బోనులో మహిళా డాన్సర్లు: ‘జనం మా చుట్టూ చేరి రాబందుల్లా పొడుస్తుంటారు’

ఆర్కెస్ట్రా డాన్సర్లు

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI. KOILWAR

    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వాయిస్ రికార్డింగ్ గది చిన్నగా ఉంది. కొంతమంది మహిళలు నిలబడే ఉన్నారు. వాళ్లందరూ తమ కథ చెప్పుకోడానికి వచ్చారు.

వారి కథలు చదివి, విని ఎవరైనా తమను కాపాడ్డానికి వస్తారేమోనని వాళ్లంతా అనుకుంటున్నారు. వారిలో ఒక చిన్న ఆశ మిణుకుమిణుకుమంటోంది.

ముప్ఫైల చివర్లలో ఉన్న ఒక మహిళ అక్కడి అమ్మాయిలను పరిచయం చేశారు. వారంతా బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పార్టీల్లో ఒక ప్రత్యేక రకం ఆర్కెస్ట్రా బాండ్‌లో డాన్సులు చేస్తుంటారు.

పొట్ట కూటి కోసం డాన్సులు చేసే వారిపట్ల జనం చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు.

ఆ డాన్సర్లను జనం బలవంతంగా తాకుతుంటారు. ఎక్కడెక్కడో పట్టుకుంటారు. కొన్నిసార్లు వారిపై అత్యాచారం చేస్తుంటారు.

పెళ్లిళ్లలో జనం ఎక్కువగా గుమిగూడినపుడు కాల్పులు కూడా జరుగుతుంటాయి. ఆ ఫైరింగ్‌లో ఇలాంటి అమ్మాయిలు చనిపోయారనే వార్తలు అప్పుడప్పుడూ వస్తుంటాయి.

జూన్ 24న నలందాలో అలా ఒక వివాహ వేడుకలో కాల్పులు జరగడంతో స్వాతి అనే ఒక డాన్సర్ చనిపోయింది. బుల్లెట్ ఆమె తలలోంచి దూసుకెళ్లింది. ఒక మగ డాన్సర్‌ కూడా గాయపడ్డాడు.

ఆర్కెస్ట్రా డాన్సర్లు

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI. KOILWAR

మహిళా డ్యాన్సర్ల పరిస్థితి దయనీయం

కరోనా మహమ్మారి తమ పరిస్థితిని మరింత ఘోరంగా మార్చిందని ఈ అమ్మాయిలు చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల పని దొరకడం కూడా కష్టమైపోవడంతో ఇంటి అద్దెలు ఎలా కట్టాలని, కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు.

మరోదారిలేక కొంతమంది డాన్సర్లు వ్యభిచారంలోకి దిగాల్సి వస్తోందని ఆర్కెస్ట్రా బాండ్‌లో పాటలు పాడే రేఖా వర్మ చెప్పారు.

రేఖ జాతీయ కళాకారుల మహా సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆర్కెస్ట్రాలో పని చేసే పురుష, మహిళా కళాకారుల హక్కుల కోసం పోరాడటానికి ఆమె 2018లో ఈ సంఘం స్థాపించారు.

వీడియో క్యాప్షన్, అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

ఆ మహిళా డాన్సర్లలో ఒకరు తన కష్టాలు చెప్పుకుని కంటతడి పెట్టారు. కన్నీళ్లతో ఆమె ముఖం తడిచిపోయింది. ఆమె పెద్ద పెద్ద కళ్లలోని కాటుక చెంపలపై కారింది.

జుట్టుకు గోధుమ రంగు షేడ్, చేతికి సీతాకోక చిలుక టాటూ ఉన్న ఆ డాన్సర్ పేరు దివ్య. కానీ అది ఆమె అసలు పేరు కాదు. చనిపోయిన నటి దివ్య భారతి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెలా కావాలని కలలు కంటూ, తన పేరు దివ్య అని పెట్టుకున్నానని ఆమె చెప్పారు.

చుట్టూ జనం ఉండే ప్రదేశం లేదా స్టేజి మీద దివ్య డాన్స్ చేస్తారు. మద్యం మత్తులో చుట్టుముట్టిన మగాళ్ల మధ్య ఆమె డాన్స్ చేయాల్సుంటుంది. వాళ్లు మహిళా డాన్సర్ల ఛాతీపై చేతులు వేస్తుంటారు. రాళ్లు విసురుతుంటారు. ఒక్కోసారి డాన్సర్లకు తుపాకులు కూడా గురిపెడుతుంటారు.

