ఖుర్షద్‌బెన్ నౌరోజీ: బందిపోట్లకు అహింసను ప్రబోధించిన సంగీత విద్వాంసురాలు

ఖుర్షద్‌బెన్ నౌరోజీ

ఫొటో సోర్స్, KONSTANTINOS PSACHOS HOUSE ARCHIVE, HELLENIC FOLKL

ఫొటో క్యాప్షన్, ఖుర్షద్‌బెన్ నౌరోజీ

ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టి, ఆడంబరమైన జీవితం గడుపుతున్న మహిళ. బాగా పాడగల గొప్ప గాయని కూడా. కానీ, ఆమె తన కెరీర్‌ను వదులుకుని బందిపోట్లకు, కిడ్నాపర్లకు అహింసను బోధించారంటే.. మరో దేశంలో అయితే ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆమెపై అనేక అధ్యయనాలు జరిగి ఉండేవి.

కానీ భారతదేశంలో చాలామంది ఆమె పేరు కూడా విని ఉండరు. దేశం మరచిపోయిన ఆమె చరిత్ర గురించి చరిత్రకారులు దిన్యార్ పటేల్ అందిస్తున్న కథనం ఇది.

భారత దేశ ఆత్మ కథల ప్రపంచం "ఓ ఖాళీ బీరువా" అని రచయిత రామచంద్ర గుహ ఓసారి అన్నారు. ఎందుకోగానీ, భారతదేశంలో చాలామంది మేధావులు తమ జీవిత కథలు రాయకుండా దూరంగా ఉండిపోయారు.

రామచంద్ర గుహా విద్యార్థులు, సహోద్యోగులు కలిసి రాసిన ఓ కొత్త పుస్తకం ఆ ఖాళీ బీరువాను నింపే ప్రయత్నం చేస్తోంది. ఎంతోమంది గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసే మంచి ప్రయత్నమే ఈ పుస్తకం.

ఆ పుస్తకంలో చోటు సంపాదించిన వారిలో ఖుర్షద్‌బెన్ నౌరోజీ ఒకరు. 1894లో ఉన్నత స్థాయికి చెందిన పార్శీ కుటుంబంలో ఆమె జన్మించారు. ఖుర్షద్‌ బెన్ తాత దాదాభాయ్ నౌరోజీ భారత దేశానికి తొలి జాతీయవాద నాయకుడు, బ్రిటిష్ పార్లమెంట్‌లో పని చేసిన తొలి భారతీయుడు.

యవ్వనంలో ఆమె బొంబాయి (ఇప్పుడు ముంబయి)లోని ఓ ఖరీదైన బంగళాలో నివసించేవారు. సొప్రానో సింగర్‌ (హైపిచ్‌లో పాడే ఓ తరహా పాశ్చాత్య సంగీత శైలి)గా పేరు తెచ్చుకున్నారు.

బంధువులు,స్నేహితులు ఆమెను బుల్‌బుల్ (సంగీత వాయిద్యం)తో పోల్చేవారు. నైటింగేల్ అని పిలిచేవారు.

ఖుర్షద్‌బెన్ నౌరోజీ సంగీత కచేరీ ప్రకటన
ఫొటో క్యాప్షన్, ఖుర్షద్‌బెన్ నౌరోజీ సంగీత కచేరీకి జవహర్ లాల్ నెహ్రు హాజరయ్యారు

సంగీతం నేర్చుకునేందుకు విదేశాలకు

1920ల ప్రారంభంలో సంగీతాన్ని అభ్యసించేందుకు ఖుర్షద్‌బెన్ పారిస్ వెళ్లారు. కానీ, యూరోప్‌లోని భిన్న సంస్కృతిలో ఆమె నిలదొక్కుకోలేక పోయారు. అప్పుడే, ఎవా పామర్ సికెలనోస్ అనే మరో ప్రవాస మహిళతో పరిచయం ఏర్పడింది.

