అమ్మానాన్న చనిపోయాక నాలుగేళ్లకు ఈ బుజ్జిగాడు పుట్టాడు!

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో తల్లిదండ్రులు చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఒక శిశువు 'సరోగసీ' పద్ధతి ద్వారా జన్మించాడు.
కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) పద్ధతిలో సంతాన ప్రాప్తి కోసం ఒక జంట ఫలదీకరణ చెందిన అండాలను ఆస్పత్రిలో భద్రపరచుకొంది. 2013లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆ దంపతులు చనిపోయారు.
భద్రపరచిన ఓ పిండాన్ని ఆ జంట కుటుంబ సభ్యులు, సరోగసీ (అద్దె గర్భం) విధానం కింద ఒక మహిళ గర్భంలోకి మార్పించారు. ఈ విధానాన్ని ఉపయోగించి 2017 డిసెంబరులో శిశువును భూమి మీదకు తెచ్చారు.
శిశువు తల్లిదండ్రులు భద్రపరచిన కొన్ని పిండాలను సంబంధిత ఆస్పత్రి తమకు అప్పగించేలా వీరి తల్లిదండ్రులు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. కోర్టు నుంచి అనుమతి సాధించారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ వార్తను తొలిసారిగా 'ద బీజింగ్ న్యూస్' పత్రిక ప్రచురించింది. ఇలాంటి సమస్య ముందెన్నడూ తలెత్తలేదని, అందువల్ల దీని పరిష్కారానికి శిశువు అమ్మమ్మ, నాయనమ్మ, ఇద్దరు తాతలు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపింది.
జియాంగ్సు రాష్ట్రం నాన్‌జింగ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో ఈ పిండాలను భద్రపరిచారు. వీటిపై హక్కులు శిశువు తల్లి వైపు నుంచి ఇద్దరు, తండ్రి వైపు నుంచి ఇద్దరు- మొత్తం నలుగురికి ఉంటాయని కోర్టు ప్రకటించింది.
భద్రపరచిన పిండాలపై వారికి హక్కులు రావడంతోనే సమస్య పరిష్కారమైపోలేదు. వీటిని నిల్వ ఉంచేందుకు మరో ఆస్పత్రి సంసిద్ధత వ్యక్తంచేసిందని లేఖ సమర్పిస్తేనే నాన్‌జింగ్ నగరంలోని ఆస్పత్రి నుంచి వీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తామన్నారు.
భద్రపరిచిన పిండాల మార్పిడిపై చైనాలో నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి. దీంతో ఈ పిండాలను నిల్వ ఉంచుకొనేందుకు ఇతర ఆస్పత్రులు ముందుకు రాలేదు.
'సరోగసీ' చైనాలో చట్టవిరుద్ధం. దీంతో శిశువు అవ్వాతాతలు ఇతర దేశాల వైపు దృష్టి సారించారు. సరోగసీ సంబంధిత సేవలు అందించే ఒక ఏజెన్సీని సంప్రదించి, వారు ఆగ్నేయాసియా దేశం లావోస్‌ను ఎంచుకున్నారు. లావోస్‌లో 'కమర్షియల్ సరోగసీ' చట్టవిరుద్ధం కాదు.

ఫొటో సోర్స్, China Photos
చైనాలో ప్రసవం
పిండాన్ని భద్రపరచిన సీసాను విమానంలో లావోస్ తీసుకెళ్లేందుకు విమానయాన సంస్థలు అంగీకరించలేదు. దీంతో శిశువు నాయనమ్మ. తాతయలు సీసాను కారులో లావోస్‌కు తరలించారు.
లావోస్‌లో ఒక మహిళ అంగీకారంతో అద్దెగర్భంలో పిండాన్ని ఉంచారు. తర్వాత ఆ మహిళ టూరిస్టు వీసాపై లావోస్ నుంచి చైనా చేరుకుని, అక్కడ శిశువును ప్రసవించారు.
శిశువుకు టియాన్‌టియన్ అని పేరు పెట్టారు. ఈ శిశువు తమ మనవడేనని నిరూపించే క్రమంలో నాయనమ్మ, అమ్మమ్మ, ఇద్దరు తాతయ్యలు అవసరమైన డీఎన్‌ఏ పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. శిశువు తల్లిదండ్రులు ఇద్దరూ చైనా జాతీయులేనని కూడా వారు నిరూపించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