ఆర్గెస్ట్రా గాయని రేఖా వర్మ

ఫొటో సోర్స్, CHINKI SINHA

ఫొటో క్యాప్షన్, ఆర్కెస్ట్రా గాయని రేఖా వర్మ

భర్త వేధింపుల నుంచి డాన్స్ స్టేజ్ వరకూ...

దివ్య బిహార్‌లోని పూర్ణియాలో పుట్టారు. చిన్న వయసులోనే ఆమె కుటుంబం పని కోసం పంజాబ్ వెళ్లిపోయింది. దివ్యకు 13ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేశారు. ఆమె భర్త డ్రైవర్. తరచూ ఆమెను కొట్టడం, బూతులు తిట్టడం చేసేవాడు. ఒక రోజు భర్త ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె కూతుళ్లను తీసుకుని పట్నా రైలెక్కేసింది.

ఆన్‌లైన్‌లో కలిసిన ఒక వ్యక్తి షూటింగ్‌లో పని ఇప్పిస్తానని ఆమెకు మాటిచ్చాడు. అతడు దివ్యను తన గర్ల్‌ఫ్రెండుతోపాటూ మీఠాపూర్‌లో ఒక ఫ్లాట్‌లో ఉంచాడు. స్టేజి షోలు, డాన్సులతో డబ్బు సంపాదించవచ్చని చెప్పాడు.

చివరికి దివ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో డాన్సులు చేసే బృందంలో చేరింది. ఇప్పుడు ఆమె వయసు 28 ఏళ్లు. ఏ స్థాయికి చేరుకోవాలని కలలు కందో, అది తనకు అందనంత ఎత్తులో ఉందనే విషయం ఆమెకు అర్థమైంది. కానీ పరిస్థితుల వల్ల డాన్స్ చేయడం తప్ప ఆమెకు వేరే దారి లేకుండా పోయింది.

బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో వివాహ వేడుకలు, పుట్టినరోజు పార్టీల్లో చిన్న చిన్న బట్టలేసుకున్న మహిళా డాన్సర్లు నృత్యాలు చేయడం మామూలే.

కానీ గత కొన్నేళ్లుగా స్టేజి మీద ఈ మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. డాన్స్ చూడ్డానికి వచ్చిన జనం వీరిని డాన్స్ ఫ్లోర్ మీద చెప్పరాని చోట బలవంతంగా పట్టుకుంటుంటారు.

తాము ఎలాంటి పరిస్థితుల్లో డాన్స్ చేస్తామో చెప్పిన దివ్య తన ఏడుపు ఆపుకోలేకపోయారు.

"అక్కడ మాకు ఎలాంటి మర్యాద ఉండదు. నేను ఇంకేం చెప్పలేను. దీనిలోకి దిగి నేను ఇరుక్కుపోయాను. నేను ఒక బోనులో డాన్స్ చేయాల్సి ఉంటుంది. దానిని ఊరేగింపులా మొత్తం ఊరంతా తిప్పుతారు. జనం మా వీడియోలు తీస్తుంటారు. మా పైన కుళ్లు జోకులేస్తుంటారు. మమ్మల్ని బూతులు తిడుతుంటారు. ఇదంతా నాకు అసహ్యంగా అనిపిస్తుంది" అని దివ్య తన ఆవేదన వ్యక్తం చేశారు.

డాన్సర్ చుట్టూ జనం

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI. KOILWAR

బోనులో నృత్యం, రాబందుల్లా జనం

ఈ అమ్మాయిలు డాన్స్ చేసే బోను ఒక చక్రాల ట్రాలీలా ఉంటుంది. మహిళా డాన్సర్లను జనం తాకకుండా ఉండడానికి అలాంటి బోన్లు ఏర్పాటు చేస్తారు.

డాన్సర్ల రక్షణ కోసమే అలా చేస్తామని ఆర్కెస్ట్రా బాండ్ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ అలా బోన్లలో డాన్స్ చేయడం ఆ మహిళలకు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

"ఎంత రక్షణ కోసమే అయినా బోను.. బోనే కదా" అన్నారు దివ్య.

