ్లాక్‌ చేస్తారు. ఈ పద్ధతి చికిత్స వల్ల గర్భాశయంలోని కణుతులు కుచించుకుపోతాయి.

పీరియడ్స్‌ సమయంలో రక్తస్రావం బాగా తగ్గిపోతుంది. చికిత్సకు ఒకరోజు ముందు హాస్పిటల్లో ఎడ్మిట్‌ కావలసి వుంటుంది.

నిపుణులైన రేడియాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. ట్రీట్‌మెంట్‌ సమయంలో తక్కువస్థాయి మత్తు అవసరమవుతుంది.

గర్భాశయానికిరువైపులా వున్న రక్తనాళాలన‌న్నీ బ్లాక్‌ చేయడానికి సుమారు 30 నుంచి 90 నిముషాల టైమ్ పడుతుంది.

ఈ చికిత్స 45 సంవత్సరాల పైబ‌డిన‌ స్త్రీలలో మంచి ఫలితాలనిస్తుంది. దాదాపు 85% మహిళలలో రక్త స్రావం పూర్తిగా ఆగిపోతుంది.

5. ఎండోమెట్రియల్ఎబ్లేషన్

గర్భాశయపు లోపలి పొరను, లేదా లోపలి లైనింగ్‌ కణజాలాన్ని ఎండోమెట్రియం అంటారు. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఆ ప్రదేశం నుండే జరుగుతుంది.

ఈ ఎండోమెట్రియం పొరను తొలగించడాన్ని ఎండోమెట్రియల్ఎబ్లేషన్ అంటారు. ఈ చికిత్స వల్ల ఋతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది.

ఒకవేళ ఆపరేషన్‌ అవసరమైతే ఎలా?

కొన్ని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు పనికి రావు.

సర్జరీ తప్పనిసరి అవుతుంది. అలాంటపుడు కూడా బెంబేలెత్తవలసిన అవసరమే లేదు.

వైద్య శాస్త్రం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తోంది.

పేషంట్ల సౌకర్యమే లక్ష్యంగా మెరుగుపరచిన సర్జరీ విధానాలిపుడు అందుబాటులో వున్నాయి.

హిస్టిరోస్కోపిక్‌ సర్జరీ

గర్భాశయపు గోడలు నుండి వేలాడే కాయలవంటి కణజాలం ( polyps ) నుండి కూడా అధిక రక్త స్రావం అవుతూ ఉంటుంది. వీటిని కోత, కుట్టు అవసరం లేని హిస్టిరోస్కోపిక్‌ సర్జరీ ద్వారా తొలగించవచ్చు.

లాపరోస్కోపిక్‌ సర్జరీ

ప్రస్తుతం లాపరోస్కోపిక్‌ సర్జరీ ద్వారా హిస్టిరెక్టమీ చేస్తున్నారు.

అంటే గర్భాశయాన్ని తొలగించడానికి పొట్టకోయనవసరం లేదు. పొట్టలో మూడు, నాలుగు చిన్న చిన్న రంధ్రాల ద్వారా, టెలిస్కోప్‌, ఇంకా ఇతర పరికరాలు అమర్చి యుటిరస్‌ను తొలగించడం కూడా సాధ్యమే.

ఈ విధమైన సర్జరీ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఆపరేషన్ సమయంలో పేషంట్‌కు తక్కువ రక్తం పోతుంది.

హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు.

సర్జరీ తర్వాత రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లిపోవచ్చు.

సాధారణమైన సర్జరీతో పోలిస్తే నొప్పి తక్కువ.

శస్త్ర చికిత్స తర్వాత నెలల తరబడి విశ్రాంతి అవసరం లేదు.

త్వరగా ఉద్యోగ విధుల్లో చేరిపోవచ్చు.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి నేపథ్యం, పాత్రలు కల్పించబడినవి. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)