డ్రాగన్ మ్యాన్: వెలుగులోకి వచ్చిన అతి ప్రాచీన మానవ జాతి పుర్రె

ఫొటో సోర్స్, Kai Geng
- రచయిత, పల్లవ్ ఘోష్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
ఇప్పటివరకు వెలుగుచూడని ఓ కొత్త మానవ జాతికి చెందిన పురాతన పుర్రెను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.
పురాతన మానవ జాతులైన నియాండెర్తాల్స్, హోమో ఎరెక్టస్‌తో దీనికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పుర్రె గల మనిషిని “డ్రాగన్ మ్యాన్”గా పిలుస్తున్నారు. 1,46,000 ఏళ్ల క్రితం తూర్పు ఆసియాలో ఈ జాతి జీవించినట్లు భావిస్తున్నారు.
ఈశాన్య చైనాలోని హెర్బిన్‌లో 1933లో ఈ పుర్రె బయటపడింది. అయితే, ఇది శాస్త్రవేత్తల దగ్గరకు వచ్చింది మాత్రం ఇటీవల కాలంలోనే.
ఈ పుర్రెపై జరిపిన అధ్యయన ఫలితాలు ద ఇన్నోవేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మానవ జాతి పరిణామక్రమంపై అధ్యయనం చేపడుతున్న ప్రముఖ పరిశోధకుల్లో ఒకరైన, లండన్‌లోని నేషనల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన ప్రొఫెసర్ క్రిస్ స్ట్రింగర్ కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.
‘‘ఇప్పటివరకు బయటపడిన శిలాజాల్లో ఇది చాలా ముఖ్యమైనది’’అని బీబీసీ న్యూస్‌తో క్రిస్ చెప్పారు.
‘‘ఇప్పుడు మనం చూస్తున్నది మానవుల్లో ఒక కొత్త జాతి. దీని నుంచి ఆధునిక మానవుడు పరిణామం చెందలేదు. అయితే, తూర్పు ఆసియాలో ఈ జాతి కొన్ని లక్షల ఏళ్లు మనుగడ సాగించింది. చివరగా ఇది అంతరించిపోయింది.’’

ఫొటో సోర్స్, Kai Geng
మానవ పరిణామక్రమ చరిత్రను తిరగరాసే శక్తి ఈ అధ్యయనానికి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పుర్రె నియాండెర్తాల్స్ కంటే హోమో సిపియెన్ జాతికి దగ్గరగా ఉందని వివరిస్తున్నారు.
ఈ జాతిని కొత్త జాతిగా పరిశోధకులు చెబుతున్నారు. దీనికి ‘‘హోమో లాంజై’’గా నామకరణం చేశారు.
‘‘మన జాతితో దగ్గర సంబంధాలున్న జాతిని మేం గుర్తించాం’’అని షిజియాఝువాంగ్‌లోని హెబేయి జీఈవో యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ షిజున్ నీ చెప్పారు.
‘‘ఇది ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత చక్కగా ఉండటాన్ని చూసి నమ్మలేకపోతున్నా. అన్ని వివరాలూ దీనిలో చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా ఓ అద్భుతం.’’
ఇతర మానవ జాతులతో పోలిస్తే, ఈ పుర్రె కాస్త పెద్దగా ఉంది. కానీ దీని మెదడు మాత్రం ఆధునిక మానవుడి మెదడు పరిమాణంలోనే ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘డ్రాగన్ మ్యాన్‌కు పెద్దపెద్ద కళ్లు, దట్టమైన కనుబొమ్మలు, పెద్ద నోరు, పెద్దపెద్ద దంతాలు ఉండేవని ఈ పుర్రె చెబుతోంది. ఇప్పటివరకు వెలుగుచూసిన అరుదైన పూర్తి పుర్రెల్లో ఇదీ ఒకటి’’అని హెబేయి జీఈవో యూనివర్సిటీ ప్రొఫెసర్ కియాంగ్ జీ చెప్పారు.

