ఆంటిగ్వా దగ్గర సముద్రంలో చెక్కుచెదరని 18వ శతాబ్దం నాటి నౌకా శకలాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, JEAN-SÉBASTIEN GUIBERT
- రచయిత, జెమ్మా హాండీ
- హోదా, ఇంగ్లిష్ హార్బర్, ఆంటిగ్వా
"31 ఏళ్ల డైవింగ్ కెరీర్‌లో నేను కనుగొన్నవాటిలో అత్యుత్తమైనది ఇదే"
200 ఏళ్లకు పైగా సముద్ర గర్భంలో ఉండిపోయిన పురాతన నౌక శకలాలను గుర్తించిన ప్రదేశం వైపు చూపిస్తూ మౌరీస్ బెల్‌గ్రేవ్ చెప్పారు.
చారిత్రక లంగర్లు, ఫిరంగులు, కాప్‌స్టాన్స్(నౌకలో మోకులు చుట్టే పరికరం)తో ఆంటిగ్వా నావల్ డాక్‌యార్డ్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
బ్రిటన్‌కు ఎంతో కీలకమైన చక్కెర ఉత్పత్తి చేసే దీవులను రక్షించే రాయల్ నావీ యుద్ధ నౌకలకు ఇది ఒకప్పుడు సురక్షితమైన ఓడరేవుగా కీలకపాత్ర పోషించిందనడానికి ఇదొక సాక్ష్యం.
ఈ రేవు చుట్టు ఉన్న మురికిగా కనిపించే సముద్ర జలాలు.. అమూల్యమైన రహస్యాలను ఎన్నో ఏళ్ల పాటు తమలో దాచుకున్నాయి.
కమర్షియల్ డైవరైన బెల్‌గ్రేవ్ అక్కడ సముద్ర గర్భంలో మట్టిలో కూరుకుపోయిన 18వ శతాబ్దానికి చెందిన పొగాకు తాగే పైపులు, ఫిరంగి గుండ్లు లాంటి చాలా వస్తువులు కనుగొన్నారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన "అసలైన చరిత్రలో ఎక్కువ భాగం నాకు సముద్రం అడుగున కనిపించింది" అన్నారు.
2013లో రోజూలాగే ఒక లంగరు గొలుసును శుభ్రం చేసే పనికోసం సముద్రం అడుగుకు వెళ్లిన ఆయన, ఇప్పటివరకూ గుర్తించిన అత్యద్భుత అన్వేషణల్లో ఒకటిగా భావిస్తున్న దానిని బయటపెట్టారు.
అవి 250 ఏళ్ల నాటి ఒక పురాతన నౌకకు సంబంధించిన చెక్కు చెదరని అవశేషాలు.
"నేను ఎప్పుడు కిందకు వెళ్లినా, నా చేతులతో మట్టిలో కలియబెట్టేవాడిని. ఆ రోజు నాకు అక్కడ కలప కనిపించింది. అవి ఒక పెద్ద నౌకకు సంబంధించిన అవశేషాలనే విషయం అర్థమైంది" అని ఆయన చెప్పారు.
ఆర్కియాలజిస్టులకు చెందిన ఒక బృందం నీటి లోపలికి వెళ్లి పరిశీలించిన తర్వాత, గత జూన్‌లో సముద్రం అడుగున 40 మీటర్ల పొడవున్న చెక్క నౌక ఉందని ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, GEMMA HANDY
భారీగా ఉన్న ఆ నౌక శకలాల సైజు కరిబియన్ దీవుల చుట్టూ దొరికిన మిగతా శకలాల కంటే భిన్నంగా ఉన్నాయి. చరిత్రకారులు ఆ నౌకను 1762 నాటి బ్యూమాంట్‌గా భావిస్తున్నారు. అంటే, అది ఒక ఫ్రెంచ్ వాణిజ్య నౌక.
ఆ తర్వాత దానిని కొనుగోలు చేసిన ఒక వ్యక్తి నౌక పేరును లియాన్ అని మార్చారు. ఇదే నౌకను అమెరికా విప్లవం సమయంలో జరిగిన యుద్ధంలో ఉపయోగించారు.
