15వ ఆర్థిక సంఘం: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా?

మోదీ, జైట్లీ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/gettyimages

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''అభివృద్ధి లక్ష్యాలను అందుకుంటున్న రాష్ట్రాలను జనాభా పేరుతో శిక్షిస్తారా? సమతుల్యత పాటించాల్సిన అవసరముంది. లేదంటే మున్ముందు అన్ని రాష్ట్రాలూ లక్ష్యాల సాధనను పక్కన పెడతాయి'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల దిల్లీలో విలేకరుల సమావేశంలోనూ, అంతకుముందు అమరావతిలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

''కేంద్రానికి మనం ఇస్తున్న పన్నుల్లో సగం కూడా తిరిగి మనకు రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మనం కష్టపడాల్సి వస్తోంది. ఇదేం సమాఖ్య?'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరం గురించి మాట్లాడుతూ ప్రశ్నించారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాల పంపిణీల్లో అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కేంద్రం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి పథంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తూ, ఉత్తరాది రాష్ట్రాలకు ఊతమిచ్చేదిలా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందంటూ అవి మండిపడుతున్నాయి.

ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా పన్నుల పంపిణీ విషయంలో కేంద్రం వైఖరి మీద నిరసన గళం విప్పారు. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ సైతం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

తాజాగా 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలు ఈ రాష్ట్రాల్లో నిరసన పెరగటానికి కారణమయ్యాయి. కేరళ ఆర్థికమంత్రి ఆహ్వానంతో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మంగళవారం తిరువనంతపురంలో భేటీ అయ్యారు.

అసలు 15వ ఆర్థిక సంఘం ఏమిటి? పన్నుల పంపిణీలో ఆ సంఘం పాత్ర ఏమిటి? దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహానికి కారణమేమిటి?

నంద కిశోర్ సింగ్

ఫొటో సోర్స్, facebook.com/nksingh.MP

ఫొటో క్యాప్షన్, నంద్ కిషోర్ సింగ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ఏమిటీ 15వ ఆర్థిక సంఘం?

కేంద్ర పన్ను ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తిలో పంచాలో నిర్ణయించే కీలక రాజ్యాంగ సంస్థ ఆర్థిక సంఘం. ఐదేళ్లకోసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం.. రాబోయే ఐదేళ్ల పాటు కేంద్ర పన్ను ఆదాయం నుంచి ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం కేంద్ర పన్ను ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. మిగిలిన 58 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవసరాలకు ఉపయోగిస్తుంది. రాష్ట్రాల వాటా అయిన 42 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలనేది ఆర్థిక సంఘమే నిర్ణయించి సిఫారసులు చేస్తుంది.

అలా.. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలుపెట్టి ఐదు ఆర్థిక సంవత్సరాల కోసం ఆర్థిక వ్యవహారాలపై సిఫారసులు చేయటానికి 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు నంద్ కిషోర్ సింగ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్‌లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఇది 2019 అక్టోబర్ నాటికి తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, gettyimages

దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం ఏమిటి?

కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే నిష్పత్తిని నిర్ణయించటానికి '15వ ఆర్థిక సంఘం 2011 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా ఉపయోగించుకోవాలి' అని విధివిధానాల్లో (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ - టీఓఆర్) పేర్కొనటం వివాదానికి మూలమైంది. ప్రధానంగా ఈ నిబంధన పట్ల దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

13వ ఆర్థిక సంఘం జనాభా సంఖ్యకు 25 శాతం వెయిటేజీ ఇచ్చింది. అయితే.. ఆ సంఘం ప్రాతిపదికగా తీసుకున్న జనాభా లెక్కలు 1971 నాటివి. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలనటం మీద వివాదం రేగుతోంది.

కేంద్ర పన్నుల పంపిణీలో 14వ ఆర్థిక సంఘం చేసిన కేటాయింపులను చూసినపుడు.. ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర పన్ను రూపంలో సగటున తాను చెల్లిస్తున్న ప్రతి రూపాయికీ తిరిగి పొందుతున్నది కేవలం 67 పైసలే కాగా.. ఉత్తరప్రదేశ్‌ చెల్లించే ప్రతి రూపాయి పన్నుకు గాను ఆ 1.79 రూపాయలను కేంద్ర నిధుల రూపంలో పొందుతోందని రాష్ట్ర ఆర్థిక రంగ నిపుణుడొకరు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నిటిదీ దాదాపు ఇదే పరిస్థితి.