న్యూయార్క్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన సికెలనోస్, ఏథెన్స్‌లో సంప్రదాయ గ్రీకు సంస్కృతిలోని కళారూపాలను పునరుద్ధరించే ఆర్కిటెక్ట్‌గా స్థిరపడ్డారు.

వీరిద్దరి మధ్య భారతదేశ సంగీతం, గ్రీకు సంగీతంపై చర్చలు జోరుగా సాగేవి. ఫలితంగా ఏథెన్స్‌లో పాశ్చాత్యేతర సంగీత కళాశాలను ప్రారంభించారు.

తరువాత, ఖుర్షద్‌బెన్ పారిస్‌లో సంప్రదాయ సంగీతానికి స్వస్తి పలికి గ్రీస్ చేరుకున్నారు. అక్కడ భారతీయ చీరలు ధరించి, భారత సంగీత కచేరీలు నిర్వహిస్తూ పైకొచ్చారు.

ఆమె గ్రీకు దేశాన్ని "మదర్ గ్రీస్" అని సంబోధించే వారు. మదర్ గ్రీస్ ఆమెను మదర్ ఇండియాపై దృష్టి కేంద్రీకరించేందుకు ప్రేరేపించింది.

ఖుర్షద్‌బెన్ భారతదేశం గురించి ఎంతో ప్రేమగా మాట్లాడేవారని, బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జరుపుతున్న పోరాటంలో పాల్గొనాలని ఉవ్విళ్లూరేవారని సికెలనోస్ జీవితకథ రాసిన ఆర్టెమిస్ లియోంటిస్ తెలిపారు.

సికెలనోస్ తొలి 'డెల్ఫిక్ ఫెస్టివల్' నిర్వహణలో ఖుర్షద్‌బెన్ సహాయం కోరారు. కానీ, అందుకు ఆమె నిరాకరించి బొంబాయి తిరిగి వచ్చేశారు.

తరువాత ఆమె గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. గాంధీతో కలిసి పనిచేశారు. జాతీయ కార్యక్రమాల్లో మహిళల పాత్ర పెంచే దిశగా గాంధీని ప్రోత్సహించారు.

"గాంధేయ వాదం మహిళలను మేల్కొల్పిందని, వారు ఇకపై దారి మళ్లరని" ఖుర్షద్‌బెన్ ఓ వార్తాపత్రికతో అన్నారు.

1924లో ఏథెన్స్‌లో జరిగిన ఒక వేడుకలో ఖుర్షద్‌బెన్ (మధ్యలో ఎడమవైపు, ముదురు రంగు దుస్తుల్లో)

ఫొటో సోర్స్, KONSTANTINOS PSACHOS HOUSE ARCHIVE, HELLENIC FOLKL

ఫొటో క్యాప్షన్, 1924లో ఏథెన్స్‌లో జరిగిన ఒక వేడుకలో ఖుర్షద్‌బెన్ (మధ్యలో ఎడమవైపు, ముదురు రంగు దుస్తుల్లో)

నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌కు ప్రయాణం

స్వతంత్ర పోరాటంలో భాగంగా ఖుర్షద్‌బెన్ ఒక అసాధారణ ప్రదేశానికి మారవలసి వచ్చింది. నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) అని పిలిచే ఈ ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. దీన్నే ఖైబర్‌పఖ్తున్ఖ్వా అని పిలుస్తారు.

ఖుర్షద్‌బెన్ ఎప్పుడు, ఎందుకు ఈ ప్రాంతానికి వెళ్లారనే వివరాలు తెలియలేదుగానీ 1930లనాటికి ఆమె ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ రాజకీయాల్లో ప్రముఖురాలిగా మారారు.

'సరిహద్దు గాంధీ'గా పిలిచే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్‌తో ఆమెకు స్నేహం కుదిరింది. పష్తూన్ల అహింసాత్మక జాతీయవాద ఉద్యమానికి గఫర్ ఖాన్ నాయకత్వం వహించారు.