స్టేజి మీద డాన్స్ చేస్తున్నప్పుడు ఏ ప్రపంచం కోసం తను కలలు కందో అందులోనే ఉన్నట్లు దివ్యకు అనిపిస్తుంది. కాస్తో, కూస్తో సినీ జీవితంలాగే ఉందిలే అనుకుంటుంది. కానీ ఆమె దృష్టిలో బోను, ఒక బోనే.

జూన్‌లో ఒక రోజు రాత్రి మెరిసే డ్రెస్‌లు వేసుకున్న ముగ్గురు అమ్మాయిలు అలాంటి ఒక బోనులో డాన్స్ చేస్తున్నారు. కొంతమంది మగాళ్లు దాన్ని చుట్టుముట్టి మొబైల్ ఫోన్లలో వీడియో తీస్తున్నారు. చక్రాల ట్రాలీ వివాహ వేదిక దగ్గరకు వెళ్తోంది.

అక్కడకు చేరుకునేలోపే ఆ ట్రాలీ చాలాసార్లు ఆగింది. లౌడ్ స్పీకర్‌లో గట్టిగా భోజ్‌పురి పాట వస్తోంది. ఆ బోనులో ఉన్న అమ్మాయిలు వెండి రెక్కల పక్షుల్లా కనిపిస్తున్నారు. ఆ ఆర్కెస్ట్రా బాండ్‌లో ఎలాంటి డాన్సులు చేస్తారో, అలాగే.. నడుము, శరీరం అంతా ఊపుతూ వాళ్లు డాన్స్ చేస్తున్నారు.

బిహార్‌లో ఒక బ్యాండ్

ఫొటో సోర్స్, CHINKI SINHA

మాజీ ఫొటో జర్నలిస్ట్ నీరజ్ ప్రియదర్శి కోయిలవర్(బిహార్)లో తన ఇంటి దగ్గరకు వచ్చిన ఆ ట్రాలీని చూస్తున్నారు. ఆ వాతావరణం మొత్తాన్నీ వీడియో తీసి, తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

చూస్తుండగానే అది వైరల్ అయ్యింది. చాలామంది ఈ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. అలా బోనులో డాన్స్ చేయించడం ఆ మహిళల గౌరవానికి భంగం కలిగించినట్లేనని చాలామంది కామెంట్లు పెట్టారు.

"మనం జంతువులతో కూడా అలా ప్రవర్తించం. నేను అలాంటి దృశ్యం అంతకు ముందెప్పుడూ చూడలేదు" అని నీరజ్ అన్నారు.

ఇనుప బోనుల్లో డాన్స్ చేస్తున్న తమ పరిస్థితి జూలో జంతువుల్లాగే అయిపోయిందని ఆ అమ్మాయిలు చెబుతున్నారు.

"మా పరిస్థితి జంతువుల కంటే ఘోరంగా ఉంది. జనం మమ్మల్ని వేటాడుతారు. అది డాన్స్ చేసే బోను కాదు" అన్నారు దివ్య.

వీడియో క్యాప్షన్, పగలు లాయర్లు.. రాత్రుళ్లు ‘డ్రాగ్’ డాన్సర్లు

పేదరికం నుంచి బయటపడ్డానికే డాన్స్

ఆకాంక్ష చెల్లెలికి ఒక డాన్స్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు తూటా తగిలింది. అది ఆమె తలను ఛిద్రం చేసుకుంటూ వెళ్లింది. అదృష్టవశాత్తు ఆమె బతికింది. ప్రమాదం నుంచి బయటపడినా ఆ ఘటనకు సంబంధించిన భయం మాత్రం ఆకాంక్షలో అలాగే ఉండిపోయింది.

"ఆకాంక్ష ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని చూశారు. కానీ పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు" అని ఆ ఆర్కెస్ట్రా యజమాని మనీష్ చెప్పారు.

ఆకాంక్ష ఆమె చెల్లెలు గత మూడేళ్లుగా బిహార్‌లోని ఆర్కెస్ట్రా బ్యాండ్ అనే ఒక గ్రూప్‌లో ఉన్నారు. అలాంటి డాన్స్ కార్యక్రమాల్లో అమ్మాయిలకు తూటాలు తగులుతాయని, వేధింపులు ఉంటాయని, డాన్సులు చూడ్డానికి వచ్చేవాళ్లు మద్యం మత్తులో తమను పట్టుకుంటారని వారికి అంతకు ముందే తెలుసు.