ఫొటో సోర్స్, KAI Geng
‘‘ఈ పుర్రెలో పురాతన, ఆధునిక రెండు మానవ జాతుల పోలికలూ కనిపిస్తున్నాయి. అందుకే మిగతా జాతుల కంటే దీన్ని భిన్నమైనదిగా గుర్తించాం.’’
ఈ డ్రాగన్ మ్యాన్ గట్టి శరీరం కలవాడని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, అతడి జీవన విధానం ఎలా ఉండేదో పరిశీలించేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. ఎందుకంటే ఈ పుర్రె సరిగ్గా ఎక్కడ దొరికిందో చూపించే ఆధారాలు లేవు.
అంటే ఆ మనిషి ఉపయోగించిన రాతి పనిముట్లు, ఇతర వస్తువులు లాంటి వాటిని పరిశీలించేందుకు సాధ్యపడలేదు.
1933లో హెయిలాగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హెర్బిన్ నగరంలో సంఝువా నదిపై వంతెన నిర్మించే సమయంలో ఓ కూలీకి ఈ పుర్రె దొరికింది. సంఝువా అంటే బ్లాక్ డ్రాగన్. అందుకే ఈ జాతికి డ్రాగన్ పేరు పెట్టారు.
ఆ సమయంలో హెర్బిన్ నగరం జపాన్ ఆధీనంలో ఉండేది. ఈ పుర్రె చాలా విలువైనదిగా భావించిన ఆ కూలీ దీన్ని ఇంటికి తీసుకెళ్లారు. తమ ఇంటి వెనుక బావిలో దీన్ని భద్రపరిచారు. దాదాపు 80ఏళ్లు ఇది అలానే ఉండిపోయింది. తను చనిపోయే ముందు ఈ పుర్రె గురించి తన కుటుంబ సభ్యులకు ఆయన చెప్పారు. అలా ఇది పరిశోధకుల చేతుల్లోకి వచ్చింది.

ఫొటో సోర్స్, KAI Geng
ఇప్పటివరకు చైనాలో వెలుగుచూసిన ఏ జాతికీ చెందనివిగా భావిస్తున్న పుర్రెల్లో డ్రాగన్ మ్యాన్ పుర్రె ఒకటి. టిబెట్‌లో లభించి షియాహె దవడ ఎముక, డాలి, జిన్నివుషాన్, హౌలాంగ్‌డాంగ్ శిలాజాలను కూడా ఇలానే ఏ జాతికి చెందనివిగా పరిశోధకులు గుర్తించారు.
ఈ శిలాజాలు హోమోసెపియన్లవా, నియాండెర్తాల్స్‌వా, డెనిసోవన్స్‌వా లేక వేరే భిన్నమైన జాతివా? అనే అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
రష్యాలోని డెనిసోవా గుహల్లో దొరికిన 50,000 నుంచి 30,000 మధ్య కాలంనాటి చేతి వేలి డీఎన్‌ఏ ఆధారంగా డెనిసోవన్స్ జాతిని గుర్తించారు. అయితే, దీనికి నియాండెర్తాల్స్‌తో కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి.
తాజా డ్రాగన్ మ్యాన్ కూడా డినిసోవన్స్ జాతికి చెందిన వాడేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్తా మిరాజోన్ భావిస్తున్నారు.
‘‘డెనిసోవన్స్ మనుగడ ఇప్పటికీ అంతుచిక్కకుండా మిగిలిపోయింది. టిబెట్‌లో దొరికిన దవడ ఎముక కూడా డెనిసోవన్స్ జాతిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Kai Geng
అంతేకాకుండా, ‘‘టిబెట్‌లో దొరికిన దవడ ఎముక, ప్రస్తుత డ్రాగన్ మ్యాన్ చూడటానికి దగ్గరగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పుర్రెను డెనిసోవన్స్ జాతి పుర్రెగా మనం భావించవచ్చు’’ అని ఆమె అన్నారు.
ఈ డ్రాగన్ మ్యాన్.. పశ్చిమాసియాలోని లెవాంట్ ప్రాంతంలో మనుగడ సాగించిన ఓ పురాతన జాతికి చెందినవాడై ఉండొచ్చని మరో అధ్యయనకర్తల బృందం చెబుతోంది. ఈ బృందం ఇటీవల నియాండెర్తాల్స్‌కు ముందు జాతిగా భావిస్తున్న, ఇజ్రాయెల్‌లో లభించిన ఓ పుర్రెపై అధ్యయనం చేపట్టింది.
అయితే, తూర్పు ఆసియాలో లభించిన ఈ పుర్రెను కొత్త జాతిగానే చైనా పరిశోధకులు చెబుతున్నారు. మిగతా శాస్త్రవేత్తల భావనలతో వీరు ఏకీభవించడం లేదు.
‘‘ఈ అధ్యయనంతో కొత్త చర్చలు మొదలవుతాయి. చాలా మంది మేం చెప్పేదానికి అంగీకరించరని మాకు తెలుసు’’అని ప్రొఫెసర్ షీజున్ చెప్పారు.
‘‘కానీ, ఇది సైన్స్. ఇలా విభేదిస్తూ వచ్చే చర్చలతోనే సైన్స్ ముందుకు వెళ్తుంది.’’
ఇవి కూడా చదవండి:
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- అజర్బైజాన్, అర్మేనియాల యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారనుందా?
- కరోనావైరస్ మృతుల విషయంలో ఇరాన్ ఎందుకు వాస్తవాలను దాచి పెడుతోంది...
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