స్వతంత్ర పోరాటంలో భాగంగా ఖుర్షద్‌బెన్ అనేమార్లు జైలుకెళ్లారు.

ఓసారి, పెషావర్ జైల్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో కూర్చుని గాంధీకి ఉత్తరం రాస్తూ, "ఈ ఈగలు, నేను ఒకరికొకరు తోడుగా, వెచ్చగా ఉన్నాం" అని అన్నారు.

చట్టవిరుద్ధమైన రాజకీయ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 1931లో ఖుర్షద్‌బెన్‌‌ను అరెస్టు చేశారు
ఫొటో క్యాప్షన్, చట్టవిరుద్ధమైన రాజకీయ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 1931లో ఖుర్షద్‌బెన్‌‌ను అరెస్టు చేశారు

బందిపోట్లకు అహింసామార్గం బోధన

ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీలో ఉన్నప్పుడు ఖుర్షద్‌బెన్‌కు ఒక సంకట పరిస్థితి ఎదురైంది. ఆ ప్రాంతంలో హిందూ-ముస్లిం ఐక్యతను, భారత జాతీయ కాంగ్రెస్‌కు మద్దతును ప్రోత్సహించమని గాంధీ ఆమెను కోరారు. అయితే ఇది ఆమెకు అసాధ్యంగా తోచింది.

ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం బందిపోట్లు, దోపిడీ దొంగల ఊసు ఎత్తితేనే స్థానిక హిందూ సమాజం భయంతో వణికిపోతుంది.

ఈ బందిపోట్లు సమీప వజీరిస్తాన్ నుంచి వచ్చి అపహరణలు, దాడులు చేసేవారు. బ్రిటిష్ పోలీసులు, భారత పోలీసులు కూడా వీరికి భయపడేవారు. వీరి వల్ల మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగేవి.

ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించమంటే సాధ్యపడే పనిలా తోచలేదు.

ఖుర్షద్‌బెన్ దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ బందిపోట్లను కలుసుకుని, హింస, దోపిడి విడనాడే దిశగా ప్రోత్సహించి, గాంధేయ అహింసామార్గాన్ని ప్రబోధించడమే.

ఈ ఆలోచన విన్న కాంగ్రెస్ సహచరులు, ముఖ్యంగా పురుషులు అదిరిపడ్డారు. వాళ్లు ఎంత వారిస్తున్నా వినకుండా, 1940 చివర్లలో ఖుర్షద్‌బెన్ ఒంటరిగా, కాలి నడకన నిర్మానుష్యమైన దారుల గుండా ప్రయాణిస్తూ సుదీర్ఘ దూరాలు చేరుకోవడం ప్రారంభించారు. అక్కడి స్థానికులతో సమావేశమై, చర్చించడం మొదలుపెట్టారు.

అక్కడ ఉన్న మహిళలకు దోపిడి, దొంగతనం, హింస ఎంత చెడ్డవో చెప్పడం ప్రారంభించారు. వాటి వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. బందిపోట్ల తల్లులు, భార్యలు తమ కొడుకులను, భర్తలను ఆ పనులు చేయకుండా ఆపే దిశలో ప్రోత్సహించారు.

తమ శిబిరాల్లోకి చొచ్చుకొచ్చి తమకే వ్యతిరేకంగా ప్రబోధిస్తున్న ఈ మహిళను ఎలా ఆపాలో తెలియక బందిపోట్లు సతమతమయ్యారు. అయితే, కొందరు తాము చేస్తున్న పనికి పశ్చాత్తాపపడడం ప్రారంభించారు.

మరికొందరు ఆమెను ఎలాగైనా అక్కడ నుంచి పారదోలాలనే ప్రయత్నాలు చేశారు. కనీసం ఒక సందర్భంలో, తనపై కాల్పుల యత్నాలు జరిగాయని గాంధీకి రాసిన లేఖలో ఖుర్షద్‌బెన్ తెలిపారు.

"తుపాకీ గుళ్లు నా పక్క నుంచి దూసుకెళ్లి ఇసుకలో పడ్డాయి" అని రాశారు.