"అప్పుడప్పుడు తుపాకీ గురిపెట్టి డాన్సర్లపై అత్యాచారం కూడా చేస్తారని మేం విన్నాం" అని ఆకాంక్ష చెప్పారు.

కానీ ఈ అక్కచెల్లెళ్లకు వేరే దారి లేకుండాపోయింది. ఏడాది క్రితం వాళ్ల నాన్న చనిపోవడంతో వాళ్ల ముందు దారులన్నీ మూసుకుపోయాయి. వీరిద్దరూ గ్వాలియర్‌కు చెందినవారు.

డాన్సులు వేసే ట్రాలీ

ఫొటో సోర్స్, CHINKI SINHA

ఫొటో క్యాప్షన్, డాన్సులు వేసే ట్రాలీ

"అమ్మ ఇళ్లలో పనులు చేస్తుంది. కుటుంబం గడవడానికి వేరే ఆదాయం ఏం లేదు ఇక స్కూల్ ఫీజులు ఎక్కడ్నుంచి తెస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు వదిలేశాం" అని ఆకాంక్ష చెప్పారు.

ఆకాంక్ష ఒక డాన్స్ స్కూల్లో కాంటెంపరరీ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ ఏవైనా వేడుకల్లో డాన్స్ చేస్తే డబ్బులు కూడా వచ్చేవి. దాంతో ఆమె బిహార్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డాన్స్ స్కూల్ నడిపే వ్యక్తి ఆమెకు కోమల్ అనే మహిళను పరిచయం చేశాడు.

మంచి అవకాశాలు, డబ్బు వస్తాయని ఆకాంక్షకు చెప్పారు. మీరిద్దరూ మాతోపాటూ బిహార్ వస్తే టెలివిజన్ పెర్ఫామెన్స్, స్టేజ్ షోల కోసం ఆడిషన్స్ అవకాశాలు ఇప్పిస్తామని, సెలక్ట్ అయ్యాక డాన్సులు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు, గుర్తింపు వస్తుందని ఆశ పెట్టారు.

ఆకాంక్ష తల్లి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఉత్సాహం చూపించారు. ఆకాంక్ష వాళ్ల అమ్మకు ఒక మంచి ఇల్లు కట్టించాలనుకుంటోంది. మొదట వాళ్లు ఒక గుడిసెలో ఉండేవాళ్లు. ఇంటి కల నెరవేరడానికి చాలా కాలం పడుతుందని, త్వరగా డబ్బు సంపాదించి ఇల్లు కట్టాలని ఆమె డాన్సులు చేయడానికి సిద్ధమయ్యారు.

ఆర్కె్స్ట్రా నిర్వహించే ట్రాలీలు

ఫొటో సోర్స్, CHINKI SINHA

ఫొటో క్యాప్షన్, ఆర్కెస్ట్రా నిర్వహించే ట్రాలీలు

అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పట్నా వచ్చారు. కోమల్ వారిని పావాపూరీలో ఒక గదిలో ఉంచారు. మీరు డాన్స్ చేసి డబ్బు సంపాదించి ఇవ్వాలని చెప్పారు. ఏదైనా అత్యవసరం అయితేనే వాళ్లను ఆ గది నుంచి బయటకు వెళ్లనిచ్చేవారు.

ఆకాంక్ష, ఆమె చెల్లెలు కొన్ని గంటలపాటు డాన్స్ చేస్తే రోజుకు 1700 వచ్చేవి. వరసగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తే తమ పరిస్థితి కుదుటపడుతుందని అనుకున్నారు. కానీ ఆలోపే ఆకాంక్ష చెల్లెలికి బుల్లెట్ తగిలింది.

ఆర్కెస్ట్రా బ్యాండ్ చూడ్డానికి వచ్చిన వారు గాల్లో కాల్పులు జరుపుతున్నారు. కొందరు స్టేజి ఎక్కి అమ్మాయిలతో డాన్స్ చేస్తూ, వాళ్లను పట్టుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ తాము వాళ్లను మానేజ్ చేయగలమని అనిపించింది. కానీ, ఆలోపే జనం మధ్య గొడవ మొదలైంది. ఒకరిమీద ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఆ ఫైరింగ్‌లో ఆకాంక్ష చెల్లెలికి బుల్లెట్ తగిలింది.