15వ ఆర్థిక సంఘానికి చేసిన సూచనలు చూస్తే ఈ పరిస్థితి ఇంకా దిగజారుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

జనాభా లెక్కలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1971 నుంచి 2011 వరకూ రాష్ట్రాల వారీగా జనాభా పెరుగుదల రేటు.. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.

2011 జనాభా లెక్కలతో సమస్య ఏమిటి?

దేశంలో పార్లమెంటు స్థానాల సంఖ్య, కేంద్ర నిధుల పంపిణీ తదితర కీలకమైన లెక్కల కోసం.. అప్పటికి ప్రచురించిన తాజా జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలన్నది రాజ్యాంగంలో నిర్దేశించారు.

అయితే.. 1971 జనగణనలో దేశంలో జనాభా అనూహ్యంగా పెరుగుతున్నట్లు నమోదైంది. దీంతో జనాభా పెరుగుదలను నియంత్రించటానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుని కుటుంబ నియంత్రణ వంటి పథకాలను విస్తృతంగా అమలు చేశారు.

ఆ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాల్లో 1971 నుంచి జనాభా పెరుగుదల రేటు స్థిరంగా తగ్గుతూ వచ్చింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఆ స్థాయిలో తగ్గలేదు.

కానీ.. తాజా జనగణనల ప్రాతిపదికగా పార్లమెంటు స్థానాలు, కేంద్ర నిధుల పంపిణీ చేసినట్లయితే.. జనాభా పెరుగుదల నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళన వ్యక్తమైంది.

దీంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి.. జనాభా పెరుగుదల పథకాలను ప్రారంభించటానికి ముందున్న 1971 జనాభా గణాంకాలనే కీలకమైన లెక్కలకు ప్రాతిపదికగా 2001 జనగణన వరకూ కొనసాగించాలని స్థిరీకరించారు.

ఆ తర్వాత 84వ రాజ్యాంగ సవరణ ద్వారా.. 2026 తర్వాత చేపట్టే మొదటి జనగణన వరకూ 1971 గణాంకాలనే ప్రాతిపదికగా కొనసాగించాలని పొడిగించారు. అంటే.. 2031 జనాభా లెక్కల వరకూ 1971 జనాభా లెక్కలే కొనసాగాల్సి ఉంటుంది.

జనాభా పెరుగుదల రేటు

ఫొటో సోర్స్, census2011.co.in

ఫొటో క్యాప్షన్, జనాభా పెరుగుదల రేటు

1971 - 2011 మధ్య జనాభా పెరుగుదల ఎలా ఉంది?

దేశంలో 1971 నుంచి 2011 వరకూ రాష్ట్రాల వారీగా జనాభా పెరుగుదల రేటు.. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.

ఈ నాలుగు దశాబ్దాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగితే.. వాటితో పోలిస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో జనాభా పెరుగుదల నెమ్మదించింది. ఆంధ్రప్రదేశ్ (ఈ కాలంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉంది) జనాభా మాత్రం నాలుగున్నర కోట్ల నుంచి ఎనిమిదిన్నర కోట్లకు పెరిగింది.

1971 తర్వాత యూపీ జనాభా దశాబ్దానికి 25 శాతం రేటుతో స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 1970ల్లో 19.24 శాతంగా ఉన్న కేరళ జనాభా పెరుగుదల రేటు ఆ తర్వాతి రెండు దశాబ్దాల్లో వరుసగా 14.32 శాతానికి, 9.43 శాతానికి తగ్గిపోయింది.

2000వ సంవత్సరంలో యూపీ జనాభా పెరుగుదల రేటు 20 శాతం పైగా ఉంటే.. కేరళలో ఆ రేటు 5 శాతం లోపే ఉంది.

రైలు

ఫొటో సోర్స్, MONEY SHARMA/gettyimages

14వ ఆర్థిక సంఘం ఎలా లెక్కలు వేసింది?

రాజ్యాంగం ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ఇతర అంశాలు వేటినైనా ఆర్థిక సంఘానికి సూచించవచ్చు. కీలకమైన లెక్కల విషయంలో 1976లో నిర్ణయించిన మేరకు.. 1971 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఏడో ఆర్థిక సంఘానికి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అప్పటి నుంచి 13వ ఆర్థిక సంఘం వరకూ అదే ప్రాతిపదికగా కొనసాగింది.

కేంద్ర నిధుల పంపిణీ లెక్కల కోసం వెయిటేజీలో 13వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా లెక్కలకు 25 శాతం కేటాయించింది.