చివరకు ఆమె ప్రయత్నాలే ఫలించాయి. 1940 డిసెంబర్ నాటికల్లా అపహరణలు చాలావరకు తగ్గిపోయాయి. మత సామరస్యం పెరిగింది.

గతంలో ఆమెను జైలుపాలు చేసిన బ్రిటిష్ అధికారులు కూడా ఆమె పనిని మెచ్చుకున్నారు.

అయితే, మరో సవాలు మిగిలే ఉంది.

బందిపోట్లు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కొంతమంది హిందువులు వజీరిస్తాన్‌లోనే ఉండిపోయారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, అక్కడకు వెళ్లే ధైర్యం చేయవద్దని బ్రిటిష్ పోలీసులు వారించారు.

ప్రాణాపాయం ఉన్నా సరే, అక్కడకు వెళ్లాలనే ఖుర్షద్‌బెన్ నిశ్చయించుకున్నారు. అక్కడ తనను నిర్బంధిస్తే, విడిపించడానికి సొమ్ములు అడుగుతారని లేదా ఏ వేలో, చెవులో కోసి పంపిస్తారని ఆమె గాంధీకి చెప్పారు.

అయితే, ఆమె కిడ్నాపర్లను కలుసుకోలేకపోయారు. వజీరిస్తాన్ సరిహద్దులు దాటకముందే బ్రిటిష్ అధికారులు ఖుర్షద్‌బెన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

ఖుర్షద్‌బెన్ నౌరోజీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును విమర్శించిన గాంధీ
ఫొటో క్యాప్షన్, ఖుర్షద్‌బెన్ నౌరోజీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును విమర్శించిన గాంధీ

చరిత్ర నుంచి కనుమరుగు

1944 వరకు ఆమె ఒక జైలు నుంచి మరో జైలుకు వెళుతూనే ఉన్నారు. బొంబాయి నుంచి వచ్చిన ఈ ఉన్నత స్థాయి మహిళ బ్రిటిష్ వారికి కొరకరాని కొయ్యగా పరిణమించారు.

మళ్లీ ఖుర్షద్‌బెన్‌ ఎప్పుడూ ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీకి వెళ్లలేదు. 1947 ఆగస్ట్‌లో ఆ ప్రాంతం భారతదేశం నుంచి విడిపోవడం చూస్తూ బాధపడ్డారు. కొన్ని నెలల తరువాత గాంధీ చనిపోవడం చూశారు.

తరువాత ఖుర్షద్‌బెన్‌ జీవితం ఎలా సాగిందన్న దానిపై సమాచారం దాదాపు అదృశ్యమైందనే చెప్పాలి.

స్వతంత్రం తరువాత ఆమె వివిధ ప్రభుత్వ కమీషన్లలో పని చేశారు. మళ్లీ పాడడం కూడా ప్రారంభించారు. ఆమె చనిపోయేవరకు సంగీత సాధన కొనసాగించారు. బహుశా 1966లో ఆమె మరణించి ఉండవచ్చు.

ఖుర్షద్‌బెన్‌లాంటి ఎన్నో కథలు ఎవరికీ తెలీకుండా చరిత్రలో కలిసిపోయాయి. చెల్లాచెదురై, చెదలు పట్టిన పాత పుస్తకాల్లో తమ కథలు చెప్పేవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.

ముఖ్యంగా బయటకు రాని మహిళల కథలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్ర పోరాటంలో ఖుర్షద్‌బెన్‌తో పాటు చేసిన మహిళలు ఎందరో. వారి కథలేవీ మనకు తెలీవు.

భారతదేశ ఆత్మకథల ఖాళీ బీరువాల్లో వారికి చాలా జాగా ఉంది.

(దిన్యార్ పటేల్ ఒక రచయిత. ఈ మధ్యనే ఆయన కొత్త పుస్తకం 'దాదాభాయ్ నౌరోజీ: పయనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం'ను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)