Summer Solstice: కొన్ని దేశాల్లో ఈ రోజు అసలు రాత్రే ఉండదు, ఎందుకు

సమ్మర్ సోల్‌స్టైస్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాదిలో సుదీర్ఘమైన పగటి కాలం ఉండే రోజుగా జూన్ 21 రికార్డు సృష్టించబోతోంది. అంటే ఈ రోజు మిగతా రోజుల కంటే సూర్యరశ్మి ఎక్కువ సేపు ఉంటుంది.

దీన్నే ‘‘సమ్మర్ సోల్‌స్టైస్’’ అంటారు. ఈ రోజున రాత్రి సమయం తక్కువగా, పగలు ఎక్కువగా ఉంటుంది.

కొన్ని దేశాల్లో సమ్మర్ సోల్‌స్టైస్ రాకతో వసంత రుతువు ముగిసి, వేసవి మొదలవుతుంది. ఆటమ్ ఈక్వినోక్స్‌తో ఇది ముగుస్తుంది. ఆటమ్ ఈక్వినోక్స్ అంటే పగలు, రాత్రి సమంగా ఉండే రోజు. ఇది సెప్టెంబరు 23న రాబోతోంది.

సమ్మర్ సోల్‌స్టైస్

ఫొటో సోర్స్, Getty Images

పగటి సమయం ఎందుకు పెరుగుతుంది?

భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టు తిరిగే క్రమంలో సమ్మర్ సోల్‌స్టైస్ ఏర్పడుతుంది.

భూమి ఒక పక్కకు ఒరిగి, తిరిగే సంగతి తెలిసిందే. అలా వంగి తిరిగేటప్పుడు, ఉత్తర లేదా దక్షిణ ధ్రువాలు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చేటప్పుడు పగటి కాలాల్లో మార్పులు వస్తాయి.

ఉత్తరార్ధ గోళం సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు సమ్మర్ సోల్‌స్టైస్ మొదలవుతుంది. అంటే ఆ రోజున ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం ఎక్కువ సేపు ఉంటుంది.

సమ్మర్ సోల్‌స్టైస్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని ప్రాంతాల్లో రాత్రే ఉండదు ఎందుకు?

సమ్మర్ సోల్‌స్టైస్ రోజున నార్వే, ఫిన్లాండ్, గ్రీన్‌లాండ్, అలస్కా సహా మరికొన్ని ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు.

ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించడు.

భూమి ఒకవైపు ఒరిగి తిరగడమే దీనికి కారణం.

సమ్మర్ సోల్‌స్టైస్

ఫొటో సోర్స్, Getty Images

దీన్ని ఎలా చూస్తారు?

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సమ్మర్ సోల్‌స్టైస్ నాడు వేడుకలు చేసుకుంటారు.

ఈ రోజున చాలా మంది బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. 4000ఏళ్ల నుంచి ఇదొక ప్రార్థనా స్థలంగా ప్రఖ్యాతి గాంచిందని చరిత్ర చెబుతోంది.

సమ్మర్ సోల్‌స్టైస్ రోజున, స్టోన్‌హెంజ్‌లోని మధ్యనుండే భారీ రాయి (సెంట్రల్ ఆల్టార్ స్టోన్) నీడ హీల్ స్టోన్ నీడతో కలుస్తుంది. సూర్యుడు ఈశాన్య దిక్కున ప్రకాశిస్తాడు. దీన్ని చూడటానికి పెద్దయెత్తున ప్రజలు వస్తుంటారు.

కరోనావైరస్ లాక్‌డౌన్‌ల వల్ల స్టోన్‌హెంజ్‌లో సూర్యోదయాన్ని ప్రజలు చూడలేకపోవచ్చు.

ఈ ప్రాంతాన్ని ఇంగ్లిష్ హెరిటేజ్ సంస్థ పరిరక్షిస్తోంది. అందరూ ఇళ్లలోనే ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, స్టోన్‌హెంజ్ సందర్శనకు రావొద్దని సంస్థ అభ్యర్థించింది.

ఇక్కడ సూర్యోదయం దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్‌ ఇస్తామని పేర్కొంది.

సమ్మర్ సోల్‌స్టైస్

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఈ పదం ఎలా వచ్చింది

సమ్మర్ సోల్‌స్టైస్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్‌లో సోల్ అంటే సూర్యుడు. సిస్టెరే అంటే కదలకుండా ఉండటం.

ఈ రోజున ఉత్తరార్ధ గోళంలోని కర్కాటక రేఖపై సూర్యుడు నిట్టనిలువుగా ఉంటాడు. దీని వల్ల 23.5 డిగ్రీల అక్షాంశాలకు పైనుండే ప్రాంతాల్లో అసలు రాత్రే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతాలు సూర్యుడికి అత్యంత సమీప దూరంలోకి వస్తాయి.

‘‘సమ్మర్ సోల్‌స్టైస్ ఎప్పుడూ జూన్ 20 నుంచి 22 మధ్య వస్తుంది. అదే లీప్ సంవత్సరం అయితే, జూన్ 20న వస్తుంది. సూర్యుడు చుట్టు భూమి తిరిగే సమయానికి మన కాలెండర్‌కు మధ్య స్వల్ప తేడా ఉంటుంది. ఈ తేడా వల్లే సమ్మర్ సోల్‌స్టైస్ తేదీ కూడా మారుతుంది’’అని బీబీసీ వాతావరణ రిపోర్టర్ స్టీవ్ డేనావోస్ చెప్పారు.

ఉత్తరార్ధ గోళంలో సమ్మర్ సోల్‌స్టైస్ వచ్చినప్పుడు, దక్షిణార్ధ గోళంలో వింటర్ సోల్‌స్టైస్ వస్తుంది. అంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)