‘చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చు’ – శాస్త్రవేత్తల పరిశోధనలో ఆధారాలు

వీర్య కణాలు

ఫొటో సోర్స్, Getty Images

'చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించొచ్చు. ఆ వీర్యంతో ఆరోగ్యంగా ఉండే పిల్లలను పుట్టించొచ్చు' అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ పరిశోధనలో కీలక ఆధారాలు లభించినట్లు కూడా వెల్లడించారు.

మనిషి చనిపోయిన 48 గంటల వరకూ అతడి శుక్రకణాల(స్పెర్మ్)ను గర్భధారణ కోసం ఉపయోగించవచ్చని, ఆ వీర్యంతో ఆరోగ్యంగా ఉన్న పిల్లలను పుట్టించవచ్చని ఆ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.

ఈ పరిశోధన 'జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్‌'లో కూడా ప్రచురితమైంది. మనిషి చనిపోయాక అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంక్‌లో నిల్వ చేయవచ్చని కూడా అందులో చెప్పారు.

ఈ పద్ధతిని నైతికంగా స్వీకరించాలని, అలా చేస్తే, స్పెర్మ్ బ్యాంకుల్లో నిల్వ చేసే శుక్రకణాల సంఖ్యను పెంచవచ్చని కూడా పరిశోధకులు అంటున్నారు.

చనిపోయిన తర్వాత పురుషుల నుంచి తీసిన వీర్యాన్ని దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా వారు కోరారు.

స్పెర్మ్ డొనేషన్‌కు సంబంధించి కఠిన చట్టాలు ఉండడం వల్ల స్పెర్మ్ బ్యాంకుల్లో శుక్రకణాల నిల్వ తగ్గిపోతున్న కొన్ని దేశాలకు ఈ పరిశోధన చాలా కీలకం అవుతుందని భావిస్తున్నారు.

చనిపోయిన 48 గంటల్లోపు రెండు పద్ధతుల ద్వారా శవం నుంచి వీర్యాన్ని తీయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొస్టేట్ గ్రంధి ఎలక్ట్రికల్ సిమ్యూలేషన్ ద్వారా, లేదా సర్జరీ ద్వారా మరణించిన వ్యక్తి నుంచి శుక్రకణాలు తీయొచ్చని వారు అంటున్నారు. ఇలా తీసిన వీర్యాన్ని నిల్వ కూడా చేయవచ్చని చెబుతున్నారు.

చనిపోయిన మనిషి వీర్యం

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని ముఖ్య ప్రశ్నలు

ఈ పరిశోధనలో ఇలా శుక్రకణాలను సేకరించే పద్ధతిని అవయవదానంలాగే భావించాలని బ్రిటన్ లాస్టర్ యూనివర్సిటీ డాక్టర్ నాథన్ హడ్సన్, మాంచెస్టర్‌లో ఉన్న ఒక ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ జాషువా పార్కర్ చెప్పారు.

"ఒక వ్యక్తి, వ్యాధులతో పోరాడుతున్న మరో వ్యక్తి బాధను దూరం చేయడానికి, వారి ప్రాణాలను కాపాడ్డానికి తన అవయవాలను దానం చేయడాన్ని నైతికంగా ఆమోదించినపుడు, ఇన్‌ఫెర్టిలిటీతో బాధపడుతున్న ఒక కుటుంబానికి సాయం చేయడానికి ఇలాంటి డొనేషన్ ఎందుకు ఇవ్వకూడదు" అని అన్నారు.

బేబీ

ఫొటో సోర్స్, BERNIE_PHOTO

అయితే దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయని వారు చెబుతున్నారు. అంటే "డోనర్ అంగీకారం, అతడి కుటుంబం అనుమతి ఎలా తీసుకుంటారు. వీర్యదాత గుర్తింపును రహస్యంగా ఎలా ఉంచుతారు" అని ప్రశ్నిస్తున్నారు.

దీనిగురించి వీర్యదానం చేసిన కొంతమందితో బీబీసీ మాట్లాడింది.

దీనివల్ల మరింత మంది పురుషులు స్పెర్మ్ డొనేషన్ గురించి ఆలోచిస్తారు అని లండన్‌లో ఉంటున్న జెఫ్రీ ఇంగోల్డ్ అనే మాజీ వీర్యదాత అన్నారు.

"స్పెర్మ్ డొనేషన్‌ను అవయవ దానంలాగే భావిస్తే, అందులో ఎలాంటి తప్పూ లేదు" అన్నారు.

చనిపోయిన మనిషి వీర్యం
ఫొటో క్యాప్షన్, స్పెర్మ్ డోనర్ జెఫ్రీ ఇంగోల్డ్

సంప్రదాయ ఆలోచనలకు సవాలు

"తన వంశాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో తాను ఎప్పుడూ వీర్యదానం చేయలేదని, దానివల్ల ఏదో ఒక కుటుంబం ప్రయోజనం పొందితే చాలని" అనుకున్నానని జెఫ్రీ చెప్పారు.

కానీ, 'చనిపోయిన తర్వాత వీర్యం తీసే ప్రక్రియను ఒక అడుగు వెనక్కు వేయడం లాంటిదే' అని కానీ షోఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ పేసీ అన్నారు.

మనం మన వనరులను "ఆరోగ్యంగా, ఇష్టపూర్వకంగా వీర్యదానం చేసే బలమైన యువకులను వెతకడానికి ఉపయోగిస్తే మంచిది అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)