ఆర్కెస్ట్రా డాన్సర్లు

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI. KOILWAR

పెట్టుబడిదారీ వాతావరణంలో కొత్త టెక్నాలజీలు రావడం, ఆ తర్వాత కరోనా వల్ల ఆర్కెస్ట్రా బాండ్‌లో పనిచేసే డాన్సర్ల పరిస్థితి దయనీయంగా మారిందని దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మున్నా కుమార్ అన్నారు.

"దోపిడీ ఇంతకు ముందు కూడా ఉంది. మహిళలు కళల ద్వారా బలం పుంజుకుని పైకి వస్తారని అనిపించింది. కానీ అలా జరగలేదు. ఈ డాన్సర్లు బలవంతంగా అన్నింటికీ రాజీ పడాల్సి వచ్చింది. అది భయానక విషయం" అన్నారు.

"ఈ మహిళలందరూ బలహీనమైన నేపథ్యం ఉన్నవారే. మొదటి నుంచి అలాంటి జీవితమే జీవిస్తుంటారు. అందులో ఎలాంటి గౌరవం ఉండదు. ఇప్పుడు నేను అలాంటి మహిళల రక్షణ కోసం, వారి హక్కుల కోసం ఒక సంఘం ఏర్పాటు చేశాను" అని పార్టీలు, పెళ్లిళ్లలో పాటలు పాడే రేఖా వర్మ చెప్పారు.

ప్రభుత్వం ఇలాంటి మహిళా కళాకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వదు. ఫలితంగా వారు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా భాగం కాలేకపోతున్నారు.

ఆర్గెస్ట్రా గాయని రేఖా వర్మ

ఫొటో సోర్స్, CHINKI SINHA

ఫొటో క్యాప్షన్, ఆర్కెస్ట్రా గాయని రేఖా వర్మ

తన కథ చెబుతున్నప్పుడు రేఖ స్వరం కంపిస్తుంది. జీవితంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్తున్నప్పుడు ఆమె గొంతు బొంగురుపోయింది. చిన్న వయసులో పోలీసు ఉద్యోగానికి జరిగిన పరీక్షలో ఆమె పాస్ అయ్యారు. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఫైనల్ సెలక్షన్స్‌ వరకూ వెళ్లలేకపోయారు.

పేదరికం కారణంగా ఆమె చివరికి ఆర్కెస్ట్రాలో చేరాల్సి వచ్చింది. మొదట ఆమె భజనల్లో, వివాహ వేడుకల్లో పాటలు పాడేవారు. బాగా పాడడం కోసం ఆమె ఒక గాయకుడి దగ్గర సంగీతం కూడా నేర్చుకోవాలనుకున్నారు. కానీ డబ్బు లేక అది కూడా సగంలోనే ఆగిపోయింది.

"మేం మా పాటలతో గాయకులకు, ఆ పాటలకు మరింత పాపులారిటీ తీసుకొస్తాం. లేదంటే వాళ్ల పేర్లు ఎవరికి తెలుస్తాయి. కానీ మేం ఎప్పటికీ తెర వెనుకనే ఉండిపోతాం" అన్నారు రేఖ.

వీడియో క్యాప్షన్, ఈ అంగోలా నృత్యం 'సెక్సీయెస్ట్‌ డాన్స్‌'గా ఎలా మారింది!

మానవ అక్రమ రవాణా

ఈ ఆర్కెస్ట్రా బాండ్స్‌లో పనిచేసే ఎక్కువమంది అమ్మాయిలు మానవ అక్రమ రవాణా బాధితులే. వీరందరినీ దేశంలోని వివిధ రాష్ట్రాలు, నేపాల్ నుంచి తీసుకువచ్చారు.

ఇలాంటి మహిళలను వారేదో తప్పు చేసినట్లు చూస్తారు. సమాజంలో కూడా వారిపట్ల చాలా చెడు అభిప్రాయం ఉంటుంది.

అందుకే అలాంటి డాన్సులు చేసే మహిళలు గుట్టుగా జీవిస్తుంటారు. వీరికి సమాజం నుంచి ఏమాత్రం మద్ధతు లభించదు. ఫలితంగా వారికి కూడా అన్ని సంస్థలపై నమ్మకం పోతోంది.