అయితే.. 2013లో ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం అందులో మార్పులు చేసింది. భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వై.వి.రెడ్డి సారథ్యంలోని 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫారసులు 2015 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. అవి 2019-2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ వర్తిస్తాయి.

ఆ కమిషన్.. నాలుగు దశాబ్దాల కిందటి జనాభా లెక్కల ఆధారంగా పూర్తి వెయిటేజీ ఇవ్వటం సరికాదని అభిప్రాయపడింది. 1971 జనాభా గణాంకాల వెయిటేజీని 17.5 శాతానికి తగ్గించింది. 2011 జనాభా లెక్కలకు 10 శాతం వెయిటేజీ ఇచ్చింది.

దానివల్ల తమిళనాడుకు 13వ ఆర్థిక సంఘం కేటాయింపుల నిష్పత్తితో పోలిస్తే 19 శాతం ఆదాయం.. అంటే దాదాపు రూ. 6,000 కోట్లు నష్టపోయిందని డాటా సైంటిస్ట్ నీలకంఠన్ ఆర్.ఎస్. 'ద వైర్'లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

కేరళ కూడా అలాగే నష్టపోతోందని అభిప్రాయపడ్డారు.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల వారీగా జనాభా పెరుగుదల రేటు

ఫొటో సోర్స్, Censusindia.gov.in

ఫొటో క్యాప్షన్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల వారీగా జనాభా పెరుగుదల రేటు

15వ ఆర్థిక సంఘం ఇస్తున్న వెయిటేజీ ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తూ 2017 నవంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని టీఓఆర్‌లో సూచించింది.

అయితే.. ఆర్థిక సంఘం పూర్తిగా రాష్ట్ర జనాభా సంఖ్య ప్రాతిపదికనే ఈ వాటాలను నిర్ణయించదు. జనాభా సంఖ్యకు కొంత వెయిటేజీ ఇస్తుంది. అలాగే.. తలసరి ఆదాయం, రాష్ట్ర విస్తీర్ణం, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలకూ వెయిటేజీ ఇస్తుంది.

అయినప్పటికీ.. కేవలం 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే.. తమిళనాడు 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్లో దాదాపు 70 శాతం ఆదాయాన్ని కోల్పోతుందని నీలకంఠన్ ‘వైర్’లో రాసిన వ్యాసంలో అంచనా వేశారు.

కేరళ కూడా ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం టీఓఆర్‌ వల్ల తమ రాష్ట్రం దాదాపు రూ. 80,000 కోట్లు నష్టపోతుందని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్‌ ఐజాక్‌.. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు సందర్భంగా పేర్కొన్నారు.

15వ ఆర్థిక సంఘానికి కేంద్రం చేసిన సూచనలు తమకు సమ్మతం కాదని, వాటిని కేంద్రం నిరంకుశంగా ఖరారు చేసిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆ సదస్సులో చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది?

జైట్లీ పోస్ట్

ఫొటో సోర్స్, facebook

అయితే.. 15వ ఆర్థిక సంఘం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అనవసర వివాదం చేస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం ఫేస్‌బుక్‌లో పోస్టు ద్వారానూ, ట్విటర్‌లోనూ వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల్లో ప్రజల పేదరికాన్ని అంచనా వేయటానికి జనాభా సంఖ్య, ఆదాయ వ్యత్యాసం అనే రెండు కీలకమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారని తెలిపారు.

అలాగే.. జనాభా నియంత్రణ కోసం కృషి చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సూచన కూడా టీఓఆర్‌లో ఉందని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి వివక్షా లేదని ఉద్ఘాటించారు.

మరోవైపు.. జనాభా లెక్కలే కాకుండా.. కేంద్ర పథకాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల వాటా నిష్పత్తిని 90:10 నుంచి 60:40 శాతానికి మార్చటాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రాలకు 30 శాతం ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరె గౌడ కూడా హాజరయ్యారు. ఈ భేటీకి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఆర్థికమంత్రులు గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో మే నెలలో విశాఖపట్నంలో సమావేశమై కేంద్ర ఆర్థికసంఘం విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించాలని, రాష్ట్రపతికి అందించే నివేదికను ఖరారు చేయాలని నిర్ణయించాయి. ఆ సమావేశానికి ఇతర రాష్ట్రాల వారినీ ఆహ్వానించాలని నిర్ణయించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)