ఏటా కొన్ని వందల ప్రయాణాలు చేసిన ఈ భారీ నౌక సముద్రంలో మునిగి నీటి అడుక్కి చేరింది. దానిపై ఒక అడుగు ఎత్తు వరకు మట్టి పేరుకుపోయింది. దాంతో పడవ శిథిలాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఆర్కియాలజిస్టులకు అసలు సిసలైన టైమ్ కాప్స్యూల్ దొరికినట్లయింది.
బ్యూమాంట్ నౌక ఆ ప్రాంతంలో ఉండవచ్చని చరిత్రకారులు ఎప్పటి నుంచో సందేహిస్తున్నారు. 2013లో జరిగిన హైడ్రోగ్రాఫిక్ సర్వేతో ఆ వాదనలకు బలం చేకూరింది. కానీ సముద్రం అడుగున విజిబులిటీ సరిగా లేకపోవడంతో ఆ నౌకను గుర్తించలేకపోయారు.
ఫ్రెంచ్, మార్టినిక్యూ ప్రభుత్వాలతోపాటు అమెరికాలోని రిచర్డ్ లూన్స్‌బెరీ ఫౌండేషన్ ఇటీవల నిధులు అందించే వరకూ నౌకను గుర్తించిన చోట దానిని పరిశీలించాలనుకున్న నిపుణుల ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. నిధులు అందాక ఒక అంతర్జాతీయ నిపుణులు బృందం ఆ నౌకను పరిశీలించింది.

ఫొటో సోర్స్, GEMMA HANDY
ఈ నౌకను కనుగొనడం ఒక అద్భుతమైన చారిత్రక అన్వేషణ అని ఆంటిగ్వా యునెస్కో ప్రతినిధి డాక్టర్ రెగినాల్డ్ మర్ఫీ చెప్పారు.
"ఈ నౌక ప్రయాణాలు, దాని సైజు గురించి మనం చదివే ఉంటాం. కానీ ఆ నౌకను మనం దగ్గరగా చూసేవరకూ అది ఎంత పెద్దది, ఎంత బలమైనది అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది చరిత్రలోపలికి వెళ్లడానికి ఒక మార్గం లాంటిది" అని అన్నారు.
"మా దగ్గర ఆ కాలానికి చెందిన ఎన్నో భవనాలు, కళాఖండాలు ఉన్నాయి. కానీ దీనితో వాటిలో దేన్నీ పోల్చలేం. ఇది వాస్తవాలను స్పృశిస్తున్నట్లు ఉంది"
ఆరు రోజుల పాటు శిథిలాలను పరిశీలించిన తర్వాత ఆ నౌక కొలతలు 900 టన్నుల బ్యూమాంట్‌కు సరిగ్గా సరిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు.
"దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ ఇది నిజంగా బ్యూమాంట్ అయితే, ప్రపంచంలో ఇలాంటి నౌక శిథిలాలు ఇంకెక్కడా దొరకవు" అని ఆంటిగ్వాలోని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ క్రిస్టఫర్ వాటర్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, DIEPPE MUSEUM
బ్యూమాంట్ నౌకను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. తూర్పు ఆసియాలోని ఇంగ్లిష్, డచ్ వాణిజ్య సంస్థలతో పోటీ పడేలా 1664లో ఈ ఇంపీరియల్ వాణిజ్య సంస్థను స్థాపించారు.
అదే కాలంలో ఆ కంపెనీ నిర్మించిన మిగతా ఎన్నో నౌకల శిథిలాలు కూడా దొరికాయి. కానీ నౌక హల్(తేలే భాగం) చెక్కుచెదరకుండా ఉన్నది ఏదీ దొరకలేదు.
ఒక విధంగా దీని అన్వేషణను 'మేరీ రోజ్' (8వ కింగ్ హెన్రీ నౌకా దళంలోని యుద్ధ నౌక)తో పోల్చవచ్చు అని డాక్టర్ వాటర్స్ చెప్పారు.
"ఈ నౌక సైజు విషయానికి వస్తే మనం దాని గురించి కథలుగా చెప్పుకోవచ్చు" అన్నారు.