"ఇక్కడ సమస్య గౌరవమే. బిహార్‌లో ఆర్కెస్ట్రా బాండ్‌లు చట్టవిరుద్ధంగా పనిచేస్తుంటాయి. కొన్ని బాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవు. అక్కడ వినోదం కాదు వేరే జరుగుతుంది" అని జాతీయ కళాకారుల మహా సంఘం వ్యవస్థాపకుడు అఖ్‌లాక్ ఖాన్ అన్నారు.

"సమాజంలో ఈ అమ్మాయిల పట్ల ఉన్న భావన, అభిప్రాయాన్ని తుడిచేసేలా, వారి కోసం పోరాడ్డానికి ఎవరూ ముందుకు రారు. బాండ్ యజమానులు ఏం చేయరు. వాళ్లు వీరిని పీల్చి పిప్పిచేసి వదిలేస్తారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో వినోదం ముసుగులో ఇలాంటి కొన్ని వేల ఆర్కెస్ట్రాలు ఉన్నాయి. అవన్నీ మహిళల దోపిడీకి అడ్డాలుగా మారిపోయాయి" అని ఆయన చెప్పారు.

గత కొన్నేళ్ల నుంచి పెళ్లిళ్లు, పార్టీల్లో డాన్స్ చేయడానికి అమ్మాయిలను పిలిపించడం స్టేటస్ సింబల్‌లా మారిపోయిందని ప్రొఫెసర్ మున్నాకుమార్ పాండే అన్నారు.

"అలాంటి వేడుకల్లో గొడవలు జరుగుతాయి. అప్పుడప్పుడు కాల్పులూ చోటు చేసుకుంటాయి. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. కానీ పెళ్లిళ్లు, పార్టీల్లో మద్యం చాలా సులభంగా దొరుకుతుంది" అని చెప్పారు.

"ఈ మధ్య జనం స్క్రీన్ మీద లైంగికంగా రెచ్చగొట్టే దృశ్యాలు చూస్తున్నారు. అది ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అలాంటి దృశ్యాలు చూశాక ఆర్కెస్ట్రా బాండ్ లైవ్ పెర్ఫామెన్సులో కూడా జనం అలాంటి వాటి కోసం డిమాండ్ చేస్తారు" అని పాండే అన్నారు.

ఇలాంటి డాన్సర్లలో ఎక్కువ మంది అమ్మాయిలు మైనర్లే. వారికి డబ్బుల అవసరం ఉంటుంది. వాళ్లు శిక్షణ పొందిన డాన్సర్లు కూడా కారు.

దివ్యకు డాన్స్ తెలిసుండడం పెద్దగా ఉపయోగపడలేదు. అక్కడ అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుని డాన్స్ చేయాలని అంతా కోరుకుంటారు.

దివ్యకు అది నచ్చకపోయినా, ఆ రంగంలో తను కొన్నాళ్లే ఉండగలననే విషయం ఆమెకు తెలుసు. అప్పటివరకు ఆర్గనైజర్ దగ్గర పనిచేయాలని, అప్పుడే తను అద్దె చెల్లించగలనని, పిల్లల స్కూల్ ఫీజ్ కట్టగలనని ఆమెకు బాగా తెలుసు.

"మాకు డిమాండ్లు పెట్టే బలం కూడా లేకుండాపోయింది. జనం మా పైకి రాబందుల్లా వస్తుంటారు. మా బట్టల్ని కూడా చించేస్తుంటారు" అని తన బట్టలు సర్దుకుంటూ చెప్పారు దివ్య.

స్టేజి అయినా.. బోనులో ఉన్నా ప్రతి క్షణం అలాంటి వాళ్లు ఈ మహిళలను వేటాడుతూ, వేధిస్తూనే ఉంటారు. అదే వాళ్ల జీవితం. పంజరంలో ఉన్న ఒక పక్షి లాంటి జీవితం.

అయినా సరే.. దివ్య కలలు కంటూనే ఉంటారు. సినిమాలంటే తనకున్న ఇష్టంతో అన్నీ భరిస్తారు. ఎప్పుడైనా ఒక రాత్రి డాన్స్ ప్రోగ్రాంలో తన చుట్టూ రాబందులు కమ్ముకోగానే.. ఎవరిని ఇష్టపడి దివ్య అనే పేరు పెట్టుకున్నారో ఆ అందమైన ముఖాన్ని ఆమె గుర్తు చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)