సముద్రం అడుగున ఉన్న ఈ నౌకను పరిశీలించిన బృందానికి మార్టినిక్యూలోని యూనివర్సిటీ ఆఫ్ యాంటిల్లె అసోసియేట్ ప్రొఫెసర్ జీన్ సెబాస్టియన్ గుల్బెర్ట్ నేతృత్వం వహించారు. నౌకను ఎలా కనుగొన్నారో ఆయన వర్ణించారు.
"హైటెక్ సోనార్ పరికరాలు, మాగ్నెటో మీటర్‌ను ఉపయోగించి నౌకను గుర్తించగానే, నిజంగా జాక్‌పాట్ కొట్టినట్టు అనిపించింది" అన్నారు.
ఆ ప్రాంతంలో పనిచేసిన 15 ఏళ్లలో తను కనుగొన్న అతిపెద్ద నౌకకు సంబంధించిన శకలాలు ఇవేనని గిల్బర్ట్ చెప్పారు.
"నౌకను దోచుకుని ఉండే అవకాశం ఉండడం వల్ల అందులో అపార నిధులేవైనా ఉండచ్చని పరిశోధనలు చేస్తున్న నిపుణులు అనుకోవడం లేదు. భారీగా ఉన్న శకలాలను పైకి తీసుకురావడం ఖర్చుతో, కష్టంతో కూడిన పని కావడంతో వీటిలో దేన్నీ పైకి కూడా తీసుకురావడం లేదు" అని డాక్టర్ వాటర్స్ చెప్పారు.
కానీ 18వ శతాబ్దంలో చెక్కతో నౌకా నిర్మాణం గురించి ఇది కొత్త విషయాలు చెబుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, GEMMA HANDY
భారీ సాయుధ వాణిజ్య నౌకలా కనిపించే బ్యూమాంట్‌ను ఫ్రాన్స్ నుంచి హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లో ప్రయాణించడానికి నిర్మించారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పతనం తర్వాత, ఇది ఫ్రెంచ్ నావికా దళానికి 1770 నుంచి 1772 వరకూ 56 ఫిరంగులున్న యుద్ధ నౌకగా సేవలు అందించింది.
తర్వాత, అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో 13 కాలనీలకు మద్దతిస్తూ హెచ్ఎంఎస్ మెయిడ్‌స్టోన్ దీనిని 1778లో స్వాధీనం చేసుకుంది.
"ఆ నౌకను ఇక్కడి వరకూ తీసుకొచ్చారని మాకు తెలుసు. తర్వాత దానికి ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ, అది అప్పటికే చాలా ఘోరంగా దెబ్బతింది. బహుశా, ఆ తర్వాత మళ్లీ రేవు వదిలి సముద్రంలోకి వెళ్లలేదు" అని డాక్టర్ వాటర్స్ చెప్పారు.
ఇది భారీ నౌక కావడంతో దీనిపై పరిశోధనలు కొనసాగించడానికి మరిన్ని నిధులు అవసరం అవుతున్నాయి.
కానీ పశ్చిమార్థగోళంలో పనిచేస్తున్న ఏకైక జార్జియన్ ఓడరేవుగా, ఆంటిగ్వా పర్యటక రంగానికి మూలస్తంభంగా ఈ ఓడరేవు ఘనతను ఈ నౌకా శకలాలు ఇప్పుడు మరింత పెంచాయి.
డైవర్ బెల్‌గ్రేవ్‌కు మాత్రం ఈ నౌక ఇంకా చాలా ఎక్కువని అనిపిస్తోంది.
చరిత్రకారులు 300 ఏళ్ల క్రితం ఈ ఓడ రేవును నిర్మించిన ఆఫ్రికా బానిసల కథలన్నింటినీ ఒకటిగా తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో ఈ నౌక శకలాల అన్వేషణ వారి వారసులకు ఎంతో ప్రత్యేకంగా మారింది.
"దీనిలో ఒక మధుర సంగీతం ఉంది. ఒక ఆఫ్రికావాసిగా ఇంత ముఖ్యమైన శకలాలను గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు బెల్ గ్రేవ్.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








